ముంబయి దాడుల కేసులో తహవ్వుర్ హుస్సేన్ రాణా పాత్ర ఏమిటి, డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి ఆయన చేసిన పనులేంటి?

ఫొటో సోర్స్, ANI
ముంబయి దాడి (2008) నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. తన అప్పగింతపై రాణా వేసిన రివ్యూపిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
తహవ్వుర్ హుస్సేన్ రాణా పాకిస్తాన్ మూలాలున్న కెనడా పౌరుడు. ప్రస్తుతం అమెరికా జైలులో ఉన్నారు. ఆయనను భారత్‌కు అప్పగించే విషయమై విచారణ జరుగుతోంది. ముంబయి దాడుల్లో ఆయన పాత్ర గురించి విచారించాలని భారత్ కోరుకుంటోంది.
తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు ఓ అమెరికా కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై రాణా నిరుడు నవంబర్ 13న రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
తన స్నేహితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి ముంబయి దాడులు, డెన్మార్క్‌లో దాడికి ప్రణాళికలు రచించారనే కేసుల్లో రాణాను దోషిగా తేల్చారు.దీంతో 63 ఏళ్ల తహవ్వుర్ హుస్సేన్ రాణాకు అమెరికా కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
రాణాను భారత్‌కు ఎప్పుడు అప్పగిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.


ఫొటో సోర్స్, Getty Images
ముంబయి దాడులు
2008 నవంబర్ 26వ తేదీ రాత్రి 10 మంది తీవ్రవాదులు, ముంబయిలోని తాజ్ హోటల్ సహా పలు భవనాలపై ఏకకాలంలో దాడి చేశారు. ఈ దాడిలో 164 మంది పౌరులు చనిపోగా, తొమ్మిది మంది తీవ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. మరో తీవ్రవాది అజ్మల్ కసబ్‌ను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. ఆయనను 2012 నవంబర్‌లో ఉరి తీశారు.
ముంబయిలో దాడికి పాల్పడిన తీవ్రవాదులకు, పాక్‌లో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం ఉందని భారత్ ఆరోపిస్తోంది.
పాకిస్తానీ- అమెరికన్ పౌరుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీపై భారత ఏజెన్సీలు చేస్తున్న దర్యాప్తులో పదే పదే తహవ్వుర్ హుస్సేన్ రాణా అనే పేరు వినిపిస్తోంది. షికాగోలో కట్టుదిట్టమైన భద్రత మధ్య నాలుగు వారాల పాటు జరిగిన విచారణలో రాణాకు సంబంధించిన పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలోనే రాణా చిన్ననాటి స్నేహితుడు హెడ్లీ నేపథ్యం కూడా వెల్లడైంది. అయితే ఈ కేసులో ముఖ్యమైన విషయం ఏమిటంటే , తహవ్వుర్ రాణాకు వ్యతిరేకంగా హెడ్లీ సాక్షిగా మారారు. హెడ్లీ తన వాంగ్మూలంలో ముంబయి దాడుల ప్రణాళిక గురించి వివరించారు. అందులో తనతోపాటు రాణా పాత్ర గురించి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో జననం
తహవ్వుర్ రాణా, పాకిస్తాన్‌లో పుట్టి పెరిగారు. మెడికల్ డిగ్రీ పొందిన తర్వాత ఆయన పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కోర్‌లో చేరారు.
రాణా భార్య కూడా డాక్టర్. 1997లో భార్యాభర్తలిద్దరూ కెనడాకు వెళ్లారు. 2001లో కెనడా పౌరసత్వం తీసుకున్నారు. 2009లో అరెస్టు కావడానికి కొన్ని ఏళ్ల ముందు, అమెరికాలోని షికాగోలో ఒక ఇమ్మిగ్రేషన్, ట్రావెల్ ఏజెన్సీని ఆయన ప్రారంభించారు. దీనితో పాటు మరికొన్ని వ్యాపారాలు కూడా మొదలుపెట్టారు.
డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో ఆయనకున్న పాత స్నేహం షికాగోలో మళ్లీ మొదలైందని కోర్టులో తెలిపారు. ముంబయిపై దాడికి హెడ్లీ సన్నాహాలు ప్రారంభించినప్పుడు, రెక్కీ నిర్వహించడానికి ఆయన 2006-2008 మధ్య అనేకసార్లు ముంబయికి రావాల్సి వచ్చింది. మళ్లీ మళ్లీ ముంబయికి ఎందుకు వస్తున్నాడో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రాణా ముంబయిలో ట్రావెల్ ఏజెన్సీ బ్రాంచ్‌ను ప్రారంభించారు. లష్కరే తోయిబా సూచన మేరకే రాణా ఇలా చేశారనే సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది.
ముంబయి దాడిలో ఆరుగురు అమెరికా పౌరులు కూడా మరణించారు. అమెరికా పౌరులను చంపడానికి సహాయం చేయడంతో పాటు, 12 ఆరోపణలపై రాణాకు శిక్ష పడింది.

ఫొటో సోర్స్, PENGUIN
ఎఫ్‌బీఐ పట్టుకుంది
అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ 2009 అక్టోబర్‌లో రాణా, హెడ్లీలను షికాగో విమానాశ్రయంలో పట్టుకుంది.వారిద్దరూ మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్లను ప్రచురించిన జిలాండ్స్-పోస్టెన్ అనే వార్తాపత్రిక కార్యాలయంపై దాడి చేయడానికి డెన్మార్క్‌కు బయల్దేరారని ఎఫ్‌బీఐ పేర్కొంది.ఈ కేసు విచారణలోనే ముంబయి దాడుల్లోనూ రాణా హస్తం ఉన్నట్లు నిర్థరణ అయింది.
ఈ విధంగా, రెండు వేర్వేరు కుట్రల్లో భాగమైనందుకు రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
కోపెన్‌హాగన్‌లో 'ఫస్ట్ వరల్డ్' ఇమ్మిగ్రేషన్, ట్రావెల్ కార్యాలయ శాఖను ఏర్పాటు చేసేందుకు హెడ్లీకి రాణా అనుమతి ఇచ్చారు. పాకిస్తాన్‌లో జరిగే లష్కర్ శిక్షణా శిబిరాల్లో హెడ్లీ పాల్గొన్నట్లు 2009 అక్టోబర్‌లో అరెస్ట్ అయిన తర్వాత రాణా వెల్లడించారు.

ఫొటో సోర్స్, HARPER COLLINS
హెడ్లీ ఒప్పుకోలు
2002-2005 మధ్య అయిదు వేర్వేరు సందర్భాల్లో తాను పాకిస్తాన్‌లో జరిగిన లష్కరే తోయిబా శిక్షణా శిబిరాలకు హాజరయ్యానని హెడ్లీ అంగీకరించారు. రెక్కీ కోసం భారత్‌కు వెళ్లాల్సిందిగా లష్కరే సభ్యుల నుంచి 2005 చివర్లో హెడ్లీకి ఆదేశాలు అందాయి. ఆ తర్వాత మూడేళ్లలో హెడ్లీ అయిదుసార్లు భారత్‌లో పర్యటించారు.
2006 వేసవి ప్రారంభంలో హెడ్లీ, మరో ఇద్దరు లష్కర్ సభ్యులు తమ కార్యకలాపాలను కవర్ చేసేందుకు ముంబయిలో ఒక ఇమ్మిగ్రేషన్ ఆఫీసును ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్లు షికాగోలో అటార్నీ జనరల్ తరఫున విడుదలైన ఒక ప్రకటన ద్వారా తెలిసింది.
''నేను షికాగో వెళ్లాను. భారత్‌లో దాడి చేయడానికి లక్ష్యాలను అన్వేషించడం గురించి అక్కడ నా పాఠశాల మిత్రుడిని సంప్రదించాను'' అని హెడ్లీ వాంగ్మూలంలో చెప్పారు.
ముంబయిలో 'ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్' కార్యాలయాన్ని ప్రారంభించడం గురించి హెడ్లీ, రాణాతో మాట్లాడారు. ఆ కార్యాలయాన్ని తమ కార్యకలాపాలకు రక్షణగా వాడుకోవచ్చని వారు భావించారు.
''2006 జులైలో నేను రాణాను కలిసేందుకు షికాగో వెళ్లాను. లష్కరే నాకు అప్పగించిన ముంబయి దాడుల మిషన్ గురించి రాణాకు చెప్పాను. ముంబయిలో "ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్" కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నా ప్లాన్‌ను రాణా ఆమోదించారు. అలాగే నేను అయిదేళ్ల వ్యాపార వీసా పొందడంలో నాకు సహాయం చేశారు" అని వాంగ్మూలంలో హెడ్లీ పేర్కొన్నారు.
అయితే, 2016 ఫిబ్రవరిలో బాంబే సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో వీడియో లింక్ ద్వారా హెడ్లీ వాంగ్మూలం ఇస్తూ, ముంబయి దాడులకు కొన్ని నెలల ముందు మాత్రమే రాణాకు తన కార్యకలాపాల గురించి తెలియజేసినట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, HARPER COLLINS/ANI
అమెరికా అటార్నీ జనరల్ ఏం చెప్పారు?
రాణాకు శిక్ష విధించిన తర్వాత, అమెరికా అసిస్టెంట్ అటార్నీ జనరల్ లిసా మొనాకో మాట్లాడారు.
"ఉగ్రవాదులను వారి సంస్థలను మేం వెంబడించే విధానాన్ని ఈరోజు మేం తీసుకున్న నిర్ణయం ప్రతిబింబిస్తుంది. దూరంగా ఉంటూ హింసాత్మక కుట్రలను అమలు చేసే వారిని కూడా మేం విడిచిపెట్టం. విదేశాల్లో దాడులకు హెడ్లీ ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకుని తహవ్వుర్ రాణా, అమెరికాలోని తన స్థావరం నుంచి హెడ్లీకి గణనీయమైన సహాయం అందించారు.ఈ శిక్ష విధించడానికి తగు రుజువులను అందించిన, సహాయం చేసిన ఏజెంట్లు, విశ్లేషకులు ప్రాసిక్యూటర్‌లకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను'' అన్నారు.
చిన్ననాటి స్నేహితులు
రాణా, హెడ్లీ చిన్నప్పటి నుంచే స్నేహితులు. వీరిద్దరూ ఒకే స్కూల్‌లో అయిదేళ్లు చదువుకున్నారు.స్కూల్ నుంచి వెళ్లిపోయిన తర్వాత 2006లో షికాగోలో మళ్లీ కలుసుకున్నారు.
రాణాతో పోలిస్తే హెడ్లీ లష్కరే కోసం చురుకుగా పనిచేసినట్లు షికాగోలో జరిగిన విచారణలో తెలిసింది.
ముంబయి, కోపెన్‌హాగన్‌లలో ఏకకాలంలో ఉగ్ర దాడులకు లష్కరే 2005లో ప్లాన్ వేసినట్లు కోర్టులో వారిద్దరూ ఇచ్చిన వాంగ్మూలాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ రెండు పథకాల్లోనూ రాణాకు భాగం ఉంది. ముంబయి దాడుల్లో రాణా పాత్ర హెడ్లీకి, లష్కరేకు సహాయం చేయడం వరకే పరిమితమైంది.
కానీ డెన్మార్క్ విషయంలో, స్వయంగా వారిద్దరూ దాడికి ప్లాన్ చేశారు. దాన్ని అమలు చేయడానికి డెన్మార్క్‌కు బయలుదేరబోతుండగా, షికాగో విమానాశ్రయంలో పట్టుబడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














