టోక్యో ఒలింపిక్స్: పాత సామానుతో.. పతకాల తయారీ

జపాన్ రాజధాని టోక్యోలో జరగబోయే 2020 ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల్లో విజేతలకు ఇచ్చే పతకాలన్నింటినీ రీసైక్లింగ్ చేసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలతోనే తయారు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
పతకాల తయీరీకి అవసరమయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని 2017 లోనే ప్రారంభించారు. అలా సేకరించే వాటిల్లో పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కూడా ఉన్నాయి.
ఆ వ్యర్థాలను శుద్ధి చేసి 30.3 కిలోల బంగారం, 4,100 కిలోల వెండి, 2,700 కిలోల కంచు సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ఏడాది మార్చిలో తమ లక్ష్యాన్ని చేరుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు.
కంచుకును సేకరించడంలో గత ఏడాది జూన్ నాటికే లక్ష్యాన్ని పూర్తి చేశారు. అక్టోబర్ నాటికి 27 కిలోలకు పైగా బంగారం, 3,400 కిలోలకు పైగా వెండిని పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వెలికితీశారు.
ఈ ఏడాది ఆఖరులోగా పతకాల డిజైన్లను విడుదల చేయనున్నారు.

ఫొటో సోర్స్, AFP
రీసైక్లింగ్ చేసిన పదార్థాలను జపాన్‌లోని ప్రజల నుంచి, వ్యాపారుల నుంచి, పరిశ్రమల నుంచి సేకరిస్తున్నారు.
2018 నవంబర్ నాటికి 47,488 టన్నుల పాత ఎలక్ట్రానిక్ వస్తువులను, 50 లక్షల పాత ఫోన్లను పోగు చేశారు.
"ఇప్పటికే సేకరించిన ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ శుద్ధి చేస్తే పతకాల తయారీకి సరిపడా బంగారం, వెండి లభ్యమవుతుంది" అని టోక్యో 2020 నిర్వాహకులు తెలిపారు.
2016లో జరిగిన రియో ఒలింపిక్స్ క్రీడల్లో 30 శాతం వెండి, కాంస్యం పతకాలను రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేశారు.

ఫొటో సోర్స్, Thinkstock
మొబైల్ ఫోన్‌లో బంగారం
దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని శుద్ధి చేస్తే.. ఒక గ్రాము బంగారం దొరుకుతుంది. అంతే బంగారం, 41 మొబైల్ ఫోన్లను రీసైక్లింగ్ చేస్తే కూడా దొరుకుతుందని ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక చెబుతోంది.
అంతేకాదు, 35 ఫోన్ల నుంచే గ్రాము బంగారాన్ని తీయొచ్చని బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు చెందిన యుమికోర్ అనే మైనింగ్ సంస్థ బీబీసీతో చెప్పింది. అంటే, 350 ఫోన్ల నుంచి తులం బంగారం వెలికి తీయవచ్చన్నమాట.
టన్ను బరువైన పాత మొబైల్ ఫోన్లను (బ్యాటరీలు లేకుండా) రీసైక్లింగ్ చేస్తే.. 300 గ్రాముల బంగారం (30 తులాలు) లభ్యమైందని యుమికోర్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- క్రీడల్లో భారత్ కంటే ఉత్తర కొరియానే ముందు!!
- "సింహాన్ని చంపాను.. తర్వాత ఓ అమ్మాయి ప్రేమించింది.. సర్కారు ఉద్యోగం ఇచ్చింది"
- ఆసియా క్రీడల్లో అమ్మమ్మలు: భారత బ్రిడ్జి జట్టులో అత్యధికులు 60 దాటినవారే
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
- ఈ ‘డాక్టర్’ స్వర్ణానికి గురిపెట్టారు.. సాధించారు.
- మహిళల క్రీడా దుస్తులు: నాడు, నేడు
- కామన్వెల్త్ గేమ్స్ చరిత్రేమిటి? ఎప్పుడు మొదలయ్యాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








