వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?

ఫొటో సోర్స్, Science Photo Library
మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యావసర సరకులలో వంట నూనెల ధరలు వేగంగా పెరుగుతూ అందరినీ కలవరపెడుతున్నాయి.
గత మే నెలతో పోలిస్తే ప్రభుత్వ లెక్కల్లోనే ఏకంగా 62 శాతం మేర వంట నూనెల ధరలు పెరిగిపోవడం ప్రజలకు భారం అవుతోంది. ఓవైపు కరోనా ప్రభావం, మరోవైపు లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన కుటుంబాలు తీవ్రంగా సతమతమవుతున్నాయి.
అమాంతంగా పెరిగిన ధరల తాకిడిని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. వంట నూనెల పెరుగుదలపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే సమీక్షా సమావేశం కూడా నిర్వహించింది. కానీ, ధరలు మాత్రం అదుపులోకి రాలేదు.
6 నెలల క్రితం 90 రూపాయలుగా ఉన్న పామాయిల్ ఇప్పుడు 150 రూపాయలు దాటిపోయింది. సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా 110 నుంచి 180 రూపాయలకు చేరింది. నల్లొండలో లీటర్ ప్యాకెట్ ఏకంగా 185 రూపాయలుండగా, అమరావతిలో అది 180రూపాయలుంది. దాంతో వంటి ఇంటి బడ్జెట్ తారుమారవుతుందోనే ఆందోళన సామాన్యులతో పాటుగా మధ్యతరగతిలో ఎక్కువగా కనిపిస్తోంది.
ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అనేక కారణాలున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దేశంలో నూనె గింజల ఉత్పత్తి నామమాత్రం దాంతో అత్యధికంగా ఎగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది.
దిగుమతులే భారం అయ్యాయి..
"మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటాం. ఆరు నెలల కిందటి ధరలతో పోలిస్తే ఇప్పుడు 30 శాతం ధరలు పెరిగాయి. అక్కడ కూడా ధరలు పెరిగాయని చెబుతున్నారు. దిగుమతి సుంకాలు తగ్గించాలని చాలా సార్లు కోరాం. ఇప్పుడు ఈస్థాయిలో ధరలు ఒక్కసారిగా పెరిగినప్పుడైనా ప్రభుత్వాలు స్పందించాలి. అలాంటి నిర్ణయాలు ఇప్పుడున్న స్థితిలో తీసుకునే అవకాశాలు నామమాత్రం".
"వాటికి తోడు మనకు అదనంగా రవాణా ఖర్చులు పెరిగాయి. కరోనా కారణంగా ఉన్న కొద్దిపాటి సమయంలో రీటైలర్లకు పంపించడం కూడా సమస్య అవుతోంది. అన్నింటికీ పామాయిల్ దిగుమతి ఈసారి ఎక్కువగా చేసుకోవాల్సి రావడంతో అంతర్జాతీయ డీలర్లు దానిని అవకాశంగా మలచుకుంటున్నారు" అని కాకినాడకు చెందిన ఎడిబుల్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి గ్రంధి శ్రీమన్నారాయణ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పామాయిల్ అయితే మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ఎక్కువగా దిగమతి అవుతుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ మాత్రం బ్రెజిల్, రష్యా , ఉక్రెయిన్, అర్జంటీనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండడంతో ఆయిల్ ధరల పెరుగుదలకు ఓ కారణంగా చెబుతున్నారు.
పెరుగుతున్న పెట్రో ధరలతో రవాణా ఛార్జీలు, జీఎస్టీ భారం కలిసి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కారణమవుతున్నాయని అంటున్నారు.
దేశంలో 6రకాల వంట నూనెల నెలవారీ ధరలు పరిశీలిస్తే గడిచిన 11 ఏళ్లలోనే అత్యధికంగా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేదంటే తమ బడ్జెట్ తారుమారవుతోందని సామాన్యులు వాపోతున్నారు.
వంటనూనెకి అదనంగా వెయ్యి రూపాయల ఖర్చు
పెరిగిన ధరలతో అదనంగా వెయ్యి రూపాయలు వంట నూనెల కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని తాడేపల్లికి చెందిన గృహిణి దొంతిరెడ్డి విరూపాక్షం అన్నారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ, " ఆరు నెలల క్రితం 5లీ. ఫ్రీడమ్ ఆయిల్ టిన్ను కొంటే కేవలం రూ. 600 అలా ఉండేది. ఈనెలలో దానిని రూ. 1090 కి కొన్నాం. ఒక్క ఈ ఆయిల్ దగ్గరే రూ. 500 అదనం. ఇక ఇంట్లో ఇతర అవసరాల కోసం పామాయిల్ అవీ కొంటే అవి కూడా దాదాపు రెట్టింపు దిశలో ఉన్నాయి. ఇక డాల్డా వంటివి కూడా బాగా పెరిగిపోయాయి.
అన్నీ కలిపి నెలకు వెయ్యి రూపాయలు అదనంగా పెట్టాల్సి వస్తోంది. అసలే కష్టాల్లో ఉన్నాం. లాక్ డౌన్ వల్ల మా పని అంతంతమాత్రంగా మారిపోయింది. నెలకు నూనె ఖర్చు వెయ్యి రూపాయాలంటే మామూలు విషయమా" అంటూ వాపోయారు.
అయితే, దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గిపోయిన తరుణంలో ప్రభుత్వం వాటి సాగు పెంచేందుకు ప్రయత్నిస్తునట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
2020లో 3కోట్ల 30లక్షల మెట్రిక్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరిగితే ఈ ఏడాది అది కేవలం 1కోటి 20లక్షల మెట్రిక టన్నులకు పడిపోయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది వాటి దిగుబడి పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దేశీయ ఉత్పత్తులతో దిగుమతి సుంకాల భారం లేకుండా ధరలను నియంత్రించవచ్చని చెబుతున్నారు.
పనుల్లేవు.. ఖర్చులు పెరిగాయి..
"కరోనా లాక్ డౌన్ తో మా షాపులో ఉపాధి కోత వేశారు. ఉదయం పూట కొనుగోళ్లకు అవకాశం ఇస్తున్నారు. ఆ సమయంలో బట్టల షాపులకు వచ్చే వారు చాలా తక్కువ. దాంతో మా షాపు పూర్తిగా మూతేశారు. మేము 20 మంది పనులు కోల్పోయాం. ఇప్పుడు నెలసరి సరుకులు కొనుక్కుందామంటే ఆయిల్ ధరలే అమాంతంగా పెంచేశారు.
పెట్రోల్ ఇతర నిత్యావసరాల ధరలు ఓవైపు పెరిగితే వంట నూనెలలు గతంలో ఎన్నడూ ఇలా పెరగలేదు. పెరిగిన ధరలతో మాకు చాలా ఇబ్బందిగా ఉంది పనుల్లేని సమయంలో పెరిగిన ఈ ఖర్చులతో జీవనమే కష్టం అవుతోంది" అని విజయవాడకు చెందిన పెమ్మాడి సురేష్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









