మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు

మావోయిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

మావోయిస్టులకు, ప్రభుత్వ భద్రతా బలగాలకు మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ మావోయిస్టులు చాలా చోట్ల తమ ఉనికిని బలంగా చాటుతున్నారు. అయితే, మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో జనజీవనం ఎలా ఉంటుంది? ఎందుకు కొందరు ఆదివాసీలు తుపాకులు అందుకుంటున్నారు? ఈ విషయాలను స్వయంగా పరిశీలించి, అర్థం చేసుకునేందుకు గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో ఏడాదిన్నరపాటు గడిపారు అల్పా షా.

ఒక సామాజిక శాస్త్రవేత్తగా ఝార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులకు మంచి పట్టున్న ఆదివాసీ ప్రాంతాల్లో ఏడాదిన్నరపాటు గడిపిన అల్పాషా అనుభవాలు... ఆమె మాటల్లోనే:

ఓ రోజు ఎటు చూసినా చిమ్మచీకటి. దారి చూసుకునేందుకు చేతిలో కనీసం టార్చిలైట్ కూడా లేదు. వరి పొలాల్లోంచి కవాతు చేసుకుంటూ అడవి వైపు వెళ్లాం. నా కంటి రెప్పలు ఉబ్బిపోయాయి, కళ్లు తెరవడం కూడా చాలా కష్టమైంది.

ఆ రోజు ఆయుధాలతో ఉన్న మావోయిస్టు గెరిల్లా దళంతో కలిసి వెళ్లాను. ఆదివాసీ, గ్రామీణ పేద హక్కుల కోసం తాము పోరాడుతున్నామని వారు చెప్పారు. వాళ్లతో కలిసి నడవటం అది నాకు ఏడో రాత్రి. ఒక్కో రాత్రి 30 కిలోమీటర్ల దూరానికి పైగా నడిచేవాళ్లం. సాయంత్రం చీకటి పడ్డాక మాత్రమే వారు తిరిగేవారు. పగటి పూట పెట్రోలింగ్ నిర్వహించే ప్రభుత్వ బలగాల కంట పడకుండా ఉండేందుకు అలా చేసేవారు.

తిరిగి తిరిగి నా శరీరం పూర్తిగా అలసిపోయింది. భుజాలు చచ్చుబడిపోయాయి. కాళ్లు తిమ్మిరెక్కాయి. తల వేలాడేశాను. నిస్సత్తువతో తూగుతూ ఉన్నాను. స్పృహ కోల్పోయినంత పనైంది. నా కాళ్లు ఎటు కదులుతున్నాయో నాకే తెలియదు.

మావోయిస్టులు దాన్ని "స్లీప్‌వాకింగ్" అంటారు. అంతగా నడిచినా వాళ్లలో ఎవరూ ఇబ్బంది పడలేదు. దాంతో వాళ్లకు అది అలవాటేనని నాకు అనిపించింది.

మావోయిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన సంఘర్షణలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత్‌లో కొంత మంది పేదలు ఎందుకు ఆయుధాలు పడుతున్నారన్నది స్వయంగా పరిశీలించి, అర్థం చేసుకోవాలని అనిపించింది. 2010లో పరిశోధన చేస్తున్న సమయంలో ఆ ఆలోచన వచ్చింది.

త్వరలోనే నేను లండన్ వెళ్లిపోతున్నాను. వాళ్ల జీవన ప్రయాణం మాత్రం అలాగే కొనసాగుతుంటుంది. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు మావోయిస్టులు ఎప్పుడూ తమ ఆవాసాలను మారుస్తుంటారు. ఒకే చెట్టుకింద రెండుమూడు రోజులకు మించి నిద్ర కూడా చేయరు.

దాదాపు 50 ఏళ్లుగా మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య పోరు కొనసాగుతోంది. 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీ అనే గ్రామంలో తిరుగుబాటుతో ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంఘర్షణలో ఇప్పటి వరకు 40 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అంచనా.

ప్రభుత్వ దళాలు ఎంతగా అణచివేసినా, మావోయిస్టులు మళ్లీ పుట్టుకొచ్చారు. దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాల్లోని అడవుల్లో పట్టు సాధించారు.

నక్సలైట్ ఉద్యమాన్ని "అర్ధ భూస్వామ్య" వ్యవస్థను రూపుమాపేందుకు మార్క్సిస్టు భావజాలంతో పేద, ఆదివాసీ, అణగారిన వర్గాలవారు ప్రారంభించిన ఉద్యమంగా చెబుతుంటారు. భారత ప్రభుత్వం మాత్రం దాన్ని ఒక "తీవ్రవాద" గ్రూపుగా పరిగణిస్తోంది.

మావోయిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంది.

కుల మతాలు లేవు

2010లో ఒక రోజు బిహార్‌లోని అడవుల్లో రహస్య గెరిల్లా సదస్సుకు వెళ్లాం.

ఆ సమావేశం కోసం వాళ్లు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక క్యాంపు భిన్నంగా ఉంది.

సదస్సు జరిగే గుడారాల వద్దకు ఎలా వెళ్లాలో కొన్ని గుర్తులు పెట్టారు. అక్కడ దళ సభ్యుల కోసం ఒక గది, కాన్ఫరెన్స్ గది, వైద్య శిబిరం, టైలర్ (దర్జీ) గుడారం, "కంప్యూటర్ రూం", వంట గది ఉన్నాయి.

సమీప గ్రామాల్లో ఎక్కడా మరుగు దొడ్లు లేవు. కానీ, ఈ సదస్సు దగ్గర మాత్రం అట్టలతో ఏర్పాటు చేసిన బాత్రూంలు, మరుగుదొడ్డి గుంతలు ఉన్నాయి.

ఆ రహస్య "నిర్మాణాన్ని" కొన్ని గంటల్లోనే మరో వ్యక్తి గుర్తించలేకుండా, ఏమాత్రం ఆనవాళ్లు దొరక్కుండా తొలగించేయవచ్చు.

ఈ గెరిల్లా దళంలో కుల, మత, లింగ భేదాలు ఏమాత్రం కనిపించలేదు. కుల, మతాలను సూచించే తోకలు వాళ్ల పేర్లలో ఉండవు. ఆ దళంలో చేరిన వారందరినీ "కామ్రేడ్" అని పిలుస్తారు.

అందరూ అన్ని పనులూ చేస్తారు. మహిళలు, పురుషులు అందరూ వంట చేస్తారు. కింది స్థాయి కేడర్‌కు చెందిన వారు చదవడం నేర్చుకుంటారు. దళ నాయకులు కూడా మరుగుదొడ్డి గుంతలు తవ్వుతారు.

మావోయిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత కొన్నేళ్లుగా ప్రభుత్వ బలగాలు పెద్దఎత్తున కూంబింగులు నిర్వహిస్తున్నాయి.

అయితే, కొన్నేళ్లుగా మావోయిస్టులు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కఠోర శిక్షణ పొందిన ఝార్ఖండ్ జాగ్వార్స్, కోబ్రా, గ్రేహౌండ్స్ లాంటి ప్రభుత్వ సాయుధ దళాలు మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలను చుట్టుముడుతున్నాయి.

అయితే, మావోయిస్టులను అణచివేస్తున్నామన్న పేరుతో గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లోని ఉక్కు, బొగ్గు, బాక్సైట్ గనుల్లాంటి సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ కొందరు మానవహక్కుల నేతలు ఆరోపిస్తున్నారు.

ఆదివాసీలకు జీవనాధారమైన అడవులను బహుళ జాతీయ సంస్థలు ధ్వంసం చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

పోలీసుల నుంచి తస్కరించిన ఆయుధాలతో, మందు పాతరలతో తమ అటవీ ప్రాంతాలను కాపాడుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు.

అయితే, రానురాను ప్రభుత్వ బలగాలు పెద్దఎత్తున కూంబింగ్ చేస్తుండటంతో వారికి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

కొన్నేళ్లుగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. విద్యుత్ లైన్లు వేస్తున్నారు. దాంతో భద్రతా దళాలు సులువుగా మారుమూల ప్రాంతాలకు వెళ్లగలుగుతాయి.

సౌత్ ఏషియా టెర్రరిస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, గత ఆరేళ్లలో దాదాపు 6,000 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కానీ, వారిలో చాలామంది ఆదివాసీలను పోలీసులు నిర్బంధించి మావోయిస్టులుగా చిత్రీకరించారని మానవహక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఒక్క ఝార్ఖండ్ రాష్ట్రంలోనే నక్సలైట్లుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ 4,000 ఆదివాసీలను జైళ్లలో పెట్టారు. వారికి బెయిల్ కూడా ఇవ్వలేదు. నేను కలిసిన చాలామందిని జైళ్లలో పెట్టారు. లేదంటే చంపేశారు.

(రచయిత: అల్పా షా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సామాజిక శాస్త్రం బోధిస్తారు. ఇటీవలే "నైట్‌మార్చ్: అమాంగ్ ఇండియాస్ రివల్యూషనరీ గెరిల్లాస్" అనే పుస్తకం రాశారు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)