టైటానిక్: 111 ఏళ్ల కిందట మునిగిపోయిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...

టైటానిక్ ఓడ

ఫొటో సోర్స్, Getty Images

1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి.. 15వ తేదీ తెల్లవారుజామున టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయింది.

ఇది ఇంగ్లాండ్‌లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరింది.

కానీ గమ్యస్థానం చేరకముందే మంచు శకలాన్ని ఢీకొట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది.

తనతో పాటు 1,500కు పైగా మందిని జల సమాధి చేసుకుంది.

అయితే, దాదాపు 700మంది ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగారు.

వారిని రక్షించడంలో టైటానిక్‌లో ఉన్న రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకపాత్ర పోషించింది.

టైటానిక్ ఓడ

ఫొటో సోర్స్, PA

700 మంది ప్రాణాలు ఎలా దక్కాయంటే...

1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ సముద్రం దాటుతుండగా రాత్రి 11.40 గంటలకు టైటానిక్ ఒక మంచు కొండను ఢీకొట్టింది.

ఓడకు చిల్లు పడి, నీరు లోపలికి రావడం మొదలైంది.

టైటానిక్‌కు రూపకల్పన చేసిన థామస్ ఆండ్రూస్ కూడా ఆ సమయంలో ఓడలో ఉన్నారు.

మంచు కొండ వల్ల ఓడకు జరిగిన నష్టాన్ని పరిశీలించిన ఆయన.. టైటానిక్ మునిగిపోతుందని కెప్టెన్‌కు చెప్పారు.

టైటానిక్‌లోని మార్కోనీ వైర్‌లెస్ టెలీగ్రాఫ్ యంత్రాన్ని ఉపయోగించి రాత్రి 12.15 నుంచి సాయం కోసం సందేశాలు పంపడం మొదలుపెట్టారు.

700 మంది ప్రాణాలు దక్కడానికి ఈ సందేశాలే కారణం.

మోర్స్ కోడ్ రూపంలో ఈ సందేశాలు వెళ్లాయి.

మోర్స్ కోడ్ చుక్కలు, గీతల రూపంలో ఉంటుంది.

షార్ట్ వేవ్ రేడియో తరంగాల రూపంలో బీప్‌ సౌండ్‌ల‌తో దీన్ని పంపిస్తారు.

టైటానిక్ ఓడ, జాక్ ఫిలిప్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జాక్ ఫిలిప్స్

టైటానిక్ మునిగిపోతోందంటూ సందేశాలు

తమ ఓడ మంచు కొండను ఢీకొట్టిందని, మునిగిపోబోతుందని కార్పాతియా అనే ఓడకు, ఫ్రాంక్‌ఫర్ట్ అనే జర్మనీ ఓడకు టైటానిక్ రేడియో ఆపరేటర్ జాక్ ఫిలిప్స్ సందేశం పంపారు.

''ప్రయాణికులను చిన్న పడవల్లోకి ఎక్కిస్తున్నాం. మహిళలు, చిన్నారులను వీటిలోకి ఎక్కిస్తున్నాం. ఎక్కువ సేపు ఉండలేం. విద్యుత్ నిలిచిపోనుంది'' అని ఓసారి.. ''టైటానిక్ నుంచి మాట్లాడుతున్నాం. ఇంజన్ రూమ్‌లోకి నీళ్లు వచ్చేశాయి'' అని ఇంకోసారి ఇలా తమ పరిస్థితి గురించి జాక్ ఫిలిప్స్ సందేశాలు పంపారు.

''యూ ఫూల్. ఆగిపోండి. దూరంగా ఉండండి'' అని దూరంగా ఉన్న ఓ ఓడకు టైటానిక్ నుంచి సందేశం వెళ్లింది. సదరు ఓడ ఫ్రాంక్‌ఫర్ట్ అయ్యుండొచ్చని, అప్పుడు రెండింటి మధ్య సందేశాలను అర్థం చేసుకోవడంలో అయోమయం చోటుచేసుకుని ఉండొచ్చని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

జాక్ ఫిలిప్స్ ఈ ప్రమాదం నుంచి బయటపడలేదు.

ఓడ కెప్టెన్ విధుల నుంచి ఆయనను విడుదల చేసినప్పటికీ, ఆయన అక్కడే ఉండిపోయారు.

ఫిలిప్స్ ధైర్య సాహసాల గురించి, టైటానిక్ విషాదానికి సంబంధించిన కథల్లో చాలా సార్లు ప్రస్తావించారు.

టైటానిక్ నుంచి వచ్చిన సందేశాలను ఆ సమయంలో మిగతా ఓడలు నమ్మలేకపోయాయి.

అర్ధరాత్రి దాటాక 2.10 గంటలకి టైటానిక్‌లో విద్యుత్ నిలిచిపోయింది.

మార్కోని పనిచేయడం ఆగిపోయింది. ఓడ ముందు భాగం అప్పటికే నీళ్లలో మునిగి, వెనక భాగం గాల్లోకి లేచింది.

మరో పది నిమిషాల్లో అంటే.. 2.20 గంటలకి ఓడ రెండు ముక్కలుగా విరిగిపోయింది.

ఆ రెండు ముక్కలూ అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయాయి.

అవి మునిగిపోయిన తర్వాత దాదాపు రెండు గంటలకు కార్పాతియా ఓడ ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుంది.

లైఫ్ బోట్స్ ద్వారా ఓడ నుంచి బయటపడి, ప్రాణాలతో మిగిలిన 700 మందిని ఎక్కించుకుంది.

గడ్డ కట్టుకుపోయేంత చల్లగా ఉన్న అట్లాంటిక్‌ సాగర జలాల్లో 1,500 మందికి పైగా ఆ రాత్రి జల సమాధి అయ్యుంటారని అంచనాలు ఉన్నాయి.

మార్కోని వైర్‌లెస్ వ్యవస్థ, టైటానిక్ ఓడ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టైటానిక్ ఓడలోని మార్కోని వైర్‌లెస్ వ్యవస్థ

1985లో టైటానిక్ శిథిలాలను గుర్తించారు.

కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్‌కు 740 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల లోతున మునిగిన చోటనే టైటానిక్ రెండు ముక్కలూ కనిపించాయి.

టైటానిక్ శిథిలాలను వెలికితీసే హక్కుల్ని 1980లో ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీ పొందింది.

నౌక అవశేషాల నుంచి మార్కోని టెలీగ్రాఫ్‌ను వెలికి తీసేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీ ఎప్పటి నుంచో వాదిస్తూ వచ్చింది.

కానీ ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్మియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) సహా అనేక సంస్థలు, వ్యక్తులు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు.

చివరికి మార్కోని టెలీగ్రాఫ్‌ను వెలికి తీసేందుకు అమెరికా కోర్టు గతేడాది అనుమతి ఇచ్చింది.

అయితే, నౌక శిథిలాలు చెదిరిపోకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.

1987 నుంచి ఆర్ఎంఎస్ టైటానిక్ దాదాపు 5,500 కళాఖండాలను శిథిలాల నుంచి బయటకు తీసింది.

వెండి పాత్రలు, పింగాణి పాత్రలు, బంగారు నాణేలు వంటివి వీటిలో ఉన్నాయి.

ఇప్పటివరకూ ఎనిమిదిసార్లు ఆ సంస్థ అక్కడికి పరిశోధక యాత్రలు చేపట్టింది.

అండర్ వాటర్ రోబోను వాడి టైటానిక్ నుంచి మార్కోని వైర్‌లెస్ సిస్టమ్‌ను వెలికితీయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆర్ఎంఎస్ టైటానిక్ వెల్లడించింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

అయితే, టైటానిక్ శిథిలాల లోపల ఇంకా మృతదేహాలుండే అవకాశం ఉందని, రేడియోని వెలికితీసే ప్రయత్నాలతో వాటిని కదిలించినట్లవుతుందని అమెరికాలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) వాదిస్తోంది.

''మునిగిపోయే క్రమంలో టైటానిక్ లోపలికి నీళ్లు వచ్చేసినా, కొన్ని చోట్లలో నీరు, పీడనం, ఉష్ణోగ్రత అలాగే స్థిరంగా ఉండిపోవచ్చు. నీటి ప్రవాహం లేక, అవి అలాగే విడిగా మిగిలిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వందల ఏళ్లైనా శరీర భాగాలు అలాగే ఉండే అవకాశం ఉంది'' అని ఆ సంస్థ అంటోంది.

''చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉన్న టైటానిక్‌ను ఇంకా ఆలస్యం చేస్తే మనం కాపాడుకోలేకపోవచ్చు. టైటానిక్‌కు సంబంధించి మిగిలిన అవశేషాలు భావి తరాలకు ఎంతో జ్ఞానాన్ని పంచుతాయి. మార్కోనీ రేడియో వ్యవస్థ వల్ల ఆ ప్రమాదం నుంచి ఎంతో మంది బతికి బయటపడ్డారు. ఆ వ్యవస్థ ద్వారా పంపిన సందేశాల వల్ల ఆ రోజు చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు వారి తర్వాతి తరాలు కూడా మన మధ్య ఉన్నాయి'' అని ఆర్ఎంఎస్ టైటానిక్ సంస్థ అధ్యక్షుడు బ్రెటన్ హంచక్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)