మెనోపాజ్‌: మలి వయసు మహిళల పోరాటమే ప్రధానాంశంగా నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్, భారత సమాజం దీని గురించి ఎప్పటికి మాట్లాడగలదు?

మెనోపాజ్‌

ఫొటో సోర్స్, HITESH MULANI

ఫొటో క్యాప్షన్, మెనోపాజ్‌ సమస్యలపై నెట్‌ ఫ్లిక్స్‌ నిర్మించిన సిరీస్‌లో పూజాభట్‌
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌

సాధారణంగా పాపులర్‌ కల్చర్‌లన్నీ యువతతో ముడిపడి ఉంటాయి. కానీ, ఒక 49 ఏళ్ల మహిళ తన మధ్య వయసుతో జరిపే పోరాటమే ప్రధాన కథాంశంగా నెట్‌ఫ్లిక్స్‌ ఓ కొత్త సిరీస్‌తో ముందుకు వచ్చింది. మహిళలు తమ శరీరంతో జీవితాంతం చేసే పోరాటానికి సంబంధించిన ఈ కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

'బాంబే బేగమ్స్‌' సిరీస్‌లోని ఓ ఎపిసోడ్‌లో రాణి అనే పాత్ర బోర్డు మీటింగ్‌ నుంచి హఠాత్తుగా బయటకు వెళ్లిపోతుంది. ఆమె అలా ఎందుకు చేసిందో ఎవరికీ అర్ధం కాదు.

తర్వాతి సీన్‌లో ఆమె చకచకా బాత్‌రూమ్‌కు వెళ్లి చల్లని నీళ్లతో తన ముఖాన్ని తడుపుకుంటూ కనిపిస్తారు. తర్వాత ఆమె తన చేతి మడతలను హ్యాండ్‌ డ్రైయర్‌ కింద ఉంచుతారు.

"ఆ దృశ్యం చూడగానే చాలామంది ఆమెకు గుండెపోటు వచ్చిందని అనుకున్నామని చెప్పారు." అని 'ఆర్టికల్‌ 14' అనే న్యూస్‌ వెబ్‌సైట్‌కు జెండర్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న నమితా భండారి చెప్పారు. "కానీ ఆమెకు ఏమయిందో నాకు తెలుసు'' అన్నారామె.

అసలు విషయం ఏంటంటే, రాణి మెనోపాజ్‌ దశలో ఉన్నారు. ఈ సిరీస్‌లో నటి పూజా భట్‌ రాణి పాత్ర పోషిస్తున్నారు. ఆమె ఓ పెద్ద బ్యాంకుకు సీఈవోగా ఇందులో కనిపిస్తారు.

కానీ తన పనులు, అవసరాల విషయం వచ్చే సరికి ఆమె అందరికీ దూరంగా జరుగుతారు. మహిళా సహోద్యోగులు ఏదైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చినా ఒప్పుకోరు.

రాణి అలా ప్రవర్తించడానికి అనేక కారణాలున్నాయంటారు నమితా భండారీ. "మెనోపాజ్‌ దశలో ఉండి, అప్పుడప్పుడూ చిరాకు పడుతూ, అవసరంలేకున్నా అరుస్తూ కనిపించే ఒక ప్రొఫెషనల్‌ లేడీ బాస్‌ ఆమె. కానీ ఈ విషయాలన్నీ తన కొలీగ్‌కు తెలియడం ఆమెకు ఇష్టం ఉండదు.

"ఇంకో కారణమేంటంటే ఆమె తన శరీరంతో తానే పోరాడుతుంటారు. చాలామంది మహిళలు ఈ పోరాటాన్ని తామే సొంతంగా చేయాలనుకుంటారు" అన్నారు నమితా.

మెనోపాజ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మలి యవ్వన దశలో కలిగే ఇబ్బందుల గురించి మిషెల్లీ ఒబామా తన అనుభవాలను తెలిపారు.

మెనోపాజ్‌ ఎప్పుడు మొదలవుతుంది?

ఇండియన్‌ మెనోపాజ్‌ సొసైటీ(ఐఎంఎస్‌) అందించిన వివరాల ప్రకారం దేశంలో 15కోట్లమంది మహిళలు మెనోపాజ్‌ దశలో జీవిస్తున్నారు. ఇండియాలో మెనోపాజ్‌ దశ సరాసరి వయసు 46.2 ఏళ్లు కాగా, ప్రపంచ వ్యాప్తంగా 51 ఏళ్లుగా ఉంది.

తరచూ శరీరానికి చెమటలు పట్టడం, ఒళ్లు వేడెక్కడం, నిద్రలేమి, ఆందోళన, కుంగుబాటు, సెక్స్‌ పట్ల అనాసక్తిలాంటి లక్షణాలన్నీ ఈ మెనోపాజ్‌ దశలో ఉన్నవారిలో కనిపిస్తుంటాయి.

"మహిళలు తమ జీవితంలో మూడింట ఒక వంతు మెనోపాజ్‌ దశలోనే గడుపుతారు. కానీ చాలామందికి దానిపై అవగాహన ఉండదు" అని ఇండియన్‌ మెనోపాజ్‌ సొసైటీకి సెక్రటరీగా పని చేస్తున్న గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ అనితా షా అన్నారు.

40 ఏళ్లు దాటిన మహిళల్లో సగానికి తక్కువ మంది మాత్రమే తన క్లినిక్‌కు వచ్చి మెనోపాజ్‌ సమస్యలను చెప్పుకున్నారని డాక్టర్‌ అనితా షా తెలిపారు.

భారతీయ సమాజంలో మెనోపాజ్‌ అనేది రుతుక్రమానికి మించి చర్చించకూడని నిషిద్ధ విషయం."రుతుక్రమం గురించి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు. బాలీవుడ్‌ సినిమా పాడ్‌మన్‌ లాంటివి అవగాహన పెంచాయి. అయితే మెనోపాజ్‌ గురించి ఇంకా అవగాహన లేదు" అన్నారు నమితా భండారీ.

ప్రపంచంలో సగమందికి సంబంధించిన సమస్య ఇంత రహస్యంగా, నిగూఢంగా మిగిలిపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. పాశ్చాత్య దేశాలలో ఈ మార్పుపై అవగాహన కల్పించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి.

గత సెప్టెంబర్‌లో తమ స్కూల్‌ పాఠ్య పుస్తకాలలో మెనోపాజ్‌ అంశాన్ని చేర్చింది బ్రిటన్‌. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు బ్రిటన్‌ వ్యాప్తంగా అనేక క్లినిక్‌లు కూడా ఉన్నాయి.

మెనోపాజ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెనోపాజ్‌ సమస్యలకు చికిత్స ఉందని చాలామందికి తెలియదు.

లక్షణాలు ఎలా ఉంటాయి?

మెనోపాజ్‌ దశలో ఉన్న తనకు ఓసారి అధికారిక హెలీకాప్టర్‌లో ప్రయాణిస్తుండగా కలిగిన అనుభవాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామ భార్య మిషెల్లీ వివరించారు.

"నా కడుపులో ఎవరో ఒక కొలిమిని రగిలించి, మంటలను ఒక్కసారిగా పెంచినట్లు అనిపించింది. కడుపులో అంతా కరిగిపోతున్న ఫీలింగ్‌ కలిగింది. తర్వాత ఇదంతా నా భ్రమ అనిపించింది" అని ఓ పాడ్‌కాస్ట్‌లో మిషెల్లీ వివరించారు.

" మహిళ శరీరం ఒక దశలో కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. దానికి సమాజంలో చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ జనాభాలో సగమంది ఈ దశలో ఉంటారు. కానీ ఎవరికీ ఏమీ తెలియకుండానే మిగిలిపోతుంది"

భారతదేశంలో చాలామంది ఇదంతా తమకు తెలియనట్లుగానే నటిస్తుంటారని నమితా భండారీ వ్యాఖ్యానించారు.

"పెద్ద పెద్ద కంపెనీలు, రాజకీయ పార్టీల్లో ఈ దశలో ఉన్న మహిళలు ఎంతోమంది ఉంటారు. కానీ ఎవరూ ఈ మార్పు గురించి మాట్లాడరు. ఎందుకంటే దీనిపై మాట్లాడకూడదని మహిళలకు నేర్పించారు. ఎంత ఎత్తుకు ఎదిగిన మహిళలైనా ఈ విషయానికి వచ్చేసరికి సైలెంట్‌ అవుతుంటారు." అని అన్నారామె.

ఇలాంటి అంశాలపై ఎక్కడా చర్చ జరగకపోవడం వల్లే ఇటీవల నిర్వహించిన సర్వేలో 71%శాతంమంది యువతులు తమకు రుతుక్రమం వచ్చే వరకు దాని గురించి తెలియదని వెల్లడించారు.

మెనోపాజ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలామంది మహిళలు తాము మెనోపాజ్‌లో ఉన్న విషయాన్ని గుర్తించరు.

చాలామందికి తెలియని అంశం

శరీరంలో జరగబోయే మార్పుల గురించి తల్లిదండ్రులు చాలా తక్కువగా తమ పిల్లలతో చెబుతారని, దీనివల్ల వారిలో లేనిపోని భయాలు, ఆందోళనలు కలుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.

మెనోపాజ్ దశలోకి వచ్చినప్పుడు కూడా మహిళలకు ఇదే తరహా ఆందోళనకు లోనవుతారు. ఈ దశకు వచ్చిన మహిళల్లో నడుము గట్టిగా మారడం, చర్మం వేలాడటం, మనస్తత్వంలో ఒడిదొడుకులు మొదలవుతాయి.

తాము ప్రాముఖ్యంలేని దశలోకి వెళ్లిపోతున్నామని స్త్రీలు ఆందోళన చెందుతుంటారు.

"శరీరంలో మార్పులు వచ్చే మాట వాస్తవం. కానీ మన తల్లులతో సహా ఎవరూ దీనికి సిద్ధమవుతున్నట్లు కనిపించదు" అన్నారు నమితా భండారీ. "ఇది దాచుకోవాల్సింది కాదు. పట్టించుకోవాల్సిన విషయం" అన్నారామె.

ఇప్పుడున్న ఇలాంటి ధోరణిని మార్చడానికి మెనోపాజ్‌ సొసైటీ పని చేస్తోందని డాక్టర్‌ అనితా షా వెల్లడించారు.

"కూతుళ్లను, కోడళ్లను ఆసుపత్రికి తీసుకొచ్చే మధ్య వయస్కులైన మహిళలకు మెనోపాజ్‌ గురించి అవగాహన కల్పించేందుకు నా వంతు ప్రయత్నాలు చేస్తుంటాను" అని డాక్టర్‌ షా వెల్లడించారు.

"ఈ దశలో కనిపించే లక్షణాలు, భౌతిక, మానసిక మార్పుల గురించి వారికి వివరిస్తాను. దీనికి చికిత్స కూడా ఉందని చెబుతుంటాను. చాలామందికి దీనికి చికిత్స ఉంటుందని తెలియదు" అని షా వివరించారు.

మెనోపాజ్‌

ఫొటో సోర్స్, YANTRA PICTURES

ఫొటో క్యాప్షన్, సినిమాల కారణంగా మెనోపాజ్‌పై అవగాహనకు అవకాశం ఉంది.

సినిమాలతో అవగాహన

సరైన అవగాహన లేక చాలామంది మహిళలు దీనివల్ల కలిగిన బాధను ఓర్చుకుంటూ గడిపేస్తారు. 2019 ఇదే అంశంపై 'పెయిన్‌ఫుల్‌ ప్రైడ్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌ విడుదలైంది.

ఇది ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శనకు నోచుకుని అవార్డులు గెలుచుకుంది తప్ప కమర్షియల్‌గా ఇంకా విడుదల కాలేదు.

ఈ సినిమా తీసే నాటికి దర్శకుడు సౌమిత్రా సింగ్‌కు 28 ఏళ్లు. ఈ చిత్రానికి డైరక్షన్‌ అవకాశం వచ్చేదాక తనకు మెనోపాజ్‌ అంటే ఏంటో తెలియదని సింగ్‌ చెప్పారు.

ఈ సినిమాలో పల్లవీ జోషీ ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో ఆమె తరచూ జ్వరం, ఒళ్లంతా చెమటలు పట్టడం, నిద్రలేమి, చిరాకులాంటి సమస్యలతో బాధపడుతుంటారని సౌమిత్రా సింగ్ బీబీసీకి చెప్పారు.

ఒకవైపు తనకు సెక్స్‌ పట్ల ఆసక్తి తగ్గుతుండటంతో తన భర్త పరాయి స్త్రీలతో ఎక్కడ ఆకర్షితుడవుతాడోనని ఆమె ఆందోళనలో కనిపిస్తుంటారు.

"మెనోపాజ్‌ దశ గురించి ఆమెకు, ఆమె కుటుంబానికి అవగాహన కల్పించడమే ఈ సినిమా కథ. మెనోపాజ్‌ అనేది ఒక వ్యాధి కాదని ఇందులో వారు గ్రహిస్తారు" అని దర్శకుడు సౌమిత్రా సింగ్‌ చెప్పారు.

మెనోపాజ్‌ గురించి సమాజంలో చర్చ జరగాల్సి ఉందంటారు నమితా భండారి. 'బాంబే బేగమ్స్‌', 'పెయిన్‌ఫుల్‌ ప్రైడ్‌' లాంటి చిత్రాలు అందుకు ఉపయోగపడతాయని ఆమె అన్నారు.

"మనం ఇప్పుడిప్పుడే రుతుక్రమం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. మెనోపాజ్‌ గురించి మాట్లాడటానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఇది 15 కోట్లమంది మహిళలకు సంబంధించిన సమస్య" అన్నారామె.

అయితే పరిస్థితుల్లో మార్పు వస్తుందని తాను భావిస్తున్నట్లు నమితా అంటారు. "ఐదేళ్ల కిందట శానిటరీ న్యాప్కిన్స్‌ గురించి ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇదొక ముందడుగు" అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)