జపాన్ వరదలు: రికార్డు వర్షపాతం.. పెను ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters
భీకర వరదలతో కొండచరియలు విరిగిపడుతున్న జపాన్ ఉత్తర ప్రాంతం అనూహ్యమైన ప్రమాదం ముంగిట్లో ఉందని.. భారీ వర్షాల ప్రమాదం ఇంకా ఉందని అధికారులు హెచ్చరించారు.
‘‘ఈ తరహా వర్షాన్ని మునుపెన్నడూ చవిచూడలేదు’’ అని వాతావరణ అధికారి ఒకరు చెప్పారు.
హిరోషిమా ఇతర ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం వల్ల నదులు కట్టలు తెంచుకుని ప్రవహిస్తూ వరదలు ముంచెత్తటంతో 60 మందికి పైగా చనిపోయారు. ఇంకా డజన్ల మంది జాడ తెలియటం లేదు.
దాదాపు 20 లక్షల మంది ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. కాలంతో పోటీపడుతూ సహాయపనులు కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి షింజో అబే పేర్కొన్నారు.
‘‘ఇంకా చాలా మంది ఆచూకీ లేదు. చాలా మందికి సహాయం అవసరం’’ అని ఆయన ఆదివారం పాత్రికేయులకు చెప్పారు.

జపాన్ ఉత్తర ప్రాంతంలో.. జూలై నెల మొత్తం ఉండే సాధారణ వర్షపాతానికి మూడు రెట్ల వర్షం.. గురువారం నుంచి ముంచెత్తింది. దీంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటం మొదలైంది.
హిరోషిమా ప్రాంతంలో ఎక్కువగా మరణాలు సంభవించాయి. మోటోయమా పట్టణంలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ 583 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరిన్ని వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరికలు జారీచేశారు. సోమవారం కొన్ని ప్రాంతాల్లో 250 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుందని అంచనావేశారు.
‘‘ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి’’ అని జపాన్ వాతావరణ సంస్థ అధికారి ఒకరు విలేకరుల సమావేశంలో తెలిపారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








