ముంబయి రైలు పేలుళ్ల కేసు : 'చేయని నేరానికి నా జీవితంలో 19 ఏళ్లు కోల్పోయాను'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాన్వీ మూలె
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముంబయిలో వరుస పేలుళ్లు జరిగి 19 ఏళ్లు గడిచాక, ట్రయల్ కోర్టు తీర్పునిచ్చి 10 ఏళ్లు పూర్తయ్యాక, శిక్ష అనుభవిస్తున్న 12 మందిని తాజాగా ముంబయి హైకోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. కానీ, ఈ కేసులో ఇప్పటికీ చాలా ప్రశ్నలకు సమాధానం లేదు.
ముంబయి సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ పశ్చిమ మార్గంలో 2006 జూలై 11న ఏడు రైళ్లలో 7 పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులలో 189 మంది మరణించారు, 824 మంది గాయపడ్డారు.
కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు, 2015లో 13 మంది నిందితులలో 12 మందిని దోషులుగా ప్రకటిస్తూ, ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఈ నిర్ణయాన్ని ఇప్పుడు ముంబయి హైకోర్టు రద్దు చేసింది.
అప్పీళ్లను విచారించిన జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్‌లతో కూడిన ధర్మాసనం "సహేతుకమైన సందేహాలకు మించి కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది" అని వ్యాఖ్యానించినట్లు మీడియా కథనాలు తెలిపాయి.


ఫొటో సోర్స్, Getty Images
"ఇది దిగ్భ్రాంతికరం, నిరాశపరిచేది. 19 ఏళ్ల తర్వాత అందరినీ వదిలేయడమంటే, చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి" అని పేలుళ్లలో ఎడమ చేయి కోల్పోయిన మహేంద్ర పితాలే అన్నారు.
"ఈ వ్యక్తులందరూ నిర్దోషులైతే, దర్యాప్తులో అసలు ఏం తప్పు జరిగింది? ఈ పేలుళ్ల వెనుక ఉన్న నిజమైన సూత్రధారులు ఎవరు? ఇన్ని సంవత్సరాలుగా వారిని ఎందుకు కనుక్కోలేకపోయారు ? మనకు సమాధానాలు దొరకడం లేదా? నిజమైన దోషులు ఇప్పుడు పట్టుబడినా, కేసు మరో 19 సంవత్సరాలు కొనసాగుతుంది" అని ఆయన అంటున్నారు.
ముంబయి స్తంభించిన రోజు
జూలై 11, 2006
ముంబయిలో ఆకాశం మేఘావృతమై ఉంది. మహేంద్ర పితాలే నగరానికి పశ్చిమాన శివారు ప్రాంతమైన విలే పార్లేలోని తన ఆఫీసులో ఉన్నారు.
ఆయన ఒక గ్లాస్ స్టూడియోలో డిజైనర్‌గా పనిచేసేవారు.
"నేను సాధారణంగా సాయంత్రం 7:30 గంటలకు ఇంటికి తిరిగి రైలులో వెళ్తాను. కానీ, ఆ రోజు కొంచెం ముందుగానే బయలుదేరాను. 6:10 గంటలకు రైలు ఎక్కాను" అని మహేంద్ర అన్నారు.
సాయంత్రం 6:24 గంటలకు, రైలు జోగేశ్వరి స్టేషన్ నుంచి బయలుదేరుతుండగా పెద్ద పేలుడు సంభవించింది. ఆ సాయంత్రం నగరాన్ని కుదిపేసిన ఏడు పేలుళ్లలో ఇదొకటి.
మొత్తం దాడులలో 189 మంది మరణించారు, 824 మంది గాయపడ్డారు, ఇది నగరంపై జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఒకటిగా పరిగణించారు.
మహేంద్ర ప్రాణాలతో బయటపడ్డారు కానీ, ఎడమ చేయిని కోల్పోయారు. ఆ రోజు ఆయన జీవితం తలకిందులైంది. 19 సంవత్సరాలు దాటినా కేసుకు ముగింపు లేకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
"ఆ తర్వాత 2008లో ముంబయిపై (26/11) ఉగ్రవాదుల దాడులు జరిగాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు త్వరగా తీర్పు ఇచ్చింది. కసబ్‌ను 2012లోనే ఉరితీశారు. కానీ, ఇక్కడ అలాంటిది జరగలేదు" అని మహేంద్ర అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విచారణ ఎలా సాగింది?
పేలుళ్లు జరిగిన కొన్ని రోజుల తర్వాత, ముంబయి పోలీసుల యాంటీ-టెర్రర్ స్క్వాడ్(ఏటీసీ) 13 మందిని అరెస్టు చేసింది. 15 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు.
'పాకిస్తాన్ సంబంధిత ఉగ్రవాద గ్రూపులు' ప్రెషర్ కుక్కర్ల వంటి పాత్రలలో బాంబులను అమర్చి పేలుళ్లకు కారణమయ్యారని’ ఏటీఎస్ తెలిపింది.లష్కరే తోయిబా కమాండర్ ఇన్ చీఫ్ అజామ్ చీమా పేరును అభియోగపత్రంలో పేర్కొంది. లష్కరే తోయిబాకు అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి.
ఈ చార్జిషీట్ ఒక్కటే 10,667 పేజీలు ఉంది. అందులో నిందితుల్లో కొంతమందికి లష్కరే తోయిబాతో సంబంధం ఉందని, మరికొందరు నిషేధిత సంస్థ అయిన సిమి సభ్యులని తెలిపారు.
అయితే, వారందరూ పోలీసుల ఆరోపణలను తిరస్కరించారు, నేరం చేసినట్లుగా తమతో బలవంతంగా ఒప్పించారని పేర్కొన్నారు.
ఈ కేసులో తీర్పు రావడానికి దాదాపు తొమ్మిదేళ్లు పట్టింది. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (ఎంసీఓసీఏ) కింద ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారించింది.
సెప్టెంబర్ 30, 2015న, అభియోగాలు నమోదైన 13 మందిలో 12 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. ఐదుగురికి మరణశిక్ష, మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. 13వ నిందితుడైన అబ్దుల్ వాహిద్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
దోషులుగా తేలిన 12 మంది నిందితులలో ఒకరైన కమల్ అహ్మద్ మొహమ్మద్ వకీల్ అన్సారీ 2021లో మరణించాడు.
జిల్లా కోర్టు మరణశిక్ష విధించిన తర్వాత, దాని నిర్ధరణకు కేసు హైకోర్టుకు వెళుతుంది. ఈ సమయంలో, దోషులు తీర్పుపై అప్పీల్ చేసుకోవచ్చు. అయితే, ఈ అప్పీళ్లపై తీర్పు రావడానికి మరో పదేళ్లు పట్టింది.

ఫొటో సోర్స్, AFP
హైకోర్టులో ఏం జరిగింది?
ఎంసీఓసీఏ కింద, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి ముందు చేసిన 'ఒప్పుకోలు(కన్ఫెషన్)'ను సాక్ష్యంగా పరిగణిస్తారు. అయితే, ఎంసీఓసీఏని సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు, ఆ తర్వాత కోర్టులో రెండేళ్ల పాటు విచారణ జరగలేదు.
కొందరు నిందితుల తరపున వాదించిన యువ డిఫెన్స్ న్యాయవాది షాహిద్ అజ్మీని 2010లో కుర్లాలో ఆయన కార్యాలయంలోనే కాల్చి చంపేశారు.
ఇంతలో, ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నాయంటూ 2008లో ముంబయి క్రైమ్ బ్రాంచ్ ఐదుగురిని అరెస్టు చేయడంతో దర్యాప్తు ఊహించని మలుపు తిరిగింది. ఏటీఎస్ వాదనలకు విరుద్ధంగా, బాంబు పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్ కారణమని వారు ఆరోపించారు.
అంతేకాదు, 2013లో జరిగిన పేలుళ్లకూ తమ గ్రూపుదే బాధ్యత అని ఐఎం సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రకటించారు. పేలుళ్లపై విచారణ 2014 ఆగస్టులో ముగిసింది. 2015 సెప్టెంబర్‌లో ఎంసీఓసీఏ కోర్టు 13 మందిలో 12 మందిని దోషులుగా నిర్ధరించింది.
దశాబ్దం గడిచింది. నిందితుల శిక్షలు, అప్పీళ్లపై బాంబే హైకోర్టులో 2025 జనవరి 31న విచారణ ముగించింది. న్యాయమూర్తులు అనిల్ కిలోర్, శ్యామ్ చందక్‌లతో కూడిన హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఆరు నెలలకు పైగా ప్రతిరోజూ అప్పీళ్లను విచారించింది. పుణేలోని ఎరవాడ నాసిక్, అమరావతి, నాగ్‌పూర్ జైళ్లలో ఉన్న దోషులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జీల ఎదుట హాజరయ్యారు.
ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్. మురళీధర్, కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్. నాగముత్తు వంటి అనేకమంది సీనియర్ న్యాయవాదులు దోషుల తరపున వాదించారు.
నిందితులను హింసించారని ఆరోపిస్తూ, వారి ఒప్పుకోలు ఆమోదయోగ్యతను న్యాయవాదులు సవాలు చేశారు. అసలు బాంబులను ఎవరు తయారు చేశారో, పేలుడు పదార్థాలను సేకరించడంలో ఎవరు సహాయపడ్డారో, వాటిని ఎవరు అమర్చారో ఎవరికీ తెలియదని ఎత్తిచూపారు.
ఐదుగురు నిందితులకు మరణశిక్షతో పాటు, మరో ఏడుగురికి జీవిత ఖైదును ధ్రువీకరించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజా థాకరే, ఎ. చిమల్కర్ కోర్టుకు విన్నవించారు.
దాదాపు 6 నెలల విచారణ తర్వాత, హైకోర్టు 'మరే ఇతర కేసులో నిందితుల పేరు లేకపోతే 12 మందిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలి' అని ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
19 ఏళ్ల పాటు అగ్నిపరీక్ష...
అబ్దుల్ వాహిద్ 2006లో సిమి (ఎస్ఐఎంఐ) సభ్యుడిగా ఉన్నారని, ఈ కేసులో కొంతమంది నిందితులు నివసించిన ఇల్లును ఆయన అద్దెకు తీసుకున్నారని ఆరోపణలు నమోదయ్యాయి.
''నేను ఎలాంటి సంస్థలోనూ సభ్యుడిని కాను. నేను ఒక ఉపాధ్యాయుడిని, విద్యావేత్తను. ఆ కారణంగానే నాకు చాలామందితో పరిచయాలు ఏర్పడ్డాయి. వర్క్‌షాప్‌లకు, విద్యా కార్యక్రమాలకు ఆహ్వానించేవారు'' అని వాహిద్ చెప్పారు.
అలాంటి కార్యక్రమాల కారణంగానే 2001లో తన పేరు ఒక కేసులో చేరిందని, అందుకే 2006లో పోలీసులు తనను అరెస్టు చేశారని ఆయన వెల్లడించారు.
''2001 కేసుకు సంబంధించి 2013లో నిర్దోషిగా విడుదలయ్యాను. ఈ వ్యక్తికి సిమితో సంబంధం లేదని న్యాయమూర్తి కూడా అన్నారు. అందుకు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఆ తీర్పును ఎవరూ సవాలు చేయలేరు'' అని అబ్దుల్ వాహిద్ చెప్పారు.
అబ్దుల్ గతంలో విక్రోలీలో ఉండేవారు. కానీ 2006లో ఆయన తన భార్య, చిన్న బిడ్డతో కలిసి ముంబ్రాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు నివసించారు. ఆయన బైకుల్లాలోని పాఠశాలకు రోజూ రైలులో రాకపోకలు సాగించేవారు.
''2006 జూలై 11వ తేదీన, రైలులో పాఠశాలకు వెళ్లి ఎప్పటిలాగే సాయంత్రం ఇంటికి తిరిగివచ్చాను. పొరుగింటిలో టీవీ చూస్తుంటే, రైలులో పేలుళ్ల గురించి బ్రేకింగ్ న్యూస్ మొదలైంది. అది చూసి మాకు చాలా బాధగా అనిపించింది. నేను ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాను. రైళ్ల వ్యవస్థ స్తంభించడంతో మర్నాడు నేను బడికి వెళ్లలేకపోయాను. ఆ తర్వాత రోజు నా సోదరుడు ఫోన్ చేసి, పోలీసులు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడిగారని చెప్పారు'' అని అబ్దుల్ వెల్లడించారు.
ఆయన స్వచ్ఛందంగానే పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏటీఎస్ అధికారులు అర్ధరాత్రి తన ఇంట్లోకి చొరబడి, తనను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.
''ఆ రోజు మొదలైన సంబంధం ఈరోజుకూ ముగియలేదు'' అని చెప్పారు.
జైలులో ఉన్నప్పుడు అబ్దుల్ లా డిగ్రీ పూర్తిచేశారు. దర్యాప్తు సాగుతున్న క్రమంపై ''బేగునాహ్ ఖైదీ'' పేరుతో ఉర్దూలో ఒక పుస్తకం రాశారు. తర్వాత 'అమాయక ఖైదీలు' పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. భారత్‌లో పోలీసు విధానాల పనితీరు, నేరాంగీకారం (ఒప్పుకోలు) తీసుకోవడానికి వారు ఆశ్రయించే పద్ధతులను అందులో ఆవిష్కరించారు. 7/11 ముంబయి పేలుళ్ల కేసులో బలవంతంగా ఒప్పుకోలు తీసుకున్నారని అబ్దుల్ ఆరోపించారు.
కోర్టు ప్రాసిక్యూషన్ వాదనను తిరస్కరించింది. ''ఉపా (యూఏపీఏ) కింద నిందితుడు శిక్షార్హమైన నేరం చేశారన్న వాదనను సహేతుకమైన సందేహానికి మించి నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది'' అని కోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
''నేను పుస్తకంలో పేర్కొన్న అధికారులలో ఎవ్వరూ నేను రాసింది నిజం కాదని ఎప్పుడూ చెప్పలేదు'' అని అబ్దుల్ చెప్పారు.
అబ్దుల్ పుస్తకంలో పేర్కొన్న అధికారులలో కొంతమందిని బీబీసీ సంప్రదించింది. కానీ వారి నుంచి స్పందన రాలేదు. అయితే కిందటి నెలలో న్యూస్ మినిట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏటీఎస్ మాజీ అధిపతి కేపీ రఘువంశీ మాట్లాడుతూ... ''దర్యాప్తు అధికారి ఉద్దేశం నిజాయితీగా ఉన్నప్పుడు, ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు చట్టం అతనికి రక్షణగా ఉంటుంది. విధినిర్వహణలో తప్పుచేసినా, అతని చర్యల్లో దురుద్దేశం లేనప్పుడు రక్షణ ఉంటుంది. ఉగ్రవాదం సంబంధిత కేసుల్లో నిందితులు తరచుగా తీవ్రవాద కుట్రలను అనుసరిస్తారు. దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించడానికి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తారు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి, గందరగోళం సృష్టించడానికి సంబంధంలేని ఆరోపణలనూ అంగీకరిస్తుంటారు'' అని చెప్పారు.
‘‘నేను దీనిని బాధ్యతగా చెప్పాను. నిజమైన నేరస్తులను పట్టుకుంటే, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారికి అదో గుణపాఠమవుతుంది’’ అని అబ్డుల్ చెప్పారు.
అబ్దుల్ నిర్దోషిగా విడుదలైనప్పటికీ, ఆయన పేరు కేసుతో ముడిపడి ఉంది.
''నేను నిర్దోషినే. కానీ వాస్తవానికి నిర్దోషిగా వదిలేసినట్లు కాదు. ఎందుకంటే పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు మమ్మల్ని అనుమానంతో చూస్తూనే ఉంటాయి. కాబట్టి అగ్ని పరీక్ష కొనసాగుతుంది'' అని అబ్దుల్ అన్నారు.
ఏదేమైనా తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని అబ్దుల్ చెప్పారు.
''నేను నేరం చేయకపోయినా నా యవ్వనంలో చాలా సంవత్సరాలు కోల్పోయాను. అలాగని మనం న్యాయవ్యవస్థను నమ్మకపోతే, ఏమిటి మార్గం?'' అన్నారు.
మరోపక్క పేలుళ్లలో చేయి కోల్పోయిన మహేంద్ర పనిచేయలేకపోయారు. ఆయనకు పశ్చిమ రైల్వే ఉద్యోగం ఇచ్చింది.
వాళ్లు నేటికీ లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణిస్తూనే ఉన్నారు.
‘‘పరిస్థితులు మారాయి. కానీ భద్రతపై భయాందోళనలు ఇంకా ఉన్నాయి. దాడులు జరిగినప్పటి నుంచి పోలీసులు భద్రత పెంచారు. కానీ ఏ నిమిషంలోనైనా ఏమైనా జరగొచ్చు. అందుకే భయపడుతూనే ఉన్నాం. దానికి అంతం లేదు’’
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














