చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని 10 కరచాలనాలు

ఫొటో సోర్స్, Getty Images
కిమ్ జోంగ్-ఉన్, డొనాల్డ్ ట్రంప్ సింగపూర్‌లో చేతులు కలిపిన దృశ్యం ఓ చరిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది. ఓ ఉత్తర కొరియా పాలకుడు, అమెరికా అధ్యక్షుడు ఇలా కలవడం, కరచాలనం చేసుకోవడం ఇదే తొలిసారి.
కానీ వీరిద్దరి కలయికలానే ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసిన అనేక షేక్‌హ్యాండ్‌లు చరిత్రలో ఉన్నాయి. ట్రంప్-కిమ్‌లలానే గతంలోనూ కొందరు ప్రఖ్యాత నాయకులు కలిసి అన్ని దేశాల దృష్టినీ తమ వైపు తిప్పుకున్నారు.
1. హిట్లర్-చంబర్లెయిన్
22 సెప్టెంబర్ 1938- జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్, బ్రిటన్ ప్రధాని నెవిల్ చంబర్లెయిన్‌ను జర్మనీలోని డ్రీసెన్ హోటల్‌లో కలిసి కరచాలనం చేశారు.
నాటి చెకోస్లోవేకియాలోని సడెటెన్‌ల్యాండ్‌పై జర్మనీ ఆక్రమణ గురించి చర్చించేందుకు వాళ్లిద్దరూ కలిశారు. ఆ చర్చలు ఫలించాయనీ, శాంతి నెలకొంటుందనీ భావించి చంబర్లెయిన్ బ్రిటన్ చేరుకున్నారు. కానీ సరిగ్గా ఏడాది తరవాత రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
2. చర్చిల్, ట్రుమన్, స్టాలిన్
23 జూలై 1945- అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్(మధ్యలో), బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్(ఎడమ), సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్(కుడి)లు పాట్స్‌డామ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి యూరప్ పరిస్థితి, ముఖ్యంగా జర్మనీ పరిస్థితి ఎలా ఉంటుందో చర్చించడానికి వీళ్లు కలిశారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఫ్రాన్స్‌కు చెందిన చార్లెస్ డె గాలేను ఆహ్వానించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఫొటో సోర్స్, Getty Images
3. జాన్సన్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
2 జూలై1964 - వాషింగ్టన్‌లోని వైట్ హౌజ్‌లో పౌర హక్కుల యాక్ట్‌పై సంతకం చేసే సమయంలో అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్, డా.మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కలిసి కరచాలనం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో, ఉపాధి అవకాశాల్లో రంగు, ప్రాంతం, జన్మస్థలం, మతం, లింగ భేదం ఆధారంగా చూపే వివక్షకు ఆ చట్టం చరమగీతం పాడింది.

ఫొటో సోర్స్, Getty Images
4. మావో, నిక్సన్
21 ఫిబ్రవరి 1972 - చైనా రాజధాని బీజింగ్‌లో ఆ దేశ నాయకుడు మావో జెడాంగ్‌తో కరచాలనం చేస్తున్న నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్.
దాదాపు 23ఏళ్ల పాటు అమెరికా చైనా సంబంధాలు దెబ్బతిన్న తరవాత, నిక్సన్ చైనా వెళ్లిన సందర్భంలో చేసిన కరచాలనం ఇది. కానీ దీని వల్ల సమస్యలు సమసిపోలేదు. రెండు దేశాల మధ్య దూరం తగ్గలేదు.

ఫొటో సోర్స్, Getty Images
5. గార్బచేవ్, రీగన్
నవంబర్ 1985 - సోవియట్ ప్రీమియర్ మైఖైల్ గార్బచేవ్(ఎడమ), అమెరికా అధ్యక్షుడు రోనల్డ్ రీగన్ తమ తొలి సమావేశంలో భాగంగా స్విజర్లాండ్‌లోని జెనీవా నగరంలో కలుసుకున్నారు. కోల్డ్‌వార్ ముగింపు దశకు చేరుకున్న రోజులవి.

ఫొటో సోర్స్, Getty Images
6. థాచర్, మండేలా
4 జూలై 1990 - లండన్‌లో 10 డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్, ఏఎన్‌సీ(ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్) నాయకుడు నెల్సన్ మండేలాతో కరచాలనం చేశారు.
కానీ ఒకానొక సమయంలో ఏఎన్‌సీని ‘టిపికల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్’ అని థాచర్ అభివర్ణించారు.
1994లో మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవి చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
7. రబిన్, అరాఫాత్
13 సెప్టెంబర్ 1993 - ఓ అరుదైన కలయిక చోటుచేసుకున్న రోజది. పాలస్తీనియన్ నేత యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ ప్రధాని రబిన్ వాషింగ్టన్‌లో కలిసి ఓ కొత్త స్నేహానికి తెరతీశారు.
ఇజ్రాయెల్, పీఎల్‌ఓకి మధ్య జరిగిన మిడిల్ ఈస్ట్ శాంతి ఒప్పందంలో భాగంగా బిల్ క్లింటన్ సమక్షంలో వాళ్లు ఓస్లో ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
8. మెక్ గిన్నిస్, ఎలిజబెత్ II
27 జూన్ 2012 - ఉత్తర ఐర్లాండ్ పర్యటనలో భాగంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ II, నాటి రీజినల్ డెప్యూటీ ఫస్ట్ మినిస్టర్ మెక్ గిన్నిస్‌తో కరచాలనం చేశారు. ఆ షేక్ హ్యాండ్ కొన్ని సెకన్ల పాటే జరిగినా, చారిత్రకంగా దానికెంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
‘బ్రిటన్, ఐర్లాండ్ మధ్య, ముఖ్యంగా ఐరిష్ పౌరుల మధ్య ఓ కొత్త బంధానికి ఈ సమావేశం తెరతీస్తుంది’ అని మెక్ గిన్నిస్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
9. ఒబామా, క్యాస్ట్రో
21 మార్చి 2016 - క్యూబాలోని ది రివల్యూషన్ ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
వందేళ్ల కాలంలో ఆ కమ్యూనిస్టు దేశంలో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానే.
క్యూబా పైన అమెరికా విధించిన ఆర్థిక పరమైన ఆంక్షల్ని తొలగించాలని ఆ సమావేశంలోనే క్యాస్ట్రో ఒబామాకు నొక్కి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
10. శాంటోస్, టిమొచెంకో
23 జూన్ 2016 - కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్, గెరిల్లా ఎఫ్‌ఎఆర్‌సీ(రివల్యూషనరి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) నాయకుడు టిమొలిన్ జిమినెజ్(టిమోచెంకో)లు శాంతి ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
దాదాపు 52ఏళ్ల సాయుధ పోరాటానికి తెరదించడంలో ఈ ఒప్పందం సాయపడింది.
ఇవి కూడా చదవండి
- సింగపూర్ వీధుల్లో కాలినడకన తిరిగిన కిమ్
- ట్రంప్: 'అణు నిరాయుధీకరణతోనే ఆంక్షల ఎత్తివేత’
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
- రాహుల్ గాంధీకి తెలియని కోకా కోలా కథ
- అసలు ఎవరీ కిమ్?ఉత్తర కొరియా పాలకుడెలా అయ్యారు?
- ట్రంప్-కిమ్ సదస్సుపై ‘మినీ ఇండియా’ అభిప్రాయం ఇది
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








