మెనోపాజ్ గురించి భారత్‌లో మహిళలు బయటకు చెప్పరెందుకు,వారు ఎలాంటి అనారోగ్యాలకు గురవుతారు?

- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘నా భర్త ఎప్పుడూ నేను మంచి డ్రెస్ వేసుకుని బాగా తయారవ్వాలని కోరుకునేవారు. నా నుదుటన పెద్ద బొట్టు, మెడలో ఆభరణాలు వేసుకునేదాన్ని. ఒకరోజు అదంతా ముగిసిపోయింది’ అని మేరఠ్‌కు చెందిన అతుల్ శర్మ చెప్పారు.
మెనోపాజ్ అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు.
పురుషులకు 60 ఏళ్లు వచ్చినా, వారు మగాళ్లే. అదే మహిళకు 40 నుంచి 45 ఏళ్లు ఉండి, మెనోపాజ్ (నెలసరి ఆగిపోవడం) వస్తే, ఆమె జీవితం అయిపోయిందని సమాజమంతా భావిస్తుంది.
అతుల్ శర్మ మహిళల ఆరోగ్య సంబంధిత విషయాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాధికారతపై పనిచేస్తున్నారు.
మెనోపాజ్ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఆ సమయంలో మహిళలు మానసికంగా తీవ్ర సంఘర్షణకు లోనవుతారు. భయం, అభద్రత, సిగ్గు, వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో మహిళల జీవితం చిక్కుకుపోతుంది.
మెనోపాజ్ వచ్చిన తర్వాత చాలా మంది మహిళలు తమ జీవితం ముగిసిపోయిందని భావిస్తారు.

‘నా భర్త మరో మహిళ దగ్గరకు వెళతారనుకున్నా’
‘‘ఇక నా భర్తకు నా అవసరం ఉండదని అనిపించింది. మరో మహిళ దగ్గరకు ఆయన వెళతారనుకున్నా. ఇక ఆయనకు నేను పనికి రాను. నేనిప్పుడు పరిపూర్ణ మహిళను కాను. నాలో సెక్స్ కోరికలు ఉండవనుకున్నా. లైంగికంగా చురుగ్గా ఉండలేనని భావించా’’ అని అతుల్ శర్మ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
‘‘నా భర్తకు నాతో సెక్స్ చేయాలని అనిపించినప్పుడల్లా ఎప్పుడూ వద్దు అనలేదు. మామూలుగా అయితే మన పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. ఇంకా ఎందుకిలా చేస్తున్నారు అనేదాన్ని. మెనోపాజ్ తర్వాత ఆయనతో ఎప్పుడూ అలా చెప్పలేదు. అలా అంటే ఆయనకు ఆ విషయం తెలిసిపోతుందేమో అనిపించేది. అందుకే, ప్రతి నెలా నాకు పీరియడ్స్ వచ్చినట్టు నటించేదానిని.మూడు రోజులపాటు ప్యాడ్లు వాడుతున్నట్టు, వాటిని చుట్టి పారేస్తున్నట్టు చేసేదానిని’’ అని చెప్పారు.
కానీ, అతుల్ శర్మ మనసులో మరో యుద్ధం జరుగుతుండేది.
‘‘రాత్రిపూట నిద్రలో మెలకువ వచ్చేది. అన్ని విషయాలకు చిరాకు పడేదాన్ని. నా కాలి గజ్జెల నుంచి శబ్దం వచ్చినా, చిరాకుగా అనిపించేది. కాలి గజ్జెలు శబ్దం చేస్తున్నాయేంటి, నేనేమైనా చిన్నపిల్లనా అనిపించేది. నేను ముసలిదాన్ని అవుతున్నానని ఆలోచించేదాన్ని. ఆ తర్వాత, మెల్లగా మంచి బట్టలు వేసుకుని తయారు కావడం మానేశాను. కొంత కాలం తర్వాత, ప్రతిదీ ముగిసిపోయినట్లు అనిపించింది’’ అని అన్నారు.
అతుల్ శర్మ తన మెనోపాజ్ విషయాన్ని ఐదారేళ్ల పాటు భర్తకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఆ తర్వాత ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. ఇవాళ్టికి కూడా తన జీవితంలో ఆమెకు ఎంత ప్రాముఖ్యం ఉందనే విషయంపై ఆయన ఆమెకు భరోసా కల్పించారు. ఇది మళ్లీ అతుల్ సాధారణ స్థితికి రావడానికి ఉపయోగపడింది.

మెనోపాజ్..సరికొత్త జీవితం ప్రారంభం
మహిళలు వయసు ఒక దశకు చేరుకున్న తర్వాత వారికి మెనోపాజ్ వస్తుంది. పునరుత్పత్తికి సంబంధించిన హార్మోన్లు సహజంగా తగ్గిపోతాయి. సింపుల్‌గా చెప్పాలంటే, వారికి నెలసరి అంటే పీరియడ్స్ రావడం ఆగిపోతుంది.
సరికొత్త జీవితానికి ప్రారంభంగా మెనోపాజ్‌ను మహిళలు చూడాలని నిపుణులు చెబుతున్నారు. మహిళలు స్వేచ్ఛగా, తమకు నచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి.
‘‘మెనోపాజ్‌ను ఎదుర్కొంటున్న మహిళల జనాభా భారత్‌లో ఎక్కువగా ఉంది. పునరుత్పత్తి తగ్గిపోయిన తరువాత వచ్చే ఆరోగ్య సమస్యలపై మనం దృష్టి పెట్టాలి. మెనోపాజ్ విషయంలో మహిళలు సంతోషంగా ఉండాలి. ’’ అని డాక్టర్ రేణుక మాలిక్ అన్నారు. ఆమె దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మెనోపాజ్ క్లినిక్ హెడ్‌గా పనిచేస్తున్నారు.
అయితే, పితృస్వామ్య సమాజంలో చిక్కుకుపోయిన వేలాదిమంది మహిళలకు మెనోపాజ్ వల్ల స్వేచ్చ లభించదు. స్త్రీలను వేధించడానికి పురుషులకు ఇదొక అవకాశంగా మారుతుంది. నెలసరి ఆగిపోవడం వారికి స్వేచ్ఛను ఇవ్వదు.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్హేరా-ఆదిపూర్ గ్రామానికి చెందిన సంజోగ్ గృహ హింస బాధితురాలు. తనకు నెలసరి ఆగిపోయిందనే విషయాన్ని ఆమె చాలా ఏళ్ల పాటు దాచి ఉంచారు.
‘‘నా భర్త నన్ను వేధించేవారు. నన్ను కొట్టేవారు, బలవంతంగా సెక్స్‌లో పాల్గొనేలా చేసేవారు. ఆయన చనిపోయే వరకు మెనోపాజ్ విషయాన్ని రహస్యంగానే ఉంచాను. ఆయన నుంచి తప్పించుకునేందుకు పిరియడ్స్ అని అబద్ధం చెప్పేదానిని. నా కమ్యూనిటీలో ఆయనకు కానీ లేదా మరే మగవ్యక్తికైనా, నేను మెనోపాజ్‌కు గురైనట్లు తెలిస్తే, నేను తల్లిని కాననే వంకతో కచ్చితంగా అత్యాచారానికి పాల్పడేవారు’’ అని సంజోగ్ చెప్పారు.
‘‘బలవంతంగా మహిళలతో సెక్స్ చేసినప్పుడు, వారు గర్భవతి అయితే ఏమవుతుందనే భయం మగవారిలో ఉంటుంది. నేను గర్భవతిని కానని ఒకవేళ వారికి తెలుసుంటే, నాకేం జరిగేదో ఆ దేవుడికి మాత్రమే తెలుసు. నా చుట్టూ ఉన్న మహిళలకు అలా జరగడం నేను చూశాను’’ అని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సగటున 50 ఏళ్లు పైబడిన మహిళలకు మెనోపాజ్ వస్తోంది. భారతీయ మహిళల్లో ఇది 46 నుంచి 47 ఏళ్లుగా ఉంది. మెనోపాజ్ సమయంలో మహిళలు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు చెప్పారు.

‘మెనోపాజ్’పై అవగాహనా లోపం
దిల్లీ లాంటి కొన్ని మెట్రో నగరాల్లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెనోపాజ్ కోసం ప్రత్యేకంగా క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. కానీ, వీటి గురించి మహిళలకు పెద్దగా తెలియదు.
దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మెనోపాజ్ కోసం ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తున్నారు.ఈ క్లినిక్‌కు వచ్చే మహిళల సగటు వయసు 40 నుంచి 46 ఏళ్ల మధ్యలో ఉంటోంది.
వారిలో నేరుగా క్లినిక్‌కు వచ్చేవారు ఎవరూ ఉండరు. ఇతరులు రిఫర్ చేయడం ద్వారానే ఇక్కడకు వస్తారు. వారిలో కొందరు తొలుత ప్రెగ్నెంట్‌గా ఉన్న తమ కుమార్తెలను గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌కు తీసుకువచ్చినప్పుడు ఇక్కడి మెనోపాజ్ క్లినిక్ గురించి తెలుసుకుంటున్నారు.
సరిత(పేరు మార్చాం) తన కూతుర్ని, ఆమెకు పుట్టిన బిడ్డను చూడటానికి వచ్చారు. అప్పుడే ఆమెకు కీళ్ల నొప్పులు వస్తున్నాయని చెప్పారు.
సరిత నొప్పుల గురించి ఆమెతో మాట్లాడిన నర్సుకు, ఆమె తీవ్ర మెనోపాజ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు అర్థమైంది. ఆస్పత్రిలో ఉన్న మెనోపాజ్ క్లినిక్‌లో చూపించుకోమని ఆమెకు చెప్పారు.
మెనోపాజ్ లక్షణాలతో బాధపడే వారికి చాలా అలసటగా ఉంటుంది. రాత్రివేళ నిద్రపట్టదు. వెన్నునొప్పి, కడుపు నొప్పి వస్తాయి.

‘సరైన చికిత్స అవసరం’
సంగీత కొన్నేళ్లుగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తనకు 43 ఏళ్లు ఉంటాయని, రెండేళ్ల క్రితం తనకు పిరియడ్స్ వచ్చినట్లు ఆమె చెప్పారు.
ఉదయం 4 గంటలకు తన రోజు మొదలై, రాత్రి 11 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ఈ మధ్యలో ఇంటి పనులను, పిల్లలను చూసుకోవడం చేస్తారు. మెనోపాజ్ లక్షణాలతోనే ఆమె వీటన్నింటినీ చేసేవారు.
‘‘కొన్నిసార్లు ఈ నొప్పులు నా చావుతోనే పోతాయనుకునేదాన్ని. దీనికి బదులు చనిపోవడం మంచిదనుకున్నా. ఇలా జీవించడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించుకునేదాన్ని’’ అని సంగీత తెలిపారు.
మెనోపాజ్ లక్షణాలకు సరైన చికిత్స అందించకపోతే, అవి ప్రాణాపాయానికి దారితీయచ్చు. కొన్ని కేసుల్లో క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, కండరాల క్షీణత లాంటి సమస్యలు రావచ్చు.
మెనోపాజ్‌కు సంబంధించిన చాలా సమస్యలు చికిత్స చేయదగినవేనని డాక్టర్లు అన్నారు.
‘‘హాట్ ఫ్లాషెస్ వంటి సమస్యలు నయం అవుతాయి. ఒళ్లు నొప్పులకు సరైన ఆహారం తీసుకోవడం, ఫిజియోథెరపీ ఉపశమనం కల్పిస్తుంది. హార్మోన్ రీప్లేస్‌మెట్ థెరపీ లేదా హెచ్ఆర్టీ ద్వారా మెనోపాజ్ లక్షణాలను తగ్గించవచ్చు. సరైన చికిత్స తీసుకుంటే, ఈ సమస్యలను నయం చేయచ్చు’’ అని రేణుక అన్నారు.
మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు తగ్గిపోతాయి. హెచ్‌ఆర్టీ ఈ హార్మోన్లను రీప్లేస్ చేసి, మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
అయితే, హార్మోన్ రీ ప్లేస్‌మెంట్ థెరపీ చాలా ఖర్చుతో కూడుకున్నది. అది సగటు మహిళలకు అందుబాటులో లేని చికిత్స. ఒక హెచ్ఆర్‌టీకి నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతుంది.
సంగీత నెలకు12 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు.
‘‘ఒకవేళ నా చికిత్స కోసమే నెలకు రూ.2 వేలు నుంచి రూ.3 వేలు ఖర్చు పెడితే, నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి? ఈ చికిత్స పొందడం నా వల్ల కాదు’’ అని అన్నారు.

మెనోపాజ్ క్లినిక్‌లు తక్కువ
మెనోపాజ్ క్లినిక్‌కు వెళ్లి, చికిత్స చేయించుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు. దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మెనోపాజ్ క్లినిక్ ఉన్నప్పటికీ, భారత్‌లోని మెట్రో నగరాల్లో ఇలాంటివి చాలా తక్కువ.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో గ్రామీణ, గిరిజన మహిళలకు చికిత్స చేసే సదుపాయాలే లేవు.
‘‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మెనోపాజ్ వల్ల బాధపడే మహిళలకు చికిత్స అందించే సౌకర్యాలు లేవు’’ అని అతుల్ శర్మ అన్నారు.
‘‘ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేసే వారు మహిళలకు ఏదైనా సాయం చేయాలనుకున్నా, మెనోపాజ్‌కు సంబంధించిన ప్రత్యేక ఔషధాలు లేదా శిక్షణ ఇవ్వడం లేదు’’ అని ఆమె చెప్పారు.
భారత్‌లో మెనోపాజ్ ఎదుర్కొంటున్న మహిళల జనాభా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సగటున 50 ఏళ్లు పైబడిన మహిళలకు మెనోపాజ్ వస్తోంది. భారతీయ మహిళల్లో ఇది 46 నుంచి 47 ఏళ్లుగా ఉంది.
‘‘1947లో మహిళల ఆయుర్దాయం సగటున 32 ఏళ్లుగా ఉండేది. ప్రస్తుతం అది 70 ఏళ్లకు పెరిగింది. జనాభాపరంగా చూస్తే, 2011 లెక్కల ప్రకారం 45 ఏళ్లు పైబడినవారిలో 9.6 కోట్ల మంది ఉండేవారు. ఆ లెక్కల ప్రకారం చూస్తే 2026 నాటికి 45 ఏళ్లు పైబడిన వారు 40 కోట్లమందికి చేరుకోవచ్చు’’ అని అనుజ్ సోని చెప్పారు. అనుజ్ సోని ఇండియన్ మెనోపాజ్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.
2030 నాటికి ప్రపంచ్యాప్తంగా మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల సంఖ్య 120 కోట్లకు పెరగవచ్చు. ప్రతీ ఏటా వీరిలో 4 కోట్ల 70 లక్షల మందికి పైగా మహిళలు చేరుతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాలు
బ్రిటన్, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు మెనోపాజ్ విషయంలో కొన్ని విధానాలు రూపొందించాయి.
హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఖర్చును బ్రిటన్ తగ్గించింది. అమెరికా మెనోపాజ్ రీసెర్చ్ అండ్ ఈక్విటీ యాక్ట్ 2023 బిల్లును ప్రవేశపెట్టింది.
ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లు ఇలాంటి చర్యలే తీసుకున్నాయి. అయితే, భారత్‌లో ఇప్పటివరకూ అలాంటి విధానం ఏదీ లేదు.
“ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం ఎలాంటి మెనోపాజ్ విధానం లేదు” అని 2023లో నాటి స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి స్మృతీ ఇరాని లోక్‌సభలో చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల ద్వారా మెనోపాజ్ లాంటి మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నాలు సరిపోవని నిపుణులు భావిస్తున్నారు.
మహిళల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభుత్వ దృష్టిపెట్టడంతో మాతా శిశు మరణాల రేట్లు తగ్గాయి. అయితే, ఇంతకుమించిన ప్రయత్నాలు జరగాల్సి ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య కార్మికుల నెట్‌వర్క్‌ను ప్రభుత్వం ఇప్పటికే పెంచిందని డాక్టర్ అనుజ్ సోని చెప్పారు.
గర్భిణులకు కాల్షియం, ఐరన్ మాత్రలు ఇస్తున్నారు. పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నారు. మహిళలకు వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు.వీటితోపాటు మెనోపాజ్‌పై కూడా దృష్టిపెట్టాలన్నారు అనుజ్ సోని.
హెచ్‌ఆర్‌టీ చికిత్సపై రేట్లు తగ్గించడం ద్వారా లక్షల మంది పేద మహిళలకు సాయం చేయచ్చని తెలిపారు. అప్పటి వరకు, సంగీత, ఆమెలాంటి చాలా మంది మహిళలు మెనోపాజ్ వల్ల కలిగే బాధలతో జీవించాల్సిందే.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














