జమ్మూకశ్మీర్: అంతు చిక్కని వ్యాధితో 17 మంది మృతి, విషపదార్థాలే కారణమా?

ఫొటో సోర్స్, MAJID JAHANGIR
- రచయిత, మాజిద్ జహంగీర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్మూకశ్మీర్‌లోని బడ్‌హాల్ గ్రామం అంతు చిక్కని వ్యాధి కారణంగా పతాక శీర్షికలకెక్కింది. రాజౌరీ జిల్లాలోని ఈ గ్రామం రాజధాని శ్రీనగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.
బడ్‌హాల్ గ్రామంలో ఈ అంతు చిక్కని వ్యాధి కారణంగా 45 రోజుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఆరు వారాల కిందట ఈ వ్యాధికి సంబంధించిన తొలి కేసు నమోదైనప్పటికీ, మరణాలకు కారణం ఏమిటనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. గ్రామస్థులు మాత్రం కోవిడ్ 19 నాటి పరిస్థితులు పునరావృతమైనట్టుగా ఉందని చెబుతున్నారు.
అయితే ఇది అంటు వ్యాధి కాదని, కోవిడ్ మాదిరిగా విస్తరించే అవకాశం లేదని రాజౌరీ ప్రభుత్వ వైద్యకళాశాల అధికారులు బీబీసీతో చెప్పారు.
నీరు,ఆహారమే కారణమా?
స్థానికులు తీసుకునే నీరు, ఆహారంద్వారా వారి శరీరంలోకి విషపదార్థాలు చేరి ఈ వ్యాధి సోకుతోందని ఆరోగ్యశాఖాధికారులు భావిస్తున్నారు.వ్యాధి మరింత విస్తరించకుండా బడ్‌హాల్ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలిపింది.
ప్రస్తుతం గ్రామంలో 10 మంది అనారోగ్యం బారిన పడ్డారని రాజౌరీ ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్ ఏఎస్ భాటియా తెలిపారు.
గ్రామస్థులతో పాటు రాజౌరికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో ముగ్గురిని జమ్ము ఆసుపత్రికి, చండీగఢ్‌కు పంపి, చికిత్స అందిస్తున్నారు.
బడ్‌హాల్‌లో 2024 డిసెంబర్ 7 నుంచి జనవరి 19 మధ్యన మరణాలు సంభవించినట్లు ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. ఈ మరణాలన్నీ మూడు కుటుంబాలలోనే సంభవించాయి. వ్యాధి సోకిన వారిలో మొదట జ్వరం, గొంతు నొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. తర్వాత రోగులు స్పృహ తప్పి ప్రాణాలు కోల్పోతున్నారు.


ఫొటో సోర్స్, MAJID JAHANGIR
వ్యాధి లక్షణాలు ఏమిటి?
బడ్‌హాల్ ప్రజలు స్థానిక కుంట నుంచి నీరు తెచ్చుకోవడం మానేశారు. స్థానిక అధికారులు ఆ నీటి నమూనాలను పరీక్షకు పంపించారు. ఆ నీటిలో కొన్ని క్రిమి సంహారక మందులు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు, వ్యాధి సోకిన మూడు కుటుంబాల ఇళ్లకు సీల్ వేశారు. ఈ మూడు కుటుంబాలకు చెందిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని కూడా రాజౌరీలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
అధికారులు అందించే ఆహారం, నీరు మాత్రమే తీసుకోవాలని గ్రామస్థులను ఆదేశించారు. వ్యాధి బారినపడిన కుటుంబాలు ఉపయోగించిన ఆహార పదార్ధాలను కూడా సీజ్ చెయాలని ఆదేశించారు.
బడ్‌హాల్‌లో గ్రామస్థులు ఒకరి నుంచి ఒకరు దూరం పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR
న్యూరో టాక్సిన్లే కారణమా?
ఈ వ్యాధి గురించి 2024 డిసెంబర్ 7 మొదటిసారి ప్రకటించినా ఇప్పటి వరకు కారణం ఏంటనేది తెలియలేదు. అయితే బాధితుల ఇళ్లలో పరిశీలించిన ఆహారంలో న్యూరోటాక్సిన్లు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని రాజౌరీ ప్రభుత్వాసుపత్రిలో ఎపిడిమాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్ షుజా ఖాద్రి బీబీసీతో చెప్పారు.
"గ్రామస్థులు కలుషిత ఆహారాన్ని ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. అందుకే వేరువేరు కుటుంబాలకు చెందినవారు ప్రాణాలు కోల్పోయారు" అని ఆయన చెప్పారు.
ఈ వ్యాధి ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదని ఆయన అన్నారు. ఏదైనా వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, జూనోటిక్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వచ్చి ఉండవచ్చనే వాదనను ఆయన కొట్టిపారేశారు. నరాలపై ప్రభావం చూపే ఏదైనా విషపూరిత పదార్ధం, లేదా రసాయనాలను న్యూరోటాక్సిన్స్ అంటారని డాక్టర్ ఏఎస్ భాటియా చెప్పారు.
ఈ వ్యాధి వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చింది కాదని తెలియడంతో వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని తేలింది.
డిసెంబర్ 7న ఐదుగురు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి వచ్చారని డాక్టర్ భాటియా చెప్పారు. అందులో నలుగురు పిల్లలు ఉన్నారు. వాళ్లను వెంటనే రాజౌరీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందించామని ఆయన అన్నారు.
"మొదట ఇది కలుషిత ఆహారం వల్ల అనుకున్నాం. అయితే రెండు గంటల్లోనే వారి శరీరాల రంగు మారిపోయింది. దీంతో పేషెంట్లకు బ్రెయిన్ సీటీ స్కాన్ చేశాం. అందులో మెదడు వాపు, జ్ఞాపకశక్తిని దెబ్బ తీసే మెదడు క్షీణత లాంటి లక్షణాలు కనిపించాయి. రోగుల్లో రెండు వేర్వేరు లక్షణాలు కనిపించాయి" అని ఆయన చెప్పారు.
"ఆస్పత్రిలో చేరినప్పుడు అందరిలోనూ విరేచనాలు, చెమట పట్టడం, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. అయితే తర్వాత నాడీ వ్యవస్థ దెబ్బ తిన్నట్లు తెలిసింది. ఆ తర్వాత వారు స్పృహ కోల్పోయారు" అని భాటియా వివరించారు.
డిసెంబర్ 12, 2024 న రెండోసారి ఆస్పత్రిలో ఐదుగురు చేరారని భాటియా చెప్పారు. వారిలో ఏడాది వయసున్న చిన్నారి కోలుకుందని డాక్టర్ భాటియా చెప్పారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR
గ్రామస్థుల్లో అలజడి
బడ్‌హాల్‌లో చనిపోయిన 17 మందిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, 14 మంది చిన్నారులు ఉన్నారు. పిల్లలంతా 15 ఏళ్లలోపు వారే.
ఇది మహమ్మారి కాదని అధికారులు నిర్ధరించినప్పటికీ, ఈ అంతు చిక్కని వ్యాధి గురించి ప్రజల్లో భయం పెరుగుతోంది. వ్యాధి తమకు కూడా వస్తుందనే భయం మధ్య జీవిస్తున్నామని బడ్‌హాల్ గ్రామస్థుడు మొహమ్మద్ రఫిక్ బీబీసీతో చెప్పారు. ఆయన భార్య, ముగ్గురు పిల్లలు ఈ వ్యాధి వల్ల చనిపోయారు.
గ్రామస్థులు ఒకరినొకరు కలవడానికి కూడా వణికిపోతున్నారని మొహమ్మద్ ఇషాక్ తెలిపారు.
"ఇలాంటి భయం కరోనా సమయంలోనే చూశాం" అని ఆయన చెప్పారు.
అయితే ఈ వ్యాధిని కోవిడ్ మాదిరిగా చూడాల్సిన అవసరం లేదని, రోగులకు చికిత్స చేసిన డాక్టర్లు, నర్సులు అంతా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ భాటియా చెప్పారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR
నిపుణులతో కమిటీ
మరణాలకు కారణాలను కనుక్కునేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర హోంమంత్రిత్వశాఖలో సీనియర్ అధికారి ఒకరు ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
కమిటీలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాలు, వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారు.
"మరణాలకు కారణాలను కనుక్కోవడంతో పాటు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి వాటిని అదుపు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశాం" అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
జనవరి 19 నుంచి ఈ బృందం బడ్‌హాల్‌లో పని చేస్తోంది.
"మరణాలకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు మేం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం" అని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం 'ఎక్స్' లో పోస్ట్ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














