ఇజ్రాయెల్ - గాజా: 'రాత్రంతా కంటి మీద కునుకు లేదు.. పిల్లలకు ఏం చెప్పాలి'.. తల్లడిల్లుతున్న తల్లులు

ఇజ్రాయెల్ గాజా ఘర్షణ
ఫొటో క్యాప్షన్, పిల్లలతో టోవా, నజ్వా
    • రచయిత, జాక్‌ హంటర్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

నజ్వా షేక్ మహ్మద్ అనే మహిళ గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలో నివసిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న బాంబు దాడులు ఆమెకు కంటి మీద కునుకు పట్టనివ్వడం లేదు.

''పిల్లల్ని పట్టుకుని రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. ఏ క్షణంలోనైనా మా ఇల్లు వల్లకాడు కావొచ్చు'' అన్నారామె.

పగలంతా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, అవి విసిరే బాంబుల మోత వింటూ గడపడమే ఆమెకు సరిపోతోంది. ''బాంబుల శబ్ధాలకు చుట్టు పక్కల ప్రాంతాలన్నీ వణికి పోతున్నాయి. మేం కూడా ప్రాణ భయంతో వణుకుతున్నాం'' అన్నారామె. నజ్వాకు ఐదుగురు సంతానం.

ఇజ్రాయెల్, గాజాలలో మహిళల ప్రస్తుత పరిస్థితికి నజ్వా ఒక ఉదాహరణ మాత్రమే. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణ కారణంగా సరిహద్దుల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.

ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో గాజా ప్రాంతానికి చెందిన వారు 83మంది చనిపోగా, ఇజ్రాయెల్‌ వైపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘర్షణ కారణంగా అక్కడి సామాన్యుల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించిన బీబీసీ, ఒక పాలస్తీనా, ఒక ఇజ్రాయెలీ మహిళతో మాట్లాడింది. సంవత్సరాలుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో వారు నిత్యం భయం భయంగా జీవిస్తున్నారు.

ఇజ్రాయెల్ గాజా ఘర్షణ
ఫొటో క్యాప్షన్, ఇంట్లో ఉన్నా భయభయంగా జీవించాల్సి వస్తోందని నజ్వా అన్నారు.

' ఇలా భయంతో బతకడం కష్టం'

బుధవారం నాడు గాజాపై ఇజ్రాయెల్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ సమయంలో నజ్వా తమ ఇంటి మొదటి ఫ్లోర్ మధ్యలో కూర్చున్నారు. తదుపరి బాంబు పడేది తమ ఇంటి మీదేనని భయంతో వణికి పోయామని ఆమె చెప్పారు.

''ఏ క్షణంలోనైనా, మా ఇంటి మీదనో, మా పొరుగింటి మీదనో బాంబు పడొచ్చు అనుకున్నాం. రక్షణగా నిలుస్తుందనుకునే ఈ ఇల్లు ఏ క్షణంలోనైనా మాకు, మా పిల్లలకు, మా కలలకు, మా జ్ఞాపకాలకు సమాధిగా మారిపోవచ్చు'' అన్నారు నజ్వా

నజ్వా ఐదుగురి పిల్లల వయసు 11 నుంచి 22 ఏళ్ల మధ్య ఉంటుంది. గాజా స్ట్రిప్‌లోని శరణార్థి శిబిరం పక్కనే ఉండే ఒక రద్దీ ప్రాంతంలో నజ్వా కుటుంబం నివసిస్తోంది.

ఇజ్రాయెల్ బాంబుల దాడుల్లో 17మంది పిల్లలు సహా కొన్ని డజన్ల మంది మరణించారని గాజా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, తమ బాంబు దాడుల్లో చనిపోయిన వారంతా తీవ్రవాదులేనని, అందులో కొందరు గాజా నుంచి మిస్ ఫైర్ అయిన మిసైళ్ల వల్ల చనిపోయారని ఇజ్రాయెల్ అధికారులు అన్నారు.

భూతలం నుంచి ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టవచ్చన్న వార్తలతో నజ్వాలో కంగారు మరింత పెరిగింది. ''ఆ మాట విన్న దగ్గర్నుంచి నాలో భయం పెరిగింది. మాకు రక్షణ లేదు. ఒక తల్లిగా నాకిది నరకంలా అనిపిస్తోంది.'' అన్నారామె.

''నేను పిల్లలకు ఈ విషయాలేవీ చెప్పలేదు. కానీ, అలా చెప్పకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఈ ప్రాంతం సురక్షితం కాదని వారికి కూడా తెలియాలి'' అన్నారామె.

యుద్ధం గురించి వారికి చెప్పకూడదని అనుకున్నా, అది అసాధ్యంగా మారిందని అన్నారు నజ్వా. ''వాళ్లు రోజంతా న్యూస్ చూస్తూనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా ఈ హింసే కనిపిస్తోంది.'' అన్నారామె.

ఇజ్రాయెల్ గాజా ఘర్షణ
ఫొటో క్యాప్షన్, పిల్లలకు హింస గురించి తెలియకుండా ఉండాలన్నా కుదరడం లేదు

ఈ దాడులు, హింస ప్రభావం తన పిల్లలపై పడుతుందన్నది నజ్జా ఆందోళన. ఆమె చిన్నకొడుకు వయసు మహ్మద్‌ 12 సంవత్సరాలు. 2008 నుంచి జరుగుతున్న ఘటనల మధ్య అతను పెరిగాడు.

''వాడు పెరిగి పెద్దయ్యాక ఎలాంటి స్మృతులను ఇవ్వగలనో అన్న ఆందోళన నాలో పెరుగుతోంది'' అన్నారామె.'' నిత్యం ఈ హింసను చూస్తూ, భయంతో ఏడ్చే పిల్లల ఏడుపులను వింటూ జీవించడం చాలా కష్టంగా మారుతోంది'' అని నజ్వా అన్నారు.

ఇజ్రాయెల్ గాజా ఘర్షణ
ఫొటో క్యాప్షన్, ఇప్పుడు మా ఇల్లు ఉందో లేదో కూడా తెలియదు-భర్తతో టోవా

'బతుకే ఒక భయంగా మారింది'

టోవా లెవీ ఇజ్రాయెలీ పట్టణమైన 'లాడ్‌'లో నివసిస్తుంటారు.ఇజ్రాయెలీ అరబ్ గుంపు ఒకటి తమ వీధి వరకు వచ్చిందని తెలియగానే, ఆమె తన కుటుంబం సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సాయంత్రం వరకు తమ కమ్యూనిటీ వాట్సప్ గ్రూప్‌లో వస్తున్నసమాచారం గమనిస్తూ భయం భయంగా జీవించారు టోవా. తమ ప్రాంతంలో భారీ ఎత్తున విధ్వంస కాండకు దిగాలని ఆ గుంపు చర్చించుకుంటున్నట్లు ఆమె మిత్రులు వాట్సప్‌లో పోస్టులు పెట్టారు.

'' మా ఇంటికి దగ్గర్లోనే కొన్ని వస్తువులకు నిప్పంటించారు. వాళ్లు మా దగ్గరకు రావడానికి అడ్డు ఏముంది? అందుకే, మేం కొన్ని సామాన్లు సర్దుకుని బంధువుల దగ్గరికి వెళ్లాం. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మేం అక్కడి నుంచి బయటపడ్డాం'' అన్నారు టోవా.

టోవా కుటుంబం అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే ఆ ప్రాంతంలో హింస తీవ్రరూపం దాల్చింది. పోలీసులతో ఆందోళనకారులు తలపడ్డారు. అనేక ఇళ్లకు కార్లకు నిప్పంటించారు.

లాడ్ నగరంలో సివిల్ వార్ జరుగుతోందని ఆ సాయంత్రమే నగర మేయర్ ప్రకటించారు. ''మా ఇంటిని బద్ధలు కొడతారని నేను భయపడి పోయాను. నేనిప్పుడు తిరిగి వెళితే అక్కడ ఏమున్నాయో, అసలు మా ఇల్లు ఉందో, బాంబులకు కుప్పకూలిపోయిందో తెలియదు'' అన్నారు టోవా.

ఇజ్రాయెల్ గాజా ఘర్షణ

టోవా కుటుంబం నగరం దాటి బైటికి వచ్చిన కాసేపటికే ఆ నగరంలపై రాకెట్ ప్రయోగం జరిగింది. ఇద్దరు ఇజ్రాయెలీ అరబ్‌లు మరణించారు. రాత్రంగా దాడికి జరిగే ప్రమాదం ఉందంటూ సైరన్లు మోగుతూనే ఉన్నాయి.

వేలమంది నగరవాసులు బాంబు షెల్టర్లలో తలదాచుకున్నారు. వారితోపాటు కొందరు అరబ్బులు కూడా ఈ షెల్టర్లలో ఉన్నారు. వారిలో చాలామంది ఈ అల్లర్లలో పాల్గొన్నవారేనని తెలియడంతో అక్కడున్న మిగతావారు భయపడి పోయారు.

'' కొందరు ఆ షెల్టర్‌ లోపలి దాకా వెళ్లడానికి కూడా భయపడ్డారు. కొందరైతే కాసేపు అయ్యాక గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయారు.'' అన్నారు టోవా.

ఇలా విధ్వంసాలు, అల్లర్లు చెలరేగినప్పుడు వాటి గురించి తన నాలుగున్నర సంవత్సరాల కొడుక్కి ఏం చెప్పాలో తనకు అర్ధమయ్యేది కాదని టోవా అన్నారు.

''చెడ్డవాళ్లే ఈ బాంబులు వేస్తున్నారని మాత్రమే వాడికి తెలుసు. అరబ్బులే బాంబులు వేస్తున్నారని నేను ఎప్పుడూ వాడికి చెప్పలేదు. వాడు తోటి అరబ్ పిల్లలతో చక్కగా ఆడుకోవాలన్నది నా కోరిక. చిన్నప్పటి నుంచి అరబ్ జాతీయులంటే భయంతో నా కొడుకు పెరగాలని నేను కోరుకోవడం లేదు'' అన్నారామె.

''మేమంతా సామాన్య ప్రజలం. కానీ, మాలో మేం గొడవలు పడుతున్నాం. ఇదొక భయంకరమైన అనుభవం'' అన్నారు టోవా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)