నాబార్డ్ రిపోర్ట్: వ్యవసాయ ఆదాయంలో దిగజారిన ఆంధ్రప్రదేశ్, జాతీయ సగటు కన్నా కాస్త మెరుగ్గా తెలంగాణ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా దేశంలోని వాస్తవ పరిస్థితులు ఆ లక్ష్యాన్ని ప్రతిబింబించడం లేదు. గ్రామీణ భారతదేశ కుటుంబాల రాబడిలో సాగు ఆధారిత ఆదాయం వాటా 20 శాతం కూడా లేకపోవడమే అందుకు నిదర్శనం. వ్యవసాయ కుటుంబాల రాబడిలో కూడా నేరుగా సాగు ద్వారా వస్తున్న ఆదాయం 35 శాతం మాత్రమే.
అంతేకాదు, వ్యవసాయ కుటుంబాల ఆదాయాన్ని అప్పులు మింగేస్తున్నాయి. వారి వార్షిక ఆదాయం ఎంతో, వారిని చుట్టుముడుతున్న అప్పులూ దాదాపు అంతేస్థాయిలో ఉన్నాయి.
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక దేశ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాల ఆర్థిక స్థితిగతులను, వారికి అందుతున్న సమ్మిళిత ఆర్థిక సేవల స్థాయిని వివరించింది.
'అఖిల భారత గ్రామీణ సమ్మిళిత ఆర్థిక సర్వే: 2016-17'(నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే-ఎన్ఏఎఫ్ఐఎస్) పేరిట జరిపిన ఈ అధ్యయనం దేశంలోని రైతుల ఆర్థిక స్థితిగతులకు దర్పణం పట్టింది.
ఈ నివేదిక ప్రకారం గ్రామీణ భారతంలోని అన్ని రకాల కుటుంబాల సగటు ఆదాయం నెలకు రూ. 8,059 కాగా వ్యవసాయ కుటుంబాల సగటు ఆదాయం రూ. 8,931. వ్యవసాయేతర కుటుంబాల సగటు ఆదాయం నెలకు రూ.7,269గా లెక్కకట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాల సగటు నెల ఆదాయం రూ. 6,920 కాగా, తెలంగాణలో ఆ మొత్తం రూ. 8,951.

ఫొటో సోర్స్, nabard.org
కూలి పనులే ప్రధాన ఆదాయ వనరు
రైతు కుటుంబాల సగటు ఆదాయం 2016-17లో నెలకు రూ.8,931 మాత్రమేనని తేల్చిన ఈ నివేదిక అందులో సాగు ద్వారా 35 శాతం(రూ.3,140) ఆదాయం వస్తుండగా.. కూలి ద్వారా 34 శాతం(రూ.3,025).. మిగతాది ఇతర మార్గాల ద్వారా వస్తున్నట్లు వెల్లడించింది.
వ్యవసాయేతర కుటుంబాల ఆదాయంలో కూలి పనులే ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించింది. 54 శాతం ఆదాయం కూలి ద్వారా వస్తున్నట్లు వెల్లడించింది.
మొత్తంగా చూసుకుంటే గ్రామీణ భారతదేశంలోని కుటుంబాల (వ్యవసాయ, వ్యవసాయేతర కలిపి) ఆదాయంలో సాగు ద్వారా 19 శాతమే వస్తుండగా కూలి ద్వారా 43 శాతం వస్తున్నట్లు లెక్కించింది.

ఫొటో సోర్స్, nabard.org
నాలుగేళ్లలో పెరుగుదల రూ.2,505
ఆదాయం అరకొరగా ఉండడంతో పాటు ఏటికేడు పెరిగిపోతున్న అప్పులు, ఆర్థిక సేవలు అందనంత దూరంలో ఉండడం, బీమా సౌకర్యం అంతంత మాత్రం కావడం వ్యవసాయదారుల జీవితాల్లో అభివృద్ధికి చోటు లేకుండా చేస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించిన వాస్తవాలు స్పష్టం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ విభాగం నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 2012-13లో చేసిన అధ్యయనం ప్రకారం దేశంలోని వ్యవసాయ కుటుంబాల సగటు నెల ఆదాయం రూ. 6,426.
అంటే, తాజా నాబార్డ్ నివేదికతో పోల్చి చూసుకుంటే ఆ నాలుగేళ్ల కాలంలో రైతు కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.2,505 మాత్రమే పెరిగిందన్నమాట.
ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే దీన్ని పెరుగుదలగా భావించలేమని ఆర్థికవేత్తలు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అధమ స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్
పంజాబ్‌లోని వ్యవసాయ కుటుంబాలు అత్యధికంగా నెలకు సగటున రూ. 23,133 ఆదాయం పొందుతుండగా హరియాణా, కేరళ రైతులు రూ.18,496 రూ.16,927 ఆదాయంతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నారు.
ఇక, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అధమ స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ రైతులు రూ.6,920 సగటు ఆదాయంతో 28వ స్థానంలో ఉండగా, రూ.6,668 సగటు ఆదాయంతో ఉత్తరప్రదేశ్ అట్టడుగుకు పడిపోయింది.
తెలంగాణ రైతు కుటుంబాలు నెలకు సగటున రూ.8,951 ఆదాయంతో జాతీయ సగటు కంటే స్వల్పంగా ముందున్నాయి.

ఫొటో సోర్స్, nabard.org
దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని 245 జిల్లాల్లో 40,327 కుటుంబాలకు చెందిన 1,87,518 జనాభాపై జరిపిన ఈ అధ్యయన నివేదిక గ్రామీణ ప్రజల జీవనోపాధి స్థితిగతులు, సమ్మిళిత ఆర్థిక స్థాయిపై సమగ్ర అవలోకనానికి వీలుకల్పిస్తోంది.
ఈ నివేదిక ప్రకారం దేశంలోని చాలా కుటుంబాలకు ఇప్పటికీ వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరు. 2016-17లో దేశంలో 21.17 కోట్ల కుటుంబాలు ఉండగా అందులో గ్రామీణ ప్రాంతాల్లో 10.07 కోట్ల కుటుంబాలున్నాయి. ఇందులో 48 శాతం వ్యవసాయ కుటుంబాలు.
రైతు నెత్తిన రుణ భారం.. ఏ రాష్ట్రంలో ఎలా ఉంది?
ఈ సర్వే చేసేనాటికి గ్రామీణ భారతంలో వ్యవసాయాధారిత కుటుంబాలలో 52.5 శాతం, వ్యవసాయేతర కుటుంబాల్లో 42.8 శాతం రుణ ఊబిలో ఉన్నాయి.
వీరిలో మూడో వంతు స్థానిక వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ సంస్థల నుంచి అప్పులు తీసుకోగా సుమారు 60 శాతం మంది బ్యాంకులు, ఇతర గుర్తింపు పొందిన సంస్థల నుంచి రుణాలు పొందారు. అయితే, రుణ మొత్తం సగటు విషయానికి వస్తే, బ్యాంకులు, ఇతర గుర్తింపు సంస్థల నుంచి తీసుకున్నదాని కంటే వడ్డీవ్యాపారులు, ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకున్నదే ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.
ఈ సర్వే చేసిన నాటికి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 79 శాతం వ్యవసాయ కుటుంబాలు రుణ ఊబిలో ఉన్నాయి. 76 శాతంతో ఆంధ్రప్రదేశ్ ఆ తరువాత స్థానంలో ఉంది. కర్ణాటకలో 75 శాతం కుటుంబాలది ఇదే పరిస్థితి. తమిళనాడులో 61 శాతం, కేరళలో 56 శాతం ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
దక్షిణ భారతదేశాన్ని మినహాయిస్తే అరుణాచల్ ప్రదేశ్(69 శాతం), మణిపుర్(61 శాతం), ఒడిశా(54 శాతం) ఉత్తరాఖండ్(50 శాతం) గ్రామీణ ప్రాంతాల్లో సగం లేదా, అంతకంటే ఎక్కువ రైతు కుటుంబాలు అప్పుల్లో చిక్కుకుని ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఈ శాతం 50కి మించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆదాయం అప్పులకే సరి
సగటున గ్రామీణ కుటుంబానికి రూ. 91,852 అప్పు ఉండగా అందులో బ్యాంకులు, గుర్తింపు ఉన్న సంస్థల నుంచి తీసుకున్న రుణం రూ. 28,207. వడ్డీవ్యాపారులు, ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న రుణ సగటు రూ. 63,645. గ్రామీణ భారతంలో, రైతు కుటుంబాలకు సమ్మిళిత ఆర్థిక సేవలు అందుబాటులో లేవని ఇది స్పష్టం చేస్తోంది.
వ్యవసాయ కుటుంబాల విషయానికొచ్చేసరికి సగటు రుణం రూ. 1,04,602 ఉంది. వ్యవసాయేతర కుటుంబాల రుణం సగటున రూ.76,731.
దేశంలోని వ్యవసాయ కుటుంబాల సగటు నెల ఆదాయం రూ. 8,931. అంటే వార్షిక ఆదాయం రూ. 1,07,412. మరోవైపు సగటు అప్పు రూ. 1,04,602 ఉంది. అంటే, రైతు కుటుంబాల ఆదాయం అప్పుల తీర్చడానికి సరిపోగా మిగిలేది నామమాత్రం.
వ్యవసాయ కుటుంబాల్లో రుణాలకు ప్రధాన కారణం సాగు పెట్టుబడులే.
బీమా వారికి ఎంతో దూరం
సర్వే కాలం నాటికి గ్రామీణ భారత కుటుంబాల్లో నాలుగో వంతు మాత్రమే జీవిత, వాహన, ఆరోగ్య బీమాలు వంటి ఏదో ఒక బీమాను కలిగి ఉన్నాయి.
వ్యవసాయ కుటుంబాల్లో 26 శాతం మందికి ఏదో ఒక బీమా ఉంది.
గ్రామీణ కుటుంబాల్లో 6 శాతం మాత్రమే ఆరోగ్య బీమా ఉన్నవారున్నారు. వ్యవసాయ కుటుంబాలకు వచ్చేసరికి ఇది 5 శాతం మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక అక్షరాస్యత పెరిగితేనే
గ్రామీణ కుటుంబాల్లో 49 శాతానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో పొదుపు ఖాతాలున్నాయి. వ్యవసాయ కుటుంబాల్లో ఇది 53 శాతం.
గ్రామీణ ప్రజల్లో 25 శాతం మంది ఇతరుల సహాయం లేకుండా ఏటీఎం కార్డును ఉపయోగించలేకపోతున్నారు.
60 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్ సేవలను సొంతంగా వినియోగించుకోలేకపోతున్నారు.
మా ఇతర కథనాలు:
- ఆ రాజ్యానికీ రాజుకూ ఈ అందమైన, బలమైన మహిళా సైనికులే రక్ష
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- బిబిసి స్పెషల్: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఎడారీకరణ ముప్పు
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా బతుకుతున్నారు’
- జలియాన్‌వాలా బాగ్ నరమేధం: ‘వందేళ్ల ఆ గాయాలు క్షమాపణలతో మానవు’
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- వెయ్యేళ్ల పాత్ర.. వెల రూ.248 కోట్లు
- జీసస్: నిజంగా నల్లగా ఉండేవాడా?
- తొలి కంచి పీఠాధిపతి ఆది శంకరుడేనా?
- నిజాం నవాబూ కాదు, బిల్ గేట్సూ కాదు.. చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- చరిత్ర: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








