ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్ మానేస్తే కానీ... ఆ దేశంలో స్మోకింగ్ తగ్గదా?

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తరచూ బహిరంగంగా సిగరెట్ కాల్చుతూ కనిపించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

దేశాధ్యక్షుడే ఎన్నో సార్లు బహిరంగంగా సిగరెట్ కాల్చుతూ కనిపిస్తూ తప్పుడు సందేశాలను పంపిస్తుంటే, అత్యధికంగా ధూమపానం చేసే దేశంలో ఆ వ్యసనాన్ని ఎలా కట్టడి చేస్తారు.

ఉత్తర కొరియాలో ధూమపానం బాగా పెరిగింది. దేశంలో ఇప్పుడు ధూమపానానికి వ్యతిరేకంగా అనేక ప్రచారాలు చేపట్టారు. అక్కడ సగం మంది పురుషులు సిగరెట్ కాలుస్తారని, స్త్రీలు అసలు కాల్చరని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు తెలుపుతున్నాయి.

ఉత్తర కొరియాలో ఈ నెల ప్రారంభంలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రజలకు మరింత నాగరికమైన, పరిశుభ్రమైన వాతావరణం అందుబాటులో ఉండేలా కొన్ని నిబంధనలను కూడా ప్రవేశపెట్టారు.

కానీ, ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తరచూ చేతిలో సిగరెట్‌తో ప్రభుత్వ మీడియాలో కనబడుతుంటారు. ప్రజలకు తప్పుడు సందేశాలిచ్చే ఇలాంటి అంశాలను ఎదుర్కొంటూ, ఆ దేశం చేపట్టిన ధూమపాన నిరోధక చర్యల లక్ష్యాలేంటి?

ఉత్తర కొరియాలో స్మోకింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పురుషులు స్మోకింగ్ చేయడం సర్వ సాధారణం... మహిళలు ఆ పని చేస్తే మహాపరాధంగా భావిస్తారు

కొత్త చట్టం ఏం చెబుతోంది?

నవంబర్ నెల ప్రారంభంలో ఆమోదించిన పొగాకు నిషేధ చట్టం ప్రకారం...దేశ ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు దేశంలోని అన్ని సంస్థలు, పౌరులు కూడా కొన్ని నియమాలను పాటించాలి.

దేశ పొగాకు నిషేధ విధానానికి అనుగుణంగా సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకాలపై చట్టపరమైన, సామాజిక నియంత్రణలను కఠినతరం చేసింది.

అంతే కాకుండా, రాజకీయ, సైద్ధాంతిక చర్చలు జరిపే ప్రదేశాల్లోనూ, నాటకాలు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ రవాణా సౌకర్యాలలను వినియోగించే ప్రదేశాల్లోనూ సిగరెట్లు కాల్చకూడదని నియమం విధించింది. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలిస్తే జరిమానా ఉంటుందని సమాచారం. కానీ ఎటువంటి జరిమానా ఉంటుందనేది ప్రభుత్వ మీడియా తెలుపలేదు.

ఈ కొత్త చట్టం ప్రవేశ పెట్టిన కొన్ని రోజుల తరువాత...పొగ త్రాగేవారికి కరోనావైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నదని నిపుణులు చెబుతున్నారంటూ ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ ఒక కథనాన్ని ప్రచురించింది.

ధూమపానానికి వ్యతిరేకంగా ప్రచారాలు ఎప్పుడు మొదలయ్యాయి?

2005లో డబ్ల్యూహెచ్ఓ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్‌ పొగాకు నియంత్రణ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత ఉత్తర కొరియాలో ధూమపానానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభమైంది.

దేశ పొగాకు నియంత్రణా చట్టం ప్రకారం సిగరెట్ ప్యాకెట్ల మీద హెచ్చరికతో కూడిన లేబుల్స్ అతికించడం, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం వంటి చర్యలు చేపట్టారు.

2019లో ధూమపానం వలన కలిగే హాని గురించి చురుకైన ప్రచారం జరిగిందని కేసీఎన్ఏ తెలిపింది. విదేశీ పొగాకు దిగుమతిని నియంత్రించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ మీడియా తెలిపింది.

పొద్దస్తమానం సిగరెట్లు తాగేవారిని 'అనాలోచితమైన వ్యక్తులు'గా కొరియన్ సెంట్రల్ టెలివిజన్ అభివర్ణించిందని డైలీ ఎన్‌కే వెబ్‌సైట్ తెలిపింది.

పొగ త్రాగడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ ఈ ఏడాది ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. "ధూమపాన వ్యతిరేక ప్రచారానికి సైన్స్, సమాచారం చాలా ముఖ్యమని" అరిరాంగ్-మియరీ తెలిపింది.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Korean Central Television

ఫొటో క్యాప్షన్, కిమ్ 2018లో బీజింగ్‌లో పర్యటించినప్పుడు ఉత్తర కొరియా ఎంబసీలో ఇలా కనిపించారు

చైన్ స్మోకింగ్ లీడర్

ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సిగరెట్లు ఎక్కువ తాగుతారు. ఎక్కడికెళ్లినా చేతిలో సిగరెట్‌తో దర్శనమిస్తారు. విద్యార్థులను కలవడానికి వెళ్లినా, మిసైల్ పరీక్షకు వెళ్లినా చేతిలో సిగరెట్ తప్పనిసరి.

2019 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు వియత్నాంకు రైల్లో ప్రయాణించినప్పుడు విరామ సమయంలో సిగరెట్ కాలుస్తూ కెమేరా కన్నుకు చిక్కారు. ఆయన సోదరి కిమ్ యో-జోంగ్ ఆయన కోసం యాష్ ట్రే పట్టుకుని నిల్చున్నారు.

కిమ్ భార్య రి సోల్-జు..సిగరెట్లు మానేయమని ఆయనకు ఎన్నోసార్లు చెప్పి చూశారని, కానీ, ఆయన ఆ అలవాటు మానలేదని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి.

ఉత్తర కొరియాలో స్త్రీలు సిగరెట్లు కాల్చరా?

ఉత్తర కొరియాలో పొగ త్రాగేవారి సంఖ్య చాలా ఎక్కువ. 2019 డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం దేశంలో 15 ఏళ్లు దాటిన పురుషుల్లో 46.1% సిగరెట్లు కాలుస్తారని తేలింది.

అయితే, స్త్రీలు అస్సలు సిగరెట్లు కాల్చరని ఈ గణాంకాలు చెబుతున్నాయి. స్త్రీలు సిగరెట్లు కాలిస్తే, వారిని చిన్నచూపు చూస్తారన్న కారణంగానే ఆ దేశంలో స్త్రీలు పొగాకుకు దూరంగా ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

"సాంస్కృతికంగా, సాంఘికంగా స్త్రీలు సిగరెట్ కాల్చడమనేది, ముఖ్యంగా పెళ్లికాని యువతులు పొగాకు త్రాగడం ఉత్తర కొరియాలో నిషిద్ధమ"ని కొరియానాకనెక్ట్ డైరెక్టర్ జేమ్స్ బ్యాన్‌ఫిల్ తెలిపారు. కొరియానాకనెక్ట్ ఉత్తర కొరియాలో పనిచేస్తున్న ప్రభుత్వేతర అమెరికా సంస్థ.

కానీ, కొందరు వయసు పైబడిన స్త్రీలు ప్రైవేట్‌గా సిగరెట్ కాలుస్తారని ఆయన అన్నారు.

"ఇక్కడ పొగాకు తాగడం పురుషులకు మాత్రమే పరిమితమని భావిస్తారు. ఈ దేశంలో సిగరెట్ అలవాటు పురుషుల్లో సర్వసాధారణమని, సాంస్కృతికంగా ఆమోదించే విషయమని" ఎన్‌కే న్యూస్ వెబ్‌సైట్ జర్నలిస్ట్ మిన్ చావో చోయ్ తెలిపారు.

ధూమపానానికి వ్యతిరేకంగా ఈ దేశంలో స్త్రీలు గొంతెత్తుతారు. అనేక ప్రచారాల్లోనూ, టీవీ చర్చల్లోనూ పాల్గొంటూ సిగరెట్ తాగడానికి వ్యతిరేకంగా గళం విప్పుతారు.

ఏది ఏమైనా, ఈ దేశంలో ధూమపానం అనేకమంది ప్రాణాలను హరిస్తోంది. ప్రతీ ఏడాది సుమారు 71,300 మంది పొగాకు బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని టొబాకో అట్లాస్ సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి.

దాదాపు ఇంతే జనాభా ఉన్న ఆస్ట్రేలియాలో ఏడాదికి పొగాకు వలన 22,200 మంది చనిపోతున్నారు. ఈ సంఖ్యతో పోలిస్తే నార్త్ కొరియాలో పొగాకు అధిక సంఖ్యలో ప్రాణాలను హరిస్తోందని తెలుస్తోంది.

పొగాకు వ్యతిరేక ప్రచారాలు సాధించిన ప్రగతి ఏమిటి?

ధూమపానానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్యలు ప్రభావం చూపుతున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"సిగరెట్ కాల్చే మగవారి సంఖ్య తగ్గింది. 2009లో నమోదైన 52.3 శాతంనుంచీ ప్రస్తుతం 46.1 శాతానికి తగ్గింది. ప్యాంగాంగ్‌లో సిగరెట్ కాల్చేవారి సంఖ్య తగ్గుతుండడం గమనిస్తున్నాను" అని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో కొరియా హెల్త్ పాలసీ ప్రోజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న కీ బీ పార్క్, బీబీసీ మానిటరింగ్‌కు తెలిపారు.

అయితే, ఈ విషయంపై భినాభిప్రాయాలు వెలువడుతున్నాయి. "ఇతర దేశాల్లాగే ఉత్తర కొరియా కూడా అనేక పొగాకు వ్యతిరేక విధానాలను ప్రవేశపెట్టింది. కానీ విధానాలకు, వాస్తవంలో జరిగే విషయాలను మధ్య చాలా పెద్ద వ్యత్యాసం కనబడుతోంది" అని మిన్ చావో చోయ్ అభిప్రాయపడ్డారు.

పొగాకు అలవాటు మానిపించాలంటే ఇంకా బలమైన నిరోధకాలు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"పొగాకు వ్యతిరేక ప్రచారాలు బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగేవారి సంఖ్యను తగ్గిస్తాయి కానీ మనుషుల్లో సిగరెట్ అలవాటు మాన్పించడానికి సరైన ప్రోత్సాహకాలుగానీ, విధానాలుగానీ లేవు" అని బ్యాన్‌ఫిల్ తెలిపారు.

అయితే, దేశాధ్యక్షుడే సిగరెట్ అలవాటు మానేసి, ప్రజలకు స్ఫూర్తిగా నిలిస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)