కిమ్ జోంగ్ ఉన్: ఉత్తర కొరియాలో గ్యాస్ మాస్క్‌లతో సైనిక పరేడ్ ఎందుకు నిర్వహించారంటే...

ఉత్తర కొరియా నిర్వహించిన సైనిక పరేడ్

ఫొటో సోర్స్, EPA

73వ వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా ఉత్తర కొరియా మిలిటరీ పరేడ్ నిర్వహించింది. బాలిస్టిక్ క్షిపణులను పెద్దగా ప్రదర్శించలేదు. కానీ గ్యాస్ మాస్క్‌లు ధరించిన వారితో కవాతు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రాత్రి సమయంలో చేసిన ఈ కవాతుకు సంబంధించిన ఫొటోలను ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది.

ఆ ఫొటోల్లో సైనికులు హజ్మత్ సూట్లు ధరించి కనిపించారు. గ్యాస్ మాస్కులు పెట్టుకున్నారు.

పరేడ్‌ సందర్భంగా తీసిన ఫైర్ ట్రక్కులు, ట్రాక్టర్ల ఫొటోలను కూడా ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది.

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఆయన కాస్త సన్నగా కనిపించారు.

ఆయనతో పాటు పక్కనున్నవారు కూడా మాస్కులు పెట్టుకోలేదు. పిల్లలు కిమ్‌ను ఆప్యాయంగా పట్టుకున్నట్టు ఫొటోల్లో కనిపించింది.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సైనిక పరేడ్‌కు హాజరైన కిమ్ జోంగ్ ఉన్

బీబీసీ ప్రతినిధి లారా బికర్ విశ్లేషణ

పరేడ్‌లో పాల్గొన్న ఒక విభాగానికి చెందిన సభ్యులు ఎరుపు రంగు హజ్మత్ సూట్లు, గ్యాస్ మాస్కులు ధరించి కనిపించారు. వీళ్లు కోవిడ్ -19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక సిబ్బంది కావచ్చని బీబీసీ కరస్పాండెంట్ తెలిపారు.

అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరించి తమ కొత్త సైనిక సంపత్తిని, బాలిస్టిక్ క్షిపణులను బాహ్య ప్రపంచానికి చూపించడానికి కొన్ని సందర్భాల్లో ఉత్తర కొరియా ఇలాంటి పరేడ్‌లు నిర్వహిస్తూ ఉంటుంది.

కానీ కష్ట సమయంలో దేశ ప్రజల ఆత్మస్థైర్యం పెంచేందుకు ఇలాంటి పరేడ్‌లను ఉత్తర కొరియా వాడుకుంటూ ఉంటుంది.

బల ప్రదర్శనలతో ప్రజల మనోధైర్యాన్ని పెంపొందించడానికి పరేడ్‌లను ఉపయోగిస్తూ ఉంటుంది. బాణాసంచా కాల్చి ప్రజలను ఉత్సాహపరచి, వారిలో కొత్త ఆశలు పెంపొందించడానికి ఈ కవాతులను వాడుకుంటుంది.

ఉత్తర కొరియా నిర్వహించిన సైనిక పరేడ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా నిర్వహించిన సైనిక పరేడ్

కోవిడ్ -19 కారణంగా ఉత్తర కొరియా తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటోంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.

అయితే, తమ దేశంలో కరోనావైరస్ కేసులు లేవని ఉత్తర కొరియా చెబుతోంది. అయినా కోవిడ్‌పై తమ పోరాటం కొనసాగుతుందని ప్రజలకు చెప్పడానికే ఈ రెడ్ హజ్మత్ బృందంతో ప్రత్యేకంగా పరేడ్ చేయించారని అనుకుంటున్నారు.

12 నెలల వ్యవధిలో ఉత్తర కొరియా మూడు పరేడ్‌లు నిర్వహించింది.

ఉత్తర కొరియా వార్షికోత్సవం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ కిమ్‌కు శుభాకాంక్షలు తెలిపారని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)