సెక్స్‌లో ప్రతి భంగిమనూ వర్ణించే శిల్పాలున్న ఆలయాలు ఇవి

BBC
ఫొటో క్యాప్షన్, BBC
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కామసూత్ర రాసిన వాత్స్యాయనుడు ఎన్నో వందల ఏళ్ల క్రితమే గ్రీకు సాహిత్యంలో ఉన్న 'కామం' అనే భావన గురించి విస్తృతంగా చర్చించారు.

'కామం' అనేది "ఒకరిపై అధికారం చూపించాలనే ఆకాంక్ష" అని ప్లేటో భావించారు.

'సింపోజియం'లో గ్రీకు నాటక రచయిత అరిస్టోఫేన్స్ కూడా "ఒక మానవుడు ఇతరుల అవసరం లేకుండా, తనను తాను పరిపూర్ణంగా భావించిన ఒక కాలం గురించి" ప్రస్తావించారు.

"అలా, మానవుడు తనకు తాను చాలా బలవంతుడుగా మారాడు. దేవతలకు కూడా సవాలు విసరడం మొదలుపెట్టాడు. దాంతో, దేవతల రాజు జాయస్ దాని నుంచి బయటపడ్డానికి ఒక పథకం వేశాడు. మానవుడిని పురుషుడు, స్త్రీ అనే రెండు భాగాలుగా విభజించాడు" అని చెప్పాడు.

ఫలితంగా మనిషి నిటారుగా నిలబడడం ప్రారంభించాడు. రెండు కాళ్లపై నడిచేటపుడు. తన ముందున్న అంగాలు విభజనకు గురైనట్లు అతడికి అనిపించింది.

Presentational grey line
News image
Presentational grey line

ప్లేటో "ఆ అపరిపూర్ణత, మనలో విభజనకు గురైన మరో భాగాన్ని కూడా పొందాలనే కోరికను రగిల్చింది" అంటారు.

"సెక్స్‌ను పరిపూర్ణత కోసం కలిగిన కోరిక"గా ప్లేటో చెప్పేవారు. "మనది కాని ఒక వస్తువును మనం ఇష్టపడతాం" అన్నారు.

కానీ సెక్స్ ఎందుకూ పనికిరానిది అని కూడా చెప్పే ఒక కాలం కూడా వచ్చింది. ఆ సమయంలో సెక్స్ చెడ్డది, అది చేయడం పాపం అని భావించారు.

క్రీ.శ 325లో "శరీరం ఒక పనికిరాని వస్తువు, శారీరక సుఖం అర్థంలేనిది, దాన్ని పొందాలనే కోరిక కలగడం పాపం" అని కాథలిక్ చర్చి తమ నియమ నిబంధనల్లో చెప్పింది.

"సెక్స్ ఒకే ఒక ఉద్దేశం సంతానానికి జన్మనివ్వడం మాత్రమే" అని ఆ నిబంధనల్లో చెప్పారు.

కానీ, దాదాపు అదే సమయంలో వాత్స్యాయనుడు గంగా తీరంలో కూచుని కామసూత్ర రాస్తున్నారు. "వాస్తవానికి, లైంగికానందం చాలా మంచిదని, దానిని మరింత పెంచడం ఎలా" అనేది చెబుతున్నారు.

విశ్వగురువు
ఫొటో క్యాప్షన్, BBC

బాహాటంగా సెక్స్‌ వర్ణన

ప్రాచీన భారత వాస్తుకళలో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అవి, ప్రాచీన కాలంలో సెక్స్ గురించి ప్రజలు ఎంత బాహాటంగా ఆలోచించేవారు అనేది చెబుతాయి. ఒడిశా కోణార్క్ సూర్యమందిరం విషయానికే వస్తే, అక్కడి శిల్పకళలో మనం నగ్న శిల్పాలు ఉండడం చూడవచ్చు.

అలాగే బౌద్ధ మతానికి సంబంధించిన అజంతా, ఎల్లోరా గుహల్లో కూడా యువతుల నగ్న వర్ణనలు కనిపిస్తాయి. అజంతా గుహలో చిత్రాలను క్రీస్తుకు రెండు శతాబ్దాల ముందు వేశారు. అటు ఎల్లోరాలోని శిల్పాలను ఐదు నుంచి పదో శతాబ్దం మధ్యలో చెక్కినట్లు చెబుతున్నారు.

భారత్‌లో సెక్స్ గురించి ఓపెన్‌గా ఉన్న వర్ణనను మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయాల్లో కూడా మనం చూడచ్చు. ఈ ఆలయాలు సుమారు వెయ్యేళ్ల పురాతనమైనవి. వీటిని చందేల్ రాజులు క్రీ.శ 950 నుంచి 1050 వరకూ నిర్మించారు. ఆ సమయంలో మొత్తం 85 ఆలయాలు నిర్మించారు. కానీ ప్రస్తుతం వాటిలో 22 మాత్రమే మిగిలాయి.

యునెస్కో 1986లో వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఈ ఆలయాల్లో లైంగిక సంబంధాల్లో ప్రతి రూపాన్నీ మనం చూడవచ్చు. గోడలపై సెక్స్‌లో ప్రతి భంగిమను వర్ణించారు. ముగ్గురితో లైంగిక సంబంధాలు నెరపడం గురించి కూడా ఇక్కడ మనకు శిల్పాలు కనిపిస్తాయి.

ఒక వింత విషయం ఏంటంటే, భారతదేశంలో స్వలింగ సంపర్కం ఇప్పటికీ చట్టప్రకారం నేరం కాగా, ఇదే దేశంలో ప్రాచీన ఆలయాల్లో శిల్పకళ ద్వారా స్వలింగ సంపర్కం అంటే ఏంటో వివరంగా అర్థమయ్యేలా చెప్పారు.

13వ శతాబ్దంలో మౌంట్ అబూ దగ్గర నిర్మించిన దిల్వాడా ఆలయాల్లో కూడా స్త్రీ, పురుషులు సన్నిహతంగా ఉండే దృశ్యాలను పాలరాయితో చెక్కారు.

BBC
ఫొటో క్యాప్షన్, BBC

స్వలింగ సంపర్కం ఆమోదయోగ్యం

స్వలింగ సంపర్కులు ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఇప్పటికీ తమ గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, ప్రాచీన భారతంలో దీనికి సామాజిక గుర్తింపు, అంగీకారం లభించింది.

అమర్ దాస్ విల్హెమ్ తన "తృతీయ-ప్రకృతి:పీపుల్ ఆఫ్ ద థర్డ్ సెక్స్: అండర్‌స్టాండింగ్ హోమో సెక్సువాలిటీ, ట్రాన్స్‌జెండర్ ఐడెంటిటీ త్రూ హిందూయిజం" పుస్తకంలో మధ్యయుగం నాటి సంస్కృత గ్రంథాలపై పరిశోధన చేసిన తర్వాత స్వలింగ సంపర్కం, తృతీయ లింగం అనేవి భారత సమాజంలో ఎప్పుడూ కలిసి ఉన్నాయని నిరూపించారు.

తన పుస్తకంలో కామసూత్రను ఉదహరిస్తూ ఆయన "ఒకప్పుడు మహిళా స్వలింగ సంపర్కాన్ని 'స్వరాణీ' అనేవారు. ఈ మహిళలు, మరో మహిళను పెళ్లి చేసుకుంటారు. వారిని సమాజం 'థర్డ్ జెండర్'గా సులభంగా అంగీకరించింది" అన్నారు.

అదే పుస్తకంలో పురుష స్వలింగ సంపర్కులకు 'క్లీవ్' అనే పేరు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. "వారిని నపుంసక పురుషులు అనేవారు. వారు తమ స్వలింగ సంపర్క ధోరణి కారణంగా మహిళలపై ఆసక్తి చూపించేవారు" అని తెలిపారు.

వివాహేతర సంబంధాల విషయం

ప్రాచీన భారతంలో స్త్రీ లేదా పురుషులు ఎవరైనా మరో స్త్రీ లేదా పురుషులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే, దానిని నేరంగా భావించేవారు కాదు. ఆ సంబంధాలకు కూడా సామాజిక గుర్తింపు లభించింది.

అప్పటి సమాజం చాలా బాహాటంగా ఉండేదని చెప్పడానికి రాధాకృష్ణుల ప్రేమ వర్ణన ఒక ఉదాహరణ. సూరదాస్ మాటల్లో చెప్పాలంటే 'ప్రేమను సిగ్గుతో జోడించకూడదు'.

రాధ సౌందర్యాన్ని వర్ణించే సమయంలో విద్యాపతి మనసు కూడా కరిగిపోయింది. రాధాకృష్ణులు పూజ్యనీయులైనా ఆయన రాధను ఒక మామూలు నాయకిగానే వర్ణించారు.

కృష్ణుడు తన భార్యలతో ఉన్న చిత్రాలు, శిల్పాలు ఎక్కడా కనిపించవు. ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడితో రాధ మాత్రమే కనిపిస్తుంది. ప్రేమను సమాజం అంగీకరించింది అనడానికి ఇది ఒక ఉదాహరణ.

BBC
ఫొటో క్యాప్షన్, BBC

అతడు అగ్ని, ఆమె నీళ్లు

అయినా, ప్రాచీన భారతదేశంలో సెక్స్ గురించి రాసిన ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కానీ "సెక్స్‌లో ఆనందం పురుషుడికి మాత్రమే అవసరం, మహిళలకు అది అంత ముఖ్యం కాదు" అనే భ్రమను మొదట పటాపంచలు చేసిన గ్రంథం కామసూత్ర.

మొదట్లో, మహిళ సెక్స్‌లో భావప్రాప్తి అంటే 'ఆర్గజం' కోసం పురుషులపై ఆధారపడాలి అనే భావన ఉండేది. మహిళల భావప్రాప్తికి పురుషుడి తోడు ఉండాల్సిన అవసరం లేదు అని వాత్స్యాయనుడు మొట్టమొదట కామసూత్రలో చెప్పాడు.

ప్రేమలో మునిగిన స్త్రీ, పురుషుల్లో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. వారి లైంగికత అంటే సెక్సువాలిటీ మూలాల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది.

"పురుషుడి సెక్స్ కోరికలు 'అగ్ని'లా ఉంటాయి. అవి అతడి జననాంగం నుంచి ఎగసి, మస్కిష్తం వైపు వెళ్తాయి. అగ్నిలా చాలా సులభంగా చెలరేగిపోయే పురుషుడు, అంతే సులభంగా చల్లారిపోతాడు. దీనికి భిన్నంగా మహిళ సెక్స్ కోరికలు 'నీళ్లు'లా ఉంటాయి. అవి తల నుంచి మొదలై కింది వైపు వెళ్తుంటాయి. కోరిక కలగడానికి పురుషులతో పోలిస్తే వారికి ఎక్కువ సమయం పడుతుంది" అని వాత్స్యాయనుడు చెప్పారు.

(ఇలస్ట్రేషన్-పునీత్ బర్నాలా, ప్రొడ్యూసర్- సుశీలా సింగ్)

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)