హైదరాబాద్‌లో కోటి 87 లక్షల రూపాయలు పలికిన ఈ గణేశ్ లడ్డూ అసలు కథ ఏంటి?

కోటీ 87 లక్షలు,లడ్డూ
ఫొటో క్యాప్షన్, కోటి 87 లక్షలు పలికిన లడ్డూ
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌లో గణేశ్ లడ్డూ వేలాలు రోజు రోజుకూ కొత్త రికార్డ్‌లు సృష్టిస్తున్నాయి.

బండ్లగూడ జాగీర్ దగ్గర ఉన్న కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లోని వినాయక మండపంలో లడ్డూ ఒక కోటి 87 లక్షల రూపాయలు పలికింది. హైదరాబాద్‌లో ఇది రికార్డు ధర.

గతేడాది కూడా ఈ విల్లాల దగ్గర లడ్డూ వేలం కోటి 20 లక్షల వరకూ వెళ్ళింది. ఇంతకూ ఈ విల్లాస్‌లో అంత ‘రిచ్’ జనాలు ఉంటారా? ఇక్కడ వేలం ఎలా నిర్వహిస్తారు?

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రిచ్‌మండ్‌ విల్లాస్ లడ్డూ వేలం అసలు కథ వేరే ఉంది. ఈ లడ్డూ వేలం పాటలో ఒక వ్యక్తి పాల్గొనరు. మొత్తం వేలంలో పాల్గొనే దాదాపు 150 మందిని నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఈ నాలుగు గ్రూపుల వారూ వేలం పాడతారు. అయితే వేలం దక్కిన గ్రూపుతో పాటూ, వేలంలో లడ్డూ దక్కని గ్రూపు కూడా డబ్బు చెల్లించాలి.

అలా నాలుగు గ్రూపులూ కలిపి ఇచ్చే మొత్తమే ఈ రిచ్‌మండ్‌ విల్లాలో ఒక కోటి 87 లక్షలకు వెళ్లింది.

గెలిచిన గ్రూపుకు మాత్రమే లడ్డూ సొంతం కాదు. ఆ లడ్డూను విల్లాల్లోని అందరికీ పంచుతారు.

లడ్డూ, కోటీ 87 లక్షలు

ఈ డబ్బంతా ఏం చేస్తారు?

ఇక్కడ లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బు మొత్తం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తామని కమిటీ చెబుతోంది. ఆర్‌‌వీ దియా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ లడ్డూ వేలం డబ్బు మొత్తం ఆ ట్రస్ట్‌కు వెళుతుంది.

ట్రస్ట్‌లో వలంటీర్లుగా ఉండేవారు, హైదరాబాద్‌లోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ సేవా కార్యక్రమాలు చేస్తోన్న ఎన్జీవోలకు ఈ డబ్బును ఉపయోగిస్తారు. ఎవరికీ నగదు రూపంలో ఇవ్వరు. మేం స్వచ్ఛందంగా ఒక బృందంగా ఏర్పడి, చాలా పరిశోధన చేస్తాం. మేం సాయం చేసే ఎన్జీవోలను స్వయంగా వెళ్లి చూస్తాం. దానితో పాటు వారి ఎకౌంట్ బుక్స్ కూడా తనిఖీ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎక్కడా దుర్వినియోగం జరగదు. మనం ఇచ్చే డబ్బు వారికి వంద శాతం అవసరం, మనం ఇచ్చిన తరువాత దాన్ని వంద శాతం వాడతారు అని నమ్మకం కుదిరిన తరువాతే ఖర్చు చేస్తాం.

మిగతా స్వచ్ఛంద సంస్థల వలె చందాలను మా నిర్వహణ ఖర్చులకు వినియోగించము. కానీ అదంతా మా సొంత డబ్బుతో చేస్తాం. దాతల డబ్బు మాత్రం వందకు వందశాతం పూర్తిగా అవసరం ఉన్న వారికే చేరుస్తాం’’ అంటూ ఈ ప్రక్రియను వివరించారు ట్రస్ట్ వలంటీర్ రంజన్.

అది వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం రూపంలో చేస్తున్నాం. దీనిలో మా విల్లాల్లో ఉండే అన్ని మతాల వారూ పాల్గొంటారు. ఇప్పుడీ కోటి 87 లక్షలను దాదాపు 150 మంది కలసి ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి సేకరించే ఈ డబ్బు, ఏడాది పొడవునా ఖర్చు చేస్తాం. దీనికి ఆదాయపన్ను మినహాయింపు కూడా ఉంది’’ అన్నారు రంజన్.

గణేశ్ నిమజ్జనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంగళవారం హుస్సేన్ సాగర్‌లో వేల గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారు

‘‘2016లో 25 వేల రూపాయలతో ఇక్కడ లడ్డూ వేలం మొదలైంది. అప్పుడు కూడా దాన్ని సేవకే ఖర్చు చేశాం. మేం ఖర్చు చేసే విధానం, కమిటీ పనితీరు, నిజాయతీ, పారదర్శకత చూసి, క్రమంగా వేలంలో డబ్బు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2016లో 25 వేలు ఉన్నది, తరువాత 2 లక్షలు, 10 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు, గతేడాది కోటి 20 లక్షలకు వెళ్లగా ఈసారి కోటి 87 లక్షలకు వెళ్లింది’’ అని వివరించారు రంజన్. ఇందులో అందరూ సమానంగా డబ్బు ఇవ్వరు.ఎక్కువ, తక్కువలు ఉంటాయి. వీరి సేవా కార్యక్రమం చూసి విల్లా బయట టీ స్టాల్ యజమాని 6 వేల రూపాయలు ఇచ్చారనీ, అది తమకు ఎంతో ఆనందం, సంతృప్తి కలిగించిందని చెప్పారు కమిటీ సభ్యులు.

రిచ్‌మండ్‌ మాత్రమే కాదు, హైదరాబాద్‌లోని అనేక చోట్ల లడ్డూ వేలాలు పెద్ద ఎత్తున సాగాయి. మీడియాలో బాగా కవరేజ్ లభించే బాలాపూర్ లడ్డూను ఈసారి 30 లక్షల వెయ్యి రూపాయలకు వేలం పాడారు. కొలను శంకర రెడ్డి అనే బీజేపీ నాయకుడు ఈ లడ్డూ సొంతం చేసుకున్నారు. గతేడాది 27 లక్షలకు లడ్డూ వెళ్లింది. 1994 నుంచి ఈ లడ్డూ వేలం సాగుతోంది.

ఇక మాదాపూర్ మై హోమ్స్ భూజ సొసైటీలో లడ్డూ కూడా భారీ ధర పలికింది. కొండపల్లి గణేశ్ అనే వ్యక్తి 29 లక్షల రూపాయలకు ఈ లడ్డూను వేలం పాడారు. ఇక్కడ గతేడాది లడ్డూ 25 లక్షల 50 వేలకు వెళ్లింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)