టోక్యో ఒలింపిక్స్ 2020: ఉదయించే సూర్యుడు ఉన్న ఈ జెండాపై వివాదమెందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆండ్రియాస్ ఇల్మర్
- హోదా, బీబీసీ న్యూస్
అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీలు జరుగుతున్నప్పుడు మైదానాల్లో అభిమానులు జెండాలు ఊపుతూ కేరింతలు కొట్టడం చూస్తుంటాం.
కానీ, కొన్ని దేశాలకు ఏదైనా జెండా అభ్యంతరకరంగా అనిపించి దాన్ని నిషేధించాలంటూ ఉద్యమమే మొదలైతే పరిస్థితి ఏమిటి?
2020 టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా ఇప్పుడు జపాన్‌కు చెందిన ఉదయించే సూర్యుడు బొమ్మ ఉన్న జెండాతో అదే జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా నుంచి దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. అక్కడి నాయకులు కొందరు ఈ జెండాపై ఉన్న బొమ్మ నాజీ స్వస్తిక గుర్తును పోలి ఉందంటున్నారు.
జపాన్ బలగాల మానవ హక్కుల ఉల్లంఘనలను పునర్లిఖించాలని, గొప్పగా చూపించాలని కోరుకుంటున్న అభిమానులు కొందరు వీటిని ఎగరేస్తున్నారని విమర్శకులు అంటున్నారు.
టోక్యో 2020 ఒలింపిక్స్ సందర్భంగా ఈ జెండాలపై నిషేధం విధించాలని దక్షిణ కొరియా కోరుతోంది. కానీ, నిర్వాహకులు మాత్రం ఈ జెండాను జపాన్‌లో విరివిగా ఉపయోగిస్తారని, పైగా ఇది ఎలాంటి రాజకీయ భావ ప్రకటనా కాదని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ ఈ ఉదయించే సూర్య పతాకం ఏమిటి?
జపాన్ జాతీయ జెండాలో చుట్టూ తెల్ల రంగు మధ్య ఒక ఎర్రని గుండ్రటి ఆకారం ఉంటుంది. ఆ జెండాతో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు.
ఈ ఉదయించే సూర్య పతాకంపై మాత్రం జాతీయ జెండాకు భిన్నంగా మధ్యలో ఉన్న గుండ్రటి ఆకారం నుంచి 16 ఎర్రని కిరణాలు ప్రసరిస్తున్నట్లు ఉంటుంది.
నిజానికి ఈ రెండు జెండాలనూ జపాన్‌లో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. 19వ శతాబ్దంలో ఈ ఉదయించే సూర్య పతాకం జపాన్ సైనిక పతాకంగా మారింది. జపాన్ కొరియా, చైనాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుని సామ్రాజ్య విస్తరణకు ఉరికిన సమయంలో ఈ జెండా రెపరెపలాడుతుండేది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఉదయించే సూర్య పతాకాన్ని జపాన్ నౌకాదళ జెండాగా వినియోగించారు. ఆ యుద్ధ సమయంలో జపాన్ ఆసియాలోని పలు ఇతర ప్రాంతాలను ఆక్రమించి అక్కడి స్థానికులపై అకృత్యాలకు పాల్పడడంతో ఈ జెండాపై ప్రతికూల ముద్ర పడింది. అప్పటి నుంచి ఇది వివాదాస్పదమైంది.
జపాన్ నౌకాదళం ఇప్పటికీ ఇదే జెండాను వాడుతుండగా, ఆ దేశ సైన్యం మాత్రం ఇలాంటిదే చిన్నపాటి మార్పులతో వినియోగిస్తోంది.

ఫొటో సోర్స్, Mary Evans Picture Library
దక్షిణ కొరియాకు అభ్యంతరమెందుకు?
జపాన్ 1905లో కొరియాను ఆక్రమించి తమ రక్షణలో ఉన్న ప్రాంతంగా ప్రకటించుకుంది. అక్కడికి అయిదేళ్ల తరువాత దాన్ని తమ పూర్తిస్థాయి వలస ప్రాంతంగా ప్రకటించుకుంది.
జపాన్ పాలనలో ఆర్థిక దోపిడీ సాగింది. ఇతర ఆసియా దేశాల్లో జపాన్ విస్తరించిన ప్రాంతాల్లోకి వేలాదిమంది కొరియన్లను తీసుకెళ్లి బలవంతంగా వారిని కార్మికులుగా మార్చారు.
రెండో ప్రపంచ యుద్ధానికి ముందు, ఆ యుద్ధ సమయంలో కూడా జపాన్ సైన్యం కోసం నిర్వహించిన వ్యభిచార గృహాలకు వేలాది మంది కొరియా బాలికలు, యువతులను బలవంతంగా పంపించారు. వీరే కాదు తైవాన్, చైనా, ఫిలిప్పీన్స్ యువతులనూ సైన్యానికి లైంగిక అవసరాలకు తీర్చడం కోసం బలవంతంగా వినియోగించారు. వీరిని కంఫర్ట్ ఉమెన్‌గా పిలిచేవారు. ఈ కంఫర్ట్ ఉమెన్ అందరినీ బలవంతంగా లైంగిక బానిసలుగా వాడుకునేవారు.
లెక్కలేనన్ని యుద్ధ నేరాలు, అకృత్యాలను ఈ ఉదయించే సూర్య పతాకం గుర్తుకుతెస్తోందన్నది చాలామంది దక్షిణ కొరియావాసుల వాదన. అంతేకాదు.. ఆ జెండాను ఇంకా వాడడమనేది జపాన్ గతంలో చేసిన ఈ తప్పులను సరిదిద్దుకోకపోవడం కానీ, పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడానికి సూచనని అంటున్నారు వారు.
''వలసపాలనలోని మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో బాధ్యత వహించడానికి ఇష్టపడని జపాన్‌పై దక్షిణ కొరియా చేసే ఫిర్యాదుల్లో ఇదొకట''ని కొరియాకు చెందిన విశ్లేషకులు ఎలెన్ స్వికార్డ్ అన్నారు.
ఈ జెండా జపాన్ సామ్రాజ్యవాదం, సైనికవాదానికి చిహ్నమని దక్షిణ కొరియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భయానక యూరోపియన్ దండయాత్రలకు చిహ్నమైన నాజీల స్వస్తిక మాదిరి జపాన్ జెండాల్లో కనిపిస్తున్న ఈ ఉదయించే సూర్యుడి గుర్తు ఆసియావాసులు, కొరియా ప్రజలకు ఇది దెయ్యం గుర్తు వంటిదని దక్షిణ కొరియాకు చెందిన క్రీడలపై పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, EPA
చైనా నుంచి నిరసనలు లేవెందుకు?
జపాన్ దండయాత్రల వల్ల నష్టపోయిన దేశంగా చైనా కూడా దక్షిణ కొరియా మాదిరే స్పందించాలి.
1937లో చైనాలోని నాంజింగ్ నగరాన్ని జపాన్ బలగాలు స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడ నెలల తరబడి అత్యాచారాలు, హత్యలు, దోపిడీలతో సృష్టించిన మారణహోమం ప్రపంచ యుద్ధాల చరిత్రలోనే ఒక భయానక ఘట్టం.
చైనా లెక్కల ప్రకారం అప్పుడు సుమారు 3 లక్షల మందిని హత్య చేశారు. అందులో చిన్నారులు, మహిళలే ఎక్కువ. 20 వేల మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు.
అయినా, ఈ జెండా విషయంలో చైనా వైపు నుంచి ఎలాంటి నిరసనలు వ్యక్తంకాలేదు.
జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ నాంజింగ్ క్యాంపస్‌కు చెందిన ప్రొఫెసర్ డేవిడ్ అరసె దీనిపై మాట్లాడుతూ తాజా రాజకీయాలే ఇందుకు కారణమని చెప్పారు.
''చైనా ఇప్పుడు జపాన్‌తో చెలిమి కోరుకుంటోంది. జపాన్ కొత్త చక్రవర్తిని కలవడానికి ఈ ఏడాది చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెళ్లే సూచనలున్నాయి. కాబట్టి చైనా దీన్ని పెద్ద వివాదం చేయదల్చుకోలేదు. చైనాలో మీడియా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది కాబట్టి అక్కడా దీనిపై ఏమీ కదలిక ఉండదు.. కాబట్టి ప్రజల దృష్టి దీనిపైకి వెళ్లదు'' అన్నారు డేవిడ్.
స్వస్తికతో పోల్చొచ్చా?
జపాన్ ఉదయించే సూర్యుడి చిహ్నాన్ని నాజీల స్వస్తిక గుర్తుతో పోల్చడంపై భిన్నాభిప్రాయాలున్నాయి.
ఉదయించే సూర్యుడి గుర్తును జపాన్ జాతీయ చిహ్నంగా చాలాకాలంగా వినియోగిస్తుంది. అక్కడి ప్రకటనలు, వాణిజ్య ఉత్పత్తులపైనా ఇది కనిపిస్తుంది.
స్వస్తిక విషయానికొస్తే నాజీలు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జర్మనీలో దీన్ని ఉపయోగించారు. జర్మనీలో ఈ గుర్తును నిషేధించారు. అక్కడి తీవ్రవాద గ్రూపులు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నాయి.
''జపాన్ సామ్రాజ్యం సాగించిన అకృత్యాలను గొప్పగా చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకూ ఈ జెండాను వినియోగించరు. అలాంటివారు తప్ప ఇతరులెవరూ దీన్ని వాడరు'' అన్నారు టోక్యోలోని సోఫియా యూనివర్సిటీ పాలిటిక్స్ ప్రొఫెసర్ కొయిచీ నకానో.
స్వస్తికాతో కంటే అమెరికన్ సివిల్ వార్ సమయంలో బానిసత్వాన్ని కొనసాగించాలని కోరిన అక్కడి దక్షిణాది రాష్ట్రాలు వినియోగించిన అప్పటి జెండా(కాన్ఫెడరేట్ ఫ్లాగ్)తో ఈ ఉదయించే సూర్యుడి జెండాను పోల్చాలని సూచించారాయన.
జపాన్ ఈ జెండాను ఎందుకు నిషేధించలేదు?
దక్షిణ కొరియా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ జపాన్ మాత్రం ఇంతవరకు ఈ విషయంలో తగ్గలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ జెండా పాత్రను ప్రస్తావించకుండా జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఈ జెండా చరిత్రను చెబుతూ వివరణ ఇచ్చింది.
''జపాన్ అంతటా ఈ జెండా వాడకం విస్తారంగా ఉంది. చేపల వేటకు వెళ్లేవారు.. సంబరాలు, ఉత్సవాల్లో పాల్గొనేవారు వాడుతుంటారు. ఎవరింట్లోనైనా పిల్లలు జన్మించినా కూడా అక్కడ జరిగే వేడుకల్లోనూ ఈ ఉదయించే సూర్య పతాకం దర్శనమిస్తుంది. జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ వాడే బోట్లు, నౌకలపైనా ఈ జెండా ఉంటుంది.
''రాజకీయ అభిప్రాయ వ్యక్తీకరణ, సైనికవాదానికి ఈ జెండా ప్రతీక అనేది పూర్తిగా అవాస్తవం'' అని ఆ వివరణలో పేర్కొన్నారు.
జపాన్‌లోని ఉదారవాద పత్రిక అసాహి శింబున్ ఈ జెండానే లోగోగా ఉపయోగిస్తోంది.
ఇది రాజకీయ చర్యా?
యుద్ధ సమయంలోని కార్మికులకు పరిహారం విషయంలో తలెత్తిన వివాదం జపాన్, దక్షిణ కొరియా మధ్య వేసవిలో వాణిజ్య యుద్ధానికి దారితీసింది.
జపాన్ ప్రధాని షింజో అబె ఈ జెండా విషయంలో చర్యలకు నిరాకరించడమనేది ఆ దేశంలోని అతి సంప్రదాయవాద వర్గాలను సంతృప్తిపరిచేందుకేనంటారు.
''ప్రస్తుత జపాన్ ప్రభుత్వం అతి జాతీయవాదానికి అవకాశమిస్తూ వారి భావప్రకటనకు మద్దతిస్తోంద''ని హవాయి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హారిసన్ కిమ్ అన్నారు.
చట్టాలు, విద్య, సంస్కృతుల్లో ఎక్కడా తన సామ్రాజ్య నేరాలను జ్ఞాపకం చేసుకోవడం కానీ, వాటికి క్షమాపణలు చెప్పడం కానీ జపాన్ చేయలేదని అన్నారాయన.
ఇవికూడా చదవండి:
- కాసిం సులేమానీని అమెరికా ఇప్పుడే ఎందుకు చంపింది? ఇరాన్ యుద్ధానికి దిగుతుందా?
- వివాహ వేదికల నుంచి ఉచిత న్యాయ సేవల వరకు... పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా యువత ఎలా ఉద్యమిస్తున్నారు?
- 144 సెక్షన్‌ను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయా?
- దేశంలో ముస్లింల భయాందోళనల గురించి మోదీ ప్రభుత్వంలో మంత్రి నఖ్వీ ఏం చెప్పారు?
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- మీ స్నేహితులు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారా?
- బీజేపీ పాలిత రాష్ట్రాలు సరే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు ఎందుకు జరగలేదు: అమిత్ షా
- యోగీ ప్రభుత్వం పీఎఫ్ఐను నిషేధించాలని ఎందుకు కోరుతోంది
- తొలిసారి విమానం ఎక్కాడు.. ఇంజిన్లోకి లక్కీ కాయిన్లు విసిరాడు
- మనీ లాండరింగ్‌పై పుస్తకం రాసిన ప్రొఫెసర్ అదే కేసులో అరెస్టు
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- అమ్మాయిల రక్షణకు పులిపై వచ్చిన 'సూపర్ హీరోయిన్'
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










