అఫ్గానిస్తాన్: ‘తాలిబాన్‌లు నా చెల్లిని బలవంతంగా పెళ్లి చేసుకుంటారు’

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్ నుంచి తప్పించుకుని బ్రిటన్ చేరుకుని, ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న యువకుడొకరు స్వదేశంలో తాలిబాన్‌ల ప్రతీకార చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.
13 ఏళ్లలోపు వయసున్న తన చెల్లిని బలవంతంగా పెళ్లి చేసుకుంటామని తాలిబాన్‌కు చెందిన కొందరు తనను బెదిరిస్తున్నారని ఆ యువకుడు బీబీసీకి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన తన పేరును వెల్లడించలేదు.
తన చెల్లిని వారు పెళ్లి చేసుకుంటే ఆమె జీవితాంతం వారి చెరలో ఉండాల్సి వస్తుందని ఆ విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశారు.
చెవెనింగ్ స్కాలర్‌షిప్ స్కీమ్‌లో భాగంగా ఆ విద్యార్థి అఫ్గానిస్తాన్ నుంచి యూకే చేరుకున్నారు. కానీ, ఆయన కుటుంబం మాత్రం బ్రిటన్ రాలేకపోయింది.
ఈ స్కాలర్‌షిప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన 35 మంది విద్యార్ధుల్లో ఆయన ఒకరు. బీబీసీ రేడియో 4 ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆ యువకుడు.. తన చెల్లిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటామని తాలిబాన్‌లు బెదిరిస్తున్నారని వెల్లడించారు. .
"నా చెల్లికి ఆ ఉన్మాదుల్లో ఒకరితో పెళ్లి చేస్తామని వారు బెదిరిస్తున్నారు. ఇది మరణశిక్ష కాదు. జీవితాంతం అనుభవించాల్సిన కారాగార శిక్ష'' అన్నారాయన.
"ఆమె పరిస్థితి యుద్ధ ఖైదీలా తయారైంది. ఆమెకు పెద్దగా మాట్లాడటం కూడా రాదు. ప్రస్తుతం స్కూలుకు వెళుతోంది. కానీ, పాఠశాలకు వెళ్లకూడదని, పెళ్లి చేసుకోవాలని తాలిబాన్‌లు చెబుతున్నారు'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ ఎలా చేరుకున్నారు?
ఆగస్ట్ 21న చెవెనింగ్ స్కాలర్‌షిప్ స్కీమ్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. దాని ప్రకారం, ఆ యువకుడు, అతని దగ్గరి బంధువులు బ్రిటన్ రావచ్చు.
కానీ, దేశ రాజధాని కాబూల్‌లోని విమానాశ్రయంలో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితుల కారణంగా ఆయన తన కుటుంబాన్ని తీసుకురావడానికి ‘రిస్క్’ చేయలేకపోయారు.
అమెరికా, దాని మిత్రదేశాల సేనలు ఆగస్టు 31 నాటికి అఫ్గానిస్తాన్‌ను వీడడానికి ముందే అనేకమంది అఫ్గాన్ పౌరులను ఆ దేశం నుంచి తరలించే ప్రయత్నం చేశాయి.
ఆగస్ట్ 26 న విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 170 మంది ప్రజలు, 13 మంది అమెరికా సైనికులు మృతి చెందారు.
ఈ దాడి తరువాత భద్రతను పెంచడంతో, కొంతమంది ప్రజలు అమెరికా సైనిక విమానాలు ఎక్కేందుకు ప్రయత్నించి మరణించారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ అప్పట్లో ప్రకటించుకుంది.
అఫ్గానిస్తాన్‌లో తాను వ్యాపార కార్యకలాపాలు నిర్వహించానని, అది నచ్చని తాలిబాన్లు తనను శిక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అంటున్నారు.
''నేను బ్రిటిష్ వారి ఏజెంట్‌నని, అందుకే తనను అఫ్గాన్ నుంచి తరలించారంటూ తాలిబాన్లు తమ మెసేజ్‌లలో ఆరోపణలు చేస్తున్నారు. వారు నన్నేమీ చేయబోమని చెబుతున్నారు. కానీ, నా కుటుంబం దానికి మూల్యం చెల్లించాల్సి వస్తోంది'' అని ఆ అఫ్గాన్ యువకుడు వాపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ సమాజంతో సంబంధాలు ఉంటే దేశంలోని ఇస్లామిక్ సాంస్కృతిక విలువలకు వ్యతిరేకంగా కుట్ర చేసినట్లు తాలిబాన్‌లు భావిస్తున్నారని ఆ యువకుడు చెప్పారు.
"వాళ్లు మనుషులు కాదు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదైనా చేస్తారు. సమాజానికి మంచి చేసే వారిని భయపెట్టాలని చూస్తున్నారు'' అని ఆయన ఆరోపించారు.
''వచ్చే నెలలో కచ్చితంగా నీ చెల్లిని ఎత్తుకెళ్తామని నాకు మెసేజ్ పంపారు'' అని ఆయన వివరించారు.
నా తల్లి, చెల్లి, బంధువులను యూకే తీసుకురాకపోతే వారు ఇబ్బందుల్లో పడతారని ఆయన వాపోయారు. "నా చెల్లికి వారితో పెళ్లి జరిగితే ఆమె జీవితాంతం ఆ ఉన్మాదులకు ఖైదీగా మారుతుంది'' అని ఆ విద్యార్ధి అన్నారు.
తన కుటుంబాన్ని ఎలాగైనా యూకే తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నాడని, యూకే ప్రభుత్వం నుంచి ఇంకా సానుకూల స్పందన రాలేదని ఆయన మిత్రులు అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో ఉన్న తమ బంధువుల గురించి ఆందోళన చెందున్న చెవెనింగ్ స్కాలర్స్ కొందరితో గ్రీన్ పార్టీ ఎంపీ కరోలిన్ లూకాస్ టచ్‌లో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
వారి కుటుంబ సభ్యులను ఇక్కడికి చేర్చడానికి అడ్డుగా నిలుస్తున్న కొన్ని నిబంధనలను సవరించాలని ఆమె సూచించారు.
''అఫ్గాన్ పౌరులకు పునరావం గురించి కొన్నాళ్లు వేచి ఉండాలని ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ, ఇప్పటికీ ఆరు వారాలైంది. ఇది మనిషి ప్రాణాలకు సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి'' అన్నారు లూకాస్.
యూకే ప్రభుత్వం ఇప్పటికే అఫ్గాన్ పౌరుల పురావాస పథకాన్ని సిద్ధం చేస్తోంది. మొదటి సంవత్సరంలో 5,000మంది శరణార్థులను, రాబోయే కాలంలో మొత్తం 20,000మందికి పునరావాసం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి:
- ‘ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
- Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- చమోలీ గ్లేసియర్ : 15 అణుబాంబులు ఒకేసారి పేలినట్లు ఆ రాయి లోయ అడుగును తాకింది
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- స్వాల్బార్డ్: ఆరు నెలలు పూర్తి పగలు.. ఆరు నెలలు పూర్తి చీకటి ఉంటుందిక్కడ..
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- "అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








