యుక్రెయిన్ యుద్ధంపై కలసికట్టుగా ఉన్న పాశ్చాత్య దేశాలు విడిపోతే ఏం జరుగుతుంది? - మీరు తెలుసుకోవాల్సిన 5 అంశాలు

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ లాండలే
    • హోదా, డిప్లమాటిక్ కరస్పాండెంట్

యుక్రెయిన్‌పై రష్యా దాడి పాశ్చాత్య దేశాలను ఏకం చేసింది. ఈ వివాదం వరకు ఆ దేశాలన్నీ ఐకమత్యంతో కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నాయి. అయితే, వివాదం తదుపరి దశకు చేరుకున్నప్పుడు కూడా వీటి ఐక్యత కొనసాగుతుందా? లేక పాశ్చాత్య దేశాలు విడిపోయే పరిస్థితులు వస్తాయా?

పాశ్చాత్య కూటమిని విడదీయగల అయిదు ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.

యుద్ధ లక్ష్యాలు

యుక్రెయిన్ యుద్ధానికి ముందు, ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలు తమ లక్ష్యాలు, భవిష్యత్తు పట్ల అనిశ్చితితో ఉన్నట్లు కొన్నిసార్లు కనిపించాయి. కొన్ని దేశాలు తమ పొత్తులను ప్రశ్నించగా, మరి కొన్ని దేశాలు జాతీయవాద భావాలకు తలొగ్గాయి.

అయితే, యుక్రెయిన్ యుద్ధం పాశ్చాత్య కూటమికి వాటి ప్రాధాన్యాలను గుర్తు చేసింది. అవి వేటికి ప్రాతినిధ్యం వహిస్తాయో గుర్తు చేసింది. ఆ అంశాలు.. స్వేచ్ఛ, సార్వభౌమాధికారం, చట్ట పాలన. అందుకే అవన్నీ రష్యా దాడిపై ఉమ్మడిగా స్పందించాయి.

మరోవైపు, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సహా పలువురు దౌత్యం నెరపుతున్నప్పటికీ, ఈ యుద్ధం మరి కొంతకాలం కొనసాగవచ్చు.

పాశ్చాత్య కూటమిలో యుద్ధం పట్ల ఏకాభిప్రాయం పతాక స్థాయికి చేరుకుందని మనం భావించవచ్చా? ఈ ఐక్యత కొనసాగుతుందని అనుకోవచ్చా?

అదే స్థాయిలో కలసికట్టుగా ఎక్కువ కాలం నిలబడడం పశ్చిమ దేశాలకు అంత సులభం కాకపోవచ్చు. ఈ ఐక్యతను భంగపరచగలిగే కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు వాటి ముందున్నాయి.

యుద్ధ లక్ష్యాల పట్ల ముఖ్యమైన ఆందోళనలు తలెత్తవచ్చు. ప్రస్తుతానికి, పాశ్చాత్య కూటమి యుక్రెయిన్‌కు అండగా ఉంది. ఆ దేశానికి ఆర్థికంగా, మిలటరీ పరంగా సహాయం, మద్దతు అందిస్తున్నాయి.

కానీ, దీర్ఘకాలిక లక్ష్యం ఏమిటి? యుద్ధం ముగియాలి.. అందరికీ కావలసింది ఇదే. దానికి రష్యా ఓడిపోవాలా? యుక్రెయిన్ గెలవాలా? వాస్తవంలో గెలుపు, ఓటమి అంటే ఏమిటి? అవి ఎలా కనిపిస్తాయి?

గత వారం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ఎంపీలను ఉద్దేశిస్తూ, "వ్లాదిమిర్ పుతిన్ ఓడిపోవడానికి, సమగ్రంగా విఫలమవ్వడానికి మనం సమిష్టిగా చేయగలిగినదంతా చేయాలి" అని అన్నారు.

కానీ, "ఓటమి" అంటే ఏమిటి? జాన్సన్ అది చెప్పలేదు. మాస్కోలో ప్రభుత్వం మారాలని తాము కోరుకోవట్లేదని మాత్రం చెప్పారు.

"ఇది చాలా ముఖ్యం.. రష్యా అధ్యక్షుడిని తొలగించడం లేదా రష్యా రాజకీయాలను మార్చడం మన లక్ష్యం కాకూడదు. మన లక్ష్యం కేవలం యుక్రెయిన్ ప్రజలను రక్షించడమే. పుతిన్ దీన్ని తనకు, పశ్చిమ దేశాలకు మధ్య పోరాటంగా చిత్రీకరించవచ్చు. దాన్ని మనం అంగీకరించలేం" అని ఆయన స్పష్టం చేశారు.

ఈ విషయంలో అమెరికా మరో అడుగు ముందుకు ఉందనే చెప్పాలి. రష్యా దళాలను ఓడించడం ఒక్కటే సరిపోదని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సూచించారు.

"రష్యా బలహీనపడడం చూడాలి. యుక్రెయిన్‌పై దాడి లాంటి పనులు మళ్లీ తలపెట్టలేని స్థాయికి బలహీనపడాలి" అని ఆయన అన్నారు.

దానర్థం రష్యా రక్షణ రంగంపై ఆంక్షలు విధించడం కావచ్చు. లేదా రష్యా దళాలను గణనీయంగా దెబ్బతీసేందుకు యుక్రెయిన్‌కు అందించే సహాయం కావచ్చు. ఏది ఏమైనా, పాశ్చాత్త దేశాలన్నీ ఇదే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పలేం. పశ్చిమ దేశాలు రష్యా అస్తిత్వానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయని పుతిన్ ఆరోపిస్తారనే భయం అందుకు కొంత కారణం కావచ్చు.

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్‌కు మిలటరీ సహాయం

యుక్రెయిన్‌కు సైన్యపరమైన సహాయం అందించడంలో పాశ్చాత్య కూటమి చాలావరకు సమిష్టిగానే ఉంది. ఏవో కొన్ని దేశాలు మాత్రమే భారీ ఆయుధాలను సరఫరా చేయడానికి నిరాకరించాయి. వాటివల్ల రక్తపాతం పెరుగుతుందని భావించడమే అందుకు కారణం. మిగతా దేశాలన్నీ మందుగుండు సామాగ్రి, శక్తిమంతమైన ఆయుధాల సరఫరాను పెంచుతూనే ఉన్నాయి.

బ్రిటన్ డిఫెన్స్ సెలెక్ట్ కమిటీ చైర్మన్ టోబియాస్ ఎల్‌వుడ్, యుక్రెయిన్‌కు బ్రిటన్ ఆయుధాల సరఫరా పెంచాలని కోరారు.

"యుక్రెయిన్ ఓడిపోకుండా ఉండడానికి కావలసినదంతా చేస్తున్నాం. కానీ, గెలవడానికి సరిపడా చేయట్లేదు. రక్షించుకోవడానికే కాక యుద్ధంలో గెలవడానికి యుక్రెయిన్‌కు సహాయపడాలి" అని ఆయన బీబీసీ రేడియో 4 టుడే ప్రోగ్రాంలో చెప్పారు.

ఇక్కడ ఆయన ముగింపుకు ఎలాంటి మార్గాన్ని సూచించారన్నది గమనార్హం.

అయితే, కొన్ని పశ్చిమ దేశాలు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండకపోవచ్చు. యుక్రెయిన్‌కు సహాయం అందిస్తూ పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రేరేపించడం వలన పుతిన్‌ను రెచ్చగొట్టినట్టు అవుతుందని భయపడుతూ ఉండవచ్చు. ఫలితంగా పుతిన్, ఇతర పశ్చిమ దేశాలను లక్ష్యంగా చేసుకోవచ్చని, సైబర్ అటాక్‌లకు పాల్పడవచ్చని లేదా భారీ విధ్వంసాలు లక్ష్యంగా ఆయుధాలు ప్రయోగించవచ్చని ఆందోళన చెందుతూ ఉండవచ్చు.

ఈ నేపథ్యంలో, సోమవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ, "అణు యుద్ధం ముప్పును తక్కువ అంచనా వేయకూడదు" అనడం గమనార్హం.

వీడియో క్యాప్షన్, 2,000 కి.మీ. కఠిన ప్రయాణం చేసిన యుక్రెయిన్ యువతి కథ

రాజకీయ పరిష్కారానికి మద్దతు

ఏదో ఒక సమయంలో సైనిక ప్రతిష్టంభన ఏర్పడవచ్చు. అలాగే, రాజకీయ పరిష్కారం కోసం ఒత్తిడి పెరగవచ్చు. యుక్రెయిన్ ఏం చేసినా పశ్చిమ దేశాలు మద్దతిస్తాయని భావించడం అత్యాశ కావచ్చు. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే?

యుక్రెయిన్ శాంతి స్థాపనకు పాటుపడాలని కొన్ని దేశాలు ఒత్తిడి తెస్తే? యుక్రెయిన్‌కు మిలటరీ సహాయాన్ని తగ్గిస్తే? కానీ, అందుకు భిన్నంగా కీయెవ్‌లో ప్రభుత్వం యుద్ధానికే మొగ్గు చూపుతుంటే, పరిస్థితులు ఎలా మారుతాయి?

లేదా యుక్రెయిన్ రాజకీయ పరిష్కారానికి ఒప్పుకుని, పశ్చిమ దేశాలు అందుకు వ్యతిరేకిస్తే? కొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలను ఎత్తివేసేందుకు నిరాకరించి, శాంతి ఒప్పందానికి గండి కొడితే?

యుక్రెయిన్ విషయంలో ఏ విధమైన రాజకీయ పరిష్కారాన్ని అంగీకరించాలనే దానిపై పాశ్చాత్త దేశాల నాయకుల మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది.

రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలపై తిరిగి పట్టు సాధించడం ప్రాధాన్యం అవుతుందా లేక యుద్ధం ముగిసిన తరువాత మిగిలిన యుక్రెయిన్ భూభాగంలో భద్రత, సమగ్రతలను సాధించడానికి ప్రాధాన్యం ఇస్తారా?

పశ్చిమ దేశాలకు చెందిన ఒక ఉన్నత అధికారి ఇలాంటి ఆందోళనలనే వెల్లడించారు.

"పుతిన్ బలం ఉపయోగించి యుక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని కుదించడంలో విజయం సాధించడాన్ని అంగీకరించలేం" అని ఆయన అన్నారు.

అలాగే, "యుక్రెయిన్ సార్వభౌమాధికారంగా, స్వతంత్ర దేశంగా విజయం సాధించడమే మా దీర్ఘకాలిక లక్ష్యం" అని కూడా అన్నారు.

అయితే, ఈ రెండు లక్ష్యాలు ఒకటే కాకపోవచ్చు.

రాజకీయ పరిష్కారంలో ఒక నిర్ణయానికి రావడం అంత సులువుగా కనిపించట్లేదు. ఈ విషయంపై ఒక అంగీకారానికి రావడం దేశాలకు క్లిష్టం కావచ్చు.

2022 ఫిబ్రవరికు ముందు యుక్రెయిన్ ఎలా ఉందో అలాగే విడిచిపెట్టి రష్యా దళాలు వెనక్కు మరలాలని డిమాండ్ చేయాలా? లేక రష్యా స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతలను విడిచిపెట్టమని కోరాలా? ఇవన్నీ కఠినమైన నిర్ణయాలు.

ఈ రెండూ సరిపోవంటున్నారు బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్.

"ఫిబ్రవరికి ముందు ఉన్నట్టు విడిచిపెట్టి వెళ్లిపోతే చాలదు. పుతిన్ అక్రమంగా క్రిమియాను, దోన్యస్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన అంతర్జాతీయ చట్టాన్ని అంగీకరించాలి. దీర్ఘకాలంలో యుక్రెయిన్‌ను పూర్తిగా విడిచిపెట్టాలి" అని ఆయన ఎంపీలతో అన్నారు.

అయితే, ఇతర పశ్చిమ దేశాలు ఈ అభిప్రాయంతో అంగీకరించకపోవచ్చు.

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

రష్యాపై ఇంధన ఆంక్షలు

పశ్చిమ దేశాలు ఆంక్షలపై ఎక్కువగా ఆధారపడవచ్చు. ప్రస్తుతానికి, రష్యాపై ఆంక్షల విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నా ఫరవాలేదన్నది ఒప్పందం. ముఖ్యంగా చమురు, గ్యాస్ ఎగుమతులపై ఆంక్షలు పెంచాలా వద్దా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

రష్యా ఇంధన ఎగుమతులపై ఆధారపడిన దేశాలు, అవి లేకపోతే తమ ఆర్థిక వ్యవస్థలు కుంటుపడతాయని భావిస్తున్నాయి. అయితే, యుద్ధం మరి కొంత కాలం కొనసాగితే, దాని ప్రతికూల ప్రభావాలు కూడా ఈ దేశాలపై పడవచ్చు.

కొన్ని దేశాలు ప్రతిష్టంభనను అంతం చేయడానికి మాస్కోపై ఆంక్షలను పెంచాలని కోరుకోవచ్చు.

యుక్రెయిన్ భవిష్యత్తు

యుక్రెయిన్ దీర్ఘకాలిక భవిష్యత్తుపై కూడా పాశ్చాత్య దేశాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ యుక్రెయిన్‌లోనే అంతర్గతంగా విభజనలు వస్తే? కొంతమంది యుద్ధాన్ని కొనసాగించాలని కోరుకుని, మరి కొంతమంది శాంతి ఒప్పందానికి మొగ్గు చూపితే? పశ్చిమ దేశాలు ఎవరి పక్షం వహిస్తాయి?

యుక్రెయిన్‌లో విభజనలు ఎంత తీవ్రంగా ఉండవచ్చు? అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 1992లో ఐర్లాండ్‌లో వచ్చిన విభజనలతో పోల్చి చూస్తూ, అదే పరిస్థితి యుక్రెయిన్‌లో రావచ్చని ఊహిస్తున్నారు.

రానున్న రోజుల్లో యుక్రెయిన్ విధానాలను పశ్చిమ దేశాలు అంగీకరించకపోతే?

భవిష్యత్తు భద్రత కోసం యుక్రెయిన్ అణ్వాయుధాలను తయారుచేసుకునే ప్రయత్నాలు చేయవచ్చని రష్యాపై నిపుణులు, అమెరికా జాతీయ భద్రతా మండలి మాజీ అధికారి ఫియోనా హిల్ సూచించారు.

"పుతిన్ అణ్వాయుధాల ప్రస్తావన ఎంత ఎక్కువగా తెస్తే, అంత ఎక్కువగా యుక్రెయిన్ లాంటి దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది. అణ్వాయుధాలను పొందడమే నిజమైన రక్షణ మార్గంగా భావించే అవకాశం ఉంది" అని ఛేంజింగ్ యూరప్ థింక్ ట్యాంక్‌ సెమినార్‌లో ఆమె అన్నారు.

అటువంటి పరిస్థితులలో, పశ్చిమ దేశాలు యుక్రెయిన్‌కు సంప్రదాయ ఆయుధాలను అందించడానికి సిద్ధంగా ఉంటాయా? లేదా యూరోపియన్ యూనియన్‌లో ఆ దేశ సభ్యత్వాన్ని పరిగణిస్తాయా?

ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వివాదాల విషయంలో విధానాలు స్థిరంగా ఉండవు. భవిష్యత్తులో కూడా పశ్చిమ దేశాలు ఒక్క తాటిపై నిలబడతాయని అంచనా వేయడం సరికాకపోవచ్చు.

వీడియో క్యాప్షన్, నడిరోడ్లపై రష్యా సైనికుల అత్యాచారాలు... యుక్రెయిన్ మహిళల ఆరోపణ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)