మేడారం అడవిలో గంటలోనే ‘లక్ష చెట్లు’ కూలిపోయాయి, పెనుగాలి సృష్టించిన బీభత్సానికి కారణమేంటి

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలోని ఓ అడవిలో అకస్మాత్తుగా గంట వ్యవధిలోనే 80 వేల నుంచి లక్షచెట్లు కూలిపోయాయని అధికారులు చెప్పారు. ఇక్కడి అడవుల్లో ఈ తరహా విధ్వంసం అటవీ శాఖ అధికారులను, శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది.
మేడారం దగ్గరలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ స్పష్టమైన కారణం తెలియట్లేదు. అది కూడా ఎవరో ఓ గీత గీసినట్టు ఒక వరుసలోని చెట్లే నేల కూలాయి.
ఇది అటవీ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.


అసలేం జరిగింది?
హైదరాబాద్‌కు సుమారు 220 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నగరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా పరిధిలోని ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ కింద, మేడారం గ్రామానికి దగ్గరలో దట్టమైన అడవి ఉంది.
ఆగస్టు 31 సాయంత్రం 6-7 గంటల సమయంలో అక్కడ దట్టమైన మేఘాలు కమ్ముకుని, అకస్మాత్తుగా కుండపోత వాన, పెను గాలి వీచాయి.
ఆ తరువాత అడవి మధ్యలో ఒక గీత గీసినట్లుగా, ఎవరో చెట్లను నరికి దారి ఏర్పాటు చేశారా అన్నట్లుగా తక్కువ వెడల్పు, ఎక్కువ పొడవున వరుసగా చెట్లన్నీ కూలిపోయాయి.
సుడులు తిరుగుతూ వచ్చిన గాలి ప్రభావంతో వరుసగా చెట్లన్నీ నేలకూలాయి.
బలమైన పెద్ద పెద్ద చెట్లను కూడా ఆ గాలి పెకిలించుకుపోయింది.
విశాలమైన అడవి మధ్యలో ఒక గీతలా ఈ గాలి సాగడంతో, అడవి మధ్యలో ఎవరో చెక్కేసినట్టు ఒక దారిలో ఖాళీ స్థలం ఏర్పడింది.
సాధారణంగా తుపాన్లు వంటివి వచ్చినప్పుడు ఒకట్రెండు చెట్లు పడిపోవడం సర్వసాధారణం.
కానీ ఇక్కడ ఏకంగా 80 వేల నుంచి లక్ష చెట్ల వరకూ కూకటివేళ్లతో నేల కూలాయని అటవీ అధికారులు చెబుతున్నారు.
‘‘ఆ రోజు సాయంత్రం పెద్ద మేఘం వచ్చి అకస్మాత్తుగా వర్షం ప్రారంభం అయింది. పెద్ద పెద్ద గాలులు వీచాయి. అంతే అరగంటలో మొత్తం చెట్లన్నీ పడిపోయాయి. అడవి మధ్యలో 6-7 కి.మీ. పొడవు, 500 నుంచి 800 మీటర్ల వెడల్పులోని భాగంలో చెట్లు కూలిపోయాయి. దానికి రెండు వైపులా ఉన్న మిగిలిన చెట్లు బావున్నాయి. 3 కి.మీ. మేరకు అతి తీవ్రమైన ప్రభావం కనిపించింది. 332 హెక్టార్లు (దాదాపు 820 ఎకరాలు) విస్తీర్ణంలోని అడవి పూర్తిగా ధ్వంసమై పోయింది. ఆ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా మిగల్లేదు. మొదట్లో 50 వేల వరకూ చెట్లు పడిపోయి ఉంటాయి అనుకున్నాం. కానీ తాజా అంచనాల ప్రకారం 80 వేల నుంచి లక్ష వరకూ చెట్లు కూలిపోవడం, విరిగిపోవడం జరిగిందని తెలుస్తోంది. ఇంకా చెట్ల లెక్కింపు కొనసాగుతోంది’’ అని బీబీసీతో చెప్పారు తెలంగాణ అటవీ శాఖ పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్.
అడవి మధ్యలో నుంచి వచ్చిన ఆ గాలి, అడవిని ఆనుకుని ఉన్న కొండపర్తి అనే గ్రామం మీదుగా వెళ్లింది. ఆ గాలి ధాటికి ఊరిలోని కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
తమ జీవితంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదని గ్రామంలోని వృద్ధులు చెప్పారు.
‘‘శనివారం (ఆగస్ట్ 31) సాయంత్రం గాడ్పు.. సుడిగాడ్పు(సుడిగాలి) వచ్చింది. చెట్లను తన్నుకుపోయింది. ఇంటి మీద పెంకులు కేజీన్నర, రెండు కేజీల వరకూ బరువు ఉంటాయి. వాటిని ఎగరేసుకుపోయింది. కొద్దిసేపే ఉంది కానీ ఇంత పెద్ద గాలి ఎన్నడూ చూడలేదు. మామూలుగా వేసవి కాలంలో సుడిగాలులు వస్తాయి, వర్షా కాలంలో రావు. అప్పుడు కూడా చెట్ల ఆకులు, బట్టలు ఎగిరిపోయేలా మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చింది అలా కాదు. నా జీవితంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదు’’ అని కొండపర్తికి చెందిన ఈసం ఎల్లయ్య, రాంబాయి దంపతులు ‘బీబీసీ’తో చెప్పారు.

ఈ గాలికి కారణం ఏంటి?
ఇలా ఎందుకు జరిగింది? వాతావరణంలో వచ్చిన మార్పు ఏంటి? చెట్ల విషయంలో ఏం జరిగింది? అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు.
అయితే, ‘‘వాస్తవానికి అది చాలా మంచి అడవి. ఆ నేలను శాండీలోమ్ (sandyloam) అంటారు. అక్కడ మట్టిలో కొంత ఇసుక కలిసి ఉంది. కింద లోతైన మట్టి ఉంది. సాయిల్ డెప్త్ ఎక్కువ. ఇది కాక అక్కడ రాలిన ఆకులు అక్కడే ఉంటాయి. అవన్నీ కుళ్లి ఎరువులా (Humus)లా తయారు అవుతాయి. దీంతో అక్కడి చెట్లకు మంచి పోషకాలు అందుతాయి. దానివల్ల చెట్ల వేళ్లు భూమి లోపలకి లోతుగా నిటారుగా వెళ్లకుండా, భూమికి సమాంతరంగా పొడవుగా వెళ్తాయి. దీంతో గాలి గట్టిగా వీచినప్పుడు, వేళ్లు సులభంగా బయటకు వస్తాయి. వీటిని షాలో రూట్స్ అని పిలుస్తారు. దానికి తోడు అది బాగా వానలు కురిసే అడవి. వాన వల్ల ఉన్న తేమ, చెట్ల కింద నానిన మట్టి, ఈ బలమైన గాలి కలసి అతి భారీ వృక్షాలను కూడా పెకలించేయగలిగింది. మెజార్టీ చెట్లు వేళ్లతో సహా వచ్చేస్తే, కొన్ని చెట్లకు మాత్రం పై భాగాలు తెగిపోయాయి’’ అని వివరించారు డోబ్రియాల్.
అక్కడ అడవిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరిని అడిగినా “తీవ్రంగా గాలి వచ్చింది, వర్షం కురిసింది” అని చెబుతున్నారు తప్ప, స్పష్టమైన కారణం ఎవరూ చెప్పలేకపోతున్నారు. క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది, రిటైర్డ్ సిబ్బంది.. ఒక్కొక్కరూ ఒక్కో పేరుతో దీన్ని పిలుస్తున్నారు.
స్క్వాల్, టోర్నడో , సడన్ లో ప్రెజర్, క్లౌడ్ బరస్ట్, డౌన్ బరస్ట్.. ఇలా రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.


హైదరాబాద్‌లో సమావేశం
అయితే ఘటన జరిగిన ప్రాంతంలో వాతావరణ శాఖకు ఎటువంటి పరికరాలు, పరిశీలన వ్యవస్థ లేదు. దీంతో అక్కడ ఆ రోజు ఏం జరిగిందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ) ను సంప్రదించారు.
‘‘ఆ ప్రాంతంలో తమకు ఏ విధమైన స్టేషన్ లేదని వాతావరణ శాఖ చెప్పింది. దీంతో మేం ఎన్ఆర్ఎస్సీ వారిని సంప్రదించాం. అక్కడ ఏం జరిగిందో శాటిలైట్ ఇమేజీల ద్వారా వారు అంచనా వేయవచ్చు. వారు ఇంకా తమ దగ్గరున్న డాటా పరిశీలిస్తున్నారు. డాటా అనలైజ్ చేసిన తరువాత మనకు సమాచారం రావచ్చు’’ అని బీబీసీతో అన్నారు డోబ్రియాల్.
అధికారులకు కూడా ఈ ఘటన కొత్తే. తమ 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఘటన చూడలేదని పలువురు అటవీ శాఖ సిబ్బంది, అధికారులు బీబీసీకి చెప్పారు. దీంతో ఏం జరిగిందో తెలసుకోవడానికి శాస్త్రవేత్తలతో వారు ఈ నెల 24న హైదరాబాద్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
ఐఎండీ, ఎన్ఆర్‌సీసీ, ఎన్‌జీపీఆర్ఐ-సీఎస్ఐఆర్, ఐసీఎఫ్ఆర్ఈ దేహ్రాదూన్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ అట్మాస్పియర్ రీసెర్చ్ ఆఫ్ ఇండియాల నుంచి శాస్త్రవేత్తలు.. వివిధ విశ్వవిద్యాలయాలు, ఇతర సాంకేతిక సంస్థల నుంచి ప్రొఫెసర్లు దీనికి వస్తున్నారు.
వారంతా కలసి ఆ రోజు ములుగు అడవుల్లో ఏం జరిగిందనే దానిపై చర్చించనున్నారు.

గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?
1996లో మధ్యప్రదేశ్‌లోని నౌరాదేహీ అటవీ ప్రాంతంలో కూడా బలమైన గాలులకు వేలాది టేకు చెట్లు కూలిపోయాయని అటవీ అధికారులు చెప్పారు.
కానీ స్పష్టమైన సమాచారం ఎవరి దగ్గరా లేదు. ఆ సమయంలో అక్కడ పనిచేసిన సిబ్బంది కూడా హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు వస్తున్నారని అధికారులు చెప్పారు.
1980-85 మధ్య ఇదే ములుగు దగ్గరోని పసర దగ్గర లవాల్ మందాల్ అనే ఫారెస్ట్ బ్లాక్‌లలో కూడా ఇలానే పెద్ద ఎత్తున చెట్లు పోయాయని సీనియర్ల ద్వారా తెలిసిందని బీబీసీతో చెప్పారు పర్యావరణ ఐక్య వేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యుడు కాజీపేట పురుషోత్తం.
అయితే ఈ రెండు ఘటనలనూ బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఫొటో సోర్స్, UGC
అడవి మళ్లీ సాధారణ స్థితికి వస్తుందా?
ప్రస్తుత ఘటన పక్కన పెడితే, తక్షణం అడవిని పునరుద్ధరించే పనిలో పడింది అటవీ శాఖ. ఈ ప్రక్రియకు ఏళ్ల సమయం పడుతుంది కానీ మంచి నేల, మంచి విత్తనాలు అందుబాటులో ఉన్నందున చెట్లన్నీ వేగంగా పెరుగుతాయని అటవీ అధికారుల అంచనా. అందుకోసం అడవి పెరిగే వరకూ ఎవరూ అడవికి నష్టం చేయకుండా పటిష్టమైన కాపలా, తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు అధికారులు.

ఫొటో సోర్స్, UGC
పర్యావరణం పరిస్థితి ఏంటి?
‘‘ఈ ఘటన వల్ల పర్యావరణానికి కాస్త ఇబ్బందే కానీ, తీవ్రమైన పర్యావరణ నష్టం అయితే కనిపించదు. పైగా ఇక్కడ వేగంగా కొత్త అడవి పెరగవచ్చు’’ అని బీబీసీతో అన్నారు డోబ్రియాల్.
‘‘ఈ ప్రభావం పర్యావరణంపై గ్లోబల్ స్థాయిలో ఉంటుందని చెప్పలేం కానీ, లోకల్‌గా ఉంటుంది. మైక్రో క్లైమేట్ అంటారు. దానిపై ఉంటుంది. అయితే మైక్రో ఫౌనా, మైక్రో ఆర్గానిజమ్స్ దెబ్బతిని ఉంటాయి. అక్కడి జీవజాలం మీద ప్రభావం ఉంటుంది. అయిదారేళ్లలో అడవి పునరుజ్జీవం జరుగుతుంది’’ అని బీబీసీతో అన్నారు పురుషోత్తం.

జంతువులు ఏమయ్యాయి?
ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామం ఏంటంటే... ఇన్ని చెట్లు నేల కూలినా, ఒక్క జంతువుకు నష్టం జరగలేదు.
అడవిలో జంతువులేవీ చనిపోయినట్లు అధికారులకు ఆధారాలు దొరకలేదు. అంటే ఈ ఉత్పాతం సమయానికి జంతువులన్నీ సురక్షిత ప్రాంతానికి వెళ్లి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
అక్కడ అడవిలో సాధారణంగా అనేక రకాల జంతువులు ఉన్నాయని, కానీ ఇంత పొడవున జరిగిన ఈ భారీ విధ్వంసంలో ఒక్క జంతువూ చనిపోకపోవడం ఆశ్చర్యమని అధికారులు అంటున్నారు.
‘‘వాతావరణం మారినప్పుడు, దట్టమైన మేఘాలు కమ్ముకున్నప్పుడు జంతువులు తమ గుహల దగ్గరకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్తాయి’’ అని బీబీసీతో చెప్పారు పురుషోత్తం.
‘‘విపత్తును వేగంగా గ్రహించి, జంతువులు సురక్షిత ప్రదేశాలకు వెళ్లి ఉండవచ్చు’’ అని బీబీసీతో అన్నారు డోబ్రియాల్.

చెట్ల లెక్కింపు పూర్తయిందా
చెట్లు కూలిపోయిన చోట ఆసక్తికర దృశ్యం కనిపిస్తోంది. ఎన్ని చెట్లు కూలిపోయాయి అనే విషయాన్ని అటవీ శాఖ లెక్క పెడుతోంది. కూలిన ప్రతి చెట్టునూ లెక్కిస్తున్నారు. సెప్టెంబరు 5న ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 150 మంది అటవీ సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ పనిలో ఉంటున్నారు. కింద పడిన ప్రతి చెట్టు పొడవు, కాండం చుట్టుకొలత తీసుకుని, ఆ చెట్టుకు ఒక నంబర్ ఇస్తున్నారు. తరువాత దాన్ని ఒక రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు.
‘‘అలా పడిపోయిన చెట్లను కలపగా మార్చి ప్రొసీజర్ ప్రకారం అమ్ముతాం. అటవీ శాఖలో ఒక్క చెట్టు చనిపోయినా, పడిపోయినా, ఎవరైనా కొట్టేసినా, డీఈటీ మాన్యువల్ ప్రకారమే డిస్పోజ్ చేయాలి. బీట్ రిజిస్టర్‌లో కూడా నమోదు చేయాలి’’ అని బీబీసీతో చెప్పారు పీసీసీఎఫ్ డోబ్రియాల్.

వాతావరణ కేంద్రం అవసరం
‘‘ఉప్పెనలు, తుపానులను అంచనా వేయడం కోసం సాధారణంగా సముద్రానికి దగ్గరలో వాతావరణ కేంద్రాలు ఉంటాయి. ఈ అటవీ ప్రాంతం ఎత్తైన ప్రదేశం కాబట్టి ఇక్కడ వాతావరణ కేంద్రం లేదు. ఇక్కడ అబ్జర్వేటరీ పెడితే బాగుంటుంది. ముందుముందు ప్రజలకు ప్రాణ, ఆస్తి, పర్యావరణ నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలి” అని బీబీసీతో అన్నారు పురుషోత్తం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














