ఇజ్రాయెల్-గాజా హింస: కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య హింస చెలరేగన 8 రోజుల తర్వాత... కాల్పుల విరమణ పాటించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు.
ఈజిఫ్ట్, ఇతర దశాలతో కలిసి తాము శత్రువులను అడ్డుకునే పనిలో ఉన్నామని బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాన బెంజమిన్ నెతన్యాహుకు చెప్పారు.
కానీ, హింసకు ముగింపు పలకాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఇచ్చిన పిలుపును అమెరికా మరోసారి అడ్డుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
"అమాయకులైన పౌరుల భద్రత కోసం అన్నిరకాల చర్యలూ చేపట్టేలా ఇజ్రాయెల్‌ను ప్రోత్సహిస్తున్నాం" అని బైడెన్ చెప్పినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
"గాజాలోని హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపులపై ఇజ్రాయెల్ సైనిక చర్యల గురించి ఇద్దరు నేతలు చర్చించారు. కాల్పుల విరమణకు మద్దతు ప్రకటించిన బైడెన్, ఈ ఘర్షణలకు ముగింపు పలకడానికి ఈజిఫ్ట్, ఇతర భాగస్వాములతో కలిసి తాము తీసుకుంటున్న చొరవ గురించి మాట్లాడారు" అని అందులో చెప్పారు.
ఇజ్రాయెల్ సైనిక దాడులు ఆపాలని కోరుతూ ఒక ప్రకటన జారీ చేయాలనుకున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రయత్నాలను అమెరికా మూడోసారి అడ్డుకుంది. తమ సొంత దౌత్య ప్రయత్నాల గురించి గట్టిగా చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ హింసాత్మక ఘర్షణలు ప్రస్తుతం రెండో వారానికి చేరాయి. కానీ, ఇవి ఇప్పుడప్పుడే ముగిసే సంకేతాలు కనిపించడం లేదు
ఇప్పటివరకూ గాజాలో 61 మంది చిన్నారుల సహా 212 మంది చనిపోగా, ఇజ్రాయెల్‌లో ఇద్దరు పిల్లల సహా పది మంది మరణించారు.
గాజాలో చనిపోయినవారిలో ఎక్కువమంది మిలిటెంట్లే ఉన్నారని, దాడుల్లో పౌరులు పొరపాటున చనిపోయారని ఇజ్రాయెల్ చెప్పింది. కానీ హమాస్ ఆ వాదనను ఖండిస్తోంది.
ఇజ్రాయెల్-గాజాలో హింసాత్మక ఘర్షణలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతుండడంతో పౌరుల మరణాలు, గందరగోళ పరిస్థితులను అడ్డుకోడానికి చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ నేతలు, మానవతా సంస్థలు కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
సూర్యోదయానికి ముందే గాజాపై 50 యుద్ధ విమానాలతో దాడులు చేసిన ఇజ్రాయెల్
పాలస్తీనా మిలిటెంట్లు సోమవారం ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంత నగరాలపై రాకెట్ దాడులు చేయగా ఇజ్రాయెల్ కూడా గాజా స్ట్రిప్‌పై వరుస వైమానిక దాడులు చేసింది.
వారం కిందట సంక్షోభం మొదలైనప్పటి నుంచీ ఇజ్రాయెల్ వైపు నుంచి జరిగిన దాడుల్లో సోమవారం నాటి దాడులు అత్యంత తీవ్రమైనవి.
సూర్యోదయానికి ముందే వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది.
సోమవారం వేకువజామున తమ దేశానికి చెందిన 50 యుద్ధ విమానాలు 20 నిమిషాల పాటు గాజా స్ట్రిప్‌పై దాడులు చేశాయని ఇజ్రాయెల్ చెప్పింది.

ఫొటో సోర్స్, SAID KHATIB
ఆదివారం ఏం జరిగింది
ఆదివారం గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 42 మంది మరణించారని హమాస్ నియంత్రణలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
చనిపోయినవారిలో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారని ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ దాడిలో కూలిపోయిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వారం రోజులుగా జరుగుతున్న ఈ ఘర్షణల కారణంగా గాజాలో చనిపోయినవారి సంఖ 188కు చేరుకుంది.
శనివారం రాత్రి ఇజ్రాయెల్ దక్షిణ భాగంలోని పలు నగరాలపై రాకెట్ దాడులు జరిగాయి.
తాజా ఘర్షణల్లో గాజా నుంచి హమాస్, ఇజ్రాయెల్‌పై అత్యధిక సంఖ్యలో రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
మేజర్ జనరల్ ఓరి గార్డిన్ విలేఖరులతో మాట్లాడుతూ.. గత సోమవారం నుంచి హమాస్ ఇజ్రాయెల్‌పై సుమారు 3,000 రాకెట్లను ప్రయోగించిందని తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
"మా సైన్యం పూర్తి శక్తితో పోరాడుతుంది": నెతన్యాహూ
కాల్పులు విరమించుకోవాలని అంతర్జాతీయ సమాజం చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ "హమాస్‌కు వ్యతిరేకంగా తమ సైన్యం పూర్తి శక్తితో పోరాడుతుంది" అని ఆదివారం ఒక టీవీ ప్రసంగంలో తెలిపారు.
ఆదివారం జరిగిన రక్షణ మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "ఉగ్రవాద సంస్థలపై మన పోరాటం పూర్తి శక్తితో కొనసాగుతుంది. మీకు, ఇజ్రాయెల్ పౌరులకు శాంతి లభించేంతవరకూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. దీనికి కొంత సమయం పడుతుంది" అని అన్నారు.
"ఆక్రమణదారులకు సరైన రీతిలో బుద్ధి చెబుతామని" నెతన్యాహూ అన్నారు.
ఆ తరువాత, మధ్యహ్నం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివాదంలో మాపై ఒత్తిడి ఉందన్న సంగతి మాకు తెలుసునని నెతన్యాహూ అన్నారు.
ఈవారం ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా రాయబారి హైదీ అమర్ ఇజ్రాయెల్ నేతలతోనూ, ఇజ్రాయెల్ అరబ్ నాయకులతోనూ, ఇతర అధికారులతోనూ చర్చలు జరిపారు.
అమెరికా హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తుందని భావిస్తారు. కాబట్టి, హైదీ అమర్ హమాస్‌తోగానీ, పాలస్తీనా నేతలతోగానీ చర్చలు జరుపుతారని అనుకోవట్లేదు.
జర్మనీలో పాలస్తీనియన్లకు మద్దతుగా ప్రదర్శనలు.. 59 మందిని అరెస్ట్ చేశారు
పాలస్తీనియన్లకు మద్దతుగా హింసాత్మక నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 59 మందిని అరెస్ట్ చేశామని, ఈ ఘటనల్లో డజను మందికి పైగా పోలీసులు గాయపడ్డారని ఆదివారం బెర్లిన్ పోలీసులు తెలిపారు.
బెర్లిన్‌లోని నోయెఖన్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం 3,500 కన్నా ఎక్కువమంది గుమికూడారని పోలీసులు తెలిపారు.
ప్రదర్శనను అడ్డుకునే సమయంలో నిరసనకారులు పోలీసులపై సీసాలు, పటాకులు విసిరారని, ఫలితంగా 93 మంది అధికారులు గాయపడ్డారని, తప్పనిసరి పరిస్థితుల్లో పెప్పర్ స్ప్రే ఉపయోగించాల్సి వచ్చిందని బెర్లిన్ పోలీసులు తెలిపారు.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనేకమందిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జర్మనీలో రోజంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా 900 మంది పోలీసులను విధుల్లోకి దింపారు. చాలా చోట్ల నిరసనలు శాంతియుతంగా జరిగాయి.
ఇజ్రాయెల్, గాజా ఘర్షణల సందర్భంగా యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, యూదుల జెండాలను తగులబెడుతూ, వారి మందిరాల తలుపులు విరగ్గొడుతూ నిరసన ప్రదర్శనలు జరిపారు.
"సోషల్ మీడియాలో అత్యంత హేయమైన అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని" జర్మనీకి చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ జ్యూస్ ఆదివారం పేర్కొంది.

ఫొటో సోర్స్, REUTERS/Chris Helgren
ఇజ్రాయెల్, హమాస్ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు
ఇజ్రాయెల్, గాజాలో హమాస్ మధ్య కొనసాగుతున్న హింసకు పరిష్కారం సూచించే దిశగా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా రాయబారి హైదీ అమర్, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్‌తో, ఇతర అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
మరో పక్క, ఈజిప్ట్ కూడా ఇరు పక్షాలతో చర్చిస్తూ కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తిత్వం నడిపే ప్రయూత్నాలను వేగవంతం చేసింది.
ఆదివారం, ఇస్లామిక్ దేశాల బృందం 'ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్' సమావేశంలో సౌదీ అరేబియా "ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల హక్కులను ఉల్లంఘిస్తోందంటూ" ఆరోపించింది. ఈ సమావేశం ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఆదివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సమస్యపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్య దేశాల విదేశాంగ మంత్రులు కూడా మంగళవారం సమావేశం కానున్నారు. ఇజ్రాయెల్, గాజా మధ్య హింసను అంతం చేసే దిశలో ఈయూ తోడ్పాటుపై చర్చించనున్నారు.
ఇరు పక్షాల మధ్య కొనసాగుతున్న హింస కారణంగా సామాన్య ప్రజలు నష్టపోతున్నారని ఈయూ విదేశాంగ విధాన ప్రతినిధి జోసెఫ్ బోరెల్ అన్నారు.
ఇరు పక్షాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను ఆపడం ముఖ్యమని, ఇరు వర్గాల మధ్య చర్చలు ఏర్పాటు చేయడం అవసరమని జర్మనీ విదేశాంగ మంత్రి హెయికో మాస్ ట్వీట్ చేశారు.
చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని పోప్ ఫ్రాన్సిస్, జర్మన్ ప్రభుత్వం కూడా ఇరు పక్షాలకు విజ్ఞప్తి చేసింది.

ఫొటో సోర్స్, Reuters
హమాస్ ముఖ్య నేత ఇంటిపై వైమానిక దాడి.. బాంబుల వర్షం
గాజా స్ట్రిప్‌లో హమాస్ ముఖ్య నేత ఇంటిపై వైమానిక దాడి చేసి బాంబుల వర్షం కురిపించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.
దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేసింది.
హమాస్ నేత యహియా సిన్వార్ ఇల్లుగా చెబుతున్న ఒక భవనంపై బాంబు పడి మంటలు చెలరేగడం ఆ వీడియోలో కనిపిస్తోంది.
తాజా ఘర్షణలు మొదలైన తరువాత ఏడో రోజైన ఆదివారం నాడు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 33 మంది మరణించారని స్థానిక అధికారులు చెప్పారు.
హమాస్ కూడా తన రాకెట్ దాడులను కొనసాగిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
గాజాపై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు అన్నారు.
ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో ముగ్గురు పాలస్తీనీలు మరణించారు.
మరోవైపు పాలస్తీనీ మిలిటెంట్లు టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించడంతో అక్కడి ప్రజలు బాంబ్ షెల్టర్లలో తలదాచుకున్నారు.
ఈ సంక్షోభానికి ముగింపు పలకాలంటూ అంతర్జాతీయ సమాజం రెండు వర్గాలనూ కోరుతోంది.
శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
సోమవారం నుంచి మొదలైన ఈ దాడుల్లో 181 మంది పాలస్తీనీలు, 10 మంది ఇజ్రాయెలీలు మరణించారు.

ఫొటో సోర్స్, REUTERS/Ashraf Abu Amrah
గాజాలో అసోసియేటెడ్ ప్రెస్, అల్ జజీరా వార్తా సంస్థల కార్యాలయాలు ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కుప్పకూలింది.
ఇజ్రాయెల్ నుంచి ఆ భవనం యజమానికి ముందస్తు హెచ్చరిక రావడంతో భవనాన్ని ఖాళీ చేయించారని, ఆ తర్వాత ఈ వైమానిక దాడి జరిగిందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ భవనంలో పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్‌కు చెందిన మిలిటరీ సామాగ్రి ఉందని ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారి తనకు ఫోన్ చేసి గంటలో భవనం ఖాళీ చేయాలని హెచ్చరించారని భవనం యజమాని జావాద్ మెహదీ చెప్పినట్టు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.
'రెండు సెకన్లలోనే 12 అంతస్తుల భవనం కూలిపోయింది' అని అల్ జజీరా రిపోర్టర్ చెప్పారు.
శాంతి కోరుతున్న అంతర్జాతీయ సమాజం
ఇజ్రాయెల్, పాలస్తీనాలు శాంతిని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలు విన్నవించాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనా వీలైనంత త్వరగా ఉద్రిక్తతలకు తెరదించాలని అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కోరాయి.
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ సోమవారం (మే 10) రాత్రి జెరూసలెంపై కొన్ని రాకెట్లు ప్రయోగించడంతో అక్కడ హింస చెలరేగింది.
ఇజ్రాయెల్ సైన్యం దీనికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌లోని చాలా మిలిటెంట్ స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది.
జెరూసలెంలోని అల్-అక్సా మసీదు సమీపంలో ఇజ్రాయెల్ భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణలో వందలాది పాలస్తీనియన్లు గాయపడడంతో, దాడులు చేస్తామని హమాస్ సోమవారం బెదిరించింది.
అప్పటి నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి.

అసలు వివాదం ఎందుకు?
1967లో మధ్యప్రాచ్యం యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ తూర్పు జెరూసలెంను తమ అధీనంలోకి తెచ్చుకుంది. మొత్తం నగరాన్ని తమ రాజధానిగా భావించింది.
అయితే అంతర్జాతీయ సమాజం దానిని అంగీకరించడం లేదు. పాలస్తీనా... తూర్పు జెరూసలెంను భవిష్యత్తులో ఒక స్వతంత్ర దేశానికి రాజధానిగా చూస్తోంది.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ భూభాగం తమదే అంటున్న యూదులు పాలస్తీనియన్లను అక్కడి నుంచి తరిమికొట్టడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అంతకంతకూ వివాదం రాజుకుంటోంది.
2016 అక్టోబర్‌లో ఒక వివాదిత తీర్మానాన్ని ఆమోదించిన ఐక్యరాజ్యసమితి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ జెరూసలెంలోని చారిత్రక అల్-అక్సా మసీదుపై యూదులకు ఎలాంటి హక్కు లేదని చెప్పింది.
"అల్-అక్సా మసీదుపై ముస్లింలకు హక్కు ఉంది. యూదులకు దానితో ఎలాంటి చారిత్రక సంబంధం లేదు" అని ఆ తీర్మానంలో చెప్పారు.
మరోవైపు యూదులు దానిని టెంపుల్ మౌంట్ అని చెబుతున్నారు. దానిని యూదులకు అత్యంత ముఖ్యమైన మతపరమైన స్థలంగా భావిస్తారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










