అఫ్గానిస్తాన్‌‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు... చిన్న పిల్లలు సహా 40 మందికి పైగా మృతి

ఖోస్త్ ప్రావిన్స్‌లోని పాకిస్తాన్ దాడుల్లో గాయపడిన బాలుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖోస్త్ ప్రావిన్స్‌లోని పాకిస్తాన్ దాడుల్లో గాయపడిన బాలుడు

అఫ్గానిస్తాన్‌లోని ఖోస్త్, కునర్ ప్రావిన్స్‌ల్లో భిన్న ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేపట్టినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో 40 మందికి పైగా అఫ్గాన్ పౌరులు మరణించారని ‘‘అఫ్గానిస్తాన్ పీస్ వాచ్’’ సంస్థ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు హబీబ్ ఖాన్ చెప్పారు.

ఈ దాడులపై ట్విటర్‌లో హబీబ్ స్పందించారు. ‘‘తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అఫ్గానిస్తాన్ గడ్డపై పాకిస్తానీ సైనిక విమానాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 40 మందికిపైగా పౌరులు మరణించారు’’అని ఆయన చెప్పారు.

దాడుల్లో మరణించినవారి ఫోటోలను ఖాన్ షేర్ చేశారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ విషయంలో కలగచేసుకోవాలని ఆయన కోరారు. దీన్ని యుద్ధ నేరంగా పరిగణించి విచారణ చేపట్టాలని ఆయన అన్నారు.

మరోవైపు ఖోస్త్, కునర్ ప్రావిన్సుల్లోని భిన్న ప్రాంతాల్లో పాకిస్తానీ విమానాలు దాడులు చేసినట్లు స్థానిక అధికారులు కూడా శనివారం ధ్రువీకరించారు.

వీడియో క్యాప్షన్, టార్గెట్ చేసి చంపేస్తున్నారు.. ‘ఈ పాలనలో బతకడం అంటే బోనులో జీవిస్తున్నట్లే’

పాకిస్తాన్ రాయబారికి సమన్లు..

దాడుల అనంతరం తాలిబాన్లు పాకిస్తాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌కు సమన్లు జారీచేసి నిరసన వ్యక్తం చేశారు.

అఫ్గానిస్తాన్ విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం.. పాకిస్తానీ బలగాల వైమానిక దాడులపై పాకిస్తాన్ రాయబారి ఎదుట అఫ్గాన్ తాత్కాలిక డిప్యూటీ రక్షణ మంత్రి అల్హాజ్ ముల్లా శిరిన్ అఖుంద్ నిరసన తెలియజేశారు.

‘‘విదేశాంగ కార్యాలయానికి పాకిస్తానీ రాయబారిని పిలిపించారు. ఆయన ఎదుట అఖుంద్‌తోపాటు విదేశాంగ మంత్రి మవ్లావీ ఆమిర్ ఖాన్ కూడా నిరసన వ్యక్తంచేశారు’’అని అఫ్గాన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.

తాజా దాడుల ద్వారా అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

‘‘డ్యూరాండ్ లైన్ వెంబడి ఖోస్త్, కునర్ ప్రావిన్స్‌లోని ప్రాంతాలపై దాడుల ద్వారా అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని పాక్ ఉల్లంఘించింది’’అని రాజకీయ విశ్లేషకుడు సదఖ్ షిన్వారీ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)