ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ చెప్పిన ‘ఘోర పరిస్థితి’ ఏమిటి.. కరోనా మరణాలేనా

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

కోవిడ్-19ను కట్టడి చేయడంలో అధికారుల తీరు సరిగా లేదని, వారి కారణంగానే దేశంలో ‘ఘోర పరిస్థితులు’ ఏర్పడ్డాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ ఉన్నతాధికారులపై విరుచుకుపడ్డారని ప్రభుత్వ మీడియా తెలిపింది.

నార్త్ కొరియాలో ఒక అంటువ్యాధి ఇంతగా ప్రబలడం అరుదని, అంతకు ముందు దేశంలో కోవిడ్ కేసులే లేవని తెలిపింది. ఈ వాదన ఎంతవరకు నిజమనే దానిపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తర కొరియా సరిహద్దులను మూసివేసింది. దాంతో దిగుమతులు సన్నగిల్లాయి.

అంతర్జాతీయ ఆంక్షలు కూడా తోడవడంతో ఆ దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది.

దేశంలో ఆహార పరిస్థితిపై ఆందోళనగా ఉందని, 1990లలో ఏర్పడిన కరవు పరిస్థితులు మళ్లీ కనిపించనున్నాయని కొద్ది రోజులకు ముందే కిమ్ అంగీకరించారు.

ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ నివేదిక ప్రకారం, పార్టీ నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కిమ్ ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. ఫలితంగా "దేశ భద్రతకు, దేశ ప్రజలకు ఘోర పరిస్థితులు దాపురించాయని" కిమ్ అన్నారు.

పలువురు పార్టీ సభ్యులను పదవుల నుంచి తొలగించారని ఈ నివేదిక తెలిపింది. ఈ సంఘటనపై మరే ఇతర వివరాలను నివేదికలో ప్రస్తావించలేదు.

కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలకు అర్ధమేంటని విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలకు అర్ధమేంటని విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.

కిమ్ వ్యాఖ్యలకు అర్థమేమిటి?

బీబీసీ ప్రతినిధి సాంగ్-మి హాన్ విశ్లేషణ

కరోవావైరస్ క్వారంటీన్ వ్యవస్థను సరిగా నిర్వహించలేదనో లేక నార్త్ కొరియా, చైనాల మధ్య మరొక కొత్త అక్రమ రవాణా మార్గం బయటపడిందనో కిమ్ వ్యాఖ్యల అర్థం కావొచ్చు.

ప్లీనరీ సెషను ముగిసిన 11 రోజుల తరువాత పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించడమే దేశంలో కోవిడ్ పరిస్థితి పెద్ద సవాలుగా మారిందనడానికి సూచన.

రాజకీయ విభేదాలను తగ్గించేందుకే పదవుల నుంచి తొలగించిన అయిదుగురు నాయకుల పేర్లు బయటపెట్టి ఉండకపోవచ్చు.

ఏది ఏమైనప్పటికీ నార్త్ కొరియా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని కిమ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

పరిస్థితి ఎంత దిగజారిపోయింది?

ఉత్తర కొరియాలో కఠినమైన కోవిడ్ నిబంధనలు అమలుచేశారు. వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ మీడియా నిరంతరం పౌరులకు సూచిస్తూనే ఉంది.

'చైనా దుమ్ము' (యెల్లో డస్ట్) విషయంలో జాగ్రత్త వహించాలని గత ఏడాది చివర్లో హెచ్చరించింది. అయితే, యెల్లో డస్ట్‌కు, కోవిడ్‌కు ఎలాంటి సంబంధం లేదు.

సరిహద్దులు మూసివేయడంతో ప్రధాన భాగస్వామి చైనాతో వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఆహారం, మందులు దేశంలోకి రవాణా జరగలేదు. ఫలితంగా, ఆహార కొరత, ఆర్థిక సంక్షోభం వస్తుందని ప్రభుత్వేతర సహాయ సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.

ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఆకలిచావులు పెరిగాయని, ఆహారం కోసం ప్రజలు అడుక్కునే స్థితికి వచ్చారని ఇటీవల పలు రిపోర్టులు ప్రస్తావించాయి.

నార్త్ కొరియాలో ప్రజారోగ్య పరిస్థితి "దిగజారిపోతోందని" చెప్పేందుకు తాజా ప్రభుత్వ మీడియా రిపోర్టే సూచన అని ఇవా మహిళా విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ లీఫ్-ఎరిక్ ఈస్లీ అన్నారు.

"సైద్ధాంతిక లోపాలను కారణాలుగా చూపిస్తూ అవిధేయులుగా ఉన్న అధికారులను పదవుల నుంచి తొలగించవచ్చు. ఈ మొత్తం అంశాన్ని ఆ అధికారుల మీదకు నెట్టేసి, వారిని బలిపశువులగా చేయడానికి కిమ్ ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఇదంతా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికో లేక విదేశాల నుంచి వ్యాక్సీన్లు రప్పించడానికో చేస్తున్న రాజకీయ సన్నాహాలు కూడా కావొచ్చు" అని డాక్టర్ ఈస్లీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)