వీళ్లు స్మార్ట్ రైతులు.. యాప్స్‌తో లాభాలు పండిస్తున్నారు

ఫొటో సోర్స్, OLAM
- రచయిత, జెస్సికా బౌన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డిజిటల్ టెక్నాలజీ రైతులకు కేవలం లాభాలు తీసుకురావడమే కాదు. వారి జీవితాలనూ మార్చేస్తోంది.
యాప్‌లు ఇప్పుడు రైతులు కొత్త రకాలుగా వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతున్నాయి.
ఉదాహరణకు ఘనాలో కొకోను పండించే రైతు ముహమ్మద్ ఆడమ్స్‌నే తీసుకోండి. ఆయన గత 25 ఏళ్లుగా ఒకే విధానంలో కోకోను పండించేవారు.
అయితే గత కొన్నేళ్లుగా ఆయన ఓలామ్ సంస్థ అభివృద్ధి పరచిన ఓలామ్ ఫార్మర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఓఎఫ్ ఐఎస్)ను ఉపయోగించడం వల్ల కీటకనాశినులపై ఆధారపడడం తగ్గింది.
ఆయన పంట ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగింది. గతంలో అతనికి ఏడు సంచుల కోకో దిగుబడి వస్తుంటే ఇప్పుడు అది 25 సంచులకు చేరింది.
ఓలామ్ టెక్నాలజీ ద్వారా ఆయన తన పంట విషయంలో ఏవైనా సమస్యలు వస్తే సరాసరి శాస్త్రవేత్తలను సంప్రదించగలుగుతున్నారు.
ఏదైనా వ్యాధి వచ్చినపుడు వాటికి రసాయనాలు వాడడం ఒక్కటే పరిష్కారం కాదని ఆయన కనుగొన్నారు. దీని వల్ల పంటపై ఖర్చు కూడా చాలా తగ్గిందని ఆడమ్స్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, OLAM
ఓలామ్‌లో కోకో రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేసిన సైమన్ బ్రయాన్ స్మిత్ - ఓఫిస్ యాప్ ద్వారా కోకో పంట సమాచారాన్ని సేకరించి, అల్గారిథమ్స్‌ను ఉపయోగించి, రైతులకు తగిన సూచనలు అందించి, పంట దిగుబడి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఓలామ్ యాప్ ద్వారా కోకో ధరలు ఏయే చోట్ల ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఈ యాప్ ద్వారా అమ్మకాలు జరిపితే పంట అమ్మిన సొమ్ము సరాసరి రైతుల మొబైల్ వ్యాలెట్‌లో పడిపోతుంది.
ఓలామ్ యాప్స్ టెక్ట్స్ మెసేజింగ్ ద్వారా పని చేస్తాయి. అయితే ఇంకా అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సమస్య ఉండడం వల్ల రైతులు దాని ప్రయోజనాలను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారని బ్రయాన్ స్మిత్ తెలిపారు.

ఫొటో సోర్స్, ROWIE MEERS
మరోవైపు సూపర్ మార్కెట్ల కారణంగా కూడా రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు.
అమెరికా వ్యవసాయ శాఖ ఈ ఏడాది రైతుల నికర ఆదాయం 8.3 శాతం పడిపోతుందని అంచనా వేసింది. అదే రకంగా బ్రిటన్ రైతులు కూడా సూపర్ మార్కెట్ల కారణంగా తమ లాభాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నైరుతి ఇంగ్లండ్‌లో పుర్టన్ హౌస్ ఆర్గానిక్స్‌ను నిర్వహిస్తున్న రోవీ మీర్స్, సూపర్ మార్కెట్లు నిరంతరం ధరలను తగ్గిస్తున్నాయని, దీని కారణంగా చిన్న రైతులు వ్యవసాయ రంగం వీడిపోతున్నారని తెలిపారు.
కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చిన్న రైతులు కూడా సూపర్ మార్కెట్లతో పోటీ పడి నిలదొక్కుకోగలుగుతున్నారు.
ఫార్మ్ డ్రాప్ అనే ఫుడ్ డెలివరీ యాప్‌ను ఉపయోగించుకుంటున్న మీర్స్, వాటి ద్వారా సరాసరి వినియోగదారులతో వ్యాపార లావాదేవీలు నిర్వహించగలుగుతున్నారు. దీని ద్వారా రైతులకు చిల్లర ధరలో 70 శాతం ఆదాయంగా లభిస్తోంది.

ఫొటో సోర్స్, FARMDROP
ఫార్మ్ డ్రాప్ వ్యవస్థాపకుడు బెన్ పగ్, ఈ యాప్ ద్వారా వినియోగదారులు రియల్ టైమ్‌లో వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడానికి అవకాశం లభిస్తుందని తెలిపారు. దీని వల్ల చిన్న రైతులు తమ ఉత్పత్తిని అమ్ముకోవడానికి మార్కెట్‌కు వెళ్లాల్సిన పని ఉండదు. తమకు రావాల్సిన సొమ్ము కోసం తిరగాల్సిన పని ఉండదు. అంతే కాకుండా వాళ్ల లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి.
దీని వల్ల తాము వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించగలుగుతామని మీర్స్ తెలిపారు.
రాబోయే పదేళ్లలో పంటలు, ఉత్పత్తి వ్యవస్థ మొత్తం డిజిటల్‌గా మారిపోతుందని బ్రయాన్ స్మిత్ అభిప్రాయపడ్డారు.
''దీని వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, వారికి ప్రపంచ మార్కెట్లతో కూడా సంబంధాలు ఏర్పడతాయి'' అని స్మిత్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








