ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
శుక్రవారం ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. దీంతో 11 రోజుల విధ్వంసకర ఘర్షణలకు తెరపడింది. ఈ ఘర్షణల్లో 240 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది గాజాలోనే ప్రాణాలు కోల్పోయారు.
‘‘బేషరతుగా, రెండు పక్షాల అనుమతితో’’ ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ఇజ్రాయెల్ క్యాబినెట్ ధ్రువీకరించింది.
మరోవైపు స్థానిక కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి 2 గంటల (తెల్లవారితే శుక్రవారం) నుంచి ఈ ఉమ్మడి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినట్లు హమాస్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.
ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తనకు ఫోన్ చేసి, ధ్రువీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
కాల్పుల విరమణతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం ఉత్తర గాజాలోని హమాస్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా వందకుపైగా వైమానిక దాడులను ఇజ్రాయెల్ చేపట్టింది. ప్రతిగా హమాస్ కూడా రాకెట్లు ప్రయోగించింది.
ముస్లింలతోపాటు యూదులకూ పవిత్రమైన తూర్పు జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు చెలరేగాయి.
మే 10న ఈ ఉద్రిక్తతలు ఘర్షణలుగా మారాయి. ఈ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాలంటూ హమాస్ రాకెట్లు ప్రయోగించారు. దీనికి స్పందనగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది.
గాజాలోని ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మంది మహిళలు, చిన్నారులు సహా 232 మంది మరణించినట్లు హమాస్ ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు గాజాలో 150 మందికిపైగా మిలిటెంట్లు మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తమ మిలిటెంట్ల మరణాల సంఖ్యను హమాస్ బయటపెట్టలేదు.
ఇజ్రాయెల్‌లో ఇద్దరు చిన్నారులు సహా 12 మంది మరణించినట్లు దేశ ఆరోగ్య సేవల సంస్థ తెలిపింది.
గాజాలోని మిలిటెంట్లు దాదాపు 4000 రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఎవరు ఏమన్నారు?
కాల్పుల విరమణ ఒప్పంద తీర్మానాన్ని తాము ఏకపక్షంగా ఆమోదించినట్లు ఇజ్రాయెల్ పొలిటికల్ సెక్యూరిటీ క్యాబినెట్ తెలిపింది.
గాజాలో వైమానిక దాడులతో తాము పైచేయి సాధించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెనీ గంట్జ్ ట్విటర్ వేదికగా చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాలస్తీనా ప్రజల విజయంగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓటమిగా హమాస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అసోసియేటెడ్ ప్రెస్‌తో ఆయన మాట్లాడారు.
ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను తుది రూపుకు వచ్చేవరకు హమాస్ మిలిటెంట్లు అప్రమత్తంగానే ఉంటారని అలీ బరాఖే చెప్పారు.
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే దక్షిణ ఇజ్రాయెల్‌లో ప్రమాద ఘంటికలు మోగాయని, అంటే గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
మరోవైపు గాజాలో తాజాగా వైమానిక దాడులు జరిగాయని పాలస్తీనా మీడియా పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
బైడెన్ ఏమంటున్నారు?
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత నెతన్యాహుతో తాను ఫోన్‌లో మాట్లాడానని, ఆయన్ను ప్రశంసించానని శ్వేతసౌధంలో విలేకరులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
''హమాస్‌తోపాటు గాజాలోని ఇతర మిలిటెంట్ గ్రూప్‌లు విచక్షణ రహితంగా జరుపుతున్న కాల్పుల నుంచి తమను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కులకు అమెరికా సంపూర్ణంగా మద్దతు పలుకుతోంది. గాజా నుంచి జరుపుతున్న కాల్పులతో ఇజ్రాయెల్‌లోని అమాయక పౌరులు మరణిస్తున్నారు''అని బైడెన్ అన్నారు.
అమెరికా సాయంతో అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ''ఐరన్ డోమ్'' విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ''రెండు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఐరన్ డోమ్.. యూదులతోపాటు అరబ్బుల ప్రాణాలను కాపాడుతోంది''అని బైడెన్ అన్నారు.
ఈ ఘర్షణల్లో మరణాల సంఖ్య మరింత పెరగకుండా అడ్డుకునే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చడంలో కీలకపాత్ర పోషించిన ఈజిప్టు అధ్యక్షుడు అల్-సీసీపైనా బైడెన్ ప్రసంసలు కురిపించారు.
''ఆప్తులను కోల్పోయిన ఇజ్రాయెల్, పాలస్తీనాలలో కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను''.
గాజాలోని ప్రజలకు సాయం అందించేందుకు, మౌలిక సదుపాయాల పునర్నిర్మానానికి ఐక్యరాజ్యసమితో తాము కలిసి పనిచేస్తామని బైడెన్ చెప్పారు. పాలస్తీనాలోని అధికారులతో మాత్రమే కలసి పనిచేస్తామని, హమాస్‌తో కాదని ఆయన స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కాల్పుల విరమణ ఒప్పందం ఎలా కుదిరింది?
కొన్ని రోజులుగా ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనా రెండు వైపులా అంతర్జాతీయ ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది.
కాల్పుల విషయంలో ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి మార్గం సుగమం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు నెతన్యాహుతో బుధవారం బైడెన్ చెప్పారు.
గాజాలోని హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో ఈజిప్టు, ఖతర్, ఐరాస కీలక పాత్ర పోషించాయి.
చర్చల కోసం ఇజ్రాయెల్‌తోపాటు పాలస్తీనా ఆధీనంలోని ప్రాంతాలకు రెండు భద్రతా ప్రతినిధుల బృందాలను అల్-సీసీ పంపినట్లు ఈజిప్టు ప్రభుత్వ మీడియా తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏమిటి
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








