FIRలో కులం పేరు ఎందుకు రాస్తారు?

తెలంగాణ సిటీ పోలీసు

మీరెప్పుడైనా పోలీసుల ప్రెస్‌నోట్లు, ఎఫ్ఐఆర్‌లు, లేదా వారికి వచ్చిన ఫిర్యాదులను చూస్తే అందులో బాధితుల, ఆరోపితుల.. ఇద్దరి కులమూ కనిపిస్తుంది.

కుల వివక్ష వివాదాలు, కులాల మధ్య గొడవల సందర్భంలో అయితే సరే కానీ, ఏ నేరానికి సంబంధించి అయినా కులం తప్పక రాస్తారు.. దీనికి కారణం ఏంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎలా మొదలైంది?

భారత్‌లో ఆధునిక పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ కాలంలో వ్యవస్థీకృతం అయింది. అప్పటి నుంచీ ఈ కులం రాసే అలవాటు ఉందంటున్నారు పరిశోధకులు.

బ్రిటిష్ వారు 1871లో ‘ది క్రిమినల్ ట్రైబ్స్ చట్టం’ తెచ్చారు. దాని ప్రకారం కొన్ని కులాలను మొత్తంగా నేర ప్రవృత్తి కలిగిన వారుగా అంటే క్రిమినల్ ట్రైబ్స్‌గా ముద్ర వేశారు.

ఆ క్రమంలో అన్ని పోలీస్ స్టేషన్లు ఆయా కులాల గురించి రికార్డులు, ఆ కులాలు లేదా తెగలకు చెందిన వారి వివరాలు కులం పేరుతో సహా నమోదు చేసి, వారిపై నిఘా వేసి ఉంచాల్సి వచ్చేది.

తర్వాత వచ్చిన పోలీస్ మాన్యువల్స్‌లో కూడా ఈ కులం పేరు ఉండాలనే నిబంధన కొనసాగించారు.

1952లో క్రిమినల్ ట్రైబ్స్ చట్టం పోయినా ఆ ఛాయలు అలాగే కొనసాగాయి.

ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఏ స్టేషన్‌కి వెళ్లినా.. మీ ఫిర్యాదులో తండ్రి, వృత్తి వివరాలతో పాటు కులం పేరు కూడా రాయాల్సి ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, X/Andhra Pradesh Police

ఎందుకు కొనసాగిస్తున్నారు?

బ్రిటిష్ కాలంలో మొదలైన కులం పేరు రాయడం ఇంకా కొనసాగడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు.

ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) బాధితుల సోషియో ఎకనమిక్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవడం కోసం కూడా కులం రికార్డు చేస్తారని బీబీసీకి చెప్పారు ఒక పోలీస్ ఉన్నతాధికారి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేరస్థుల సమాచారాన్ని నిర్వహించే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్, CCTNS)లో కులం కాలమ్ ఉండేది.

అయితే, తాజాగా ఈ కులం కాలమ్ తీసేయాలని వివిధ కోర్టులు ఆదేశాలు ఇస్తున్నాయి.

''ఫిర్యాదుదారులు, ఆరోపితులు లేదా నిందితులు కులాల గురించి విచారించడం, నమోదు చేయడం ముందు నుంచీ ఉంది. ఇది వారిని ప్రాథమికంగా గుర్తించే పద్ధతిలో భాగమైపోయింది. ఏళ్ళ నుంచి పాతుకుపోయినా పాలనా-పోలీసింగ్ పద్ధతుల్లో ఇదొకటి'' అంటూ సీనియర్ పోలీస్ అధికారి, సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు ఈ పద్ధతి గురించి వివరించారు.

''నేరానికి సంబంధించి కులం కీలకమైతే తప్ప, చట్ట ప్రకారం అయితే రికార్డుల్లో కులం పెట్టక్కర్లేదు. అయితే, పౌర హక్కుల పరిరక్షణ చట్టం, 1955, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, 1989 వంటి చట్టాల కింద విచారించే కేసులకు మాత్రమే కులం పేరు కచ్చితంగా నమోదు చేయాల్సిన అవసరం వస్తుంది'' అన్నారు నాగేశ్వర రావు.

"FIRలో కులం రాయడం తప్పనిసరి ఏమీ కాదు. అయితే, ఆ నేరమే కులం ఆధారంగా జరిగినప్పుడు మాత్రం అది అవసరమవుతుంది. ఐతే పాఠశాల రికార్డులు, ప్రభుత్వ రికార్డులలో లాగానే పోలీసులు కూడా సాధారణంగా గుర్తింపు కోసం కులం రాస్తున్నారు" అని బీబీసీతో చెప్పారు రిటైర్డ్ ఐజీ ఎల్. కాళిదాసు వెంకట రంగారావు.

కులం నమోదు వల్ల విచారణలో ఏదైనా ప్రయోజనం ఉంటుందా లేదా పోలీసులకు మరే రకమైన ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించినప్పుడు, "నేరానికి కులమే ప్రధాన కారణం కానంత వరకు, దర్యాప్తులో దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు" అన్నారాయన.

పరోక్షంగా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయగలిగిన కులాలవారు జైలు శిక్ష అనుభవించడం లేదంటూ గుర్తు చేశారు రంగారావు. ఇటువంటి సామాజిక విశ్లేషణలకు కులం నమోదు పనికి వస్తుందనేది ఒక వాదన.

అయితే సమాజంలో నేరాలు జరుగుతున్న శైలి వాటి సామాజిక నేపథ్యాలను పరిశీలించడానికి ఇది ఉపయోగపడుతుందన్న అభిప్రాయంతో మాజీ ఐజీ కాళిదాసు వెంకట రంగారావు ఏకీభవించారు.

"న్యాయ వ్యవస్థను సమాజంలో కొన్ని వర్గాలు ఎప్పటికీ ప్రభావితం చేయలేవు. అటువంటివారు శిక్షలు పడి జైల్లో ఉంటారు. ప్రస్తుతం జైళ్లలో ఉన్న వారిలో 90% మంది సమాజంలోని వెనుకబడిన లేదా అణగారిన వర్గాలకు చెందినవారే. అలాగే, ఆస్తి నేరాలకు పాల్పడే కొన్ని నేరపూరిత ముఠాలను గుర్తించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది" అన్నారు రంగారావు.

ఎఫ్ఐఆర్ కాపీ

ఫొటో సోర్స్, UGC

కులం వద్దంటున్న కోర్టులు

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ దివాకర్ 2025 మార్చిలో కొన్ని ఆదేశాలు ఇచ్చారు.

పోలీసులు నేర సంబంధిత పత్రాల్లో కులం ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు.

ఎఫ్ఐఆర్‌లో కులం ఎందుకు రాస్తున్నారో వివరిస్తూ వ్యక్తిగతంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ డీజీపీని కోర్టు ఆదేశించింది.

రాజ్యాంగం కుల వివక్షను తొలగించేందుకు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తూ, ''ఇలా కులం రాయడం ప్రజల్లో ఒక ముద్ర పడిపోవడానికి, వ్యవస్థీకృతమైన వివక్ష ఏర్పడటానికీ కారణమవుతుంది'' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ప్రవీణ్ ఛెత్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఆ కేసులో అరెస్టయిన అందరి కులాల పేర్లూ ఉండటంతో హైకోర్టు ప్రశ్న లేవనెత్తింది.

కులం రాయడానికి గల కారణాలను సెప్టెంబరులో ఆ కేసు విచారణ సందర్భంగా యూపీ డీజీపీ వివరించారు

సీసీటీఎన్ఎస్ రికార్డుల్లో నమోదు చేయడం కోసం, అలాగే ఒకేలాంటి పేర్లున్న వ్యక్తుల మధ్య తేడా గుర్తించడం కోసం ఇలా రాస్తున్నాం తప్ప వివక్ష కాదని డీజీపీ సమాచారం ఇచ్చారు.

కోర్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఇంటి పేర్లు లేని ఉత్తర భారతంలో ఒకే తరహా చివరి పేర్లున్నప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి ఇలా రాశాం అన్న ధోరణిలో డీజీపీ సమాధానం ఉంది. అయితే కోర్టు ఈ వాదనను తిరస్కరించింది.

21వ శతాబ్దిలో కూడా మనుషులను గుర్తించడానికి కులం ఎందుకు అని, బాడీ కెమెరా, వేలిముద్రలు, మొబైల్ ట్రాకింగ్, ఆధార్‌లను వాడుకోవాలని జడ్జ్ ఆదేశించారు.

అంతేకాదు ''ఎఫ్ఐఆర్, రికవరీ మెమో, అరెస్ట్ ఫామ్, ఇతర పోలీసు పత్రాల్లో కులం కాలమ్ తొలగించాలి. వ్యక్తులను గుర్తించడం కోసం తండ్రి, భర్తతో పాటు తల్లి పేరు పెట్టవచ్చు. పోలీస్ స్టేషన్ నోటీసు బోర్డుల్లో కూడా ఆరోపితుల పేరు పక్కన కులం తొలగించాలి. గ్రామాల్లో, వాహనాలపై కులం పేరు వాడవద్దు'' అని 2025 సెప్టెంబరులో కోర్టు తీర్పు ఇచ్చింది.

2025 సెప్టెంబరులో అలహాబాద్ హైకోర్టు తీర్పు మేరకు యూపీ ప్రభుత్వం కులం నమోదు చేయవద్దంటూ మొదటిసారి పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఎఫ్ఐఆర్, అరెస్ట్ మెమోల్లో రాయవద్దని చెప్పింది. దాని బదులు తల్లిపేరు పెట్టాలని చెప్పింది.

కుల వివక్ష కేసుల నిమిత్తం అంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రకారం నమోదయ్యే కేసులకు ఈ నిబంధన వర్తించదు.

అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకారం కేవలం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే పోలీస్ రికార్డుల్లో కులం పేరు తొలగింపుకు ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ పద్ధతి కొనసాగుతోంది.

ఎఫ్ఐఆర్ కాపీలో కులం పేరు

ఫొటో సోర్స్, UGC

కోర్టు పత్రాల్లో కూడా..

పోలీసులే కాదు కోర్టుల కాజ్ టైటిల్స్‌లో కూడా కులం పేరు వద్దని 2023లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పు టైటిల్లో ఆరోపితుని కులం ఉండటాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

''ఆరోపితునితో కోర్టు డీల్ చేస్తున్నప్పుడు అతనికి కులం, మతం ఉండవు. కాజ్ టైటిల్‌లో కులం పేరు ఉండకూడదు'' అని డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు మాత్రమే కాక, 2020లో రాజస్థాన్ హైకోర్టు కూడా అరెస్ట్ మెమోల్లో కులం రాయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

రాజ్యాంగంలో కానీ , సీఆర్పీసీలో కానీ కులం రాయాలని లేదని చెప్పింది. 2016లో పంజాబ్ హరియాణా హైకోర్టు కూడా ఇదే తరహా తీర్పు ఇచ్చింది.

అయితే, మొత్తంగా ఈ కులం పేరు తొలగించడం పట్ల భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.

''దళితులకు చట్టం కొన్ని రక్షణలు కల్పించింది. కాబట్టి ఆయా కేసుల్లో సామాజిక నేపథ్యం రాయడం అవసరం. అయితే, ఫిర్యాదుదారు లేదా బాధిత వ్యక్తి ఇతరత్రా కేసుల్లో తన కులం పేరు ఇవ్వడం ఇష్టం లేకపోతే పోలీసులు దాన్ని నమోదు చేయడం మానేయాలి'' అని న్యాయవాది విజయ్ గోపాల్ బీబీసీతో అన్నారు.

''దేశంలో కులం ఉంది. కుల ప్రభావం ఉంది. కార్ల మీద, ఇళ్ళ మీద రాసుకునే కులం, నేరం చేసినప్పుడు మాత్రం రాసుకోవడంలో ఏముంది? మన సమాజంలో ఆధిపత్య వర్గాల వారు తప్పు చేస్తే తెలివిగా వారి కులం రాయనివారు కూడా కనిపిస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం, ఎఫ్ఐఆర్, ఇతర పోలీసు రికార్డుల వరకూ కులం పేరు రాయడం తప్పు కాదు. అదే సందర్భంలో ప్రెస్ నోట్‌లో కులం రాయాల్సిన అవసరం లేదు. బయట విరివిగా కులం పాటిస్తూ, ఎఫ్ఐఆర్‌లో మాత్రం రాయకపోవడం వల్ల లాభం లేదు. అదే సందర్భంలో ఎవరైనా తమ కులం రాయడం ఇష్టం లేదు అంటే బలవంతం చేయాల్సిన అవసరం లేదు'' అని కుల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ బీబీసీతో అన్నారు .

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)