మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో ఎక్కువమంది గృహిణుల చేతిలో ఆదాయం ఉండదు. కానీ ఇంటి ఖర్చులలో కొంత డబ్బును ఎలా ఆదా చేయాలో వారికి తెలుసు.
పొదుపు ఖాతాలలో చిన్నచిన్న మొత్తాలను దాచి పెట్టడం ద్వారా పెద్ద మొత్తాన్ని పోగు చేయాలని వారు భావిస్తుంటారు.
ఇలాంటి పొదుపు భవిష్యత్తులో ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుందన్నది వారి ఆలోచన. దీని ద్వారా వారు ఆర్ధిక శక్తిని కూడా పొందుతారు. ఆ డబ్బు ఏదైనా అవసరంలో కుటుంబానికి ఉపయోగపడవచ్చు.
మ్యూచువల్ ఫండ్‌గా పిలిచే పెట్టుబడి మార్గం ఇలాంటి చిన్న మొత్తాలను దాచుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది.
ప్రతి నెలా కొంత మొత్తాన్ని బ్యాంకులో దాచుకున్నట్లే, ఒక స్థిరమైన మొత్తాన్ని క్రమ పద్ధతిలో పెట్టుబడిగా పెట్టుకునే విధానాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) అంటున్నారు. ఇది మంచి రాబడిని ఇస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, PTI
'సిప్' ఎలా పని చేస్తుంది?
'సిప్' అనేది మిగతా మ్యూచువల్ ఫండ్స్‌కు కాస్త భిన్నమైనది. అయితే ఇది ఎలా పని చేస్తుంది? రాబడి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం.
రోజు, నెల, సంవత్సరం ప్రాతిపదికన సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా మనం పెట్టిన పెట్టుబడిని మ్యూచువల్‌ఫండ్ కంపెనీలు వేర్వేరు సంస్థలలో ఇన్వెస్ట్ చేసి వాటిపై వచ్చే రాబడులను మదుపరులకు ఇస్తాయి.
వడ్డీ ఆధారిత పథకాలలో పెట్టుబడి పెడితే, వడ్డీ కూడా లభిస్తుంది. అయితే మదుపరుల డబ్బును వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టరు. దీనికోసం ఒక ఫండ్‌ను సృష్టిస్తారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులను నిర్వహించే సంస్థలను అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీస్ (AMC) అని అంటారు.
ఈ ఏఎంసీలు పెట్టుబడిదారులు పెట్టిన మొత్తాన్ని కలిపి ఒక నిధిని ఏర్పరుస్తాయి. ఈ నిధిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించే వ్యక్తిని ఫండ్ మేనేజర్ అంటారు.
ఇలాంటి ఫండ్‌లలో ఒక్కొక్కరు ఒక్కో మొత్తాన్ని పెట్టుబడిగా పెడతారు. ఉదాహరణకు కొందరు రూ. 500 పెట్టుబడి పెట్టగలిగితే, కొందరు రూ. 5 లక్షలు కూడా ఇన్వెస్ట్ చేయగలరు.
ఫండ్ మేనేజర్ ఈ మొత్తం డబ్బును ఒకేసారి వివిధచోట్ల పెట్టుబడిగా పెడతారు. వచ్చే రాబడిని అందరికీ పంచుతారు. ఇలాంటి ఫండ్‌లలో ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్ లాంటి సౌకర్యాలు ఉండవు.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి అనేక పథకాలు ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన స్కీమ్, లేదా నిపుణులు సూచించిన పథకాలను ఎంచుకోవచ్చు. నెట్ అసెట్ వ్యాల్యూ (NAV) రూపంలో ఫండ్లలో పెట్టిన పెట్టుబడి విలువను కంపెనీలు ప్రకటిస్తాయి.

ఫొటో సోర్స్, NORA CAROL PHOTOGRAPHY
కొద్ది మొత్తంతో మొదలు.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద మొత్తాలే ఉండాల్సిన అవసరం లేదు. రూ.500 కూడా ప్రారంభించవచ్చు. రోజు, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం లేదంటే ఒకేసారి (వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్) కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
"సాధారణ పొదుపు పథకాలలో పెద్దగా రాబడి ఉండదు. కానీ మ్యూచువల్ ఫండ్లు అందుకు భిన్నంగా మంచి ఆదాయాన్ని ఇస్తాయి" అని ఆర్డీ ఇన్వెస్ట్‌మెంట్ డైరక్టర్ రాజేశ్ రోషన్ అన్నారు.
కేవలం గృహిణులే కాకుండా, కొద్ది జీతాలతో పనులు చేసుకునే మహిళలు కూడా వీటిపట్ల ఆసక్తి చూపుతున్నారని రాజేశ్ రోషన్ అన్నారు. ఇలా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మహిళలు ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఫండ్ మేనేజర్లు వారికి సాయపడతారు.
రిటైరైన మహిళలు కూడా భవిష్యత్తు కోసం పెట్టుబడులకు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు.
"ఒకేచోట పొదుపు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. వడ్డీతోపాటు ద్రవ్యోల్బణం రేటు కూడా పెరుగుతుంది. అలాంటి సందర్భంలో పొదుపు పథకాలతో లాభం తక్కువ. మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రాబడినిస్తాయి. అయితే రిస్క్, ప్రాఫిట్‌లను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి" అని అన్నారు చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న రచనా రనడే.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్గదర్శకాల ప్రకారం మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పనిచేస్తాయి. ఈ కంపెనీలన్నీ ప్రైవేట్‌వే.
మ్యూచువల్ ఫండ్‌లలో ప్రధానంగా మూడు రకాలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్
ఇది స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా రాబడి ఉంటుంది. వీటిలో రిస్క్ ఎక్కువ. ప్రయోజనం కూడా ఎక్కువగా ఉండొచ్చు. దీర్ఘకాలిక పద్దతిలో పెట్టుబడి పెట్టేవారికి ఇది మంచి ఆప్షన్.
వెంటనే డబ్బు అవసరం లేని వారు ఐదు, ఆరు సంవత్సరాల ప్రాతిపదికన పెట్టుబడిగా పెట్టవచ్చు.
మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎందుకు, నేరుగా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు కదా అన్న సందేహం రావచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్లు మన డబ్బును మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టే విధానం భిన్నంగా ఉంటుంది.
మీ దగ్గర డబ్బు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సురక్షితమని భావించే కంపెనీలలో పెట్టుబడి పెట్టలేరు. కానీ మ్యూచువల్ ఫండ్ల ద్వారా అలా చేయవచ్చు. అవి మీ డబ్బును పెద్ద ఫండ్‌లలో ఇన్వెస్ట్ చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
డెట్ మ్యూచువల్ ఫండ్
ఇలాంటి ఫండ్‌లు మన సొమ్మును బాండ్లు, గవర్నమెంట్ సెక్యురిటీ, ట్రెజరీ బిల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లలో పెట్టుబడులు పెడతారు. ఇందులో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆప్షన్లు ఉంటాయి. స్వల్పకాలిక పెట్టుబడుల పద్ధతిలో రోజు ప్రాతిపదికన కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీనిని ఓవర్‌నైట్ ఫండ్ అని కూడా అంటారు.
డెట్ మ్యూచువల్ ఫండ్లలో లాభాలు ఎక్కువగా ఉండవు. కానీ రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇందులో ఫిక్స్‌డ్ రిటర్న్‌లతోపాటు డబ్బు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. కాని డెట్ ఫండ్స్ తక్కువ సమయంలో సురక్షితమైన పెట్టుబడికి మంచి ఆప్షన్.
"పన్ను మినహాయింపుల కోసం కూడా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. వీటినే టాక్స్ సేవర్ ఫండ్ అంటారు. ఇది ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్. అంటే కనీసం 65శాతం డబ్బు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టబడుతుంది. మిగిలిన 35శాతం డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టబడుతుంది. మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. అయితే, పెట్టుబడిని ఎక్కడ నష్టపోతామోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫండ్ మేనేజర్ చూసుకుంటారు" అన్నారు రచనా రనడే.

ఫొటో సోర్స్, Reuters
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్
ఇది ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్‌ల మిశ్రమం. ఇందులో రెండు విధాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. మీ డబ్బులో కొంత షేర్లు, మరికొంత బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు.
ఇందులో నష్ట భయం, రాబడి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకంటే తక్కువ, డెట్ మ్యూచువల్ ఫండ్లకంటే ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు జారీ చేసే గోల్డ్‌ఫండ్‌లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









