అఫ్గానిస్తాన్: ‘మా పిల్లల్లో ఎవరినైనా కొనుక్కుంటారా? రూ. 65,000 ఇవ్వండి చాలు’

ఫొటో సోర్స్, SANJAY GANGULI/BBC NEWS
- రచయిత, యోగిత లిమాయే
- హోదా, బీబీసీ ప్రతినిధి
మేం హెరాత్ నగరం నుంచి బయలుదేరి, రద్దీగా ఉన్న వీధులు దాటేసరికి ఓ పెద్ద హైవే కనిపించింది. రోడ్డు మీద వాహనాలేం లేవు. ఖాళీగా ఉంది.
హైవేకు చేరుకున్న దారిలో రెండు తాలిబాన్ చెక్‌పోస్టులు కనిపించాయి.
మొదటి చెక్‌పోస్టులో కనిపించిన తాలిబాన్ సైనికులు స్నేహపూర్వకంగా పలకరించారు. కానీ, మా కార్లను, ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి పొందిన పర్మిట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అక్కడి నుంచి మేం బయలుదేరుతుండగా, భుజానికి రైఫిల్ వేలాడుతున్న ఓ సైనికుడు మావైపు తిరిగి, విశాలంగా నవ్వుతూ.. "తాలిబాన్లను చూసి భయపడకండి. మేం మంచివాళ్లం" అన్నారు.
రెండో పోస్ట్ దగ్గర సైనికులు గంభీరంగా, కఠినంగా కనిపించారు.
అఫ్గాన్‌లో ప్రయాణిస్తుంటే ఎలాంటి తాలిబాన్లు కలుస్తారో ఊహించలేం.
అక్కడి నిరసన ప్రదర్శనలను కవర్ చేసినందుకు కొందరు అఫ్గాన్ జర్నలిస్టులను తాలిబాన్ మిలిటెంట్లు దారుణంగా కొట్టారు.
ఈమధ్య వైరల్ అయిన ఒక వీడియోలో ఓ విదేశీ ఫొటోగ్రాపర్‌ను తుపాకీ వెనుక భాగంతో కొట్టిన దృశ్యం చూడవచ్చు.
రెండో చెక్‌పోస్ట్ నుంచి మేం తొందరగానే బయటపడ్డాం. కానీ, మేం వెళ్లిపోతుంటే అక్కడి సైనికుడు అన్న మాట మాకో హెచ్చరికలాగా వినిపించింది.
"మా గురించి అన్నీ మంచి విషయాలే రాయాలని నిర్ణయించుకోండి" అని అన్నారు.

ఫొటో సోర్స్, Sanjay Ganguli/BBC News
ఒక పిల్ల/పిల్లాడి ఖరీదు 65 వేలు
హెరాత్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బస్తీకి మేం చేరుకున్నాం. అక్కడ ఇళ్లన్నీ గడ్డి, మట్టి, ఇటుకలతో కట్టినవి.
సంవత్సరాల తరబడి యుద్ధం, కరువు కారణంగా అనేకమంది తమ స్వస్థలాలను విడిచిపెట్టి ఈ బస్తీకి వచ్చారు.
ఇక్కడ భద్రత ఉంటుందని, సమీపంలో ఉన్న పట్టణంలో పని దొరుకుతుందని సుదూరప్రాంతాల నుంచి కుటుంబాలతో సహా తరలివచ్చారు.
కారు దిగగానే చలిగాలి రివ్వున వీచింది. శీతాకాలం దగ్గరపడుతోందని అర్థమైంది.
పేదరికాన్ని తట్టుకోలేక నిజంగానే పిల్లల్ని అమ్మేస్తున్నారా? లేక అవి వదంతులా అని తెలుసుకోవడానికి మేం అక్కడకు వెళ్లాం.
ఈ సంగతి మొదటిసారి విన్నప్పుడు ఎవరో కొద్దిమంది అలా చేసుంటారని అనుకున్నాను.
కానీ, అక్కడ మాకు కనిపించిన వాస్తవాలు నమ్మలేనట్లుగా ఉన్నాయి.
మేం అక్కడకు చేరుకున్న కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తి నేరుగా మా బృందంలోని ఓ సభ్యుడి దగ్గరకొచ్చి.. "మా పిల్లల్లో ఎవరినైనా కొనుక్కుంటారా?" అని అడిగారు.
ఒక పిల్ల/పిల్లాడి ఖరీదు 900 డాలర్లు (సుమారు రూ. 65,000) అని చెప్పారు.
మీ బిడ్డను ఎందుకు అమ్మాలనుకుంటున్నారని నా సహోద్యోగి అడిగారు.
"మా ఇంట్లో ఎనిమిది మంది పిల్లలున్నారు. కానీ, వారికి తినడానికి తిండి లేదు" అని ఆ వ్యక్తి జవాబిచ్చారు.

ఫొటో సోర్స్, SANJAY GANGULI/BBC NEWS
గతిలేక తిండి కోసం పిల్లల్ని అమ్ముకుంటున్నారు
మేం మరికొంచం ముందుకు వెళ్లేసరికి ఒక పాపని తీసుకుని ఓ మహిళ మా దగ్గరికి వచ్చారు.
ఆమె చాలా కంగారుగా మాట్లాడారు. అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చి అంతకుముందే ఏడాదిన్నర పిల్లని అమ్మేశారని చెప్పారు.
ఇంతలో మా చుట్టూ జనం గుమికూడడం ప్రారంభించారు.
డబ్బుల కోసం తన 13 నెలల మేనకోడలిని అమ్మేశారని వారిలో ఒక యువకుడు చెప్పాడు.
ఘోర్ ప్రాంతానికి చెందిన ఒక తెగలోని వ్యక్తి చాలా దూరం నుంచి వచ్చి ఆ పిల్లని కొనుక్కుని వెళ్లారని, పాప పెద్దయ్యాక తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తానని తమ కుటుంబానికి మాటిచ్చారని చెప్పారు.
ఈ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.
అక్కడే ఓ ఇంట్లో ఆరు నెలల పాప ఉయ్యాల్లో పడుకుని ఉంది. ఆ పాప నడవడం ప్రారంభించాక, ఆమెను కొనుగోలు చేసిన వ్యక్తి వచ్చి తీసుకెళతారు. ఆ ఇంట్లో మరో ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.
ఆ కుటుంబానికి రోజూ ఆహారం దొరకడం గగనమే. చాలారోజులు ఆకలితోనే పడుకుంటారు. ఆ పాప తండ్రి చెత్త సేకరిస్తూ కుటుంబాన్ని షోషిస్తున్నారు.
"చాలా రోజులు సంపాదన ఏమీ లేకుండానే గడిచిపోతాయి. డబ్బులు వచ్చిన రోజు ఆరు లేదా ఏడు రొట్టెలు కొనుక్కుంటాం. వాటినే పంచుకుని తింటాం. మా పాపను అమ్మేయడానికి నా భార్య ఒప్పుకోవట్లేదు. అందుకే కాస్త ఆందోళనగా ఉంది. కానీ, నేనింకేం చేయలేను. బతకడానికి వేరే మార్గం లేదు. ఇంకెప్పుడూ నా భార్య కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడలేను" అని పాప తండ్రి చెప్పారు.
ఆయన మాటల్లో ఆక్రోశం, నిస్సహాయత కనిపించాయి.
బిడ్డను అమ్మితే వచ్చే డబ్బు వాళ్ల ప్రాణాలను నిలబెడుతుంది. మిగిలిన పిల్లలకు ఆహారం దొరుకుతుంది. కానీ, అది కొద్ది నెలలు మాత్రమే.
ఇంతలో మరో మహిళ మా దగ్గరకొచ్చి డబ్బులు ఇవ్వమని సైగ చేస్తూ తన బిడ్డలను అక్కడికక్కడే అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు.

ఫొటో సోర్స్, SANJAY GANGULI/BBC NEWS
ఇలాంటి పరిస్థితి చూస్తామని ఊహించలేదు
ఇక్కడ ఇన్ని కుటుంబాలు తమ పిల్లల్ని అమ్ముకునే దుస్థితిలో ఉన్నాయని మేం అసలు ఊహించలేదు.
మా వద్ద ఉన్న సమాచారాన్ని అందించడానికి ఐక్యరాజ్యసమితి సంస్థ యునిసెఫ్ (UNICEF)ను సంప్రదించాం.
ఈ కుటుంబాలను చేరదీసి, సహాయం చేసేందుకు ప్రయత్నిస్తామని వాళ్లు చెప్పారు.
అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అధికంగా విదేశీ నిధులపై ఆధారపడి ఉంది.
ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేపట్టిన తరువాత విదేశీ సహాయం పూర్తిగా నిలిచిపోయింది.
దాంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే జీతలతో సహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి.
ఫలితంగా అట్టడుగు వర్గాలు దీనస్థితికి చేరుకున్నాయి. ఆగస్టుకు ముందు ఎలాగోలా బతుకీడ్చిన వాళ్ల పరిస్థితి ఇప్పుడు మరింత దుర్భరం అయిపోయింది.
మానవ హక్కులకు ఎలాంటి రక్షణ ఉంటుందో, ఇచ్చిన డబ్బును ఎలా సద్వినియోగం చేస్తారో చెప్పకుండా తాలిబాన్లకు సహాయ నిధి అందించడం ప్రమాదకరం.
కానీ, ఈ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపకపోతే మరింత మంది ప్రజలు ఆకలిచావులు చూడాల్సి వస్తుంది.
బయట సహాయం లేకుండా ఈ శీతాకాలాన్ని ఎదుర్కోవడం లక్షలాది అఫ్గాన్ ప్రజలకు దుర్లభమని హెరాత్‌లో చూసిన పరిస్థితుల బట్టి స్పష్టమైంది.
ఇవి కూడా చదవండి:
- 'అర్ధరాత్రి వచ్చిన ఆ ఫోన్ కాల్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది'
- కఠిన పర్వతాలు ఎక్కి, వారాల తరబడి నడుస్తూ సరిహద్దులు దాటేస్తున్నారు ఇలా..
- తెహ్రీక్-ఎ-తాలిబాన్‌పై ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు.. పాకిస్తాన్లో కలకలం
- జీ-20 సదస్సులో నరేంద్ర మోదీ: 'అఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదానికి కేంద్రంగా మారనివ్వద్దు'
- అఫ్గానిస్తాన్: కుందుజ్‌లోని మసీదుపై ఆత్మాహుతి దాడి, 50 మందికి పైగా మృతి
- కాకినాడ పోర్ట్‌లో డ్రగ్స్ దిగుమతులు జరుగుతున్నాయా... అధికార, ప్రతిపక్షాల వాగ్వాదం ఏంటి?
- అఫ్గానిస్తాన్ వెళ్లలేరు.. ఇండియాలో ఉండలేరు
- అత్యంత ప్రమాదకరంగా లారీల కింద దాక్కుని స్మగ్లింగ్ చేస్తున్న పిల్లలు
- ‘13 ఏళ్ల నా చెల్లెలిని బలవంతంగా పెళ్లి చేసుకుంటామని తాలిబాన్లు మెసేజ్ పంపించారు’
- అఫ్గానిస్తాన్: సేనల ఉపసంహరణ తర్వాత తొలిసారి తాలిబాన్లతో అమెరికా చర్చలు
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
- భారత్-పాక్ యుద్ధం 1971: చెరువులో నీటి అడుగున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్న భారత సైనికుడి కథ
- పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా... పాక్ రూపాయి పడిపోవడానికి అదే కారణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








