‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అలాంటి పిటిషన్లతో ఉపయోగం లేదు’- చీఫ్ జస్టిస్ బోబ్డే

ఫొటో సోర్స్, Getty Images
'దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వాతావరణం శాంతియుతంగా మారేందుకు అందరూ సహకరించాలి. ముందు దానికోసమే ప్రయత్నించాలి'.. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన ఒక పిటిషన్ విచారణ నేపథ్యంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే చేసిన వ్యాఖ్యలివి.
సీఏఏపై నిరసనల నేపథ్యంలో కొందరు దేశంలో శాంతికి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినీత్ దండా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌పై విచారించే సమయంలో చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి కోసం పాటుపడాలని, ఈ సమయంలో అలాంటి పిటిషన్ల వల్ల ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు.
దేశంలో హింసాత్మక పరిస్థితులు సద్దుమణిగాక పౌరసత్వ సవరణ చట్టం చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపడతామని ఆయన పేర్కొన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమైనదే అని ప్రకటించాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని వినీత్ దండా కోరిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
'ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా మీరు మరింత అలజడిని సృష్టిస్తున్నారు. ఒక చట్టాన్ని రాజ్యాంగబద్ధం చేయమని కోరే పిటిషన్‌ను మేం ఎప్పుడూ చూడలేదు' అని చీఫ్ జస్టిస్ బోబ్డే అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వినీత్ వేసిన పిటిషన్‌పై విమర్శలు ఎదురైనప్పటికీ కోర్టు దానిపైన విచారణ జరిపింది.
మరోపక్క సీఏఏను సవాలు చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టుకు తరలించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరినట్లు పీటీఐ తెలిపింది.
ఈ ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌పై జనవరి 10న విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
'సీఏఏను సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్లపై హైకోర్టులే విచారణ చేపట్టాలనే అభిప్రాయంతో మేమున్నాం. ఒకవేళ ఆ విషయంలో ఏవైనా భిన్నాభిప్రాయాలు ఎదురైతే మేం వాటిని పరిశీలిస్తాం' అని ఆ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు.
కానీ, హైకోర్టులు దీనిపై విచారణ చేపట్టడం వల్ల కోర్టుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని, విచారణకు హాజరయ్యేందుకు న్యాయవాదులు వివిధ రాష్ట్రాల మధ్య తిరగాల్సి వస్తుందని కేంద్రం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ జీ మెహతా అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- దీపికా పడుకోన్: బాలీవుడ్‌కి ఒక రాజకీయ గళం దొరికిందా?
- నిర్భయ దోషులకు డెత్ వారెంట్, జనవరి 22న ఉరిశిక్ష
- JNU విద్యార్థులపై హింసాత్మక దాడి వెనుక... వాట్సాప్ గ్రూప్స్ సీక్రెట్ చాటింగ్
- ఈ భవనాలు హిరోషిమా అణు బాంబును తట్టుకున్నాయి..
- ఉదయించే సూర్యుడు ఉన్న ఈ జెండాపై వివాదమెందుకు?
- సీఈఎస్ 2020: శాంసంగ్ బాలీ.. నీడలా వెంటాడే రోబో బంతి
- ఆ రెండు అమెరికా స్థావరాలపైనే ఇరాన్ క్షిపణి దాడులు ఎందుకు చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








