మైక్ పెన్స్-అబ్బాస్ భేటీని రద్దు చేయొద్దని పాలస్తీనాను హెచ్చరించిన అమెరికా

ఫొటో సోర్స్, Mark Wilson/Getty Images
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పర్యటనను వ్యతిరేకిస్తున్నామని, తమ భూభాగంలో ఆయనకు స్వాగతం పలకబోమని పాలస్తీనా అధికారి పేర్కొనగా, పెన్స్‌తో చర్చలను రద్దు చేయొద్దంటూ పాలస్తీనాను అమెరికా హెచ్చరించింది.
జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చేసిన ప్రకటనపై పాలస్తీనా రగిలిపోతోంది.
అమెరికా ప్రయోజనాలతోపాటు ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి సాధనను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకొన్నానని ట్రంప్ తెలిపారు.
ఈ తరుణంలోనే పెన్స్ పర్యటనకు వ్యతిరేకంగా పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ నాయకత్వంలోని ఫతా పార్టీ సీనియర్ అధికారి జిబ్రిల్ రజౌబ్ వ్యాఖ్యలు చేశారు. పెన్స్‌తో అబ్బాస్ సమావేశం కారని చెప్పారు.

ఫొటో సోర్స్, Sean Gallup/Getty Images
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ స్పందిస్తూ- అబ్బాస్‌తో, ఇతర పాలస్తీనా నాయకులతో పెన్స్ సమావేశమవ్వాలనుకొంటున్నారని తెలిపింది. పెన్స్‌తో అబ్బాస్ సమావేశాన్ని రద్దు చేయాలనే నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పింది.
ఈ అంశంపై అబ్బాస్ ఇప్పటివరకు వ్యక్తిగతంగా స్పందించలేదు.
అమెరికా చర్యను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిర్యాదు దాఖలు చేసేందుకు ఫతా పార్టీ సిద్ధమవుతోంది. అమెరికా చర్యకు వ్యతిరేకంగా అరబ్ లీగ్ దృఢ వైఖరిని అనుసరించేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది.
తమ స్పందనపై నిర్ణయం తీసుకొనేందుకు భద్రతా మండలి, అరబ్ లీగ్ త్వరలో సమావేశాలు నిర్వహించనున్నాయి.
ఇంతకుముందు నిర్ణయించినదాని ప్రకారం పెన్స్ డిసెంబరు ద్వితీయార్ధంలో పాలస్తీనాను సందర్శించాల్సి ఉంది. పాలస్తీనాతోపాటు ఇజ్రాయెల్, ఈజిప్టులలో పర్యటించాల్సి ఉంది.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








