యుక్రెయిన్ గగనతలాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటిస్తే రష్యా ఓటమి పాలవుతుందా

యుక్రెయిన్ వైమానిక దళ సామర్థ్యాల గురించి బీబీసీకి కెప్టెన్ కర్వాచుక్ వివరించారు
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ వైమానిక దళ సామర్థ్యాల గురించి బీబీసీకి కెప్టెన్ కర్వాచుక్ వివరించారు
    • రచయిత, జొనాథన్ బియెల్
    • హోదా, బీబీసీ డిఫెన్స్ కరెస్పాండెంట్, యుక్రెయిన్ నుంచి

రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు దృష్టి అంతా భూమి మీద జరుగుతోన్న పోరాటాల మీదే (గ్రౌండ్ ఫైటింగ్) మీదే ఉంది.

కానీ, గగనతలంలో యుద్ధ ప్రాధాన్యం కూడా ఇప్పుడు చాలా పెరిగింది. గగనతలంలో పైచేయి సాధించడానికి రెండు దేశాలు పోటీ పడుతున్నాయి.

యుక్రెయిన్ గగనతల ఆక్రమణ కోసం పోరాటాలు ఎలా జరుగుతున్నాయో ఒక యుక్రెయిన్ వైమానిక అధికారి, బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

రష్యా యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

కెప్టెన్ వెసిల్ కర్వాచుక్ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉంటుంది.

50 రోజులుగా యుద్ధంలో పోరాడుతోన్న ఒక సైనికుని ముఖంలో అలాంటి నవ్వును చూడటం ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు.

కర్వాచుక్ గుర్తు తెలియని సైనిక స్థావరం నుంచి వీడియో లింక్ ద్వారా మాతో మాట్లాడారు.

రాబోయే కొద్ది వారాల్లో తనకు ఖాళీ సమయం దొరకదనే సంగతి ఆయనకు తెలుసు.

కీయెవ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో రష్యా ఓడిపోయి ఉండొచ్చు. కానీ, తూర్పు యుక్రెయిన్‌లోని దోన్బస్ ప్రాంతంపై దాని పట్టు బలంగా ఉంది.

అయితే, తర్వాతి రౌండ్ పోరాటంలో నిప్రోకు చెందిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ దళానికి చెందిన సైనికులు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు.

యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

రష్యా దాడుల నుంచి యుక్రెయిన్ గగనతలాన్ని రక్షించుకోవడం కొంతకాలంగా పెద్ద సవాలుగా మారింది.

మరో యుక్రెనియన్ వైమానిక అధికారి మాట్లాడుతూ... ''ఇది ఎలా ఉందంటే, మీరు పెద్ద పెద్ద రంథ్రాలున్న దోమల తెరను వాడుతున్నట్లు ఉంటుంది'' అని వ్యాఖ్యానించారు.

''గగనతలం మొత్తాన్ని కవర్ చేయలేం'' అని కర్వాచుక్ అన్నారు.

నిజానికి, ఆర్మీ స్థావరంలో కూర్చొని ఆయన మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం చిన్న విషయమేమీ కాదు.

యుద్ధం తొలినాళ్లలోనే యుక్రెయిన్‌కు చెందిన చాలా వైమానిక స్థావరాలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైనది.

వీడియో క్యాప్షన్, నడిరోడ్లపై రష్యా సైనికుల అత్యాచారాలు... యుక్రెయిన్ మహిళల ఆరోపణ

రష్యాకు గట్టి పోటీనిస్తున్న యుక్రెయిన్

యుద్ధం తొలి రోజుల్లో చాలా నష్టపోయామని యుక్రెయిన్ సైన్యం అంగీకరించింది. బహిరంగంగా ఇలా ఒప్పుకోవడం అరుదైన విషయం.

అయినప్పటికీ, యుక్రెయిన్ వైమానిక దళాలు సమర్థంగా పనిచేస్తున్నాయి.

రష్యాకు చెందిన 82 యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు వారు చెప్పారు. ఇందులో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు, డ్రోన్లు ఉన్నాయి.

యుక్రెయిన్‌కు చెందిన 33 విమానాలు కూడా ధ్వంసమయ్యాయి.

యుక్రెయిన్ వైమానిక దళాన్ని త్వరలోనే రష్యా బలగాలు అణిచివేస్తాయని చెప్పిన మిలిటరీ నిపుణులను యుక్రెయిన్ సైన్యం సాధించిన ఈ విజయం గందరగోళంలో పడేసింది.

గగనతలంలో జరుగుతోన్న యుద్ధంలో రష్యా ఆర్మీ ఇప్పటికే చాలా ప్రయోజనకరమైన స్థితిలో ఉంది. యుక్రెయిన్ సైన్యం కన్నా మూడింతలు ఎక్కువగా ఫైటర్ విమానాలను రష్యా మోహరించింది.

రష్యా విమానాలు 250కి పైగా మిలిటరీ మిషన్లను నిర్వహించాయని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతీరోజు వారు 30 వైమానిక దాడులను నిర్వహిస్తారు.

అయితే, గగనతలంలో ఆధిపత్యం కోసం రష్యా ఇంకా పోరాడాల్సి ఉంటుందని పశ్చిమ దేశాల అధికారులు అంటున్నారు.

మరోవైపు తమ పాత మిగ్-29 ఫైటర్ విమానాలతో రష్యా ఆర్మీకి పోటీగా యుక్రెయిన్ వైమానిక దళం తీవ్రంగా పోరాడుతోంది. ప్రతీరోజు 10 మిలిటరీ మిషన్లను పూర్తి చేస్తోంది.

రష్యాకు గగనతలంలో అనుకూలత ఉందని యుక్రెయిన్‌కు తెలుసు. ఈ కారణంగానే యుక్రెయిన్ గగనతలాన్ని మూసివేయాలని వారు పశ్చిమ దేశాలను అడుగుతున్నారు. యుక్రెయిన్‌ను 'నో ఫ్లై జోన్'గా ప్రకటించాలని చాలాసార్లు డిమాండ్ చేశారు.

యుక్రెయిన్ ఆకాశంలో ‘నో ఫ్లై జోన్’‌ను సృష్టించాలని పదే పదే డిమాండ్ చేసింది

ఫొటో సోర్స్, ARIS MESSINIS/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్, తమ గగన తలంలో 'నో ఫ్లై జోన్'‌ను సృష్టించాలని పదే పదే డిమాండ్ చేసింది

క్షిపణుల బాధ్యత

దోన్బస్ ప్రాంతంలో కొత్త దాడులతో రష్యా భయపెడుతోంది. ఇది, యుక్రెయిన్‌కు కఠిన సవాలుగా మారొచ్చు.

''తూర్పు ప్రాంతంలోని ఆకాశంలో రష్యా మరింత స్వేచ్ఛను పొందుతున్నట్లుగా అనిపిస్తోంది'' అని రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఎయిర్‌పవర్‌లో సీనియర్ పరిశోధకుడు జస్టిన్ బ్రాంక్ అన్నారు.

ఈ ప్రాంతానికి పక్కనే ఉన్న వైమానిక స్థావరాలపై రష్యాకు నియంత్రణ ఉంది. ఈ కారణంగానే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తూర్పున రష్యా మరింత ప్రయోజనాన్ని పొందుతోంది.

ఒకవేళ యుక్రెయిన్ ఈ ప్రాంతంలో యుద్ధం గెలవాలి అనుకుంటే... వారికి సుదీర్ఘ, మధ్య శ్రేణి, స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణులు అవసరం. దీన్నే 'లేయర్డ్ డిఫెన్స్' వ్యూహం అని పిలుస్తారు.

పశ్చిమ దేశాలు ప్రస్తుతం యుక్రెయిన్‌కు భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలిగే స్వల్ప శ్రేణి క్షిపణులను ఇస్తున్నాయి. యుక్రెయిన్‌కు అమెరికా 2000 స్టింగర్లను ఇచ్చింది.

బ్రిటన్ కూడా యుక్రెయిన్‌కు చాలా 'స్టార్‌స్ట్రైక్ హై వెలాసిటీ' క్షిపణులను అందించింది.

భుజాల మీద నుంచి ప్రయోగించే క్షిపణులు తమకు చాలా ఉపయోగపడుతున్నాయని కెప్టెన్ కర్వాచుక్ అన్నారు. వీటిని మ్యాన్‌ప్యాడ్స్ అని పిలుస్తారు. యుద్ధరంగంలోని ముందువరుస పోరాటంలో ఈ క్షిపణులు ప్రభావవంతంగా ఉన్నాయి.

తక్కువ ఎత్తులో ఎగురుతోన్న రష్యా విమానాలకు వ్యతిరేకంగా పనిచేయడంలో మ్యాన్‌ప్యాడ్స్ అత్యంత ప్రభావం చూపినట్లు రుజువైంది. రష్యా ఎక్కువగా దీర్ఘ శ్రేణి క్రూయిజ్ మిసైల్స్‌ను ఉపయోగిస్తోంది.

''మా దగ్గర మధ్య, దీర్ఘ శ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలు తక్కువగా ఉన్నాయి. ఇవి సరిపడినంతగా లేవు'' అని కెప్టెన్ కర్వాచుక్ చెప్పారు.

ప్రస్తుతం, దోన్బస్ ప్రాంతంలో దాడికి రష్యా చేస్తోన్న సన్నాహాలు... పరిమిత వైమానిక వనరులు ఉన్న యుక్రెయిన్‌పై ఒత్తిడిని పెంచాయి.

దోన్బస్ ప్రాంతంలో దాడి

ఫొటో సోర్స్, MATTEO PLACUCCI/GETTY IMAGES

ఇప్పుడు యుద్ధం పూర్తిగా తూర్పు యుక్రెయిన్ ప్రాంతంపై కేంద్రీకృతమై ఉంది. కానీ, దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా రక్షణ అవసరం.

యుక్రెయిన్, ఇటీవల తూర్పు ప్రాంతాలకు అదనంగా వైమానిక రక్షణను పంపుతున్నట్లుగా కనిపిస్తోంది.

మొత్తం వైమానిక రక్షణ వ్యవస్థను కేవలం దోన్బస్ ప్రాంతానికే పరిమితం చేయడం సాధ్యం కాకపోవచ్చు.

''ఎలాంటి రక్షణ లేకుండా యుక్రెయిన్ సగభాగాన్ని ఇలా విడిచిపెట్టలేం'' అని కర్వాచుక్ అన్నారు.

ఆకాశంలో ఆధిపత్యం ప్రదర్శించినవారిదే గెలుపు

వైమానిక రక్షణ వ్యవస్థను యుక్రెయిన్, కేవలం రష్యా విమానాలను కూల్చడానికి మాత్రమే కాకుండా క్రూయిజ్, బాలిస్టిక్ మిసైల్స్‌ను కూడా లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో యుక్రెయిన్ కొంత విజయం సాధించింది.

తమ యూనిట్ 50 నుంచి 70 శాతం వరకు రష్యా దీర్ఘ శ్రేణి క్షిపణులను ధ్వంసం చేస్తున్నట్లు కెప్టెన్ కర్వాచుక్ అంచనా వేశారు.

''ఉదాహరణకు నిప్రో చుట్టుపక్కలా రష్యా ఆరు క్షిపణులను ప్రయోగించింది. అందులో నాలుగింటిని యుక్రెయిన్ ఆర్మీ అడ్డుకుంది'' అని ఆయన చెప్పారు.

అంటే దీనర్థం, చెప్పుకోదగిన సంఖ్యలోని రష్యా క్షిపణులు ఇప్పటికీ యుక్రెయిన్‌లో దాడులు చేయడంలో విజయవంతం అవుతున్నాయి.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఆర్మీ 1550 క్షిపణులను ప్రయోగించిందని పెంటగాన్ చెప్పింది.

వీడియో క్యాప్షన్, నరమేధం అంటే ఏంటి?

హైపర్‌సోనిక్ క్షిపణులను కూడా వాడుతున్నామని రష్యా చెబుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ ఆర్మీ పెద్దగా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఈ క్షిపణులు ధ్వని వేగం కంటే ఐదు రెట్లు ప్రయాణించి లక్ష్యాలను ఛేదిస్తాయి.

కానీ, ఇక్కడ చేదు నిజం ఏంటంటే... కీలకమైన సహాయం అందకపోతే యుక్రెయిన్ చాలా కాలం పాటు రష్యా వైమానిక, క్షిపణి దాడులను తట్టుకొని నిలబడటం కష్టమే.

యుక్రెయిన్ అడుగుతోన్న ఆయుధాల్లో మధ్య, దీర్ఘ శ్రేణి క్షిపణులే అగ్రస్థానంలో ఉన్నాయని ఒక సీనియర్ పశ్చిమ నిఘా అధికారి, బీబీసీకి చెప్పారు.

''వైమానిక రక్షణ కోసం ఆయుధాలకు యుక్రెయిన్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పుడు వాటి అవసరం వారికి చాలా ఉంది'' అని ఆయన అన్నారు.

''గత యుద్ధాల ప్రకారం చూసుకుంటే ఆకాశంలో ఆధిపత్యం ప్రదర్శించేవారే యుద్ధంలో గెలుస్తారనేది స్పష్టంగా తెలుస్తుంది'' అని కెప్టెన్ కర్వాచుక్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)