థాయ్‌లాండ్: కొనసాగుతున్న ‘బాలల్ని కాపాడే ఆపరేషన్’

ఫొటో సోర్స్, EPA/thai navy
థాయ్ గుహలో రెండు వారాలుగా చిక్కుకుపోయిన 12 మంది పిల్లలు, వారి కోచ్‌ను బయటకు తీసుకొచ్చేందుకు సహాయ బృందాల ఆపరేషన్ కొనసాగుతోంది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు సహాయ బృందాలు గుహలోకి ప్రవేశించాయని థాయ్‌లాండ్ ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు.
బాలల్ని బయటకు తీసుకొచ్చే ఈ ఆపరేషన్ గురించి వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు.
ప్రస్తుతం గుహ దగ్గర పరిస్థితులు లోపలున్న వారిని కాపాడడానికి తగినట్టుగా ఉన్నాయని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న నారోంగ్సక్ తెలిపారు.
కానీ, భారీ వర్షాల వల్ల గుహ ఇరుకుదారుల్లో వరదనీళ్లు నిండుతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
జూన్ 23న గుహను చూడ్డానికి వెళ్లిన థాయ్ పిల్లలు, వరద నీళ్లు రావడంతో తమ ఫుట్‌బాల్ కోచ్‌తో సహా లోపలే చిక్కుకుపోయారు.
పిల్లల ఆచూకీ గుర్తించినప్పటి నుంచి సహాయ బృందాలు వారికి ఆహారం, ఆక్సిజన్, మందులు సరఫరా చేస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన సహాయక దళాలు గుహలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.

"గుహ దగ్గర నీళ్లు, వాతావరణం అనుకూలంగా ఉండడంతోపాటు ప్రస్తుతం లోపలున్న పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు" అని చయాంగ్ రాయ్ ప్రావిన్స్ గవర్నర్ చెప్పారు.
"మేం ఏమేం చేయాలి అనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, AFP
తల్లిదండ్రులకు పిల్లల లేఖలు
శనివారం ఉదయం థాయ్ నేవీ సీల్స్ పిల్లలు తమ కుటుంబాకు రాసిన లేఖలను విడుదల చేసింది. లోపల ఉన్న వారికి ఆక్సిజన్ ట్యాంకులు సరఫరా చేస్తున్న ఈతగాళ్లు పిల్లల నుంచి ఈ లేఖలు తీసుకువచ్చారు
కొందరు పిల్లలు "డోంట్ వర్రీ, మేం బాగున్నాం" అని రాస్తే, ఒక బాలుడు "టీచర్, మాకు ఎక్కువ హోంవర్క్ ఇవ్వద్దు" అని లేఖ రాశాడు.
ఇంకొక బాలుడు "అమ్మ, నాన్న, అక్కయ్యా.. నా గురించి దిగులు పడకండి. అమ్మా, నాన్నా.. నేను బయటికొస్తే తినడానికి మూకతా( థాయ్ బార్బిక్యూ) తీసుకొస్తారా" అని అడిగాడు. వారిపై తన ప్రేమకు గుర్తుగా హార్ట్ సింబల్స్ కూడా వేశాడు.
పిల్లలను గుహ దగ్గరకు తీసుకెళ్లినందుకు తనను క్షమించాలని కోచ్ తల్లిదండ్రులను కోరాడు. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఇందులో అతడి తప్పేం లేదని భావిస్తున్నారు.

కాపాడే ప్లాన్ ఏంటి?
గుహలో ఉన్న పిల్లలు, కోచ్ ప్రస్తుతం ఒక రాయిపైకి ఎక్కి పొడిగా ఉన్నారు. కానీ వర్షాలతో లోపలికి నీళ్లు పెరుగుతుండడంతో ఆ స్థలం 10 చదరపు మీటర్ల కంటే చిన్నగా అయిపోయే ప్రమాదం ఉంది.
గుహ లోపలికి వేసిన ఆక్సిజన్ ట్యూబు వల్ల అక్కడ తక్కువ స్థలం ఉన్నా, ఎక్కువ మంది గాలి పీల్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
పిల్లలకు ప్రమాదం లేకుండా లోపలి నీళ్లు బయటికి రావడానికి గుహ గోడలకు రంధ్రాలు వేస్తున్నారు.

తొలుత నాలుగు నెలలు అనుకున్నప్పటికీ..
సహాయ బృందాలు మొదట పిల్లలను కాపాడేందుకు నాలుగు నెలలపాటు వేచిచూడాలని, లేదా వారికి డైవింగ్ నేర్పించాలని భావించాయి. లేదంటే నీళ్లన్నీ బయటికి తోడేసేవరకూ ఆగాలని అనుకున్నారు.
అయితే తర్జనభర్జనల అనంతరం నిపుణులైన డైవర్ల సాయంతో వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం ప్రారంభించారు. పిల్లలు కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పిల్లలను, కోచ్‌ను రక్షించేందుకు మొత్తం 18 మంది డైవర్లు రంగంలోకి దిగారు.
డైవర్లు పిల్లలున్న చోటికి చేరి, అక్కడి నుంచి ఒక్కక్కరిని బయటకు తీసుకురావడానికి సుమారు 11 గంటల సమయం పట్టవచ్చని అంచనా.

పిల్లల రక్షించే ఈ కార్యక్రమంలో కొంత దూరం బురదలో నడిచి, కొంత దూరం ఈత కొట్టి, మరికొంత దూరం పాకాల్సి ఉంటుంది. ఈ మొత్తం పనులన్నీ వాళ్లు చీకటిలోనే చేయాలి. ప్రతి పిల్లవాడి వెంట ఇద్దరు డైవర్లు ఉంటారు. పిల్లలకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్‌ను కూడా ఈ డైవర్లే మోసుకువస్తారు.
మార్గమధ్యంలో ఉన్న T జంక్షన్ వద్దే అసలైన సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ఇక్కడ దారి అతి ఇరుకుగా ఉండడంతో డైవర్లు కొంతసేపు తమ ఆక్సిజన్ సిలిండర్లు కూడా తొలగించి, ఆ దారి గుండా రావాల్సి ఉంటుంది.
ఈ ఆపరేషన్ విజయవంతమైతే మొట్టమొదటి పిల్లవాడు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం పిల్లలందరినీ బయటకు తీసుకురావడానికి రెండు మూడు రోజులు పట్టవచ్చు.
ఇవి కూడా చదవండి:
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?
- స్పైడర్‌మ్యాన్ సహ సృష్టికర్త మృతి
- హెచ్ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు
- కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది
- సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
- #లబ్‌డబ్బు: ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయండి ఇలా..
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- ప్రపంచంలోనే కష్టమైన ప్రయాణం!
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









