టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు? కలకత్తా వచ్చిన వ్యక్తి ఏమయ్యారు

టైటానిక్

ఫొటో సోర్స్, LP FILMS

ఫొటో క్యాప్షన్, టైటానిక్ ఓడ ప్రమాదం నుంచి తప్పించుకున్న చైనీయులు
    • రచయిత, జావోయిన్‌ ఫెంగ్‌, యెట్సింగ్‌ వాంగ్‌
    • హోదా, బీబీసీ వరల్డ్

టైటానిక్‌ నౌక 1912, ఏప్రిల్‌లో అట్లాంటిక్‌ సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

లైఫ్‌బోట్లు ఉపయోగించిన వారిలో కొందరు క్షేమంగా ఒడ్డుకు చేరగలిగారు. ప్రమాదంలో ఇంకా ఎవరైనా బతికి ఉన్నారేమోనని వెతకడానికి వచ్చిన సెర్చ్‌ బృందానికి ఓ వ్యక్తి కనిపించారు.

ఒక తలుపు చెక్కను పట్టుకుని వణుకుతూ కనిపించిన ఆయన ఓ చైనా జాతీయుడు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ఆరుగురు చైనీయులలో ఫాంగ్‌లాంగ్ ఒకరు. ఈయనను రక్షించే ఘట్టాన్ని 1997లో విడుదలైన టైటానిక్‌ సినిమాలో చూపించారు.

మునక నుంచి తప్పించుకోగలిగినా, తర్వాత కూడా ఆయనకు కష్టాలు ఆగలేదు.

ప్రమాదం నుంచి ప్రాణాలతో గట్టెక్కిన తర్వాత 24 గంటల్లో వారిని న్యూయార్క్ సమీపంలోని ఎల్లిస్‌ దీవికి చేర్చారు. అయితే అప్పటికే అమలులో ఉన్న చైనీస్ ఎక్స్‌క్లూజన్ యాక్ట్‌ ప్రకారం వారిని అమెరికా నుంచి పంపించివేశారు.

చైనా దేశస్తులు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు అమెరికా ఈ వివాదాస్పద చట్టాన్ని చేసింది.

అమెరికాలో జాతి వివక్షకు, వలస వ్యతిరేకతకు ఈ ఘటన అద్దం పడుతుంది.

టైటానిక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టైటానిక్ ఓడ

ఆ ఆరుగురు చైనీయులు ఎవరు ?

టైటానిక్ ప్రమాదం నుంచి బైటపడిన ఆ ఆరుగురు చైనీయుల పేర్లు లీ బింగ్, ఫాంగ్‌లాండ్, చాంగ్‌ చిప్, అహ్‌ లామ్, చుంగ్‌ఫూ, లింగ్‌ హీ.

వారంతా ఉపాధి కోసం కరీబియన్ దీవులకు వెళుతున్నట్లు భావిస్తున్నారు. ''ఎవరికీ అంతగా తెలియని చిన్న బృందం అది'' అని 'ది సిక్స్‌' సినిమా దర్శకుడు ఆర్థర్‌ జోన్స్‌ బీబీసీతో అన్నారు.

టైటానిక్‌ మునక నుంచి బయటపడిన వారి పేర్లను మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అయితే వీరి ప్రస్తావన చాలా తక్కువగా కనిపించింది.

వీళ్లు చైనా వారు కావడంతో మీడియాలో వీరి పట్ల వివక్ష కనిపించిందని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

'ది బ్రూక్లిన్ ఈగల్' అనే డైలీ వీరిని '' లైఫ్‌బోట్లలోకి దూకిన జంతువులు''గా అభివర్ణించింది. ప్రమాదం జరుగుతోందని తెలియగానే లైఫ్‌బోట్లలోని సీట్ల కింద దాక్కున్నారని పేర్కొంది.

అయితే ఈ ఘటనలపై డాక్యుమెంటరీలు నిర్మించిన బృందం జరిపిన పరిశోధనలో ఇదంతా అవాస్తవమని తేలింది. టైటానిక్ పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు తేడా లేదని, వివక్ష కొనసాగుతూనే ఉందని కొందరు అన్నారు. ''వలస వెళ్లేవారిని మీడియా బలిపశువును చేస్తోంది.'' అని దర్శకుడు జోన్స్ అన్నారు.

లైఫ్‌బోట్లలో సులభంగా స్థానం సంపాదించేందుకు కొందరు చైనీయులు మహిళల వేషంలో వచ్చారని ఆనాటి పత్రికలు రాశాయి.

అయితే ఈ వాదనలకు ఎలాంటి ఆధారం లేదని టైటానిక్‌ చరిత్ర కారుడు టిమ్‌ మాల్టిన్ స్పష్టం చేశారు.

టైటానిక్

ఫొటో సోర్స్, LP FILMS

''ఈ సంఘటనపై కొన్ని మీడియ సంస్థలు, వ్యక్తులు అబద్ధపు కథనాలను సృష్టించారు'' అని ఆయన బీబీసీతో అన్నారు.

టైటానిక్‌ ఘటన నుంచి బైటపడ్డ కొందరు వ్యక్తులు చేసిన ప్రచారంతో ఈ కథనాలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. ప్రమాదం రోజు మహిళలు, పిల్లల రక్షణకే అధిక ప్రాధాన్యమిచ్చారని సామాన్య ప్రజలు కూడా నమ్మారు.

ఓడ మునిగిన సమయంలో చాలామందిని రక్షించడంలో చైనీయులు సాయపడ్డారని మాల్టిన్ చెప్పారు. ఓడ మునిగిన తర్వాత తలుపును పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్న ఫాంగ్‌లాంగ్, లైఫ్‌బోట్ ద్వారా చాలామందిని ఒడ్డుకు చేర్చడంలో సాయపడ్డారని ఆయన వెల్లడించారు.

టైటానిక్
ఫొటో క్యాప్షన్, ఆర్ధర్ జోన్స్ బృందం

ప్రమాదం తర్వాత వారు ఏమయ్యారు ?

అమెరికా తిరస్కరించడంతో ఆ ఆరుగురు చైనీయులు క్యూబా వెళ్లిపోయారు. అక్కడి నుంచి యూకే వచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్‌లో నావికుల కొరత ఎక్కువగా ఉండటంతో వారికి ఉపాధి దొరికింది.

న్యుమోనియ కారణంగా చాంగ్‌ చిప్ 1914లో మరణించారు. లండన్‌లో ఓ మారుమూల ప్రాంతంలో ఆయన్ను సమాధి చేశారు.

మిగిలిన వారంతా 1920 వరకు కలిసి ఒకేచోట పని చేశారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్ధిక సంక్షోభం తలెత్తడంతో వలసదారులపై స్థానికులలో వ్యతిరేకత మొదలైంది.

వారిలో కొందరు బ్రిటన్‌ దేశస్తులను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కన్నారు. అయితే వలసదారులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలతో వారు తమ కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది.

''అందులో వారి తప్పేమీ లేదు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా వారు ఏమీ చేయలేకపోయారు'' అన్నారు జోన్స్.

అహ్‌లామ్‌ను హాంకాంగ్ పంపించగా, లింగ్‌ హీ కలకత్తా వచ్చే ఓడ ఎక్కించారు.

లీ బింగ్‌ తర్వాత అక్కడి నుంచి కెనడా వలస వెళ్లారు. ఫాంగ్‌లాంగ్ చివరకు తనను తిప్పిపంపిన అమెరికాలోనే స్థిరపడగలిగారు.

విదేశీయుల మీద వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో, తాను టైటానిక్‌ ప్రమాదం నుంచి బైటపడ్డ వ్యక్తి అన్న విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడేవారని ఫాంగ్ అన్నారు.

టైటానిక్
ఫొటో క్యాప్షన్, ఫాంగ్‌లాంగ్ కుమారుడు టామ్‌ఫాంగ్

చరిత్ర పునరావృతం

టైటానిక్ పడవ మునిగిన 50 ఏళ్ల తర్వాత టామ్‌ ఫాంగ్ పుట్టారు. ఆయన ఫాంగ్‌లాంగ్‌ కుమారుడు.

'' ఆయన మాకేమీ ఆ విషయాలు చెప్పలేదు. నాకే కాదు..మా అమ్మకు కూడా'' అన్నారు ఫాంగ్‌

1985లో ఫాంగ్‌లాంగ్ మరణించారు. అప్పటికి ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన మరణించిన 20 ఏళ్ల తర్వాత తాను టైటానిక్‌ ఓడ బాధితుడి కుమారుడినని తెలుసుకోగలిగారు.

''వారు పడవల అడుగున దాక్కున్నారని, మహిళల డ్రెస్సులు వేసుకుని నమ్మించారని అప్పట్లో కథలు కథలుగా ప్రచారం చేశారు.'' అని ఆయన అన్నారు.

పరిశోధనా బృందం సభ్యులు ఈ ఆరుగురు చైనీయుల వారసులను కలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఇప్పటికీ వారు ఈ విషయాలపై మాట్లాడటానికి అయిష్టంగా ఉన్నారు. సంఘటన జరిగి వందేళ్లు దాటినా, వారు ఇప్పటికీ ఆ బాధను మర్చిపోలేకపోతున్నారు.

అమెరికాలోని విస్కాన్సిన్‌ రాష్ట్రంలో పెరిగిన ఫాంగ్, జాతి వివక్షకు సంబంధించి తాను అనేక సంఘటనలను చూశానని చెబుతారు.

ఆయన నివసిస్తున్న ప్రాంతంలో ఆయన తండ్రి వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. తన పేరు అభ్యంతరకరంగా ఉచ్ఛరించిన ఓ వ్యక్తి ముఖంపై తన తండ్రి పంచ్ ఇచ్చిన విషయాన్ని ఫాంగ్ గుర్తు చేసుకున్నారు.

''ఆయన (ఫాంగ్‌లాంగ్) తనపట్ల కొందరు వివక్ష చూపుతున్నారు అనే విషయం తెలుసుకునే వరకు చాలా మంచి వ్యక్తి'' అన్నారు ఫాంగ్.

టైటానిక్

ఫొటో సోర్స్, Getty Images

ఈ సంఘటన జరిగి వందేళ్లు అయినా ఇప్పటికీ ఆసియన్ల పట్ల జాతి వివక్ష కనిపిస్తూనే ఉంది.

ఒక్క అమెరికాలోనే వేలమంది ఆసియన్లపై దాడులు జరిగినట్లు ఇటీవల రిపోర్టులు వచ్చాయి. గొడవలు పడటం, తిట్టడం, దాడులు చేయడం లాంటి వేధింపులన్నీ ఇందులో ఉన్నాయి.

టైటానిక్ షిప్‌లో తన తండ్రికి ఎదురైన పరిణామాలను ఇప్పటి తరానికి గుర్తు చేయడం ద్వారా ప్రస్తుత పరిణామాలపట్ల వారికి అవగాహన కల్పించ వచ్చని ఫాంగ్ అంటున్నారు.

''చరిత్ర తెలుసుకోకపోతే, అది పునరావృతం అవుతూనే ఉంటుంది'' అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)‌