ఉప్పాడ తీరంలో ఇసుకను దువ్వెనతో దువ్వితే బంగారం దొరుకుతుందా?

బంగారం, ఉప్పాడ, తుపాను, సముద్ర తీరం, బంగారు ఆభరణాలు,
ఫొటో క్యాప్షన్, తనకు ఒక చిన్న బంగారం తీగ దొరికిందని ఒక మత్స్యకారుడు చూపించారు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

డిసెంబర్ 2న కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి వెళ్లిన బీబీసీ బృందానికి దువ్వెనలతో తీరంలోని ఇసుకను గీస్తున్న చాలామంది కనిపించారు. అలా దువ్వెనతో గీస్తున్న మత్స్యకారుడు అప్పలరాజు “నాకు బంగారం దొరికిందోచ్...” అంటూ అక్కడున్న వారికి చెప్పారు. దాంతో మిగతా వారు కూడా మరింత శ్రద్ధగా దువ్వెనలతో బంగారం కోసం గాలించే పనిలో పడ్డారు.

అయితే, ఈ తీర ప్రాంతమంతా కోతకు గురై, కుప్పకూలిన ఇళ్లు కూడా పదుల సంఖ్యలో కనిపించాయి.

కొన్ని ఇళ్లు తీరానికి 10 నుంచి 15 మీటర్ల ఎత్తులో వేలాడుతూ పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించాయి.

వాటి దిగువనే మత్స్యకారులు బంగారం కోసం వేట సాగిస్తున్నారు.

తుపాను రానుందనే సూచనలు కనిపిస్తే చాలు స్థానికులు తీరంలో బంగారం కోసం అన్వేష‌ణ మొదలుపెడతారు.

తుపాను రావడానికి ముందు, తుపాను తర్వాత కూడా కొన్ని రోజులపాటు ఇక్కడ దువ్వెనలతో బంగారం కోసం ఇలా గాలిస్తుంటారు. నవంబర్ 30న ఫెయింజల్ తుపాను పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది.

ఇదంతా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలోని రెండు కిలోమీటర్ల పరిధిలోనే కనిపిస్తుంది.

వలలతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు, దువ్వెనలతో బంగారం కోసం ఎందుకు గాలిస్తున్నారు?

అసలు తీరంలో బంగారం దొరకడం ఏంటి? ఈ ఇసుకలోకి బంగారం ఎలా వచ్చింది? ఇక్కడేమైనా బంగారం నిధులు, గనులు ఉన్నాయా? మత్స్యకారులు ఏమంటున్నారు? నిపుణులు ఏం చెబుతున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగారం, ఉప్పాడ, తుపాను, సముద్ర తీరం, బంగారు ఆభరణాలు,
ఫొటో క్యాప్షన్, తుపాను సమయంలో కొట్టుకొచ్చే నల్లటి ఇసుకలోనే బంగారం కోసం వెతుకుతామని అప్పలరాజు చెప్పారు

ఉప్పాడలో గోల్డ్ హంట్..

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ సముద్ర తీరంలో తుపాన్ల సమయంలో స్థానిక మత్స్యకారులు, గ్రామస్థుల్లో చాలా మంది ఇలా ఇసుకలో శ్రద్ధగా వెతుకుతూ కనిపిస్తుంటారు.

వీరు బంగారం కోసం రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రూపులుగా తీరంలో దువ్వెనలతో ఇసుకపై గీస్తూ ఉంటారు.

అకస్మాత్తుగా ఇసుక రేణువుల మధ్య ఏదైనా మెరిస్తే... వెంటనే దానిని నిశితంగా పరిశీలించి బంగారమని నిర్ధరణకు వస్తే, దానిని అలాగే చేతి వేళ్లతో గట్టిగా పట్టుకుని, మళ్లీ అక్కడే మరింత హుషారుగా దువ్వెనతో గీస్తుంటారు.

“పూర్వ కాలం నుంచి ఇక్కడ బంగారం దొరుకుతోంది. కొన్ని సార్లు బంగారు ఆభరణాలు దొరుకుతాయి. కానీ బంగారు రజను మాత్రం తుపాను సమయాల్లోనే దొరుకుతుంది. అందుకే ఇప్పుడు మేం ఇసుకను గీయడానికి సులభంగా ఉండే దువ్వెనలను ఉపయోగించి ఇసుకలో గాలిస్తుంటాం. మా ముత్తాతలు, వాళ్ల తాతల కాలం నుంచి కూడా బంగారం వేట సాగుతోంది. చేపల వేట లేని సమయాల్లో మా కుటుంబాలకు ఇది కూడా ఒక ఆదాయ మార్గమే” అని అప్పటికే దొరికిన బంగారం రేణువులను చేతిలో గట్టిగా పట్టుకుని చెప్పారు మత్స్యకారుడు అప్పలరాజు.

‘‘తెల్లని ఇసుకలో బంగారం దొరకదు. తుపాను సమయంలో కొట్టుకొచ్చే నల్లని ఇసుకలోనే బంగారం కోసం వెతుకుతాం. ఎందుకంటే తెల్లని ఇసుకలో బంగారం రేణువులు ఉన్నా కనిపించవు. అదే నల్లని ఇసుకలో దువ్వెనతో గీస్తే బంగారం రేణువులు మెరుస్తూ కనిపిస్తాయి’’ అని ఆయన వివరించారు.

బంగారం, ఉప్పాడ, తుపాను, సముద్ర తీరం, బంగారు ఆభరణాలు, కాకినాడ
ఫొటో క్యాప్షన్, తుపాను వచ్చే సూచనలు కనిపించగానే ఉప్పాడ స్థానికులు తీరంలో బంగారం కోసం అన్వేష‌ణ మొదలుపెడతారు.

అది వ్యాపారంలో భాగమే: బంగారం వ్యాపారులు

‘‘ఖాళీగా ఉండే బదులు ఇక్కడ వెతికితే బంగారం దొరుకుతుంది కదా.. అలాగని ఏ రోజూ నాకు మూడునాలుగు వందల రూపాయలకు మించి ఆదాయం రాలేదు. ఇలా దొరికిన రేణువులను కాగితంలో పొట్లం కట్టి, బంగారం దుకాణం వాళ్లకు చూపిస్తే, వాళ్లు ఏదో రేటు కట్టి డబ్బులిస్తారు. ఇవాళ నాకు రూ. 300 వస్తుండొచ్చు’’ అని అప్పలరాజు చెప్పారు.

‘‘మత్స్యకారులు బంగారం రేణువులంటూ పసుపు రంగులో ఉండే రేణువులను మా దగ్గరికి పొట్లాలు కట్టి పట్టుకొస్తుంటారు. కొన్నిసార్లు అది బంగారమో కాదో నిర్ధరించలేం’’ అని బంగారం వ్యాపారులంటున్నారు.

“కొందరికైతే బంగారం రేణువులే అప్పుడప్పుడు దొరుకుతుంటాయి. వాటికి ఆ రోజు బంగారం ధర ఎంతుందో అంత ధర చెల్లిస్తాం. కానీ కొన్నిసార్లు వారు తీసుకొచ్చింది బంగారమో కాదో నిర్ధరించడంలో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కానీ వారితో వ్యాపారం, సంబంధాలు బాగుండాలని వారు తీసుకొచ్చే వాటికి ఎంతో కొంత రేటు కట్టి ఇస్తుంటాం” అని ఉప్పాడలోని ఒక బంగారం షాపు యాజమాని చెప్పారు.

బంగారం, ఉప్పాడ, తుపాను, సముద్ర తీరం, బంగారు ఆభరణాలు, కాకినాడ
ఫొటో క్యాప్షన్, తుపాన్ల సమయంలో స్థానికుల్లో అనేక మంది సముద్ర తీరంలోని ఇసుకలో శ్రద్ధగా వెతుకుతూ కనిపిస్తుంటారు.

బంగారు రేణువులే కాదు, ఆభరణాల ముక్కలు కూడా..

ఉప్పాడ తీరంలో కేవలం బంగారు రేణువులే కాదు, అప్పుడప్పుడు ఆభరణాల ముక్కలు కూడా దొరుకుతుంటాయని స్థానికులు చెప్పారు. బీబీసీ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ రోజు తనకు దొరికిన చిన్న బంగారు ఆభరణాన్ని చూపించారు సతీష్.

దానిని భద్రంగా రెండు రూపాయల అమృతాంజన్ డబ్బాలో వేసి, దాచిపెట్టారు. తర్వాత చిన్న చిన్న సముద్రపు రాళ్ల మధ్య దువ్వెనతో గీస్తూ బీబీసీతో మరిన్ని విషయాలు పంచుకున్నారు.

“తీరంలో వెతికిన ప్రతి ఒక్కరికీ బంగారం దొరకదు. అంతా అదృష్టమే. నాకు ఇవాళ దొరికిన బంగారం ముక్క విలువ నాకు తెలిసి రూ. 1,500 నుంచి రూ. 2,000 వేలు ఉంటుంది. తుపాను ప్రభావం తగ్గితే మళ్లీ ఇక్కడేమీ దొరకదు. తుపాను వచ్చినప్పుడల్లా తీరంలోని కొన్ని ఇళ్లు కుప్పకూలిపోయి కొట్టుకుపోతాయి. అలా కొట్టుకుపోయిన ఇళ్లలో కొన్ని సార్లు బంగారం కూడా ఉండొచ్చు. అవే మళ్లీ మాకు దొరకొచ్చు. గతంలో మా మత్స్యకారుల ఇళ్లలో బాగా బంగారం ఉండేదట. ఇది ఆ బంగారమే అయ్యుండొచ్చు” అని సతీష్ చెప్పారు.

సతీష్ చొక్కా జేబులో చిన్న చిన్న రాగి, ఇనుప ముక్కలు కూడా కనిపించాయి.

అవేంటని అడిగితే.. ‘‘ఇవి కూడా అమ్ముకుంటే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా’’ అని ఆయన చెప్పారు.

"ఇవి కూడా ఇక్కడ దొరికినవే. వందల ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో తీరం వెంట రాజుల కోటలు, పెద్ద పెద్ద ఊళ్లు ఉండేవని మా పెద్దలు చెప్పారు. అలాగే పేరున్న దేవాలయాలు కూడా ఉండేవట. అవన్నీ తుపాన్ల వల్ల సముద్రంలో కలిసిపోయి వాటిలోని బంగారమే ఇప్పుడు కొంచెం కొంచెంగా బయటకు వస్తోందని వాళ్లు చెప్పేవారు. మాకు దొరుకుతున్న బంగారం రేణువులు, వస్తువులు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది” అని సతీష్ వివరించారు.

బంగారం, ఉప్పాడ, తుపాను, సముద్ర తీరం, బంగారు ఆభరణాలు, కాకినాడ
ఫొటో క్యాప్షన్, కుటుంబాలతో సహా అందరూ బంగారం వెతికే పనిలో ఉంటారు.

ఆ బంగారం ఎక్కడిది?

ఇటీవల ఫెయింజల్ తుపాను ప్రభావానికి ఏర్పడిన సముద్ర కోత కారణంగా ఉప్పాడ తీరంలో 30 నుంచి 40 ఇళ్లు నేలమట్టమయ్యాయి.

అయితే ఇలాంటి పరిస్థితులను ఏళ్ల తరబడి చూస్తున్న మత్స్యకారులు తీరంలో ఉంటున్న ఇళ్లలో ఖరీదైన వస్తువులను, బంగారాన్ని ఉంచడం మానేశారు.

ఈ విషయాన్ని తీరంలో ఉన్న ఇంటిని కోల్పోయిన పైడమ్మ బీబీసీతో చెప్పారు.

“మా చిన్నతనంలో ఇప్పుడున్న ఉప్పాడకు తీరం కనీసం రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. తుపాన్లు వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెంగా ఊరిని సముద్రం మింగేస్తోంది. మా కళ్ల ముందే ఎన్నో ఇళ్లు ఈ సముద్రంలో కలిసిపోయాయి. ఇది మాకు అలవాటైపోయింది. వందల ఏళ్లుగా ఎన్నో ఇళ్లు కొట్టుకుపోయి ఉంటాయి, వాటిలోని ఎన్నో బంగారు ఆభరణాలు సముద్రంలో కలిసిపోయి ఉంటాయి” అని పైడమ్మ వివరించారు.

“ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవని, వాటిలో విలువ కట్టలేనన్ని బంగారం ఆభరణాలు ఉండేవని కథలుగా చెప్తుంటారు. అది నిజమేనేమో అని అనిపిస్తుంది, ఇక్కడ బంగారం కోసం జరిగే వేట చూసినప్పుడల్లా..” అని మరో మత్స్యకార మహిళ రాజ్యలక్ష్మి అన్నారు.

‘‘ఎక్కడైనా తుపాన్లు వస్తే చాలు అందరూ తీరం నుంచి దూరంగా వెళ్లిపోతుంటారు. ఉప్పాడలో మాత్రం తీరంలోనే ఉంటూ బంగారం కోసం వెతుకుతాం’’ అని నవ్వుతూ చెప్పారు రాజ్యలక్ష్మి.

బంగారం, ఉప్పాడ, తుపాను, సముద్ర తీరం, బంగారు ఆభరణాలు, కాకినాడ
ఫొటో క్యాప్షన్, తుపాన్లు వచ్చినప్పుడల్లా కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతం

‘తుపాను సమయాల్లో ఎవరి మాట వినరు’

తుపాన్ల సమయంలో సముద్రంలోకి దిగవద్దని, తీరంలో ఉండడం ప్రమాదకరమని గ్రామ పెద్దలు, పోలీసులు, ఇతర అధికారులు హెచ్చరిస్తుంటారు.

అయితే, ఈ గ్రామస్థులు అప్పుడు ఎవరి మాటా వినరు.

అల్పపీడనం మొదలు తుపాను వచ్చే సూచనలు కనిపించగానే, అంటే తీరంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటే చాలు దువ్వెనలు పట్టుకుని తీరంలో బంగారం వేట సాగిస్తుంటారు. కుటుంబాలతో సహా అదే పనిలో ఉంటారు.

“మూడేళ్ల కిందట మా ఊరిలో ఒక అబ్బాయికి దొరికిన బంగారు వస్తువు విలువ ఆ రోజుల్లో రూ. 40 వేలు పలికింది. అయితే అన్నిసార్లు ఇలా దొరకవు. రోజంతా వెతికితే, మూడు నాలుగు చిన్నచిన్న ముక్కలు దొరికే అవకాశముంది. వాటికి రూ. 300 వస్తాయి” అని లక్ష్మయ్య చెప్పారు.

లక్ష్మయ్య ఆ రోజు అప్పటికే రెండు గంటలుగా బంగారం కోసం వెతికే పనిలో ఉన్నారు. కానీ ఏమీ దొరకలేదు. ఇక దొరకవులే అనుకుని ఇంటికి వెళ్లిపోతూ బీబీసీతో మాట్లాడారు.

“ఈ రోజు దొరకలేదు కానీ, రేపు కచ్చితంగా దొరుకుతుంది. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ పని చేస్తున్నా కూడా నాకు ఒకే ఒక్క రోజు రూ. 1,000 విలువైన బంగారం ముక్క దొరికింది. మిగతా రోజుల్లో వస్తే మూడు నాలుగొందలు లేదంటే... ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లిపోవడమే” అని లక్ష్మయ్య బీబీసీతో చెప్పారు.

బంగారం, ఉప్పాడ, తుపాను, సముద్ర తీరం, బంగారు ఆభరణాలు, కాకినాడ
ఫొటో క్యాప్షన్, గతంలో ఈ ప్రాంతంలో ఆలయాలు ఉండేవని తమ పెద్దలు చెప్పినట్లు స్థానికులు తెలిపారు.

అక్కడ బంగారు గనులేవీ లేవు

‘‘తుపాన్లు వచ్చినప్పుడు, తీరం కోతకు గురై కొట్టుకుపోయిన ఇళ్లలో బంగారం వస్తువులు ఉంటే, అవి ఆటుపోట్ల కారణంగా మళ్లీ తీరానికి కొట్టుకుని వచ్చే అవకాశం ఉంది. అవే అక్కడ వెతికే వారికి దొరుకుతుంటాయి. అదేమీ పెద్ద విశేషం కాదు’’ అని ఏయూ జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఏ. యుగంధరరావు అన్నారు.

“అయితే... ఇక్కడ అతి సూక్ష్మమైన బంగారు రేణువులు దొరుకుతున్నాయి. ఇవి దొరకడం కొంత ఆశ్చర్యమే” అని చెప్పారు.

“ఇలా రేణువులు దొరకాలంటే... ఆ సమీపంలో ఏవైనా బంగారు గనులుండాలి. కానీ అలాంటివి లేవు. కాబట్టి ఆ ప్రాంతంలో వందల సంవత్సరాలుగా తీరం కోత కారణంగా సముద్రంలో కలిసిపోయాయని చెప్తున్న ఇళ్లు, దేవాలయాల్లోని బంగారు ఆభరణాలు ఏళ్లుగా అలల ఆటుపోట్లకి రాళ్లతో రాపిడికి గురవ్వడంతో చిన్న చిన్న రజనులుగా మారే అవకాశం ఉంది.

బంగారం స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ కాబట్టి మామూలు రోజుల్లో కాకుండా ఆటుపోట్లు ఎక్కువ ఉండే అల్పపీడనాలు, తుపాన్ల సమయంలో తీరం వైపు కొట్టుకుని వస్తాయని చెప్పడానికి అవకాశం ఉంది” అని ప్రొఫెసర్ యుగంధరరావు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)