అంబేడ్కర్‌ గురించి పశ్చిమ దేశాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయి?

అంబేడ్కర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల అమెరికాలోని కొలరాడో, మిషిగన్ రాష్ట్రాలు ఏప్రిల్ 14ను 'డా. బీఆర్ అంబేడ్కర్ ఈక్విటీ (సమన్యాయం) డే'గా ప్రకటించాయి. అంతకు ముందు, కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ కూడా ఏప్రిల్‌ను దళిత్ హిస్టరీ మంత్ (దళితుల చరిత్ర మాసం)గా ప్రకటించింది.

భారత రాజ్యాంగ మూలకర్త అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన దళితులు, అణగారిన వర్గాల గౌరవం, హక్కుల కోసం కృషి చేశారన్న సంగతి మనకు తెలిసిందే. ఆయన కృషి ఫలితంగా భారతదేశంలో అట్టడుగు వర్గాలవారికి రిజర్వేషన్లు, వివక్ష వ్యతిరేక చట్టాలు ఏర్పడ్డాయి.

ఇప్పుడు దళిత ఉద్యమకారులు, విద్యావేత్తలు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారు పశ్చిమ దేశాల్లో కూడా దళితుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.

అంబేడ్కర్
ఫొటో క్యాప్షన్, అంబేడ్కర్

విదేశాలకూ విస్తరించిన కుల జాడ్యం

సాధారణంగా విదేశాల్లో భారతీయులకు "మోడల్ మైనారిటీలుగా" పేరుంది. ఏ దేశానికి వెళ్లినా సజావుగా, ఉత్సాహంగా అక్కడి ప్రజలతో కలిసిపోతారన్న కీర్తి ఉంది. కానీ, అక్కడ కూడా భారతీయుల మధ్య కుల వివక్ష విలసిల్లుతూనే ఉంది.

"ఒకసారి అంబేడ్కర్ ఏమన్నారంటే, 'హిందువులు వేరే దేశానికి వలస వెళితే, భారతీయుల కులం సమస్య ప్రపంచ సమస్యగా మారిపోతుంది.' ఇప్పుడు అమెరికాలో సరిగ్గా అదే జరుగుతోంది" అని అమెరికాలోని పౌర హక్కుల సంఘం 'అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌'కు చెందిన రామకృష్ణ భూపతి బీబీసీతో అన్నారు.

విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థల్లో అగ్రవర్ణ భారతీయులు చూపిస్తున్న వివక్ష బయటకు రావట్లేదని, దానిపై ఎవరూ దృష్టి పెట్టట్లేదని దళిత ఉద్యమకారులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు.

అయితే, గత కొన్నేళ్లల్లో ఈ రకమైన వివక్ష గురించి కూడా మాట్లాడడం పెరిగింది.

2020 సెప్టెంబర్‌లో ఎన్‌పీఆర్ నిర్వహించే రఫ్ ట్రాన్స్‌లేషన్ షోలో ఒక టెక్ ఉద్యోగి సామ్ కార్నెలియస్ అనే మారుపేరుతో ఇలాంటి వివక్ష గురించి మాట్లాడారు. తాను జంధ్యం వేసుకున్నానో లేదో పరిశీలించడానికి సహోద్యోగులు వీపు మీద తడుతూ మాట్లాడతారని చెప్పారు. జంధ్యం సాధారణంగా బ్రాహ్మణులు వేసుకుంటారు.

"స్విమ్మింగ్ చేద్దాం రమ్మని పిలుస్తారు. 'హేయ్ ఈత కొడదాం రా' అంటారు. ఎందుకంటే, ఈత కొట్టడానికి చొక్కా తీసేయాలి కదా. అప్పుడు ఎవరెవరు జంధ్యాలు వేసుకున్నారో సులువుగా తెలిసిపోతుంది" అని ఆయన ఆ షోలో చెప్పారు.

అదే విధంగా, యూనివర్సిటీల్లో జరిగే పార్టీల్లో భారతీయులు ఒకరినొకరు కులాలు అడిగి తెలుసుకుంటారని చెబుతూ మరికొందరు భయన్ని, అసౌకర్యాన్ని వ్యక్తం చేశారు.

అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఉద్యమకారుల కృషి, ఆన్‌లైన్, సోషల్ మీడియా కొంతవరకు "సురక్షితమైన" వేదికగా మారడం వలన ఈమధ్య కాలంలో ఇలాంటి కులవివక్షలు ఎక్కువగా వెలుగులోకొస్తున్నాయి.

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్, బ్రయోన్నా టేలర్ హత్యల తరువాత బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. దాని ప్రభావం కూడా కొంత ఉందని మైనేలోని కోల్బీ కాలేజీలో రిజర్వేషన్ల కోసం పోరాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సోంజా థామస్ అన్నారు.

తమ సొంత కమ్యూనిటీలలో నల్లజాతీయుల పట్ల వివక్షను, కులవివక్ష ద్వారా వివరించేందుకు దక్షిణాసియా అమెరికన్లు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.

గత దశాబ్దకాలంలో అగ్రవర్ణాలలో కూడా ప్రధానంగా మార్పు వచ్చిందని, చారిత్రకంగా తమకు లభించిన కులాధిపత్యం సమస్యలతో పెనుగులాడుతున్నారని సోంజా థామస్ అన్నారు.

"మా ముందుతరాల వాళ్లు ఒక చిన్న సూట్ కేసు, జేబులో కొన్ని డాలర్లతో ఇక్కడకు ఎలా చేరారో, ఎంత కష్టపడ్డారో కథలుగా విన్నాం. అయితే, తరాలుగా భారతదేశంలో పాతుకుపోయిన కులాధిపత్యం వాళ్లు ఇక్కడకు రావడానికి మార్గం వేసిందని, వారు, వారి పిల్లలు ఇక్కడ రాణించడానికి దోహదపడిందన్న అవగాహన మాత్రం ఎవరికీ లేదు" అని డాక్యుమెంటరీ చిత్రనిర్మాత కవితా పిళ్ళై అన్నారు. పులిట్జర్ సెంటర్ నిధులు సమకూర్చిన 'కాస్ట్ ఇన్ అమెరికా సిరీస్‌'లో కవితా ఈ వ్యాఖ్యలు చేశారు.

కుల వివక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుల వివక్ష చూపిస్తున్నారంటూ సిస్కో ఉద్యోగులపై 2020లో కేసు నమోదైంది.

సిలికాన్ వ్యాలీలోనూ కులవివక్ష

అమెరికాలో కులవివక్ష వెలుగులోకి రావడానికి 2020లో జరిగిన ఒక సంఘటన కీలకమని ఉద్యమకారులు అంటారు. కాలిఫోర్నియాలోని ఐటీ సంస్థ సిస్కోలో ఇద్దరు అగ్రవర్ణ భారతీయులు ఒక దళిత సహోద్యోగిపై వేధింపులు, వివక్షకు పాల్పడ్డారంటూ 2020లో వారిపై కేసు వేశారు.

కులవివక్షను వెలుగులోకి తేవడానికి "అప్పటికే జరుగుతున్న ప్రయత్నాలకు ఈ కేసు విశ్వసనీయతను సమకూర్చించింది" అని అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (ఏఏఎన్ఏ) బీబీసీతో చెప్పింది.

సిస్కో కేసు పబ్లిక్‌లోకి రాగానే, దళిత హక్కుల సంస్థ 'ఈక్వాలిటీ ల్యాబ్స్'కు కులం ఆధారంగా జరుగుతున్న వేధింపులు, వివక్షపై అనేక రిపోర్టులు వచ్చాయి. గూగుల్, ఫేస్‌బుక్, ఏపిల్ సహా వివిధ సిలికాన్ వ్యాలీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల దగ్గర నుంచి 250కి పైగా రిపోర్టులు వచ్చాయి.

గూగుల్ మాతృ సంస్థ 'ఆల్ఫాబెట్ ' వర్కర్స్ యూనియన్ నుంచి సిస్కో కేసుకు మద్దతు లభించింది.

"మన దేశానికి వెలుపల ఉన్న ఒక అమెరికన్ సంస్థ కులవివక్షను పౌర హక్కుల సమస్యగా పరిగణించడం, దీనిపై ప్రభుత్వ వ్యాజ్యం అవసరమని గుర్తించడం అదే తొలిసారి" అని ఈక్విటీ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు తేన్మొళి సౌందరరాజన్ బీబీసీతో చెప్పారు.

2021లో, హిందూ సంస్థ బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్) వివిధ ప్రాంతాలలో దేవాలయాలను నిర్మించే క్రమంలో దళితుల కార్మికులకు కనీస వేతనం కన్నా తక్కువ ఇస్తూ దోపిడీకి పాల్పడిందని మరో కోర్టులో కేసు నమోదైంది.

అదే ఏడాది కాలిఫోర్నియా యూనివర్సిటీ, డేవిస్, కాల్బీ కాలేజ్, హార్వర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా డెమోక్రటిక్ పార్టీ తమ విధానాలలో కుల వివక్షకు వ్యతిరేకంగా రక్షణ వ్యవస్థను జోడించాయి.

అదే విధంగా, 2022 జనవరిలో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ తమ విధానాలలో, రక్షణ కల్పించాల్సిన విభాగాల్లో కులాన్ని చేర్చడం ఒక మైలురాయి. అమెరికాలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి, అతిపెద్ద యూనివర్సిటీ ఇదే.

కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన ప్రచారానికి ఆ రాష్ట్రంలోని ప్రధాన కార్మిక సంఘాలన్నీ మద్దతిచ్చాయి. కుల వివక్షను కార్మిక హక్కుల సమస్యగా ఈ ప్రచారం హైలైట్ చేసింది.

ఇది, అమెరికాలో కులవివక్ష అంశాన్ని మలుపు తిప్పిన సంఘటన (గేమ్‌ఛేంజర్) అని సౌందరరాజన్ అన్నారు.

అమెరికాలో కార్మిక సంఘాల నుంచి వచ్చిన సంఘీభావం అంతర్జాతీయ స్థాయిలో కుల అసమానతలపై మరింత చర్చకు దారితీయగలదని ఆమె ఆశిస్తున్నారు.

కులం, వివక్షం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రేమ్ పరియార్

అమెరికన్లకు కులవ్యవస్థ గురించి వివరించడం అంటే..

"జాతివివక్ష ప్రధానంగా శరీరం రంగుపై ఆధారపడి ఉంటుంది. కానీ కులవివక్ష అలా కాదు. ఇది చాలా సంక్లిష్టమైనది. పుట్టుకతో కులం తోడవుతుంది. నిచ్చెనమెట్ల హిందూ వ్యవస్థలో మీ స్థానాన్ని నిర్ణయిస్తుంది. దీన్ని అమెరికన్లను వివరించడం అంత సులువు కాదు" అని భూపతి అభిప్రాయపడ్డారు.

కుల వ్యవస్థను వివరించడానికి "కులం ఎముక, జాతి చర్మం" అని ఇసాబెల్ విల్కర్సన్ రాసిన పుస్తకంలో వాక్యాలను తోడు తెచ్చుకుంటూ ఉంటానని ప్రేమ్ పరియార్ చెప్పారు. నేపాలీ మూలాలున్న ప్రేమ్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ పాలసీ ఛేంజ్ ప్రధాన నిర్వాహకుడుగా వ్యవహరిస్తున్నారు.

2020లో వచ్చిన పుస్తకం 'క్యాస్ట్: ది ఆరిజన్స్ ఆఫ్ అవర్ డిస్‌కంటెంట్స్'లో కులం, జాతి చరిత్రలను పరిశీలిస్తూ, రెండిటినీ పోల్చి రాశారు ఇసాబెల్ విల్కర్సన్.

అమెరికా ప్రధాన స్రవంతిలో కుల వివక్షను గుర్తించడానికి ఇది సహాయపడిందని పరియార్ అభిప్రాయపడ్దారు.

నేపాల్ నుంచి అమెరికా వెళ్లిన ప్రేమ్ పరియార్‌కు అక్కడా కుల వివక్ష ఎదురైంది. అయితే, ఆయన అనుభవాలను అక్కడి అగ్రవర్ణాల అధ్యాపకులు చిన్నచూపు చూశారు. కుల వివక్ష "భారతదేశానికి సంబంధించిన సమస్య" అని, అమెరికాలో దాని గురించి చర్చ ఎందుకు? అంటూ నిర్లక్ష్యం చేశారు.

కుల వివక్ష ఉందని అంగీకరించడం పట్ల విముఖత అగ్రవర్ణాలకు కొత్తేం కాదని థామస్ అన్నారు. క్రిస్టియానిటీలో కులం, జెండర్ వివక్షలపై ఆమె పనిచేస్తున్నారు.

"ప్రివిలేజ్ (ఆధిపత్యం/ప్రత్యేకత) అనే పదం వాడడానికి వాళ్లు భయపడతారు. ఎందుకంటే అమెరికా సమాజంలో వారికి దక్కిన స్థానం వారు సంపాదించుకున్నది కాదని, ప్రివిలేజ్ వల్లే వచ్చినదని అనుకునే ప్రమాదం ఉందని భావిస్తారు. అమెరికాలో హిందూ, ముస్లింల లాగ దక్షిణాసియా ప్రజలు కూడా మైనారిటీలే" అంటూ ఆమె వివరించారు.

అయితే, కులం అనేది హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదని, దక్షిణాసియా మతాలన్నింటిలో ఈ అసమానత ఉందని హార్వర్డ్‌లోని ఆంత్రోపాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ అజంతా సుబ్రమణియం ఈ సంవత్సరం ప్రారంభంలో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీకి రాసిన ఒక లేఖలో ప్రస్తావించారు.

"కానీ, అణగారిన వర్గాల్లో కూడా చాలామంది హిందువులే" అని ఆమె రాశారు.

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్ దళిత జనోద్ధారకుడు, రాజ్యాంగ నిర్మాత... అంతేనా?

రైట్ వింగ్ హిందుత్వ సమూహాల నుంచి సవాళ్లు

అమెరికాలో ఇలాంటి హక్కుల ఉద్యమాలు సాధించిన విజయాలకు సాధారణంగా హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) వంటి అతివాద భారతీయ అమెరికన్ గ్రూపుల నుంచి సవాళ్లు ఎదురవుతుంటాయి.

కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ పాలసీని, సిస్కో కేసును ఈ సంస్థ వ్యతిరేకించింది. అది "వివక్ష" అని, "హిందూ అమెరికన్ల హక్కుల" ఉల్లంఘన అనిపేర్కొంది.

"భారతీయులు అంటే హిందువులని, హిందువులంటే భారతీయులనే" భావనను సొంతం చేసుకోవడానికి భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సిద్ధంగా ఉందని వర్గీస్ కే జార్జ్ తన పుస్తకం 'ఓపెన్ ఎంబ్రాస్'లో రాశారు.

ప్రస్తుతం భారతదేశంలో పాలక ప్రభుత్వం, కులాన్ని విస్మరిస్తూ అఖిల భారత హిందూ గుర్తింపును ప్రోత్సహిస్తున్న అజెండా వలన ఈ భావన వ్యాప్తి చెందడం సులభమైంది.

ప్రధాని నరేంద్ర మోదీ కోసం లాబీయింగ్ చేసిన అనేక భారతీయ-అమెరికన్ సంస్థలలో హెచ్‌ఎఫ్ కూడా ఒకటి. ఇలాంటి సంస్థలను మోదీ "వ్యూహాత్మక ఆస్తులుగా" పేర్కొన్నారు.

భారతదేశంలో బీజేపీ ఎదుగుదలతో ఇలాంటి సమూహాలకు మరింత అండ చేకూరిందని, అమెరికాలో విధానపరమైన మార్పుల విషయంలో లాబీయింగ్ చేయడానికి, చట్టపరమైన ప్రయత్నాలను విస్తరించుకోవడానికి అవకాశం కుదిరిందని భూపతి అన్నారు.

అంతర్జాతీయ పౌర, మానవ హక్కులపరంగా కుల సమానత్వం సాధించడం ఒక ముఖ్యమైన, అత్యవసరమైన హద్దు అని సౌందరరాజన్ అన్నారు.

"కులవివక్ష బారిన పడ్డవారు సంస్థల విధానాలలో మార్పులు తెస్తూ, అవి అందరికీ సమాన హక్కులు కల్పించే వేదికలుగా ఎదగడానికి తోడ్పడాలని మేం కోరుకుంటున్నాం" అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, ఈ కులం ఏంటి? ఈ మతం ఏంటి? వీటిని వదిలేసుకుంటే పోలా.. అని మీకెప్పుడైనా అనిపించిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)