లెబనాన్: పేజర్ల తర్వాత వాకీటాకీల పేలుళ్లు, 20 మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డేవిడ్ గ్రిటెన్, హ్యూగో బచెగా(మిడిల్ ఈస్ట్ కరెస్పాండెంట్)
- హోదా, బీబీసీ న్యూస్
లెబనాన్‌లో వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలు మరోసారి పేలడంతో 20 మంది చనిపోయారని, 450 మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.
హిజ్బుల్లాకు బాగా పట్టున్న ప్రాంతాలుగా పరిగణించే బీకా వ్యాలీ, దక్షిణ లెబనాన్, బేరూత్‌కు దక్షిణ శివారు ప్రాంతాల్లో హిజ్బుల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించిన వాకీ టాకీలు పేలాయి.
మంగళవారం హిజ్బుల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించే పేజర్లు పేలడంతో 12 మంది చనిపోయారు.
వీరిలో కొంతమంది అంత్యక్రియలు జరుగుతుండగా కొన్ని వాకీటాకీలు పేలాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడులు ఇజ్రాయెల్ చేసిందని హిజ్బుల్లా ఆరోపించింది. ఇజ్రాయెల్ దీనిపై స్పందించలేదు.
యుద్ధం మరో అంకానికి చేరిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ప్రకటించిన తరుణంలోనే హిజ్బుల్లాపై ఈ దాడులు జరిగాయి.
అలాగే లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆర్మీని మోహరించింది.

ఈ పరికరాలన్నింటినీ పేల్చేయడం అనేది ఒక పెద్ద మిలిటరీ ఆపరేషన్‌కు ముందు చేసే సన్నాహక దాడుల్లా కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. అందరూ శాంతిని పాటించాలని ఆయన సూచించారు.
ఉత్తర ప్రాంతంలో నిరాశ్రయులుగా మారిన వేల మంది ప్రజలను సురక్షితంగా ఇళ్లకు చేర్చుతామని పేలుళ్లు జరిగిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హామీ ఇచ్చారు.
యుద్ధంలో కొత్త అంకాన్ని మొదలుపెట్టామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ చెప్పారు. వనరులు, బలగాలను తరలిస్తూ తమ దృష్టి ప్రధానంగా ఉత్తరం వైపే కేంద్రీకరించామని వెల్లడించారు.
గాజాలో క్రియాశీలంగా వ్యవహరించిన ఒక ఆర్మీ బృందాన్ని మళ్లీ ఉత్తరాన మోహరించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ధ్రువీకరించింది.

ఫొటో సోర్స్, AFP
హమాస్‌కు తాము మద్దతు ఇస్తున్నామని హిజ్బుల్లా చెబుతోంది. గాజాలో పోరాటం ముగిసిన తర్వాతే సరిహద్దుల్లో తమ దాడుల్ని ఆపేస్తామని హిజ్బుల్లా చెబుతోంది.
తాజా పేలుళ్ల నేపథ్యంలో హిజ్బుల్లా తదుపరి కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికలు గురువారం రావొచ్చు. హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా ప్రసంగం తర్వాత తదుపరి ప్రణాళికల సూచనలు వచ్చే అవకాశం ఉంది.
రెండో విడత పేలుళ్లలో 16 ఏళ్ల బాలుడు సహా తమ ఫైటర్లు 13 మంది చనిపోయారని బుధవారం హిజ్బుల్లా మీడియా కార్యాలయం ప్రకటించింది.
సరిహద్దులకు సమీపంలోని ఇజ్రాయెల్ బలగాలను లక్ష్యంగా చేసుకున్నామని, ఇజ్రాయెల్ సాయుధ స్థావరాలపై రాకెట్లను ప్రయోగించామని కూడా వెల్లడించింది.
లెబనాన్ నుంచి 30 షెల్స్ దూసుకొచ్చాయని, వాటివల్ల మంటలు చెలరేగాయని, అయితే ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్ మిలటరీ చెప్పింది.
దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా ఫైటర్లను ఇజ్రాయెల్ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
బుధవారం నాటి పేలుళ్లతో, హిజ్బుల్లా సమాచార వ్యవస్థ మొత్తం ఇజ్రాయెల్ చేతికి చిక్కిందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
మంగళవారం నాటి పేలుళ్ల ఘటనతో చాలా మంది లెబనాన్ పౌరులు ఇంకా షాక్‌లో ఉన్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోజున ఒకేసారి వేల సంఖ్యలో పేజర్లు పేలిపోయాయి. అవి పేలడానికి ముందు వాటికి ఒక మెసేజ్ వచ్చింది. హిజ్బుల్లా నుంచి ఆ సందేశం వచ్చినట్లుగా వారు భావించారు.
బుధవారం నలుగురి అంత్యక్రియల జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న బీబీసీ బృందానికి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు భారీ పేలుడు శబ్దం వినిపించింది.
అక్కడున్నవారంతా గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత లెబనాన్‌లోని ఇతర ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లుగా వార్తలు రావడం మొదలైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














