హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?

అడాల్ఫ్ హిట్లర్

ఫొటో సోర్స్, AFP/Getty Images

    • రచయిత, మార్టిన్ వెన్నర్డ్
    • హోదా, బీబీసీ న్యూస్ కోసం

1945 మే 1న సాయంత్రం చీకటిపడుతోంది. కార్ల్ లెమన్ పశ్చిమ లండన్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని రీడింగ్ శివార్లలో తన టేబుల్ పై పని చేసుకుంటున్నారు.

సోవియట్ యూనియన్ దళాలు బెర్లిన్ సమీపిస్తున్నాయి. జర్మనీతో వారి యుద్ధం ఆఖరి దశకు చేరుకుంది.

24 ఏళ్ల అతడు జర్మన్ స్టేట్ రేడియో వార్తలు వింటున్నప్పుడు, శ్రోతలు ఇప్పుడు ఒక ముఖ్యమైన వార్తను వినబోతున్నారని అందులో ప్రకటించారు.

"గంభీరంగా ఉన్న సంగీతం వినిపించిన తర్వాత హిట్లర్ మరణించారని వారు చెప్పారు" అని కార్ల్ గుర్తు చేసుకున్నారు.

"బోల్షేవిజ్మ్‌లో పోరాడుతూ హిట్లర్ నేలకొరిగారని వారు ప్రకటించారు. ఆ వార్తను చాలా గంభీరంగా చెప్పారని" అన్నారు.

బీబీసీ కార్యాలయం
ఫొటో క్యాప్షన్, కావెర్షామ్ పార్క్‌లో ఉన్న బీబీసీ మానిటరింగ్‌లో వెయ్యి మంది పనిచేసేవారు. అందులో కార్ల్ ఒకరు
బీబీసీ కార్యాలయం
ఫొటో క్యాప్షన్, జర్మనీ మానిటరింగ్ బృందంలో ఎక్కువగా నాజీ హింసను తట్టుకోలేక పారిపోయి వచ్చిన యూదులు, సామ్యవాదులు, వ్యాపారులే ఉండేవారు

తొమ్మిదేళ్ల క్రితం యూదులను హింసించడం మరింత ఎక్కువ కావడంతో నాజీల నుంచి తప్పించుకోమని తమ్ముడు జార్జ్‌తో సహా ఆయన్ను తల్లిదండ్రులు జర్మనీ నుంచి బ్రిటన్ పంపించి వేశారు. వాళ్ల నాన్న జర్మనీకి చెందిన ఒక యూదు.

"నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. ఎందుకంటే తను (హిట్లర్) నా జీవితం నాశనం చేశాడు" అని కార్ల్ తెలిపారు.

రెండో ప్రపంచ యుద్ధం గురించి చెప్పడానికి స్థాపించిన బీబీసీ మానిటరింగ్‌లో కార్ల్ లేమాన్ పనిచేస్తుండేవారు.

ముఖ్యంగా జర్మనీ, దాని మిత్ర దేశాలు, వేరే దేశాల రేడియో ప్రసారాలను వినడం ఆయన పని. తర్వాత వాటిని అనువదించి ఆ సమాచారం బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేసేవారు.

"బ్రిటన్‌లో ఆ ప్రకటన విన్న మొదటి వాళ్లలో మేమూ ఉన్నాం’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

‘‘భవనంలోని వారంతా సంతోషంగా అరిచారు. అది ఎంత ముఖ్యమో మాకు తెలుసు. దాంతో జర్మనీకి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధం ముగిసింది. జర్మనీ అధికారికంగా లొంగిపోవడానికి మరో ఆరు రోజులు పట్టింది’’ అని కార్ల్ లేమాన్ తెలిపారు.

‘‘హిట్లర్ మరణించాడనే విషయంలో ఎలాంటి సందేహాలు లేకపోయినా, ఆయన ఆత్మహత్య చేసుకోవడం వల్లే మృతి చెందాడనేది తర్వాత తెలిసింది. నేలకొరగడం అంటే యుద్ధంలో మరణించాడని అర్థం-మేం ఒక పెద్ద అబద్ధం విన్నాం" అంటారు కార్ల్.

"హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని వాళ్లు ఒప్పుకోలేదు. ఎందుకంటే తక్షణం అంతా ముగిసిపోతుంది. కానీ జర్మన్లు వారే స్వయంగా తమ రేడియోలో హిట్లర్ చనిపోయాడని ప్రకటించారు. మనకు అందిన అధికారిక సమాచారం అదే.’’

‘‘హిట్లర్ తన వారసుడుగా గ్రాండ్ అడ్మిరల్ కార్ల్ డోనిట్జ్‌ను నియమించాడని కూడా ఆ న్యూస్ రీడర్ చెప్పారు’’ అని కార్ల్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.

హిట్లర్

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇవాతో హిట్లర్

హిట్లర్ పతనం 1945

15-16 ఏప్రిల్ - బెర్లిన్ నగరం తూర్పున ఉన్న జర్మనీ దళాలపై సోవియట్ దళాలు ఫిరంగి గుండ్లు కురిపించగానే, రాత్రికి రాత్రే ఆ నగరంపై ఆఖరి దాడులు ప్రారంభమయ్యాయి.

21 ఏప్రిల్ - రెడ్ ఆర్మీ బెర్లిన్ శివార్లలోకి ప్రవేశించింది. శివారు పట్టణాలన్నీ స్వాధీనం చేసుకుంది.

27 ఏప్రిల్ -జర్మనీలోని ఎల్బీ నది దగ్గర కలిసిన సోవియట్, అమెరికా దళాలు జర్మనీ సైన్యాన్ని రెండుగా విభజించడంలో విజయవంతం అయ్యాయి.

29 ఏప్రిల్ - రీచ్ చాన్సలరీ హెడ్ క్వార్టర్స్ కింద ఉన్న తన బంకర్లో హిట్లర్, ఇవా బ్రౌన్ పెళ్లి చేసుకున్నారు.

30 ఏప్రిల్ - హిట్లర్, ఆయన కొత్త భార్య ఆత్మహత్య చేసుకున్నారు, వారి మృతదేహాలను దహనం చేశారు.

1 మే - జర్మన్ రేడియో హిట్లర్ మరణించాడని ప్రకటించింది.

7 మే -బేషరతుగా లొంగిపోతానని జర్మనీ సంతకం చేసింది, ఐరోపాలో ఆరేళ్లు కొనసాగిన యుద్ధానికి తెరపడింది.

హిట్లర్ మరణించారని జర్మనీ చేసిన ప్రకటనను జర్మన్ మానిటరింగ్ టీమ్ సూపర్‌వైజర్ ఎర్నెస్ట్ గోంబ్రిచ్ వేగంగా అనువదించారు. ఈయనే ఆ తర్వాత ప్రముఖ చరిత్రకారుడిగా పేరు సంపాదించారు.

"గోంబ్రిచ్ ఈ వార్తను ఒక పేపరు ముక్కపై రాశారు. దాన్ని అర్థం చేసుకోవడం కష్టమైంది. ఎందుకంటే ఆయన వాటిని గజిబిజిగా రాశారు. ఆయన చేతి రాత భయంకరంగా ఉండేది" అని ఆయన మాజీ సహచరుడు చెప్పారు.

తర్వాత ప్రభుత్వానికి చెప్పడానికి ఎర్నెస్ట్ గోంబ్రిచ్ లండన్‌లోని కేబినెట్ ఆఫీసుకు ఫోన్ చేశారు. బీబీసీ న్యూస్ రూమ్స్‌కు కూడా సమాచారం అందింది. దాంతో ఆ వార్తను ప్రపంచమంతా ప్రసారం చేశారు.

ఇప్పుడు 97 ఏళ్ల వయసులో ఉన్న కార్ల్ ఆ వార్త విని దేశమంతా సంతోషించడం తనకు గుర్తుకొస్తోందని చెప్పారు.

హిట్లర్ మరణంతో ఆయన తిరిగి తన తల్లిదండ్రులను చూడగలిగారు. తన తండ్రి వాల్టర్ గోలోగ్నేలో ఒక హోల్ సేల్ మిల్లినెరీ వ్యాపారం చేసేవారు. ఇక మీదట అవి అమ్మకూడదని నాజీలు గట్టిగా చెప్పక ముందే ఆయన, తన భార్య ఎడిత్‌తో కలిసి జర్మనీ వదిలారు. చివరికి అమెరికా చేరారు.

హిట్లర్

ఫొటో సోర్స్, Karl Lehmann

ఫొటో క్యాప్షన్, చిన్నప్పటి కార్ల్ లెమన్ (ఎడమ నుంచి మూడో వ్యక్తి)

హిట్లర్ మరణించిన సమయంలో కావెర్షామ్ పార్క్‌లో ఉన్న బీబీసీ మానిటరింగ్‌లో వెయ్యి మంది పనిచేసేవారు. వారిలో డారిస్ పెన్నీ అనే సీనియర్ ఇటాలియన్ మానిటర్ కూడా ఉన్నారు. ఆమె ఆయన మొదటి భార్య అయ్యారు.

40 మంది ఉన్న ఆ జర్మన్ బృందంలో ఎక్కువ మంది నాజీ హింసను తట్టుకోలేక పారిపోయి వచ్చిన యూదులు, సామ్యవాదులు, వ్యాపారులే ఉండేవారు.

"తాము బలవంతంగా వలస వెళ్లేలా చేసిన హిట్లర్ మరణంతో వారంతా సంతోషించారు" అని కార్ల్ చెప్పారు.

నాజీ నియంత మరణంతో జర్మన్ మానిటర్స్ కచ్చితంగా ఊపిరి పీల్చుకున్నారు.

"హిట్లర్‌ను అనువదించడం చాలా కష్టం" అని కార్ల్ గుర్తుచేసుకుంటారు.

"ఆయన చేతిరాత ఘోరంగా ఉండేది. ఆయన జర్మన్ ప్రసంగాలను చదివినప్పుడు ఆకట్టుకునేలా ఉండవు. కానీ మాట్లాడుతుంటే మాత్రం అవి మరోలా ఉండేవి. ఆయన తన వాగ్ధాటిపైనే ఆధారపడ్డారు. ఇక నుంచి మాకు ఆయనవి అనువదించాల్సిన అవసరం లేదు" కార్ల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)