మేడారం అడవుల్లో చెట్లు కూలిపోవడానికి, ఇప్పుడు భూకంపానికి సంబంధం ఉందా?

మేడారంలో కూలిన చెట్లు, భూకంపం

ఫొటో సోర్స్, BBC/National Center for Seismology

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా బుధవారం ఉదయం భూకంపం సంభవించింది.

7:27 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం రాగా, భూమి లోపల దాదాపు 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది.

హైదరాబాద్ నగరానికి 219 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉంది.

భూకంప ప్రభావంతో ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, వరంగల్, విజయవాడ, నందిగామ సహా చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది.

కొన్నిచోట్ల ప్రకంపనలు ఎక్కువగా ఉండగా, కొన్నిచోట్ల స్వల్పంగా గుర్తించినట్లు అక్కడి ప్రజలు బీబీసీ తెలుగు సోషల్ మీడియా పేజీల్లో కామెంట్లు చేశారు.

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి.

అప్పుడు జరిగిన విధ్వంసానికి, ఇప్పుడు వచ్చిన భూకంపానికి ఏదైనా సంబంధం ఉందా? ఏపీ, తెలంగాణలో ఈ స్థాయిలో భూకంపం రావడానికి కారణం ఏమిటి? గతంలో ఈ స్థాయిలో భూకంపం ఎప్పుడు వచ్చింది? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అడవిలో ఏం జరిగింది? భూకంపానికి సంబంధం ఉందా?

ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఆగస్టు 31న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో 80 వేలకు పైగా చెట్లు నేలకూలినట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.

తాజా భూకంప కేంద్రం ములుగుకు సమీపంలోని మేడారంలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది.

అప్పుడు జరిగిన విధ్వంసానికి, ఇప్పుడు వచ్చిన భూకంపానికి సంబంధం ఉందని చెప్పడం సరికాదని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ దవులూరి శ్రీనగేశ్ బీబీసీతో చెప్పారు.

ములుగు అడవి

‘‘తుపాను లేదా భారీ వర్షాలు వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. భూ ప్రకంపనలు అనేవి భూమిలోపల కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చే కన్విక్షన్ కరెంట్స్ కారణంగా ఏర్పడతాయి. ఈ రెండూ పూర్తిగా విరుద్ధమైనవి. ఒక శాస్త్రీయ నిర్ధరణ లేకుండా అప్పట్లో వేల చెట్లు కూలడానికి.. ఇప్పుడు వచ్చిన భూకంపానికి సంబంధం ఉందని చెప్పలేం. ఈ రెండు ఘటనల మధ్య మూడు నెలల వ్యత్యాసం ఉంది.

ఇప్పుడు భూకంప కేంద్రం 40 కిలోమీటర్ల లోతులో ఉంది. అప్పట్లో వర్ష ప్రభావం అనేది భూమికి 5 కిలోమీటర్లపై ఎత్తులో వచ్చింది. రెండింటినీ పోల్చుకుంటూ అప్పటి విధ్వంసం వల్లే ఇది వచ్చిందని చెప్పడానికి లేదు’’ అని చెప్పారాయన.

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ రామంచర్ల కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘అప్పుడు చెట్లు కూలిపోవడం, ఇప్పుడు భూకంపం రావడం అనేది పూర్తిగా యాదృచ్ఛికం. ఈ రెండింటినీ పోల్చలేం’’ అని ప్రొఫెసర్ ప్రదీప్ చెప్పారు.

నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ దవులూరి శ్రీనగేశ్
ఫొటో క్యాప్షన్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ దవులూరి శ్రీనగేశ్

55 ఏళ్ల తర్వాత..

ఏపీ, తెలంగాణలో తరచూ భూకంపాలు వస్తుంటాయి. కానీ, అవి రిక్టర్ స్కేల్‌పై 3 లేదా 4 తీవ్రతకు మించి ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దాదాపు 55 ఏళ్ల కిందట భద్రాచలంలో వచ్చిన భూకంపం కూడా ప్రస్తుత భూకంపం స్థాయిలోనే వచ్చిందని శ్రీనగేశ్ చెప్పారు.

‘‘అప్పట్లో భద్రాచలం కేంద్రంగా వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. మళ్లీ ఆ స్థాయిలో ఇన్ని సంవత్సరాల తర్వాత భూమి కంపించింది. అందుకే ప్రకంపనలు ఎక్కువగా వచ్చాయి.

భద్రాచలంలోని అప్పటి భూకంప కేంద్రానికి వాయువ్య దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారంలో ఇప్పుడు భూకంపం వచ్చింది’’ అని శ్రీనగేశ్ వివరించారు.

అప్పట్లో భద్రాచలంలో వచ్చిన భూకంపం కేంద్రం భూమికి దాదాపు పది కిలోమీటర్లు భూమి లోతులో ఉందని సైన్స్ డైరెక్ట్ జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసం ద్వారా తెలుస్తోంది.

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరంగల్, ములుగు, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ ప్రాంతాల్లో వరదలు సంభవించాయి.

వరదల ప్రభావంతో భూకంపాలు వస్తాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని శ్రీనగేష్ ఖండించారు.

భూకంపం

ఫొటో సోర్స్, National Center for Seismology

అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి?

గోదావరి రిఫ్ట్ అనేది ప్రాణహిత-గోదావరి పరివాహక ప్రాంతమని, ఈ ప్రాంతంలో భూమి పొరల్లో తరచూ సర్దుబాట్లు జరుగుతుంటాయని, అందువల్ల భూకంపాలు సంభవిస్తుంటాయని చెప్పారు శ్రీనగేశ్.

‘‘భూమిలో ప్రధానంగా 16 రకాల పలకలు ఉంటాయి. ఇవి ప్రతిరోజూ వివిధ దిశల్లో పయనిస్తుంటాయి. ప్రస్తుతం భారత దేశం ఉన్న ఫలకం ఉత్తర దిశలో ఏటా 5 సెం.మీ. పయనించి ఆసియా పలకతో ఢీకొంటుంది. ఈ ఢీకొనే క్రమంలో ఏర్పడే ఒత్తిడి పలక లోపలికి విస్తరించి, ఎక్కడైతే భూమి లోపల పొరలు/పగుళ్లు లేదా ఫాల్ట్స్ ఉంటాయో అక్కడికి చేరుతుంది.

అలా వందల సంవత్సరాలపాటు ఒత్తిడి పెరిగిన తర్వాత, ఆ ఒత్తిడి భూమి లోపల ఉన్న రాళ్ల శక్తిని అధిగమించినప్పుడు పొరల్లో కదలికలు వచ్చి భూకంపం సంభవిస్తుంది’’ అని చెప్పారు శీనగేశ్.

భూకంప తరంగాలు ఉత్పన్నమై వివిధ దిశల్లో పయనించేటప్పుడు వాటి ప్రభావం తెలుస్తుందని చెప్పారాయన.

ములుగు

ములుగులో వస్తే విజయవాడలో ప్రకంపనలు ఎందుకు?

ఎక్కడో ములుగు జిల్లాలోని మేడారంలో భూకంపం వస్తే ఆ ప్రకంపనలు మేడారం నుంచి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు విస్తరించాయి.

మరోవైపు మేడారం నుంచి సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని రాజమండ్రిలోనూ ప్రకంపనలు వచ్చినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

అంత దూరం వరకు ప్రకంపనలు ఎందుకు వచ్చాయని పరిశీలిస్తే.. ‘భూమిలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండటంతో ఆ ప్రభావం (కోన్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్) చాలా దూరం వరకు ఉంటుంది.

ఇక్కడి భూమి లోపల రాతి ప్రదేశం ఎక్కువగా ఉంది. దానివల్ల భూకంప తరంగాలు చాలా వేగంగా ప్రయాణించే వీలుంటుంది. అందుకే చాలా ప్రాంతాల్లో భూమి ఎంతో కొంత కంపించింది’’ అని బీబీసీతో శ్రీనగేశ్ చెప్పారు.

భూకంపం

ఫొటో సోర్స్, National Center for Seismology

భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశం ఉందా?

నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ ప్ర‌కారం, భూకంప ముప్పు తీవ్రత అంచనాల ఆధారంగా భారత్‌ను మొదట్లో అయిదు జోన్లుగా విభ‌జించారు. 1993లో వ‌చ్చిన లాతూర్ భూకంపం త‌ర్వాత జోన్‌-1ను జాబితా నుంచి శాస్త్రవేత్త‌లు తొల‌గించారు.

ప్ర‌స్తుతం నాలుగు జోన్లు మాత్రమే ఉన్నాయి. దీని ప్ర‌కారం భార‌త్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక సందర్భంలో భూకంపం వచ్చే ముప్పుంది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఏయే ప్రాంతాలు ఏ జోన్ పరిధిలో ఉన్నాయి, భవనాలు లేదా ఇళ్లు ఏ విధంగా కట్టుకుంటే సురక్షితంగా ఉండొచ్చో శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నది ఈ లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భవిష్యత్తులో కూడా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని బీబీసీతో చెప్పారు శ్రీనగేశ్.

‘‘2021లో రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో కాళేశ్వరం సమీపంలో భూకంపం వచ్చింది. మున్ముందు కూడా భూకంపాలు వస్తూనే ఉంటాయి. వాటిని తట్టుకునేలా భవనాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)