అప్పట్లో ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్
ఒకప్పుడు ఫుట్‌బాల్‌కు హైదరాబాద్ పెట్టింది పేరు. అలాంటి హైదరాబాదీ ఫుట్‌బాల్ చరిత్రను జ్ఞాపకాలను తలచుకునేందుకు క్రీడా విశ్లేషకులు, కామెంటేటర్ సి వెంకటేశ్ బీబీసీ కోసం అప్పటి ఫుట్‌బాల్ కెప్టెన్ అమల్ రాజ్‌తో మాట్లాడారు.
ఫుట్‌బాల్ అంటే అందరికీ అర్జెంటీనా, బ్రెజిల్ లేదంటే పోలెండ్, జర్మనీ వంటి దేశాలే గుర్తొస్తాయి. ఇటు మా ఆట కూడా ఒక్కసారి చూడండంటూ భారత ఫుట్‌బాల్ కెప్టెన్ చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి? నిజంగా భారత్ లో ఫుట్‌బాల్ పరిస్థితి ఇదేనా?
ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రను ఒక్కసారి తిరగేసి మన స్థానం ఎక్కడుందని ఆరా తీస్తే అదిరిపోయే నిజాలు తెలిశాయి!
ఒకప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచ ఫేవరెట్స్‌లో భారత్ ఒకటి. అవును మీరు చదివింది నిజమే. ఫుట్‌బాల్‌లో భారత్‌ని ఆ స్థాయిలో నిలబెట్టింది ఎవరో కాదు! హైదరాబాద్ ఆటగాళ్లే! ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్. ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్ అనేంతగా ఈ క్రీడ భారత్‌లో ఓ వెలుగు వెలిగింది. .
1956లో ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టు 4వ స్థానంలో నిలిచింది. ఆ జట్టులో ఏకంగా 9 మంది ఆటగాళ్లు హైదరాబాద్ వారే. 1954 ఏషియన్ గేమ్స్, 1962 ఏషియన్ గేమ్స్‌లో కూడా భారత ఫుట్‌బాల్ జట్టు దుమ్మురేపింది. అప్పుడు కూడా టీమ్‌లో హైదరాబాదీలదే హవా. 1943 ఏష్ గోల్డ్ కప్‌లో రాయల్ ఎయిర్‌ఫోర్స్ టీమ్‌ని హైదారాబాద్ సిటీ పోలీస్ టీమ్ ఓడించింది.
ఈ ఘన విజయాలన్నింటి వెనుక ఒక వ్యక్తి ఉన్నారు. సయ్యద్ అబ్దుల్ రహీమ్! ఈయన్ను ముద్దుగా రహీమ్ సాబ్ అంటారు. రహీమ్ 1950 నుంచి 1963 వరకూ భారత ఫుట్‌బాల్ కోచ్‌గా కూడా పనిచేశారు.
"రహీమ్‌కు ఆటగాళ్ల గురించి బాగా తెలుసని విక్టర్ అమల్ రాజ్ బీబీసీకి చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన అమల్ రాజ్ భారత ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉండేవారు.
"రహీమ్ మంచి టీచర్. కమిటెడ్ కోచ్. అతను ఆటగాళ్లను చదువుతాడు. ఫుట్ బాల్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. అప్పట్లో బెనర్జీ, గోస్వామి, తంగరాజ్, కణ్ణన్, అజీజ్ లాంటి ఆటగాళ్లను తీర్చిదిద్దింది ఆయనే. ఎవరెక్కడ చక్కగా సరిపోతారో రహీమ్ సరిగ్గా అంచనా వేసేవారు" అని అమల్ రాజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్
హైదరాబాద్‌లో ఒకప్పుడు ఫుట్‌బాల్ ఒక వెలుగు వెలిగిందని క్రీడా విశ్లేషకులు వెంకటేశ్ చెప్పారు.
"హైదరాబాద్‌లో ఒకప్పుడు ఫుట్‌బాల్ క్లబ్‌లు చాలా ఉండేవి. వాటిలో సిటీ పోలీస్ టీమ్ బాగా ఫేమస్. భారతదేశంలో కోల్‌కతా, గోవా, కేరళలో ఫుట్‌బాల్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి హైదరాబాద్‌లోనూ వాటితో సమానంగా ఫుట్‌బాల్ కల్చర్ ఉండేది. అసలు ఇప్పుడు ఉన్న చాలా క్రికెట్ మైదానాల్లో ఒకప్పుడు ఫుట్‌బాల్ ఆడేవారు" అన్నారు వెంకటేశ్.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ప్రాభవం ఏదీ?
"అప్పట్లో తరచూ హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ లీగ్స్ జరుగుతుండేవి. ఎన్నో మైదానాలు ఉండేవి. ఎల్బీ స్టేడియం, రైల్వే గ్రౌండ్స్, ఇలా చాలా.. ఇక టీమ్స్ కూడా చాలా ఉండేవి. రహీమ్ సార్ చనిపోయాక అవన్నీ క్రమంగా మరుగున పడ్డాయి. మంచి ఆటగాళ్లకు హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్స్ ఆర్థికంగా అవకాశాలు చూపించలేకపోయాయి" అన్నారు అమల్ రాజ్.
హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ప్రతిష్ఠ మసకబారడంతో కొందరు ఆటగాళ్లు 60ల తర్వాత కోల్‌కతా వెళ్లిపోయారు. బయటి క్లబ్స్ కి ఆడారు. అప్పటికే కోల్‌కతా లీగ్ చాలా ఫేమస్. నయీం, హబీబ్, అక్బర్, షబ్బీర్ అలీ, సలాం, జాన్ విక్టర్, షరీఫ్ అందరూ హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లి ఆడిన వారే.
"కోల్‌కతా క్లబ్బులు 18వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యాయి. బ్రిటిష్ వారు వాటిని మొదలుపెట్టారు. ఆటగాళ్లకు మంచి కాంట్రాక్టులు ఇచ్చారు. మనీ ఫాక్టర్ పనిచేసింది. మంచి అవకాశం రావడంతో వారంతా అక్కడికి వెళ్లిపోయారు" అని వివరించారు అమల్ రాజ్.

ఫొటో సోర్స్, Getty Images
బొల్లారం టు పాతబస్తీ
హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ సంస్కృతి ఉండేది! ఇప్పుడు గల్లీ క్రికెట్ లాగే, అప్పట్లో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ఆడేవారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో కనిపించే చాలా క్రికెట్ మైదానాలు ఒకప్పుడు ఫుట్‌బాల్ కోసం తయారు చేసినవే. ఎల్.బి. స్టేడియంగా పేరు మార్చిన ఫతే మైదాన్, జింఖానా గ్రౌండ్స్ సహా పాతకాలం క్రికెట్ మైదానాలన్నిటిలో ఒకప్పుడు ఫుట్‌బాల్ ఆడారు.
హైదరాబాద్ నగరానికి ఆ మూల బొల్లారం, ఈ మూల పాతబస్తీ ఉంటాయి. కానీ ఫుట్‌బాల్ నగరాన్ని ఏకం చేసింది. బొల్లారం బ్రిటిష్ సైనిక స్థావరం కావడంతో స్థానికులు బ్రిటిష్ సైనికులతో ఫుట్‌బాల్ ఆడేవారు. అలా బొల్లారం హైదరాబాదీ ఫుట్‌బాల్ అడ్డాగా మారింది.
అటు ఓల్డ్ సిటీలో కూడా ఫుట్ బాల్ ఆడేందుకు చాలా గ్రౌండ్స్ ఉండేవి. సిటీ కాలేజ్ ఫుట్‌బాల్ టీమ్ చాలా ఫేమస్. 1930, 40ల నుంచే బొల్లారం యువతలో ఫుట్‌బాల్ క్రేజ్ ఉండేది. బొల్లారంలో ఇప్పటికీ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందడి కనిపిస్తుంది.

బూట్లు లేక వరల్డ్ కప్ ఆడలేదు
1950లో బ్రెజిల్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ జరిగింది. దానికి భారత్ క్వాలిఫై అయ్యింది. కానీ వెళ్లలేకపోయింది.
1950 వరల్డ్ కప్ ఆడడానికి భారత్ వెళ్లకపోవడానికి వెంకటేశ్ రెండు కారణాలు చెబుతారు. "మొదటి కారణం. అప్పటికి మనవాళ్లు షూ లేకుండా ఒట్టి పాదాలతో ఫుట్‌బాల్ ఆడేవారు. రెండోది. .అది స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో జరిగింది. బ్రెజిల్ పంపడానికి అప్పట్లో సరైన ఆర్థిక వనరులు లేవని చెబుతారు" అన్నారు.
"కానీ ఆ తర్వాత జరిగిన ఏషియన్ గేమ్స్‌లో మన వాళ్లు ప్రతిభ చూపించారు. కొత్త లీగ్స్ వచ్చాక పరిస్థితి మారింది."
ఫుట్‌బాల్‌కు పూర్వ వైభవం తీసుకురావాలంటే అసోసియేషన్, ఫెడరేషన్ కలిసి కృషి చేయాల్సి ఉంటుందని అమల్ రాజ్ చెబుతారు.
"ఇప్పుడు ఫుట్‌బాల్‌లో రెండు లీగ్‌లు జరుగుతున్నాయి. అలా కాకుండా, ఒకటే లీగ్ జరగాలి. అసోసియేషన్ ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించి, ఎప్పుడూ లీగ్‌లు నిర్వహించాలి. గ్రౌండ్స్ లాంటి మౌలిక వసతులు పెంచాలి. పాఠశాలల్లో స్పోర్ట్స్ పీరియడ్స్ తప్పనిసరి చేయాలి. కోచింగ్ వసతులు మెరుగుపడాలి. విదేశీ ఆటగాళ్లను తీసుకువచ్చి ఆడించడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. వాళ్ల నుంచి మన ఆటగాళ్లు కొన్ని మెళకువలు నేర్చుకోవచ్చు" అన్నారు అమల్ రాజ్.
ఇవి కూడా చదవండి:
- ఈతలో రికార్డుల మోతకు కారణాలు తెలుసా?
- మహిళలు కనిపెట్టిన అద్భుతాలివి
- నల్లమల: సంపర్కం, ఆవాసం కోసం పులుల మధ్య పోరాటం
- #FIFA2018: అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీకి అసలేమైంది?
- హైదరాబాద్: 'ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నా కులంతో పనేంటి?'
- హైదరాబాద్ క్లాక్‌టవర్స్.. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు
- క్రికెట్: బౌలింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- ఒకే రోజు ఇద్దరి కలలు భగ్నం: ప్రపంచ కప్‌లో మళ్లీ మెస్సీ.. రొనాల్డో ఆట చూడగలమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









