BBC SPECIAL: భారత్-ఇజ్రాయెల్‌ల రొమాన్స్‌లో గాఢత కొరవడిందా?

- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి, జెరూసలెం
ఇజ్రాయెల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్‌లోని ఓ ఫ్యాక్టరీలో నలువైపులా డ్రోన్స్ (మానవ రహిత విమానాలు) ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా తయారైనవి కాగా, మరికొన్ని ఇంకా పూర్తి కానివి.
భారత సాయుధ బలగాలు ఈ డ్రోన్స్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నాయి.
జెరూసలెంకు గంటన్నర దూరంలో, రాజధాని టెల్ అవీవ్ నగరానికి దగ్గరలో ఉన్న ఈ ఫ్యాక్టరీ రక్షణ సామగ్రిని తయారు చేసే అతి పెద్ద కంపెనీలలో ఒకటి.
కంపెనీ పరిసరాల్లో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంది. ఎవరినీ అక్కడికి రానివ్వరు. అయితే బీబీసీ బృందానికి లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు.

ఇజ్రాయెలీ డ్రోన్ల మధ్యలో..
మమ్మల్నీ, మా వెంట ఉన్న సామాన్లనూ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మమ్మల్ని లోపలికి వెళ్లనిచ్చారు.
హేరోన్ యూఏవీ సిస్టమ్ అంటే డ్రోన్లను భారత సైన్యం బాగా ఉపయోగిస్తోంది. సాధారణంగా వీటిని ఆకాశం లోంచి గూఢచర్యం కోసం ఉపయోగిస్తారు.
మిస్సైల్స్ ప్రయోగించడం కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు. ఈ ఫ్యాక్టరీలో హేరోన్ డ్రోన్లు తయారై సిద్ధంగా ఉన్నాయి.
"మా కంపెనీకి భారత్ అతి పెద్ద వినియోగదారు" అని కంపెనీకి చెందిన ఒక సీనియర్ అధికారి యువాష్ రూబిన్ నాతో అన్నారు.
"భారత్ మా వినియోగదారు మాత్రమే కాదు, భాగస్వామి కూడా. మా సంబంధాలు పాతికేళ్ల నాటివి" అని ఆయన చెప్పారు.

భారత్‌లో నెతన్యాహూ
రక్షణ రంగంలో భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య ప్రగాఢ సంబంధాలున్నాయి. ఇరు దేశాల మధ్య గత 25 ఏళ్లలో 1,000 కోట్ల డాలర్ల ఒప్పందాలు జరిగాయి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూ ఆదివారం నాడు నాలుగు రోజుల పర్యటనపై భారత్‌కు చేరుకున్నారు. భారత్‌తో సంబంధాలను పటిష్టం చేసుకోవడమనేదే ఆయన ముందున్న ముఖ్యమైన సవాలు.
ఇరు దేశాల సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి వీలు కల్పించేది రక్షణ రంగమే.

సంబంధాల్లో ఎగుడుదిగుళ్లు
ఇటీవల భారత్ ఇజ్రాయెల్‌కు షాక్ ఇవ్వడంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉత్సాహం తగ్గింది. జెరూసలెం విషయంలో ఐరాసలో జరిగిన ఓటింగ్‌లో పాలస్తీనాకు అనుకూలంగా ఓటు వేయడం ద్వారా ఇజ్రాయెల్‌కు భారత్ తొలి షాక్ ఇచ్చింది.
50 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం ద్వారా భారత్ ఇజ్రాయెల్‌కు మరో షాక్ ఇచ్చింది.
ఈ షాక్‌ల నుంచి ఇజ్రాయెల్ ఇంకా తేరుకోలేదు. అందుకే స్థానిక మీడియాకు చెందిన కొంత మంది అసలు నెతన్యాహూ భారత్‌కు వెళ్లడం దేనికంటూ ప్రశ్నిస్తున్నారు.
రెండు దేశాల మధ్య ఉన్నది రొమాన్సేననీ, ప్రగాఢ సంబంధం కాదనీ మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

'మజా లేని రొమాన్స్'
ఇజ్రాయెల్-భారత్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలను దగ్గరగా అధ్యయనం చేసిన షల్వా వైల్ అభిప్రాయం ప్రకారం రెండు దేశాల మధ్య 'రొమాన్స్‌లో ఇప్పుడు మజా లేకుండా పోయింది'.
"ఇరు దేశాల మధ్య నిస్సారంగా మారిన రొమాన్స్‌ను పట్టాలెక్కించడానికి నెతన్యాహూ కృషి చేయాల్సి ఉంటుంది" అని ఆమె అంటారు.
ఇరు దేశాల పరస్పర వ్యాపారం 2010 నాటితో పోలిస్తే నేడు తగ్గిపోయింది.
పరస్పర వ్యాపారం ప్రస్తుతం 500 కోట్ల డాలర్లుగా ఉంది. సామర్థ్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువే.
ఇరు దేశాల వ్యాపారుల మధ్య చాలా దూరం ఉందని ఇజ్రాయెల్-ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్‌పర్సన్ అనత్ బర్న్‌స్టైన్ అన్నారు.

వ్యాపార ఇబ్బందులు
అనత్ బర్న్‌స్టైన్ అభిప్రాయం ప్రకారం, "ఇజ్రాయెల్ వ్యాపారులకు అమెరికన్లతో పని చేయడం బాగా అలవాటు. వారిలో తొందరపాటు పాలు ఎక్కువ. భారత్‌లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. అక్కడి పని పరిస్థితులను వారు అర్థం చేసుకోవాలి."
అయితే 2018లో ఈ పరిస్థితి మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య వ్యాపారం చాలా వేగంగా వృద్ధి చెందబోతోందని ఆమె చెప్పారు.
భారత్‌కు 'కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ'లో ఇజ్రాయెల్ సహకారం అందించగలదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా సహాయం చేయగలదు.
అయితే, ఇక్కడి వ్యాపారులు భారతీయ మార్కెట్ల పరిస్థితులను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరుకు నాణ్యంగా ఉండాలి, అట్లాగే చౌకగా కూడా ఉండాలి.
ఇజ్రాయెల్ వ్యాపారులకు ఈ విషయాలు ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయి.
ఇక్కడ కొందరు నిపుణులతో మాట్లాడిన తర్వాత నాకేమనిపించిందంటే, 80 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్‌కు వంద కోట్ల జనాభా గల భారత్‌తో వ్యాపారం నిర్వహించడం అంటే శక్తికి మించి చేసే కసరత్తే.
భారత్‌తో సంబంధాల్లో వ్యూహాత్మక గాఢతను సాధించడం ప్రధానమంత్రి నెతన్యాహూ ముందున్న ముఖ్యమైన సవాలు.
"ఇజ్రాయెల్, భారత్‌లు రెండూ తమ సంబంధాలను రొమాన్స్ స్థాయి నుంచి మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంద"ని ఇక్కడ ఒకాయన అన్నది చాలా వరకు సరిగ్గా అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








