ఉత్తర కొరియా: విదేశీ వీడియోలు చూస్తే 15 ఏళ్ల జైలు శిక్ష.. సీడీలు, పెన్‌డ్రైవ్‌లతో దొరికితే మరణ శిక్ష

చట్టవిరుద్ధమైనా సరే నార్త్ కొరియాలో అనేకమంది సౌత్ కొరియా సినిమాలు చూస్తారు
ఫొటో క్యాప్షన్, చట్టవిరుద్ధమైనా సరే నార్త్ కొరియాలో అనేకమంది సౌత్ కొరియా సినిమాలు చూస్తారు
    • రచయిత, లారా బికర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రస్తుతం ఉత్తర కొరియాలో "విదేశీ" అనే మాట వినబడిందంటే శిక్ష తప్పదు. విదేశీ వస్తువులు, సినిమాలు, దుస్తులు, ఆఖరుకు విదేశీ యాస మాట్లాడినా కఠిన చర్యలు తీసుకొనేలా ఇటీవలే ఆ దేశంలో ఓ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు.

ఇదంతా ఎందుకు?

ఈ ప్రశ్నకు సమాధానంగా.. యూన్ మి-సో తన కళ్ల ముందే జరిగిన ఓ విషాద సంఘటనను వివరించారు.

ఆమెకు 11 ఏళ్లు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దక్షిణ కొరియాకు చెందిన ఓ నాటకంతో పట్టుబడ్డారు. ఉత్తర కొరియా పోలీసులు ఆయన కళ్లకు గంతలు కట్టి తీసుకొచ్చారు.

ఆ వ్యక్తికి విధిస్తున్న శిక్షను ఇరుగుపొరుగు వారంతా చూడాల్సిందే.

"అలా చూడకపోతే రాజద్రోహం కింద శిక్షిస్తారు."

అందరూ చూస్తున్నారో లేదో పోలీసులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. చట్టవిరుద్ధంగా వీడియోలను స్మగ్లింగ్ చేస్తే పడే శిక్ష మరణమేనని అందరికీ తెలియాలి. అదే వారి ఉద్దేశం.

"నాకు బాగా గుర్తు.. పట్టుబడిన వ్యక్తి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఎంతలా ఏడ్చారంటే ఆయన కళ్లకు కట్టిన గంతలు పూర్తిగా తడిసిపోయాయి. నేను ఆ సంఘటన మర్చిపోలేను. పెను విషాదం అది."

"ఆ వ్యక్తిని ఓ కర్రకు కట్టి తుపాకీతో కాల్చేశారు" అని ప్రస్తుతం సియోల్‌లో ఉన్న యూన్ మి-సో వివరించారు.

విదేశీ భాషలు, విదేశీ కేశాలంకరణ, బట్టలు "ప్రమాదకరమైన విషాలు" అని కిమ్ పేర్కొన్నారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, విదేశీ భాషలు, విదేశీ కేశాలంకరణ, బట్టలు "ప్రమాదకరమైన విషాలు" అని కిమ్ పేర్కొన్నారు

‘ఆయుధాలు లేకుండా యుద్ధం’

కొన్ని నెలలు లాక్‌డౌన్ ఉంటేనే మనం ఎంతో సతమతమైపోతున్నాం. అలాంటిది, ఎప్పుడూ లాక్‌డౌన్‌లాంటి పరిస్థితే ఉండి, ఇంటర్నెట్ లేక, సోషల్ మీడియా లేక, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కొన్ని టీవీ ఛానల్స్ మాత్రమే వస్తూ, అందులో దేశ నాయకులు నిర్ణయించిన కార్యక్రమాలే వస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నార్త్ కొరియాలో జీవితం ఇలాగే ఉంటుంది.

పైగా ఇప్పుడు నార్త్ కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ కొత్త విదేశీ వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారు.

దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌లకు చెందిన ఆడియోలు, వీడియోలు లేదా ఎలాంటి భారీ మీడియాతోనైనా పట్టుబడితే మరణశిక్ష తప్పదు. అవి చూసినవారికి 15 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.

ప్రజలు ఏం చూస్తున్నారన్నది ముఖ్యం కాదు. ఆ దేశాల నుంచి వచ్చే వీడియోలు చూడకూడదు, అంతే.

యువతలో కనిపిస్తున్న "అవాంఛనీయమైన, వ్యక్తివాద, సోషలిస్టు వ్యతిరేక ప్రవర్తనను" అరికట్టాలని నార్త్ కొరియా యూత్ లీగ్‌కు పిలుపునిస్తూ కిమ్ ఇటీవలే ప్రభుత్వ మీడియాలో ఒక లేఖ రాశారు.

విదేశీ భాషలు, విదేశీ కేశాలంకరణ, విదేశీ దుస్తులను వాడడం యువత మానేయాలన్నది ఆయన ఉద్దేశం. వీటిని "ప్రమాదకరమైన విషాలు"గా కిమ్ పేర్కొన్నారు.

సియోల్ నుంచి వచ్చే ఆన్‌లైన్ పబ్లికేషన్ 'ది డైలీ ఎన్‌కే' ప్రచురించిన ఒక కథనం ప్రకారం కే-పాప్ కళాకారుల మాదిరి హెయిర్‌స్టైల్ పెట్టుకుని, చీలమండలపైకి ప్యాంటులను కత్తిరించుకున్నందుకుగానూ ముగ్గురు యువకులను రీఎడ్యుకేషన్ క్యాంప్‌లకు పంపించారు.

ఇదంతా అణ్వాయుధాలు, క్షిపణులు లేకుండా కిమ్ చేస్తున్న యుద్ధం.

దేశం బయట నుంచి ఎలాంటి సమాచారమూ నార్త్ కొరియా ప్రజలకు అందకూడదన్నదే కిమ్ లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు.

నార్త్ కొరియాలో పరిస్థితులు రోజురోజులూ క్లిష్టమైపోతున్నాయి. లక్షలాది ప్రజలు ఆకలి బాధలు అనుభవిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం జాగ్రత్తగా రూపొందించిన ప్రోపగాండా మాత్రమే ప్రజలకు తెలిసేట్టు కిమ్ ప్రణాళిక రచిస్తున్నారని నిపుణులు అంటున్నారు.

గత ఏడాది కరోనా కారణంగా లాక్‌డౌన్ విధిస్తూ సరిహద్దులు మూసివేయడంతో నార్త్ కొరియా పూర్తిగా బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయింది.

పొరుగు దేశమైన చైనాతో వాణిజ్య సంబంధాలు, ముఖ్య వస్తువుల దిగుమతులు దాదాపు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే దిగుమతులకు అనుమతిస్తున్నా, పరిమితంగానే ఉన్నాయి.

ఇప్పటికే అణ్వాయుధాల ప్రోజెక్టులకు కేటాయించిన అధిక వ్యయానికి తోడు బయట దేశాలతో సంబంధం లేకుండా ఐసొలేషన్‌లో ఉండడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బ తీసింది.

"మా దేశ ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితిని చవిచూస్తున్నారు. దీన్లోంచి ఎలాగైనా బయటపడాలి" అని గత ఏడాది కిమ్ అంగీకరించారు కూడా.

సౌత్ కొరియా డ్రామా 'స్ట్రైర్‌వే టు హెవెన్' నుంచి ఓ దృశ్యం

ఫొటో సోర్స్, SBS

ఫొటో క్యాప్షన్, సౌత్ కొరియా డ్రామా 'స్ట్రైర్‌వే టు హెవెన్' నుంచి ఓ దృశ్యం

కొత్త చట్టం ఏం చెబుతోంది?

ఈ చట్టం తొలి కాపీ ది డైలీ ఎన్‌కేకు చిక్కింది.

"తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగి పట్టుబడితే, ఫ్యాక్టరీ యజమానిని శిక్షించవచ్చు. పిల్లలు సమస్యగా మారితే తల్లిదండ్రులను శిక్షించవచ్చు. ఒకరినొకరు పర్యవేక్షించుకునే విధానాన్ని ఈ చట్టంలో బలంగా ప్రవేశపెట్టారు" అని ది డైలీ ఎన్‌కే ఎడిటర్ ఇన్ చీఫ్ లీ సాంగ్ యాంగ్ బీబీసీకి చెప్పారు.

సౌత్ కొరియా గురించి కలలు కనే యువత ఆలోచనలను భగ్నం చేయడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు.

"మరో రకంగా చెప్పాలంటే విదేశీ సంస్కృతులు చొరబడితే ప్రతిఘటన మొదలవుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది" అని లీ సాంగ్ యాంగ్ అన్నారు.

కిందటి ఏడాది దేశం నుంచి బయటపడిన కొద్దిమందిలో ఒకరైన చోయి జాంగ్-హూన్ బీబీసీతో మాట్లాడుతూ "పరిస్థితులు క్లిష్టమవుతున్న కొద్దీ నిబంధనలు, చట్టాలు, శిక్షలు కఠినం అవుతున్నాయి. కడుపు నిండినవాడు సౌత్ కొరియా సినిమా చూస్తే విశ్రాంతి కోసం అనుకోవచ్చు. కానీ, ఆకలితో కడుపు మండుతున్నవాడు ఆ సినిమాలు చూస్తే ప్రతిఘటించి తీరుతాడు" అని అన్నారు.

మరి, ఇది పని చేస్తుందా?

విదేశీ సినిమాలను చైనా బోర్డర్ నుంచి స్మగ్లింగ్ చేయడంలో ప్రజలు ఎంత ప్రతిభావంతులో గతంలో చేసిన దర్యాప్తుల్లో తెలింది.

విదేశీ చిత్రాలు, డ్రామాలను అక్రమ రవాణా చేసి, అందరికీ పంచేందుకు కావలసినన్ని వనరులు వారి వద్ద ఉన్నాయి.

చాలా ఏళ్లుగా యూఎస్‌బీ డ్రైవుల్లో విదేశీ సినిమాలు దేశ సరిహద్దులు దాటి లోపలికి వస్తున్నాయి.

"వీటిన్నిటికీ గట్టి పాస్‌వర్డ్‌లు పెట్టి పట్టుబడకుండా తప్పించుకోవచ్చు. ఒకవేళ పట్టుబడినా మూడు సార్లు పాస్‌వర్డ్ తప్పుగా కొడితే అందులో ఉన్న కంటెంట్ మొత్తం డీలీట్ అయిపోయేలాగ కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అంత సాంకేతికత అందుబాటులో ఉంది" అని చోయ్ చెప్పారు.

తమ ఇరుగుపొరుగువారు సినిమాలు చూడడం కోసం ఎంత దూరం వెళ్లారో యూన్ మి-సో గుర్తు చేసుకున్నారు.

కార్ బ్యాటరీ కొని, దాన్ని జనరేటర్‌కు తగిలించి, ఆ పవర్‌తో టీవీ పెట్టుకుని, అందులో సౌత్ కొరియా సినిమాలు వేసి చూసేవారని, తాను కూడా "స్టైర్‌వే టు హెవెన్" అనే నాటాకాన్ని అలాగే చూశానని మీ-సో చెప్పారు.

చైనా నుంచి చౌకగా సీడీలు, డీవీడీలు అక్రమ రవాణా అయ్యేవని చోయ్ తెలిపారు.

ఈ వ్యవస్థ బీటలు వారడం ఎప్పుడు మొదలైందంటే...

విదేశీ చిత్రాల అక్రమ రవాణా వ్యవస్థను ప్రభుత్వం గమనించడం ప్రారంభించింది.

2002లో ఒక యూనివర్సిటీపై ప్రభుత్వం చేసిన దాడిలో 20,000ల కన్నా ఎక్కువ సీడీలు లభ్యమయ్యాయని చోయ్ చెప్పారు.

"ఒక్క యూనివర్సిటీలోనే ఇన్ని బయటపడ్డాయంటే, దేశం మొత్తం మీద యూనివర్సిటీల్లో ఎన్నెన్ని ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రభుత్వానికి తల తిరిగిపోయింది. అప్పుడే శిక్షలను కఠినతరం చేయడం ప్రారంభమైంది" అని ఆయన చెప్పారు.

కిమ్ జియుమ్-హ్యోక్ అనే వ్యక్తి తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు.

2009లో తనకు 16 ఏళ్లుంటాయి. ఆ సమయంలో చట్టవిరుద్ధంగా వీడియోలు షేర్ చేసినవారిని పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ యూనిట్ చేతికి జియుమ్-హ్యోక్ దొరికిపోయారు.

జియుమ్-హ్యోక్ తండ్రి చైనా నుంచి చట్టవిరుద్ధంగా తెప్పించిన సౌత్ కొరియా పాప్ మ్యూజిక్ వీడియోలను తన స్నేహితులతో పంచుకున్నారు.

తనను విచారణ కోసం ఒక రహస్య గదిలో ఉంచారని, నాలుగు రోజుల పాటు అదే పనిగా చితకబాదారని జియుమ్-హ్యోక్ చెప్పారు.

"చాలా భయపడ్డాను. నా జీవితం ముగిసిపోయింది అనుకున్నాను. ఈ వీడియోలు నాకెలా వాచ్చాయో, ఎంతమందితో పంచుకున్నానో చెప్పమన్నారు. మా నాన్న తీసుకొచ్చారని చెప్పలేను కదా. అందుకే నాకేం తెలీదని చెప్పాను. నాకేం తెలీదు, నన్ను విడిచిపెట్టండి అని బతిమాలుకున్నాను" అని ప్రస్తుతం సియోల్‌లో ఉంటున్న జియుమ్-హ్యోక్ బీబీసీకి చెప్పారు.

జియుమ్-హ్యోక్ కాస్త డబ్బున్న కుటుంబానికి చెందినవారు కాబట్టి ఆయన తండ్రి లంచం ఇచ్చి కొడుకును విడిపించుకున్నారు.

ఇప్పుడు కిమ్ పాలనలో ఇలాంటివి ఎంతమాత్రం సాధ్యం కావు.

అప్పట్లో ఇలా దొరికినవారందరినీ శ్రామిక శిబిరాలకు పంపించారు. కానీ, ఈ శిక్ష ప్రజలను భయపెట్టలేదు. అందుకే శిక్షలను పెంచారు.

"మొదట్లో శ్రామిక శిబిరాల్లో ఓ ఏడాది పాటూ ఉంచేవారు. తరువాత, ఈ శిక్షను మూడేళ్లకు పైగా పెంచారు. ఇప్పుడు శ్రామిక శిబిరాలకు వెళ్లి చూస్తే 50% కన్నా ఎక్కువమంది యువత అక్కడ కనిపిస్తారు. వాళ్లంతా విదేశీ వీడియోలు చూస్తూ పట్టుబడ్డవారే. రెండు గంటలు విదేశీ వీడియోలు చూసినందుకు మూడేళ్లు శ్రామిక శిబిరాల్లో శిక్ష అనుభవించాలి. ఇది చాలా పెద్ద సమస్య" అని చోయ్ అన్నారు.

గత ఏడాది నార్త్ కొరియాలో జైలు శిబిరాలను విస్తరించారని మాకు పలు మూలాల నుంచి సమాచారం అందింది.

కఠినమైన కొత్త చట్టాలు ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా చూడ్డం అనేది ఓ విలాసం. సినిమా చూసే ముందు కడుపు నిండాలి. ఓ పూట తిండికే తిప్పలు పడాల్సిన పరిస్థితుల్లో, కుటుంబంలో ఒకరిని శ్రామిక శిబిరానికి పంపేస్తే ఆ కుటుంబాలు ఛిన్నాభిన్నం అయిపోతాయి" అని చోయ్ అన్నారు.

జియుమ్-హ్యోక్, యూన్ మి-సో

ఫొటో సోర్స్, college

ఫొటో క్యాప్షన్, జియుమ్-హ్యోక్, యూన్ మి-సో

ఇంకా ఎందుకు ప్రజలు అదే పని చేస్తున్నారు?

"అనేక అవకాశాల తరువాత ఓ సినిమా చూడగలుగుతాం. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న మా కుతూహలాన్ని ఎవరూ ఆపలేరు" అని జియుమ్-హ్యోక్ అంటున్నారు.

తన దేశంలో జరుగుతున్న విషయాలను గ్రహించడం తన జీవితాన్నే మార్చేసిందని జియుమ్-హ్యోక్ అన్నారు. ఆయనకు ఉన్న సామాజిక పరపతి వలన బీజింగ్ వెళ్లి చదువుకోగలిగారు. అక్కడ ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నారు.

"మొదట్లో నా దేశం గురించి వినిపిస్తున్న మాటలను నమ్మలేకపోయాను. ఇదంతా విదేశీ కుట్ర అనుకున్నా. వికీపీడియా అబద్ధం చెబుతోంది అనుకున్నా. నా మనసు నమ్మకపోయినా, నా బుద్ధి నమ్మమని చెప్పింది. అప్పుడు నార్త్ కొరియాపై వచ్చిన పలు డాక్యుమెంటరీలు చూశాను. అనేక వ్యాసాలు చదివాను. నేను వింటున్నవన్నీ నిజమని నాకు అర్థమైంది."

"ఇదంతా గ్రహించాక, నాలో మార్పు మొదలైంది. అప్పటికే ఆలశ్యమైంది. ఇంక నేను వెనక్కు వెళ్లలేకపోయాను" అని జియుమ్-హ్యోక్ చెప్పారు.

ఆయన చివరకు సియోల్ పారిపోయారు.

మి-సో కూడా సియోల్‌ వెళ్లి తన కలలను సాకారం చేసుకున్నారు.

కానీ, రాను రాను ఇలాంటి కథలు వినిపించడం తగ్గిపోతోంది.

ప్రస్తుతం సరిహద్దుల వద్ద పాటిస్తున్న కఠిన నిబంధనలు, "కాల్చి చంపేయమనే" ఆదేశాలతో నార్త్ కొరియా విడిచిపెట్టి వెళ్లడం దాదాపు అసాధ్యమైపోయింది.

ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త చట్టంతో ఆ దేశంలో జీవితం మరింత దుర్భరం కాబోతోందని ఊహించడం కష్టమే కాదు.

ఒకటో, రెండో సినిమాలు చూసినంత మాత్రాన దశాబ్దాల తరబడి కొనసాగుతున్న సైద్ధాంతిక ఆలోచనలు మారిపోవని చోయ్ అంటున్నారు. ప్రభుత్వ ప్రచారాలు అసత్యమని నార్త్ కొరియా ప్రజలకు తెలుసునని ఆయన అభిప్రాయం.

"నార్త్ కొరియా ప్రజల్లో కోపం, మనోవేదన మొదలయ్యాయి. అయితే, ఎందువల్ల కోపం వస్తోందో వారికి తెలీదు. నేను చెప్పినా వారికి అర్థం కాదన్న సత్యం నా హృదయాన్ని ముక్కలు చేస్తోంది. వారిని నిద్ర లేపి, సత్యాన్ని చూపించగలవారు కావాలి" అని చోయ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)