యుక్రెయిన్, రష్యా యుద్ధం: దోన్బస్‌పై పుతిన్ ఎందుకు కన్నేశారు? తూర్పు ప్రాంతాన్ని రష్యా ఎందుకు చుట్టుముడుతోంది?

రష్యా బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పాల్ కిర్బీ
    • హోదా, బీబీసీ న్యూస్

యుక్రెయిన్ మీద సైనిక దాడి చేస్తున్న రష్యా.. ఆ దేశ రాజధాని కీయెవ్ నుంచి సైనిక బలగాలను వెనక్కు మళ్లించిన అనంతరం యుద్ధాన్ని ప్రధానంగా తూర్పు యుక్రెయిన్ మీద కేంద్రీకరిస్తోంది.

దోన్బస్ అని పిలిచే ఈ ప్రాంతం కోసం పోరాటం మొదలైందని.. ఇందులో రష్యా సైన్యం పెద్ద ఎత్తున పాల్గొంటోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ చెప్పారు.

యుక్రెయిన్‌కు ఒకప్పటి పారిశ్రామిక కేంద్రమైన ఈ దోన్బస్ ప్రాంతాన్ని ‘విముక్తి’ చేయాలన్న తన లక్ష్యంలో విజయం సాధించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించుకోవాలంటే ఆయనకు ఏం కావాలి? అసలు అది సాధ్యమేనా?

యుక్రెయిన్‌ తన సుశిక్షత సైనిక బలగాలను ఇప్పటికే తూర్పు ప్రాంతంలో మోహరించింది. రష్యా మద్దతున్న వేర్పాటువాదులతో ఎనిమిదేళ్లుగా ఈ బలగాలు పోరాడుతున్నాయి. ఆ బలగాలు ఇప్పుడు భారీగా దెబ్బతిన్నాయని, అయినప్పటికీ రష్యా సైన్యానికి పెద్ద సవాలుగానే ఉన్నాయని భావిస్తున్నారు.

రష్యా బలగాలు తూర్పు ప్రాంతంలో ఇప్పటికే మానవతా సంక్షోభాన్ని రగిల్చాయి. కానీ రేవు నగరమైన మరియుపోల్‌ను ఇంకా తన ఆధీనంలోకి తెచ్చుకోలేదు. ‘‘మా భూమిలో ప్రతి మీటరు కోసం మేం పోరాడుతాం’’ అని జెలియెన్‌స్కీ చెప్పారు. రష్యా కొత్తగా మొదలుపెట్టిన దాడి సుదీర్ఘ ఘర్షణగా మారవచ్చు.

Donbas map

యుక్రెయిన్‌లోని దోన్బస్ ప్రాంతం ఏమిటి?

రష్యా అధ్యక్షుడు పుతిన్ దోన్బస్ గురించి మాట్లాడుతున్నపుడు.. ఆయన చెప్తున్నది యుక్రెయిన్‌లోని పాత బొగ్గు గనులు, ఉక్కు ఉత్పత్తి ప్రాంతం గురించి. యుక్రెయిన్ తూర్పు భాగంలో.. దక్షిణాన మరియుపోల్ శివార్ల నుంచి ఉత్తరాన దేశసరిహద్దు వరకూ ఉండే లూహాన్స్క్, దోన్యస్క్ అనే రెండు పెద్ద ప్రాంతాల గురించి ఆయన ఉటంకిస్తున్నారు.

‘‘కీలక విషయం ఏమిటంటే.. ఈ ప్రాంతాన్ని రష్యన్ భాష మాట్లాడే ప్రాంతంగా.. యుక్రెయిన్ కన్నా రష్యాకే అది సాంస్కృతికంగా, సామాజికంగా దగ్గరైనదని రష్యా గుర్తించింది’’ అని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సామ్ క్రానీ ఎవాన్స్ పేర్కొన్నారు.

ఈ ప్రాంతాల్లో రష్యన్ మాట్లాడేవాళ్లు అధికంగా ఉండొచ్చు. కానీ అవిప్పుడు రష్యా అనుకూల ప్రాంతాలు కాదు.

‘‘యుక్రెయిన్‌లో రష్యాకు అత్యంత అనుకూలంగా ఉండే నగరాల్లో యురియుపోల్ ఒకటి. దానిని నేలమట్టం చేయటం నాకు ఏమాత్రం అర్థంకాలేదు’’ అంటారు రక్షణ రంగ నిపుణుడు, రోచన్ కన్సల్టింగ్ అధినేత కోనార్డ్ ముజికా.

యుద్ధం మొదలైన నెల రోజుల తర్వాత.. లూహాస్క్స్‌లో 93 శాతం ప్రాంతాన్ని, దోన్యస్క్స్‌లో 54 శాతం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు రష్యా ప్రకటించుకుంది.

ఈ మొత్తం ప్రాంతాన్ని లోబరుచుకోవటానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా చాలా దూరంలో ఉన్నారు. ఒకవేళ ఆయన విజయం ప్రకటించుకోగలిగినప్పటికీ.. ఇది చాలా విస్తారమైన ప్రాంతం. దీనిని నియంత్రించటం కష్టమవుతుంది.

తూర్పున సుదూర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో క్రమటోర్క్స్ స్టేషన్ ఒకటి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, తూర్పున సుదూర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో క్రమటోర్క్స్ స్టేషన్ ఒకటి

దోన్బస్‌ కావాలని పుతిన్ ఎందుకు కోరుకుంటున్నారు?

యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో జాతిహననానికి పాల్పడిందని పుతిన్ పదేపదే నిరాధార ఆరోపణలు చేశారు.

యుద్ధం మొదలైనప్పుడు తూర్పు ప్రాంతాల్లోని మూడింట రెండువంతుల భాగం యుక్రెయిన్ చేతుల్లో ఉంది. మిగతా భాగం.. ఎనిమిదేళ్ల కిందట మొదలైన యుద్ధ కాలంలో రష్యా మద్దతు గల చిన్న దేశాలుగా ఏర్పడి, రష్యా ప్రచ్ఛన్న ప్రతినిధుల నిర్వహణలో ఉన్నాయి.

తాజా యుద్ధానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ రెండు తూర్పు యుక్రెయిన్ ప్రాంతాలను యుక్రెయిన్ నుంచి స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించారు.

ఈ యుద్ధంలో రష్యా గనుక ఈ రెండు పెద్ద ప్రాంతాలను జయించగలిగితే.. పుతిన్‌కు ఏదో ఒక విధమైన విజయాన్ని అందిస్తుంది. 2014లో క్రైమియాలో ‘రిఫరెండం’ నిర్వహించి ఆ పేరుతో ఆ ప్రాంతాన్ని రష్యాలో కలుపుకున్న తరహాలో ఈ రెండు ప్రాంతాలను కూడా కలుపుకోవటం తర్వాతి చర్య అవుతుంది.

ఈ ప్రాంతాలను మే 9వ తేదీలోగా హస్తగతం చేసుకోగలిగితే.. 1945లో నాజీ జర్మనీని ఓడించిన విజయోత్సవ దినాన్ని కూడా కలుపుకుని ఈ విజయాన్ని పుతిన్ జరుపుకోవచ్చు.

యుద్ధ ప్రాంతంలో ఓటింగ్ నిర్వహించటమనే ఆలోచనే విడ్డూరంగా ఉన్నప్పటికీ.. లూహాన్స్క్‌లో ‘సమీప భవిష్యత్తు’లో రిఫరెండం నిర్వహించటం గురించి అక్కడి రష్యా కీలుబొమ్మ నాయకుడు ఇప్పటికే మాట్లాడారు.

వీడియో క్యాప్షన్, ఈ యుక్రెయిన్ సైనికులు 8 ఏళ్లుగా కందకాల్లోనే ఎందుకు ఉన్నారు?

ఈ యుద్ధంలో పుతిన్ వ్యూహం ఏమిటి?

కేవలం దోన్బస్ మీద మాత్రమే కాకుండా దక్షిణాది ప్రాంతమైన ఖేర్సాన్ మీద కూడా పూర్తి నియంత్రణ సాధించాలని పుతిన్ కోరుకుంటున్నట్లు యుక్రెయిన్ సైన్యం భావిస్తోంది. ఈ ప్రాంతం క్రైమియాకు పశ్చిమోత్తర దిశలో ఉంటుంది. ఆ ప్రాంతం కూడా తన ఆధీనంలో ఉన్నట్లయితే రష్యాకు దక్షిణ తీరంలో భూ అనుసంధానం లభించటంతో పాటు క్రైమియాకు నీటి సరఫరా మీద కూడా నియంత్రణ లభిస్తుంది.

అయితే దోన్యస్క్‌లో చాలా భాగం, లూహాన్స్క్‌లో కీలకమైన ప్రాంతాలు ఇంకా యుక్రెయిన్ చేతుల్లోనే ఉన్నాయి. దీంతో రష్యా బలగాలు ఉత్తర, తూర్పు, దక్షిణ దిశల నుంచి కదులుతూ తూర్పు ప్రాంతంలోని యుక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టటానికి ప్రయత్నిస్తునాయి.

‘‘ఇది చాలా పెద్ద భూభాగం. నియంత్రించటం కష్టం. ఇక్కడి భౌగోళిక సంక్లిష్టతలను కూడా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు’’ అంటారు కింగ్స్ కాలేజ్ లండన్‌లో కాన్ఫ్లిక్ట్, సెక్యూరిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ట్రేసీ జెర్మన్.

రష్యా సైన్యం రష్యా సరిహద్దుకు దక్షిణంగా ఉన్న యుక్రెయిన్ రెండో అతి పెద్ద నగరం ఖార్కియెవ్‌ను స్వాధీనం చేసుకోవటంలో విఫలమైంది. అయితే వేర్పాటువాదుల నియంత్రణలోని తూర్పు ప్రాంతానికి దారితీసే ప్రధాన రహదారి మీద దిగువన గల వ్యూహాత్మక పట్టణం ఇజియుమ్‌ను వశపరచుకుంది.

‘‘ఇజియుమ్ విషయంలో వాళ్లు చేస్తున్నది చూస్తే.. ప్రధాన హైవేలను వారు అనుసరిస్తున్నారు. వారి సైనిక పరికరాలను ప్రధానంగా రోడ్డు, రైలు మార్గాల్లో తరలిస్తుండటాన్ని బట్టి అది తెలివైన పనిగానే కనిపిస్తోంది’’ అన్నారు ప్రొఫెసర్ జెర్మన్.

Combat area in the east. Updated 19 April

ప్రస్తుతం రష్యా చేతుల్లో ఉన్న పట్టణాలు ఇప్పటికే ఏళ్లతరబడి యుద్ధాన్ని చవిచూసి ఉన్నాయి. దోన్బస్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా మద్దతుగల వేర్పాటువాదులు తొలుత ఆ ప్రాంతాలను హస్తగతం చేసుకున్నప్పటి నుంచీ అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది.

ఎం03 రోడ్డు దిగువన రష్యా తర్వాతి పెద్ద టార్గెట్ స్లోవియాన్స్క్ అనే పట్టణం. అక్కడ 1.25 లక్షల జనాభా ఉన్నారు. ఈ పట్టణాన్ని 2014లో రష్యా మద్దతుగల వేర్పాటువాద బలగాలు స్వాధీనం చేసుకోగా ఆ తర్వాత యుక్రెయిన్ సైన్యం తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అలాగే దక్షిణాన గల క్రమటోర్క్స్ నగరాన్ని స్వాధీనం చేసుకోవటం కూడా రష్యాకు మరో పెద్ద లక్ష్యంగా ఉంటుంది.

స్లోవియాన్స్క్ పట్టణాన్ని యుక్రెయిన్ గనుక నిలుపుకోగలిగే.. దోన్బస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటానికి రష్యా ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్ (ఐఎస్‌డబ్ల్యూ) అంచనా వేస్తోంది.

వీడియో క్యాప్షన్, ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏంటి?

రైలు మార్గాలపై నియంత్రణ కీలకం...

రష్యా బలగాలు ఉత్తరం నుంచి తూర్పుకు పురోగమిస్తున్న క్రమంలో.. లూహాన్స్క్‌లో యుక్రెయిన్ నియంత్రణలో ఉన్న పట్టణాలపై దాడులు చేశాయి. సెవెరోడోనెస్క్క్‌కు వాయువ్యంగా ఉన్న క్రెమిన్నాలోకి ప్రవేశించాయి. రుబిఝ్నే, పొపాస్నా, లిసిచాంస్క్ తదితర పట్టణాలపై బాంబుదాడులు చేశాయి.

ఈ పట్టణాలు ముఖ్యమైనవి. ఎందుకంటే వీటిని నియంత్రణలో ఉంచుకోవటం వల్ల రష్యా బలగాలు పశ్చిమ దిశగా సాగి.. ఇజియుమ్‌కు ఆగ్నేయంగా ముందుకు సాగుతున్న తమ బలగాలతో అనుసంధానం కావటానికి వీలుకలుగుతుందని ఐఎస్‌డబ్ల్యూ చెప్తోంది. అందుకే యుక్రెయిన్ సైన్యం ఇజియుమ్ వెలుపల తమ ప్రతిదాడుల మీద దృష్టి కేంద్రీకరిస్తోంది.

సరఫరా మార్గాలను రష్యా నియంత్రణలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. యుక్రెయిన్‌కు పశ్చిమం నుంచి రైలు మార్గాలు అందకుండా అడ్డుకోవాల్సి ఉంటుంది. యుక్రెయిన్ బలగాలకు, భారీ ఆయుధాలకు అత్యంత ప్రభావవంతమైన రవాణా సాధనం రైలు. అలాగే పౌరులు పారిపోవటానికి కూడా అదే అతి వేగమైన మార్గం.

ఈ రైలు వ్యవస్థలోని కీలక భాగాలను నియంత్రణలోకి తెచ్చుకోవటం వల్ల రష్యా బలగాలు తమ సైనిక బలగాలను, సరఫరాలను రవాణా చేయటానికి వెసులుబాటు లభిస్తుంది.

లుహాన్స్క్ పశ్చిమ ప్రాంతీయ సరిహద్దును చేరుకోవాలన్న పుతిన్ లక్ష్యాన్ని సాధించటానికి.. తమ దారికి అడ్డుగా ఉన్న ప్రతిదానినీ ధ్వంసం చేయటమే రష్యా ఉద్దేశమని ప్రాంతీయ సైనిక పాలన అధిపతి సెర్హీయ్ హాయ్‌దాయ్ అభిప్రాయపడ్డారు.

‘‘వాళ్లు ఆస్పత్రులు, నివాస భవనాల మీద దాడులు చేశారు. చలి నుంచి కాపాడే హీటింగ్ లేదు. విద్యుత్ లేదు’’ అని మరీనా అగాఫోనోవా (27) చెప్పారు. లిసిచాంన్స్క్‌ మీద రష్యా సైన్యం షెల్లింగ్ చేస్తుండటంతో అక్కడ తమ ఇల్లు, తల్లిదండ్రులను వదిలి ఆమె పారిపోయారు.

రష్యా ముందుకు వస్తుండటంతో పౌరులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ‘‘ఊర్లోనే ఉండి, రష్యా దాడుల్లో నిద్రలో కాలిపోవటం చాలా భయానకం’’ అని హాయ్‌దాయ్ హెచ్చరించారు.

ఉత్తరాన ఇజియుమ్‌కు, దక్షిణాన మరియుపోల్, మెలిటోపోల్‌లకు రైలు మార్గాలను కత్తిరించారు. స్లోవియాంస్క్క్‌ నుంచి రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సమీపంలోని ప్రధాన కూడలి క్రమటోర్క్స్ రైల్వే స్టేషన్ మీద రాకెట్ దాడి జరిగి 57 మంది పౌరులు చనిపోయినప్పటి నుంచీ అక్కడి నుంచి ట్రైన్లు నడవటం లేదు.

వీడియో క్యాప్షన్, నరమేధం అంటే ఏంటి?

యుక్రెయిన్ సైన్యం నిలబడగలదా?

యుద్ధం ఆరంభమైనపుడు.. తూర్పు ప్రాంతంలోని యుక్రెయిన్ జాయింట్ ఫోర్సెస్ ఆపరేషన్‌లో భాగంగా ఉన్న 10 బ్రిగేడ్లను ఆ దేశంలో అత్యుత్తమ శిక్షణ గల, అత్యుత్తమ ఆయుధాలు గల సైనికులుగా పరిగణించారు.

‘‘యుక్రెయిన్ సైన్యం బలం ఎంత అనేది మనకు ఇప్పుడు తెలీదు’’ అంటారు రూసీకి చెందిన సామ్ క్రానీ ఎవాన్స్. ఇటీవలి వారాల్లో వలంటీర్లు చేరటంతో యుక్రెయిన్ సైనికుల సంఖ్య పెరిగి ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు.

‘‘యుక్రెయిన్ సైన్యానికి ప్రధాన లక్ష్యం.. రష్యా వైపు సాధ్యమైనంత భారీ నష్టాలు కలిగించటం. పెద్ద పెద్ద పోరాటాలను నివారించటానికి యుక్రెయిన్ సైన్యం వ్యూహాత్మక ఎత్తుగడలు అనుసరిస్తోంది’’ అని చెప్పారు కోన్రాడ్ ముజికా.

ప్రస్తుతం యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యా సైన్యానికి చెందిన 76 బెటాలియన్ల టాక్టికల్ గ్రూపులు ఉన్నాయని, వాటిలో 11 బెటాలియన్లను కొద్ది రోజుల కిందటే దించిందని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఒక్కో బెటాలియన్‌లో సాధారణంగా 700 నుంచి 900 మంది సైనికులు ఉంటారు. సరిహద్దుకు ఉత్తరం వైపునకు రష్యా మరిన్ని బలగాలను పంపిస్తోందని కూడా పేర్కొన్నారు.

మరిన్ని బలగాలను బరిలోకి దించుతున్నప్పటికీ.. రష్యా బలగాలు వేగంగా విజయం సాధిస్తాయా అనేదానిమీద సర్వత్రా అనుమానాలున్నాయి. యుక్రెయిన్ బలగాలను బలహీనపరచవచ్చునేమో గానీ అందుకు చాలా మూల్యం చెల్లించాల్సి రావచ్చునని ఐఎస్‌డబ్ల్యూ భావిస్తోంది.

మరోవైపు రష్యా బెటాలియన్లు చాలా వరకూ అధమ పరిస్థితుల్లో ఉన్నాయని యుక్రెయిన్ సైనిక నిపుణులు నమ్ముతున్నారు.

ఏడు వారాలుగా యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న రష్యా సైన్యం ఇప్పటికే భారీ నష్టాలు చవిచూసింది. సైన్యం నైతిక స్థైర్యం దిగజారినట్లు భావిస్తున్నారు. స్థానిక వేర్పాటువాద ప్రాంతాల నుంచి చేర్చుకున్న వారు, చాలా మంది ఒత్తిడి వల్ల చేరినవారు, సరిహద్దు సైన్యంతో ఈ బలగాలు ప్రధానంగా నిండివున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)