మే డే ఎలా మొదలైంది? కార్మిక దినోత్సవం చరిత్ర ఏమిటి?

ఫొటో సోర్స్, C. Nettleton/Hulton Archive/Getty Images
మే 1.. అంటే ‘మేడే’. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు.
చాలా దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు.
కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు.
ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి.
1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్.
ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది.
ఆపై ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP/Getty Images
1900 నుంచి 1920 వరకూ యూరప్‌లో ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు.
తరవాతి దశకాల్లో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగానూ జరుపుకునేవారు. ఇటలీలో ముస్సోలిని, స్పెయిన్‌లో జనరల్ ఫ్రాంకోలు మే డే పైన అనేక ఆంక్షలను విధించారు.
రెండో ప్రపంచ యుద్ధం తరవాత యూరొపియన్ దేశాల్లో మే1ని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారు. అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి రావడం మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
అటు సంక్షేమ పథకాల అమలుతో పాటు నిరసన కార్యక్రమాలకూ మే 1 వేదికగా మారింది. వేర్వేరు దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజునే మొదలయ్యాయి. అనేక ఇతర కార్మిక ఉద్యమాలూ మే డే నాడే ప్రాణం పోసుకున్నాయి.
భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ట్రేడ్ యూనియన్లు ఇదే రోజున ధర్నాలతో పాటు ర్యాలీలు, ఇతర ప్రదర్శనలనూ చేపడతాయి. కార్మికుల పని వాతావరణంతో పాటు వేతనాలూ మెరుగవ్వాలన్నది చాలాకాలంగా లేబర్ యూనియన్ల ప్రధాన డిమాండ్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
- గన్నవరం నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఎందుకు-
- ప్రజ్వల్ రేవణ్ణ ‘సెక్స్ వీడియో’ కేసు- దేవెగౌడ మనవడిపై ఫిర్యాదు చేసిన పనిమనిషి ఏం చెప్పారు-
- ‘వాంపైర్ ఫేషియల్’ వల్ల ముగ్గురు మహిళలకు హెచ్ఐవీ.. అసలేంటి ఈ ఫేషియల్-
- హిమాలయాల్లో 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ‘పాద ముద్రలు’.. ఇవి యతివేనా
- ముఖంపై ముసుగు ధరించడం ఏయే దేశాల్లో నిషిద్ధం?
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











