అఫ్గానిస్తాన్: కిడ్నాపర్లకు హెచ్చరికగా హెరాత్‌లో మృతదేహాలను వేలాడదీసిన తాలిబాన్లు

ఫొటో సోర్స్, Reuters
నలుగురు కిడ్నాపర్లను కాల్చి చంపామని, వారి మృతదేహాలను హెరాత్‌లోని కూడళ్లలో బహిరంగంగా వేలాడదీసినట్లు తాలిబాన్లు ప్రకటించారు.
మరణశిక్ష, శిరచ్ఛేదం లాంటి కఠినమైన శిక్షలను మళ్లీ అమలు చేస్తామని తాలిబాన్ అధికారి ప్రకటించిన తదుపరి రోజే ఈ ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఒక వ్యాపారవేత్తతో పాటు అతని కుమారున్ని కిడ్నాప్ చేసిన వారే... ఈ కాల్పుల్లో మరణించారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు.
సిటీ సెంటర్‌లో క్రేన్ సహాయంతో ఒక మృతదేహాన్ని వేలాడదీశారని స్థానికులు అన్నారు.
''కూడలి దగ్గరికి నాలుగు మృతదేహాలను తీసుకువచ్చారు. అక్కడ ఒకదాన్ని వేలాడదీసి, మిగతా మూడింటిని నగరంలోని ఇతర కూడళ్లలో ప్రదర్శించేందుకు తీసుకువెళ్లారు'' అని స్థానిక దుకాణదారు వజీర్ అహ్మద్ సిద్ధిఖీ అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.
''భవిష్యత్‌లో మరిన్ని కిడ్నాప్‌లను నిరోధించడానికే మృతదేహాలను బహిరంగంగా వేలాడదీశాం. ఒక వ్యాపారవేత్తతో పాటు ఆయన కుమారున్ని కిడ్నాప్ చేసినట్లు తెలియడంతోనే వారిపై కాల్పులు జరిపి చంపివేశాం. వారి ఆధీనంలో ఉన్న వారికి విముక్తి కల్పించాం'' అని హెరాత్ డిప్యూటీ గవర్నర్ మౌల్వీ షైర్ చెప్పారు.
ఈ ఘటనను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న గ్రాఫిక్స్ ఫొటోలలో... రక్తంతో తడిసిన మృతదేహాలను తీసుకొచ్చిన ఒక ట్రక్కు దాని క్రేన్‌తో మరో వ్యక్తి మృతదేహాన్ని పైకి వేలాడదీయడం కనబడుతోంది.
క్రేన్‌కు వేలాడుతోన్న మృతదేహం ఛాతి భాగంపై 'కిడ్నాప్‌లు చేసేవారు ఇలాగే శిక్షించబడతారు' అని రాసి ఉండటం ఒక వీడియోలో చూడొచ్చు.
ఆగస్టు 15న, అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టినప్పటి నుంచి తాలిబాన్లు తమ పాలన మునుపటి కంటే న్యాయబద్ధంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు.
కానీ ఇప్పటికే దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు ఎన్నో నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తాలిబాన్ల ప్రముఖ మతాధిపతి ముల్లా నూరుద్దీన్ తురబీ ప్రస్తుతం జైళ్ల శాఖ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లో మరణశిక్ష, అంగఛేదనం వంటి తీవ్రమైన శిక్షలను మళ్లీ ప్రారంభిస్తామని ఆయన గురువారం ప్రకటించారు. దేశ భద్రతకు ఈ శిక్షలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ శిక్షలను బహిరంగంగా అమలు చేయమని తురబీ అన్నారు. ఎందుకంటే అవి 1990ల నాటి తాలిబాన్ల పాలనకు చెందినవని పేర్కొన్నారు. నాటి ఐదేళ్ల పాలన కాలంలో తాలిబాన్లు, కాబుల్‌లోని క్రీడా మైదానాల్లో లేదా ఈద్గా మసీదు విశాల మైదానాల్లో బహిరంగ ఉరిశిక్షలు తరచుగా అమలు చేసేవారు.
గత పాలనలో తాలిబాన్ల బహిరంగ మరణశిక్షలపై అందరూ అసంతృప్తి వెళ్లగక్కడాన్ని తురబీ తోసిపుచ్చారు. ''మా చట్టాలు ఎలా ఉండాలో ఎవరూ మాకు చెప్పక్కర్లేదు. స్టేడియాల్లో శిక్షలు అమలు చేయడంపై అందరూ మమ్మల్ని విమర్శించారు. కానీ మేమెప్పుడు ఇతరుల చట్టాలు, శిక్షల గురించి వేలెత్తి చూపలేదు'' అని అన్నారు.
గత చర్యల కారణంగా తురబీ, యునైటెడ్ నేషన్స్ ఆంక్షలు విధించిన వ్యక్తుల జాబితాలో ఉన్నారు.
హజారా మైనారిటీకి చెందిన తొమ్మిది మంది సభ్యుల ఊచకోత వెనుక తాలిబాన్ పోరాటయోధుల హస్తముందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆగస్టులో పేర్కొంది.
''హజారాల ఊచకోతల్లో వారు చూపిన క్రూరత్వం తాలిబాన్ల గత పాలన రికార్డులను గుర్తుకు తెస్తోంది. తాజా తాలిబాన్ల పాలన ఎంత ప్రమాదకరంగా, భయంకరంగా ఉండబోతుందో సూచిస్తుంది'' అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ అగ్నెస్ కలమర్డ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్లకు తాలిబాన్‌కు మధ్య తేడా ఏంటి?
- ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు మిగతా దేశాలకు ఎందుకు ఆందోళన కలిగిస్తున్నాయి
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ల మొదటి నెల పాలన ఎలా ఉంది?
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- ఉత్తర కొరియాలో గ్యాస్ మాస్క్‌లతో పరేడ్ ఎందుకు నిర్వహించారంటే...
- ‘మా పెళ్లి జరిపించడానికి పూజారి ఒప్పుకోలేదు, అందుకే...’
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- 'మగతోడు లేకుండా మీరెందుకు బయటికొచ్చారు?'
- తాలిబాన్ హోం మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ... అమెరికాకు 'మోస్ట్ వాంటెడ్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









