శరీర వాసనతో మనుషులను గుర్తుపట్టొచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నవేలియా వైలే
- హోదా, బీబీసీ న్యూస్
ఈ రోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్. మీ పక్కన కూర్చున్న వ్యక్తి వయసు ఎంతో, వారి శరీరం నుంచి వచ్చే వాసన ఆధారంగా చెప్పగలరా? ఆ వ్యక్తి ఎటువంటి పెర్ఫ్యూమ్ కొట్టుకొని ఉండకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి విలక్షణమైన శరీర వాసనతో వయసును పసిగట్టవచ్చు.
నాకు ఈ ఛాలెంజ్ ఏ సోషల్ మీడియాలోనో కనిపించలేదు. కానీ, ఒక వ్యక్తి శరీరం నుంచి వెలువడే సహజ వాసన ఆధారంగా వారి వయసును ఎలా కనిపెట్టవచ్చో నిరూపించే ఒక అధ్యయనం గురించి తెలుసుకున్నాను.
మన శరీర వాసన ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ, అది మన జీవితంలో వయసును బట్టి మారుతూ ఉంటుంది. అందులో సంభవించే మార్పులు మన సహజ జీవితం గురించి మాత్రమే కాకుండా మన సామాజిక, పరిణామాత్మక ధోరణిని ప్రతిబింబిస్తాయి.


ఫొటో సోర్స్, Getty Images
'తల్లిదండ్రులు పసిగట్టేస్తారు'
బాల్యంలో తక్కువ క్రియాశీల స్వేద గ్రంథులు, చర్మపై ఉండే సూక్ష్మజీవుల కారణంగా పిల్లల శరీరం నుంచి వాసన తక్కువగా విడుదలవుతుంది. అయినప్పటికీ, ఇతర పిల్లలతో పోలిస్తే తమ సొంత పిల్లల నుంచి వచ్చే సువాసనను తల్లిదండ్రులు పసిగట్టేస్తారు.
ఈ సువాసన తల్లిదండ్రులలో ఆహ్లాదకరమైన, సుపరిచితమైన భావోద్వేగ బంధాన్ని సృష్టిస్తుంది. శిశువు పట్ల ఆనందం, ప్రేమ వంటి భావాలను ఉత్తేజపరుస్తూ తల్లిదండ్రుల్లో ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఇక పెరుగుతున్న పిల్లల నుంచి వెలువడే ప్రత్యేక వాసన చాలా ఆకట్టుకుంటుంది.
అయితే, ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడే తల్లులు కొన్నిసార్లు తమ బిడ్డల నుంచి వెలువడే సువాసనను పసిగట్టలేరు.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నప్పుడే సువాసన
యుక్తవయసు ప్రారంభంలో మన శరీర వాసనలో చాలా మార్పులు వస్తుంటాయి. చెమటను ఉత్పత్తి చేసే గ్రంథులు, చర్మానికి సంబంధించిన తైల గ్రంథులను ఉత్తేజపరిచే సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి కారణంగా ఈ మార్పులు సంభవిస్తాయి.
చాలావరకు చెమట గ్రంథులు నీరు, ఉప్పును విసర్జిస్తాయి. ప్రొటీన్లు, ఇతర కొవ్వుకు సంబంధించిన ఆవిరిని అపోక్రిన్ గ్రంథులు విసర్జిస్తాయి. ఈ గ్రంథులు ఒక్కో మనిషిలో ఒక్కో ఒకరకమైన సువాసనలను ఉత్పత్తి చేస్తాయి. మన శరీరంలో ఉండే లిపిడ్లు, సెబమ్ (తలవెంట్రుకలకు చర్మానికి జిడ్డునిచ్చే కొవ్వు పదార్థం) వంటి పదార్థాలు ఈ గ్రంథుల నుంచే బయటకు వస్తాయి.
కానీ, బ్యాక్టీరియాతో కలిస్తే మన శరీర వాసన దుర్వాసనగా మారుతుంది. ఇలాగే యువత చెమట, వారి శరీర వాసనతో కలిసి దుర్వాసనగా మారుతుంటుంది. బాల్యం ముగిసి పూర్తిగా యుక్తవయసులోకి ప్రవేశించినప్పుడు వారి శరీర దుర్వాసన తల్లిదండ్రులిద్దరిలో వాసన ద్వారా పిల్లలను గుర్తించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
గుర్తించడానికి..
కౌమారదశలో తైల గ్రంథుల నుంచి స్రావం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. పెద్దయ్యాక వాటి తీవ్రత తగ్గినప్పటికీ, ప్రతి వ్యక్తికీ అప్పటికే ప్రత్యేకమైన శరీర వాసన ఉంటుంది. ఇది ఆహారం, ఒత్తిడి, హార్మోన్లు లేదా స్కిన్ మైక్రోబయోమ్ వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది.
ఒక వ్యక్తి వాసన తన గురించిన సమాచారాన్ని గుర్తించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ముఖ్యంగా చీకటి లేదా ధ్వనించే వాతావరణంలో లేదా స్పష్టంగా చూడటం, వినడం కష్టంగా ఉన్నప్పుడు.
శరీర వాసన సహచరుల ఎంపిక, బంధువుల గుర్తింపు లేదా లింగ భేదాలను గుర్తించడంలో సహాయపడుతుంది.
వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది?
వయసు పెరుగుతున్న కొద్దీ మన చర్మంలో వ్యాకోచతత్వం, కొల్లాజెన్ తగ్గుతుంది. ఇది చెమట, తైల గ్రంథుల కార్యకలాపాలను తగ్గిస్తుంది. వాటి లోపం వల్ల వృద్ధులకు శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడం కష్టమవుతుంది.
తైల గ్రంథుల విషయానికొస్తే.. వృద్ధాప్యంతో వాటి స్రావం తగ్గుతుంది. వాటి నిర్మాణం కూడా మారుతుంది. ఇది విటమిన్ ఇ లేదా స్కోలిన్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాల పరిమాణంలో తగ్గింపుకు దారితీస్తుంది.
చర్మ కణాల ద్వారా యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తి తగ్గడం వల్ల ఆక్సీకరణ పెరుగుతుంది. ఇది వృద్ధులలో వాసనకు కారణమవుతుంది, దీనిని జపనీయులు 'కెరిషో' అని పిలుస్తారు. అందుకే, 40 ఏళ్ల వయసు తర్వాత చర్మంలోని ఒమేగా 7, పాల్మిటోలిక్ యాసిడ్ వంటి కొన్ని కొవ్వు ఆమ్లాల పనితీరు మారుతుంది. ఇది శరీర వాసనను మారుస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














