వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం

ఫొటో సోర్స్, ISRO/BBC
- రచయిత, పల్లవ్ బాగ్లా
- హోదా, విజ్ఞానవేత్త
మానవుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఒక పెద్ద విజయం అందుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలు క్రూ ఎస్కేప్ సిస్టమ్ (తప్పించుకునే వ్యవస్థ)ను విజయవంతంగా ప్రయోగించారు. భారతీయ వ్యోమగాముల భద్రతలో కీలక అడుగు వేశారు.
ఏమైనా అవాంతరాలు, సాంకేతిక కారణాల వల్ల అంతరిక్షంలోకి లేదా మరేదైనా గ్రహం వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపివేయాల్సిన పరిస్థితుల్లో వ్యోమగాములను అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమి మీదకు తిరిగి తీసుకురావడానికి ఇది సాయం చేస్తుంది. ఇప్పటివరకూ ఇలాంటి సాంకేతికత అమెరికా, రష్యా, చైనా దగ్గర మాత్రమే ఉంది.
5 గంటల కౌంట్‌టౌన్ తర్వాత గురువారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను ప్రయోగించారు. డమ్మీ క్రూ మాడ్యూల్‌తోపాటు 12.6 టన్నుల బరువున్న ఈ సిస్టమ్‌ను ఉదయం 7 గంటలకు ప్రయోగించారు. తర్వాత 259 సెకన్లలో ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది.
డమ్మీ క్రూ మాడ్యూల్‌తోపాటు నింగిలోకి దూసుకెళ్లిన క్రూ ఎస్కేప్ సిస్టమ్.. శ్రీహరికోటకు 2.9 కిలోమీటర్ల దూరంలో పారాచ్యూట్ సాయంతో బంగాళాఖాతం తీరంలో దిగింది.
ఇస్రో చేసిన ఈ ప్రయోగం ఎందుకంత కీలకం? భారత అంతరిక్ష కార్యక్రమానికి దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లభిస్తుంది? మానవుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే దిశగా దీనిని కీలక విజయంగా శాస్త్రవేత్తలు ఎందుకు అభివర్ణిస్తున్నారు?

ఫొటో సోర్స్, Alamy
సొంతంగా తయారు చేసిన రాకెట్ ద్వారా భారతీయ వ్యోమగాములను స్వదేశం నుంచి అంతరిక్షంలోకి పంపాలని భారత్ భావిస్తోంది.
క్రూ మాడ్యూల్‌తో చేసిన ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో తమ లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకు వేసిందనే చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ ప్రయోగం విజయవంతం కాకుంటే, భారత్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడం సాధ్యం కాదు.
అంతరిక్షంలోకి మన వ్యోమగాములను పంపించడానికి ఇప్పుడు జరిగిన "క్రూ ఎస్కేప్ సిస్టమ్" ప్రయోగం చాలా కీలకం.

ఫొటో సోర్స్, ISRO/BBC
క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే ఏంటి?
ఎవరైనా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేటపుడు, వారు ఉన్న రాకెట్‌ను లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తారు. ఆ సమయంలో రాకెట్‌లో ఉన్న సిబ్బంది ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
లాంచ్ ప్యాడ్‌పై రాకెట్ పేలిపోతే. దానికి మంటలు అంటుకోవడం, లేదా వేరే ప్రమాదకరమైన సమస్యలు తలెత్తవచ్చు. ఆ సమయంలో వ్యోమగాములను సురక్షితంగా ఎలా కాపాడాలి, ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి అనేదానిపై శాస్త్రవేత్తలు పరీక్షలు చేస్తారు. అదే "క్రూ ఎస్కేప్ సిస్టమ్" టెస్ట్. ఈ పరీక్షలో భారత్ మొదటిసారే విజయం సాధించింది.
హ్యూమన్ స్పేస్ ఫ్లైట్(మానవ అంతరిక్ష యాత్ర)కు ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తిగా అనుమతులు రాలేదు. ఈ కార్యక్రమం ప్రస్తుతం సమర్థమైన సాంకేతిక అభివృద్ధి దిశగా సాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్రో వరుస పరీక్షలు
అంతకు ముందు 2007లో శాటిలైట్ రీఎంట్రీ ప్రయోగం, 2014లో జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్‌వీ) మార్క్-3 ప్రయోగం జరిగినపుడు భారత్ ఒక "డమ్మీ క్రూ మాడ్యూల్" పరీక్ష చేసింది. వాటితోపాటు వ్యోమగాములు వేసుకునే స్పేస్ సూట్ టెస్ట్ కూడా నిర్వహించింది.
ఇలా రకరకాల ప్రయోగాలను ఇస్రో ఒకేసారి చేస్తూ వస్తోంది. చిన్న చిన్న అడుగులు వేస్తూ సమర్థమైన సాంకేతికత దిశగా ముందుకెళుతోంది. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే, వీలైనంత త్వరగా భారతీయ వ్యోమగాములను సులభంగా అంతరిక్షంలోకి పంపించగలిగేలా ఇస్రో ఎప్పటి నుంచో ఈ సన్నాహాలు చేస్తోంది.

ఫొటో సోర్స్, NASA
లో ఎర్త్ ఆర్బిట్‌లో తొలి పరీక్ష
భారత్ మొదటి సారి తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేటపుడు, వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి తిరిగి తీసుకురావడానికి వీలుగా భూ కక్ష్యలో తక్కువ ఎత్తుకు(లో ఎర్త్ ఆర్బిట్) పంపుతారు.
ఇది ఉపగ్రహ ప్రయోగంలా ఉండదు. వాటిలో రోబోటిక్ మిషన్ ఉంటుంది. ఈ ప్రయోగంలో అంతరిక్షంలోకి పంపించే వ్యోమగాములను తప్పనిసరిగా తిరిగి భూమిపైకి తీసుకురావల్సి ఉంటుంది. దానికోసం సమర్థమైన, నాణ్యమైన టెక్నాలజీ తప్పనిసరి. తాజా ప్రయోగాలతో భారత్ ఆ దిశగా కీలక అడుగు వేసింది.

ఫొటో సోర్స్, NASA
హ్యూమన్ స్పేస్ ఫ్లైట్
ఇప్పటివరకూ మూడు దేశాలు మాత్రమే "హ్యూమన్ స్పేస్ ఫ్లైట్" చేశాయి. రష్యా, అమెరికా, చైనా.. ఈ మూడూ అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించి, తిరిగి తీసుకురావడంలో స్వయం ప్రతిపత్తి సాధించాయి.
భారత్ వ్యోమగాములను పంపించడంలో విజయం సాధిస్తే, అది అంతరిక్షంలోకి మనిషిని పంపిన ప్రపంచంలోని నాలుగో దేశం అవుతుంది.
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించింది. ఇప్పుడు జరిగిన "క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్" పరీక్ష "హ్యూమన్ స్పేస్ ఫ్లైట్" కోసం చాలా ముఖ్యమైన ప్రయోగం.
ఇవి కూడా చదవండి:
- అప్పట్లో ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్
- ఎంసెట్ పేపర్ లీకేజీ: శ్రీచైతన్య డీన్, నారాయణ ఏజెంట్ అరెస్ట్
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- సోషల్ మీడియా: కావాలనే యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు
- చెట్లు రహస్యంగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?
- భారత్‌లో 'వాట్సప్ హత్యలను' ఎవరు ఆపగలరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








