మాజీ ఉప ముఖ్యమంత్రికి ఎందుకు ‘శిక్ష’ వేశారు?

శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్

పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు అకాల్ తఖ్త్ సోమవారం మతపరమైన శిక్ష విధించింది.

సిక్కు నియమాలను ఉల్లఘించినా, సిద్ధాంతాలకు వ్యతిరేకమైన పనులు చేసినా సదరు వ్యక్తికి మతపరమైన శిక్ష విధించే అధికారం అకాల్ తఖ్త్‌కు ఉంటుంది.

ఇలాంటి శిక్షలను ‘తన్ఖా’ అని పిలుస్తారు.

సుఖ్‌బీర్ బాదల్‌తో పాటు 2007-2017 మధ్య శిరోమణి అకాలీదళ్ కేబినెట్‌లో సభ్యులుగా ఉన్న చాలామందికి అకాల్ తఖ్త్‌ మతపరమైన శిక్ష విధించింది.

ఇంతకీ అకాలీదళ్ నాయకుల్ని ఎందుకు శిక్షించారు?

పంజాబ్‌లో 2007 నుంచి 2017 వరకు శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.

ఆ సమయంలో అకాలీదళ్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు.

ప్రకాశ్ సింగ్ బాదల్ అయిదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్

ఫొటో సోర్స్, Akalidal

సిక్కు సిద్ధాంతాలకు, సిక్కు సమాజం మనోభావాలకు విరుద్ధంగా అకాలీదళ్ నాయకత్వం వ్యవహరిస్తోందని ఆరోపణలు వచ్చాయి.

2015లో పంజాబ్‌లోని బర్గారిలో సిక్కుల పవిత్ర గ్రంథం “గురు గ్రంథ్ సాహిబ్” లోని కొన్ని పేజీలను దుండగులు చింపేశారు. గురు గ్రంథ్ సాహిబ్‌ సిక్కులకు అత్యంత పవిత్రమైనది.

ఈ ఘటనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో, పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిక్కులు మరణించారు.

అకాల్ తఖ్త్ ఎదుట నిలబడిన అకాలీ దళ్ నేతలు

ఫొటో సోర్స్, Akali Dal

ఈ కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్ అనుచరులు నిందితులని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన కేసులో రామ్ రహీమ్‌పై సుప్రీం కోర్టులో ఈ ఏడాది అక్టోబరులో మళ్లీ విచారణ ప్రారంభమైంది.

2007లో రామ్ రహీమ్‌ను బహిష్కరించాలని అకాల్ తఖ్త్ ఆదేశించింది.

గుర్మీత్ రామ్ రహీమ్‌‌ను బహిష్కరించిన తర్వాత కూడా ఆయనతో అకాలీదళ్ నాయకులు సంబంధాలు కొనసాగించారనే ఆరోపణల నేపథ్యంలో సోమవారం అకాల్ తఖ్త్ సుఖ్‌బీర్‌కు మతపరమైన శిక్ష వేసింది.

పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే బాదల్ ప్రకటించారు.

అకాలీదళ్

ఫొటో సోర్స్, AkaliDal

అకాలీ దళ్ నాయకులకు విధించిన శిక్ష ఏంటి?

శిరోమణి అకాలీ దళ్ ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు, మతపరమైన తప్పిదాలు చేసినట్లు అకాల్ తఖ్త్ నిర్ధరించింది.

“అకాలీ నాయకులు తమ తప్పులను అంగీకరించారు. కాబట్టి వారు డిసెంబరు 3 నుంచి తన్ఖా సేవ చేస్తారు. మధ్యాహ్నం 12-1 గంటల మధ్య స్వర్ణ దేవాలయ కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లను శుభ్రం చేస్తారు. దర్బార్ సాహిబ్ మేనేజర్ వారి హాజరు వేస్తారు. తర్వాత స్నానం చేసి వంట పాత్రలు కడుగుతారు. గుర్బానీ (సిక్కు కీర్తనలు) వింటారు. మెడలో ప్లకార్డు కూడా వేసుకోవాలి” అని అకాల్ తఖ్త్ జతేదార్ రఘుబీర్ సింగ్ శిక్ష విధించారు.

అకాలీ దళ్

ఫొటో సోర్స్, Akali Dal

సుఖ్‌బీర్ బాదల్‌ కాలికి గాయం, సీనియర్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వారిద్దరినీ దర్బార్ సాహిబ్ గేటు వద్ద వీల్‌చెయిర్‌పై కూర్చుని కాపలాదారుగా పనిచేయాలని ఆదేశించారు. రోజుకు రెండు గంటల చొప్పున యూనిఫారం ధరించి, చేతిలో ఈటె పట్టుకుని అక్కడ పనిచేయాలని శిక్ష విధించింది.

పంజాబ్‌లోని మరో రెండు తఖ్త్‌లతో పాటు, ఫతేఘర్ సాహిబ్ గురుద్వారాలో కూడా రెండు రోజుల పాటు సేవలందించాలని ఆదేశించింది.

ఒక వ్యక్తి ఎంత శక్తిమంతుడైనా, ప్రముఖుడైనా మతసూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవరైనా ఆ వ్యక్తిపై అకాల్ తఖ్త్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

అమృత్‌సర్‌లోని అకాల్ తఖ్త్‌ సెక్రటేరియట్‌లో అకాల్ తఖ్త్ జతేదార్ నేతృత్వంలో అయిదు తఖ్త్‌లకు చెందిన ప్రతినిధులు సమావేశమై సదరు వ్యక్తిపై విచారణ జరిపి శిక్షను నిర్ధరిస్తారు.

అకాలీ తఖ్త్ భవనం

ఫొటో సోర్స్, AkaliDal

ఫొటో క్యాప్షన్, అకాలీ తఖ్త్ భవనం

గతంలో మత శిక్ష అనుభవించిన నాయకులు

1984 ఆపరేషన్ బ్లూస్టార్‌లో అకాల్ తఖ్త్ భవనం దెబ్బతింది. భారత ప్రభుత్వం తర్వాత మరమ్మతు చేసింది.

అప్పడు కేంద్ర హోం మంత్రి బూటా సింగ్, బుధ దళ్‌కు చెందిన శాంతా సింగ్ భారత ప్రభుత్వం తరపున ఈ మరమ్మతు బాధ్యతలు తీసుకున్నారు.

ప్రభుత్వ సహాయంతో నిర్మించిన ఈ భవనాన్ని సిక్కులు ఆమోదించలేదు. 1986లో సర్బత్ ఖల్సా (సిక్కుల సమావేశాలు)లో ఈ భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు.

శాంతా సింగ్‌ను సిక్కు సంఘం నుంచి బహిష్కరించారు. ఆయనను 'తంఖాహియా' (అపరాధి)గా ప్రకటించారు. తన తప్పును అంగీకరించి అకాల్ తఖ్త్ వద్ద హాజరయ్యారు. మతపరమైన శిక్షను ఆయనకు విధించారు.

అకాలీ దళ్

ఫొటో సోర్స్, Akali Dal

అకాల్ తఖ్త్ సాహిబ్‌పై దాడి జరిగిన సమయంలో బూటా సింగ్ కేంద్ర హోం మంత్రిగా, జ్ఞాని జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్నారు. క్షమాపణ కోసం వీరిద్దరూ అకాల్ తఖ్త్ సాహిబ్ వద్ద హాజరయ్యారు.

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ప్రకాశ్ సింగ్ బాదల్ స్వయంగా శిరోమణి అకాలీదళ్ నాయకులందరితో కలిసి 2018లో అకాల్ తఖ్త్ వద్ద హాజరయ్యారు. స్వర్ణ మందిరంలో బూట్లు, పాత్రలను శుభ్రం చేశారు.

అలాగే తమ హయాంలో జరిగిన 'తప్పులను' మన్నించాలని కోరారు. అయితే ఈ 'తప్పులు’ ఏంటనే అంశంపై స్పష్టత లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)