భారతదేశం ఆర్థికాభివృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సమీర్ హష్మి
- హోదా, బీబీసీ న్యూస్, ముంబై
భారత ఆర్థికాభివృద్ధిని వాస్తవం కన్నా అధికంగా అంచనా వేసి ఉండవచ్చునని దేశ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అభిప్రాయపడ్డారు.
అరవింద్ సుబ్రమణియన్ తాజాగా ఒక పత్రికలో రాసిన వ్యాసంలో.. దేశ ఆర్థిక వృద్ధిని లెక్కించే విధానాన్ని భారతదేశం మార్చిందని.. దీనివల్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనా ప్రతి ఏటా వాస్తవం కన్నా 2.5 శాతం అధికంగా లెక్కించి చెప్తున్నారని తన పరిశోధనలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఆయన నిర్ధారణలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహాదారుల సంఘం తిరస్కరించింది. ఆయన లేవనెత్తిన అంశాలు ఒక్కొక్క దానికీ ఖండనలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పింది.
అయితే.. అరవింద్ సుబ్రమణియన్ విశ్లేషణలు భారత ఆర్థికాభివృద్ధి గణాంకాల విశ్వసనీయత మీద మరోసారి ఆందోళనలను రేకెత్తించాయి.
2018లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారతదేశం నిలిచింది. అయితే.. ఈ వృద్ధిని లెక్కించటానికి అనుసరించిన విధానం లోపభూయిష్టంగా ఉందని, ఆర్థిక వ్యవస్థకు వాస్తవికంగా ప్రతిఫలించటం లేదని ప్రముఖ ఆర్థికవేత్తలు చాలా మంది వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ వివాదం?
జీడీపీని లెక్కించే పద్ధతిని భారతదేశం 2015లో మార్చింది.
ప్రధాన మార్పుల్లో ఒకటి: జీడీపీని ఇప్పుడు మార్కెట్ ధరలను ఉపయోగించి లెక్కిస్తున్నారు. అంతకుముందు కనీస ధరలను బట్టి లెక్కించేవారు.
అంటే.. ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులు పొందటానికి అయ్యే టోకు ధరల ఆధారంగా 2015 వరకూ జీడీపీని లెక్కించేవారు. కానీ ఇప్పుడు వినియోగదారులు చెల్లించే మార్కెట్ ధరల ఆధారంగా జీడీపీని లెక్కిస్తున్నారు.
అలాగే.. త్రైమాసిక, వార్షిక వృద్ధిని లెక్కించటానికి ఆధారంగా ఉండే సంవత్సరాన్ని (బేస్ ఇయర్‌ను) 2004-05 నుంచి 2011-12కు మార్చారు.
ఇలా మార్చినప్పటినుంచీ.. ఈ కొత్త పద్ధతి మీద ఆర్థికవేత్తలు, గణాంక నిపుణుల నుంచి నిశిత విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
2011-12 నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆర్థికాభివృద్ధిని వాస్తవంకన్నా అతిశయంగా చూపించారని చెప్పటం ద్వారా ఆ సందేహాలను అరవింద్ సుబ్రమణియన్ బలపరిచారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సంవత్సరాల్లో ఆర్థికాభివృద్ధి 7 శాతంగా ఉందని అధికారిక లెక్కలు చెప్తుంటే.. ''వాస్తవ వృద్ధి'' కేవలం 4.5 శాతంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.
అరవింద్ సుబ్రమణియన్ తన సొంత పరిశోధన ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పరిశోధనను హార్వర్డ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ప్రచురించింది.
కొత్త విధానం అమలులోకి వచ్చిన 2015 నుంచి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో అధిక వృద్ధి రేటు అంచనాలను ప్రశ్నిస్తున్న నిపుణుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ.. నిరుద్యోగిత 2017 - 18 మధ్య 45 ఏళ్ల గరిష్ట స్థాయికి పెరిగింది.
నిరుద్యోగిత ఇంత అధికంగా ఉన్నపరిస్థితుల్లో అధిక ఆర్థికాభివృద్ధి లెక్కల మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ అధిపతి, అంర్జాతీయ ద్రవ్య నిధి మాజీ ప్రధాన ఆర్థికవేత్త రఘురాం రాజన్ కూడా సందేహాలు వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వం ఏం చెప్తోంది?
ఆర్థికాభివృద్ధిని లెక్కించటానికి తాము ప్రవేశపెట్టిన పద్ధతిని ప్రభుత్వం సమర్థించుకుంది.
''ఆర్థికవ్యవస్థలో వివిధ రంగాల తోడ్పాటును భారతదేశం నిష్పాక్షికంగా లెక్కిస్తుంది. ఆమోదించిన విధానాలు, పద్ధతుల్లోనే దేశ జీడీపీ అంచనాలు రూపొందించటం జరిగింది'' అని భారత అర్థగణాంక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆర్థిక లెక్కల సేకరణ విషయమై ప్రభుత్వం మీద ప్రశ్నలు తలెత్తటం ఇదే మొదటిసారి కాదు. 2016 జూన్‌లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీని లెక్కించటానికి ఉపయోగించిన కంపెనీల్లో 36 శాతం సంస్థల ఆచూకీ లభించకపోవటమో, వాటిని పొరపాటుగా వర్గీకరించటమో జరిగిందని ఇదే అర్థగణాంక మంత్రిత్వశాఖ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
సమాచారం సేకరించే విధానంలో లోటుపాట్లు ఉన్నాయని ప్రభుత్వం సైతం అంగీకరించింది.
ఈ నేపథ్యంలో.. భారత జీడీపీ గణాంకాలను పరిశీలించటానికి భారతీయులు, విదేశీయులతో కూడిన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుబ్రమణియన్ పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది భారతదేశం మీద ఎలా ప్రభావం చూపుతుంది?
ఇటీవలే రెండో సారి ఎన్నికల్లో గెలిచిన మోదీ ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఆర్థికాభివృద్ధిని పునరుద్ధరించాల్సిన ఒత్తిడిని ప్రభుత్వం ఇప్పటికే ఎదుర్కొంటోంది.
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాదని ప్రభుత్వ సొంత లెక్కలే అంగీకరిస్తున్నాయి. చైనా జీడీపీ వృద్ధి రేటు ఐదేళ్లలో అత్యంత మందకొడిగా ఉన్నప్పటికీ.. వేగంగా అభివృద్ధఇ చెందుతున్న ఆర్థికవ్యవస్థ హోదా చైనాకు వెళ్లిపోయింది.
ఇది భారత గౌరవాన్ని దెబ్బతీయటం మాత్రమే కాదు.. గత కొన్నేళ్లలో అమలు చేసిన ఆర్థిక విధానాలు నిజానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తప్పుడు చిత్రం చూపటం ద్వారా వృద్ధిని ఎలా కుంటుపరిచాయనేది కూడా చాటుతోంది.
ఉదాహరణకు.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి దేశంలో వడ్డీ రేట్లను అధిక స్థాయిలో ఉంచారు. కానీ అలా చేయటం వ్యాపారాలకు మరిన్ని అవరోధాలను సృష్టించింది. వాళ్లు ఎక్కువ ధరకు పెట్టుబడులు అప్పు తెచ్చుకునేలా చేసింది. పరిస్థితులను మరింతగా దిగజార్చుతూ.. మొండి బకాయిలు, చెడ్డ రుణాలు బ్యాంకుల మీద ప్రభావం చూపాయి. దీంతో డబ్బులు తీసుకోవటం కష్టంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
వృద్ధి రేటు ఒడిదుడుకుల్లో పడటం మొదలయ్యాక.. ఆర్థికవ్యవస్థకు ప్రోత్సాహం ఇవ్వటం కోసం రిజర్వ్ బ్యాంకు ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గించింది.
ఆర్థికాభివృద్ధిని కుంగదీస్తున్న రెండు పెను సవాళ్లు.. ఉద్యోగాల లేమి, వ్యవసాయ సంక్షోభం.
ఆర్థికవ్యవస్థ మీద విశ్వాసాన్ని పునరుద్ధరించటంతో పాటు.. విధానాల విశ్లేషణ కోసం ఎప్పటికప్పుడు వాస్తవిక గణాంకాలను అంచనా వేయటానికి అర్థగణాంక వ్యవస్థను అత్యవసరంగా పునర్‌వ్యవస్థీకరించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
సమాచార సేకరణ విధానాన్ని ఆధునికీకరించటం కోసం ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.
మందగమనాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన అవసరముందని అరవింద్ సుబ్రమణియన్ కూడా అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








