మన్యంలో మావోయిస్టుల దాడి: నా తలకు తుపాకీ గురి పెట్టి కారు ఆపారు- సివేరి సోమ డ్రైవర్ BBCకి చెప్పిన కథనం

సోమ కారు డ్రైవర్ చిట్టిబాబు
ఫొటో క్యాప్షన్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కారు డ్రైవర్ చిట్టిబాబు
    • రచయిత, రిపోర్టింగ్: బళ్ల సతీశ్; ఫొటోలు: కె.నవీన్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మన్యంలో కాల్చి చంపిన ఘటన గురించి ప్రత్యక్ష సాక్షి, సివేరి సోమ కారు డ్రైవర్‌ చిట్టిబాబుతో బీబీసీ తెలుగు మాట్లాడింది. సోమ వద్ద ఆయన పది నెలలుగా పనిచేస్తున్నారు. మంగళవారం అరకులో చిట్టిబాబు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

''డుంబ్రిగుడ మండలం కండ్రుం పంచాయతీ పరిధిలోని సరాయి గ్రామంలో 'గ్రామదర్శిని' కార్యక్రమం నిమిత్తం సర్వేశ్వరరావుతో కలిసి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఇక్కడి(అరకు) నుంచి వాహనాల్లో బయల్దేరాం.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు

ఫొటో సోర్స్, AP Assembly

ఫొటో క్యాప్షన్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు

డుంబ్రిగుడ దాటాక ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని లివిటిపుట్ అనే గ్రామం గుండా వెళ్తుండగా నక్సలైట్లు దాడికి వచ్చారు. మేం ఊరి మధ్యలో వెళ్తుండగా తుప్పల్లోంచి, గ్రామంలోంచి వాళ్లు ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లలో ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాళ్లు వచ్చిన వెంటనే కాల్పులు జరపలేదు. ఏకే-47 తుపాకులు, చిన్న చిన్న పిస్టళ్లు వారి వద్ద ఉన్నాయి. సాధారణ దుస్తుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరూ బూట్లు వేసుకున్నారు. టోపీలు పెట్టుకొన్నారు. తూటాలకు అవసరమైన బెల్టులు, బ్యాగులు పకడ్బందీగా పెట్టుకొని ఉన్నారు.

రోడ్డుపై ముందు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వాహనం ఉంది. తర్వాత మా కారు ఉంది. నక్సలైట్లు ఒక్కసారిగా సర్వేశ్వరరావు కారును చుట్టుముట్టి తుపాకులు గురిపెట్టి, ఆపించారు. డోర్ తీసి, ''మీరు లొంగిపోండి, మీ ఆయుధాలను మాకు ఇచ్చేయండి, మిమ్మల్ని ఏమీ చేయం'' అని గన్‌మెన్లకు చెప్పారు. గన్‌మెన్ల వద్ద ఉన్న ఆయుధాలను లాగేసుకున్నారు.

కిడారి సర్వేశ్వరరావు చనిపోయిన ప్రదేశం
ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చనిపోయిన ప్రదేశం

గన్‌మెన్లను, ఎమ్మెల్యేను వాహనంలోంచి కిందకు దించేశారు. తర్వాత వారిని ఎటూ కదలకుండా చేశారు. ఇది జరుగుతున్నప్పుడు మా కారు కొంత దూరంలో ఉంది. అక్కడి నుంచే ఇదంతా చూశాను.

వాళ్లు సాధారణ దుస్తుల్లోనే ఉన్నా వాళ్ల చేతుల్లో ఆయుధాలు ఉండటం చూసి నక్సలైట్లనే అనుకున్నాను. వెంటనే సోమ కూర్చుని ఉన్న మా కారును అక్కడి నుంచి తప్పించేందుకు పక్కకు తిప్పాను. ఇది చూసి మావోయిస్టులు పరుగెత్తుకుంటూ మా కారు వద్దకు వచ్చారు.

ఇంతలో మాకు అడ్డుగా ఒక పెద్ద లారీ వచ్చింది. లారీ వల్ల కూడా మాకు అక్కడి నుంచి బయటపడటం సాధ్యం కాలేదు. లారీ ఎవరిదో తెలియదు. అప్పటికీ కారు పోనిచ్చేస్తానని నేను సోమతో అన్నాను. ఆయన వద్దన్నారు. ''ఏదయితే అది అయింది. ఆపేయ్. వెనక్కు తిప్పొద్దు'' అని చెప్పారు. అవే సోమ ఆఖరి మాటలు.

సోమ చనిపోయిన ప్రదేశం
ఫొటో క్యాప్షన్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ చనిపోయిన ప్రదేశం

కారు వెనక్కు పోనిస్తే మొత్తం వాహనాన్నే పేల్చేస్తారని ఆయన అనుకున్నారేమో. అందుకే వెనక్కు తిప్పొద్దని చెప్పారనిపిస్తోంది.

బండి నిలిపాక ఒక నక్సలైట్ దగ్గరకు వచ్చి అద్దం గుండా నా వైపు తుపాకీ గురిపెట్టాడు. మేం అద్దాలు వేసుకొని ఉన్నాం. వాటికి బ్లాక్ ఫిల్మింగ్ ఉంది. బయటివాళ్లు మాకు కనిపిస్తారుగాని, మేం బయటకు కనిపించం. నేను కనిపించకపోవడం వల్ల నేను డ్రైవర్ అన్న విషయం అతనికి తెలిసుండదు. తుపాకీ లోడ్ చేసుకొని నాపై కాల్పులకు దాదాపు సిద్ధంగా ఉన్నాడు. బండి ఆపేసి నక్సలైట్ వైపు చూశాను. బండి ఆపేయ్, కదలనిస్తే ఎన్‌కౌంటర్ చేసేస్తానని, ఘోరంగా ఉంటుందని హెచ్చరించాడు. ఆపేస్తానని చెప్పాను. అతడు తెలుగులోనే మాట్లాడాడు.

తర్వాత మిగతా నక్సలైట్లు కారును చుట్టుముట్టారు. ముందు గన్‌మెన్లను లొంగిపొమ్మని చెప్పి కిందకు దించారు. వారి నుంచి ఆయుధాలు తీసేసుకున్నారు. ఒక్కసారిగా అంత మంది అక్కడకు వచ్చేసరికి ఏం చేయాలో మాకు తెలియలేదు. తిరగబడటానికి కూడా అవకాశం లేదు. సోమను కూడా కారులోంచి దించేసి ఆయన చేతులను వెనక్కు తిప్పి తాడుతో కట్టేశారు. ఆయన్ను సర్వేశ్వరరావు వద్దకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత వారిద్దరినీ ఒకేసారి నడిపించుకుంటూ ఒక చోటకు తీసుకెళ్లారు.

మాజీ ఎమ్మెల్యే సోమ నివాసం వద్ద ...
ఫొటో క్యాప్షన్, మాజీ ఎమ్మెల్యే సోమ నివాసం వద్ద ...

గన్‌మెన్లను, డ్రైవర్లను, పీఏను మరో చోటకు తీసుకెళ్లారు. ముగ్గురు నలుగురు నక్సలైట్లు.. మా అందరికీ తుపాకులు గురిపెట్టి, కదిల్తే కాల్చేస్తామన్నారు. మమ్మల్ని ఎటూ కదలకుండా చేశారు.

సర్వేశ్వరరావు, సోమ ఉన్న ప్రదేశానికీ, మాకూ చాలా దూరం ఉంది. అక్కడ సర్వేశ్వరరావు, సోమలతో నక్సలైట్లు ఏదో మాట్లాడారు. మాకు వినిపించలేదు.

తర్వాత సోమను ముగ్గురు నలుగురు నక్సలైట్లు చేతులు పట్టుకొని దిగువలో ఉన్న ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. సర్వేశ్వరరావును మరో ప్రదేశానికి తీసుకెళ్లారు. తర్వాత రెండు నిమిషాల్లోనే సోమను తీసుకెళ్లిన ప్రదేశం నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. మూడు నాలుగు రౌండ్లు కాల్చారు. తర్వాత కొన్ని సెకన్లలోనే సర్వేశ్వరరావుపైనా మూడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.

సోమపై కాల్పులు జరపడం నాకు కనిపించలేదు. ఎందుకంటే ఆ ప్రదేశం కొంత తగ్గులో ఉంది. కాల్పుల శబ్దం మాత్రమే వినిపించింది. సర్వేశ్వరరావుపై కాల్పులు జరపడమైతే కొంత మేర కనిపించింది. తుప్పలు ఉన్నందున పూర్తిగా కనిపించలేదు. ''అన్నా, నన్నేం చేయొద్దు.. వదిలేయండి, అన్నా.. వదిలేయండి అన్నా'' అంటూ సర్వేశ్వరరావు ఆర్తనాదాలు చేశారు. అయినా నక్సలైట్లు వదల్లేదు. ఆయనపై కాల్పులు జరిపారు. తర్వాత ఆయన కాసేపు అరిచి కింద పడిపోయారు.

అరకు లోయ
ఫొటో క్యాప్షన్, అరకు లోయ

దాడికి వచ్చిన నక్సలైట్ల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. ఎత్తు తక్కువగానే ఉన్నారు. వచ్చినవాళ్లలో ఎక్కువ మంది ఆడవారే. ఈ ఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల 40-50 మంది గ్రామస్థులు ఉన్నారు.

సర్వేశ్వరరావు, సోమపై నక్సలైట్లు ఈ దాడి చేస్తున్న సమయంలో, కాల్పులు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఒక మహిళా నక్సలైట్ గ్రామస్థులను కూర్చోబెట్టి మీటింగ్ నిర్వహించారు. ఒకవైపు సర్వేశ్వరరావు, సోమలను నక్సలైట్లు తీసుకెళ్లడం, మమ్మల్ని బంధించడం చేస్తుండగా, మరోవైపు ఆమె ఈ మీటింగ్ నిర్వహించారు.

సర్వేశ్వరరావు, సోమలను హత్య చేశాక నక్సలైట్లు వాకీ టాకీలో ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత మమ్మల్ని వదిలేశారు. అందరూ ఒక చోటకు చేరి అక్కణ్నుంచి బయల్దేరారు.

నేను సోమ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లాను. అప్పుడు నక్సలైట్లు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. నాకు దగ్గర్లోనే ఉన్నారు. వెళ్లేటప్పుడు కూడా వాళ్లు సర్వేశ్వరరావు, సోమ చనిపోయారో లేదోనని మరోసారి చూసుకున్నారు. మృతదేహాలను కొట్టినట్టు అనిపించింది. నాకు సరిగా కనిపించలేదు.

తర్వాత ఇద్దరు మావోయిస్టులను నా వద్దకు పంపించారు. ఆ ఇద్దరు మావోయిస్టులను, నన్ను సర్వేశ్వరరావు, సోమ మృతదేహాల వద్దకు పంపించి, వారిద్దరి సెల్‌ఫోన్లను తెప్పించుకున్నారు. తర్వాత కండ్రుం వైపు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు.

డుంబ్రిగుడ పోలీసు స్టేషన్
ఫొటో క్యాప్షన్, డుంబ్రిగుడ పోలీసు స్టేషన్

ఆదివారం సరాయిలో గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్తున్నామని ఈ దాడి జరగడానికి ముందు రోజైన శనివారం డుంబ్రిగుడ ఎస్సైకు ఎమ్మెల్యే సిబ్బంది సమాచారం ఇచ్చారంట. కార్యక్రమానికి బయల్దేరబోయే ముందు కూడా ఎస్సైకు చెప్పారంట. అయినా పోలీసులు రాలేదు. కాల్పులు జరిగిన రోజు కూడా మధ్యాహ్నం మూడున్నరైనా పోలీసులు ఘటనా స్థలికి రాలేదు.

కాల్పులు జరిగిన చోట మొబైల్ సిగ్నల్ ఉండదు. ఘటన తర్వాత నేను డుంబ్రిగుడకు వెళ్లి సీఐకు, ఎస్‌ఐకు ఫోన్ చేసి నక్సలైట్ల దాడి గురించి చెప్పాను. సర్వేశ్వరరావు, సోమ వాళ్ల సంబంధీకులకు కూడా సమాచారం ఇచ్చాను.

పోలీసులు ఎంతకూ రాకపోవడంతో, అక్కడే వేచి ఉండటం మంచిది కాదని, సోమ మృతదేహాన్ని ఆయన వాహనంలో, సర్వేశ్వరరావు మృతదేహాన్నిఆయన వాహనంలో చేర్చి ఇంటికి తీసుకొచ్చేశాం.''

వీడియో క్యాప్షన్, వీడియో: అరకులో ఆందోళనల తీవ్రత ఇదీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)